live-in relation
-
16 ఏళ్లు రిలేషన్లో ఉండి రేప్ అంటే ఎలా?
న్యూఢిల్లీ: ఏకంగా 16 సంవత్సరాలు ఒక వ్యక్తితో సంబంధం నెరిపి ఇప్పుడు రేప్ కేసు పెడితే ఎలా? అని సుప్రీంకోర్టు ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై అభ్యంతరం వ్యక్తంచేసింది. పెళ్లిచేసుకుంటానని నమ్మించి రేప్ చేశాడని ఒక మహిళ దాఖలుచేసిన పిటిషన్‌ను జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టేసింది. మహిళ చేసిన ఆరోపణల్లో నిజం లేదని కోర్టు అభిప్రాయపడింది.‘‘ పెళ్లిచేసుకుంటానని చెప్పి మోసం చేసి సంబంధం పెట్టుకుంటే దానిని రేప్‌గా భావించలేం. మహిళ సమ్మతి లేదని నిరూపణ అయితేనే రేప్‌గా పరిగణిస్తాం. ఈ కేసులో సమ్మతి లేదు అని చెప్పలేం. ఎందుకంటే ఉన్నత విద్యార్హతలున్న, పరిణతి సాధించిన చదువుకున్న మహిళ.. ఒక వ్యక్తి పెళ్లిచేసుకుంటానని నమ్మిస్తే 16 ఏళ్లపాటు అతడిని అలాగే నమ్మడం అనేది అసంభవం. 16 ఏళ్లపాటు తనపై లైంగికదాడిని ఆ మహిళ భరించిందంటే నమ్మశక్యంగా లేదు. సుదీర్ఘకాలాన్ని చూస్తుంటే లైంగిక సంబంధం అనేది పరస్పర సమ్మతితో కొనసాగినట్లు స్పష్టమవుతోంది. ఇన్నేళ్ల శారీరక సంబంధం తర్వాత ఇప్పుడొచ్చి అత్యాచారం చేశాడంటూ కేసు పెట్టడం సరికాదు. 16 ఏళ్ల కాలం అనేది ‘బలవంతంగా లైంగిక దోపిడీచేశాడు. శారీరక సంబంధం కోసం వంచించాడు’ అనే వాదనలను బలం చేకూర్చడంలేదు. పెళ్లిచేసుకుంటానని అతను మాటిస్తే ఇన్నేళ్లలో ఆమెకు ఒక్కసారైనా అనుమానంరాకపోవడం విచిత్రం. అతను వేరే మహిళను పెళ్లిచేసుకున్న తర్వాతే ఈ మహిళ తొలిసారిగా పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఈ 16 సంవత్సరాల్లో వీళ్లు ఒకే చోట సహజీవనం చేశారు. ఈ కేసు పూర్తిగా ప్రేమ/సహజీవనానికి సంబంధించిన అంశం. ఇందులో అత్యాచారం అనే కోణానికి తావులేదు. మహిళ చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చే సాక్ష్యాధారాలు లేవు. ఇలాంటి సందర్భంలో ఇంకా అతనిపై నేర విచారణ కొనసాగించడం చట్టప్రకారం సబబు కాదు’’ అంటూ సుప్రీంకోర్టు ఈ కేసును కొట్టేసింది. 2006లో ఒకరోజు రాత్రి ఇంట్లో చొరబడి రేప్ చేశాడని, తర్వాత పెళ్లిచేసుకుంటానని ఇన్నేళ్లు మోసంచేశాడని సంబంధిత మహిళ 16 సంవత్సరాల తర్వాత 2022లో ఫిర్యాదుచేసింది. దీంతో అదే ఏడాది ఎఫ్ఐఆర్ నమోదుచేసి కేసు విచారణ ప్రారంభించారు. ఈ కేసులో హైకోర్టులోనూ తనకు వ్యతిరేకంగా తీర్పురావడంతో ఆ వ్యక్తి చివరకు సుప్రీంకోర్టును ఆశ్రయించగా చిట్టచివరకు అతనికి అనుకూలంగా తీర్పు వచ్చింది. మార్చి మూడో తేదీనాటి ఈ కేసు తీర్పు వివరాలు గురువారం బహిర్గతమయ్యాయి. -
యువత సహజీవనం: హైకోర్టు సంచలన తీర్పు
అహ్మదాబాద్: ఆమె 19 ఏళ్ల హిందూ యువతి. అతను 20 ఏళ్ల ముస్లిం యువకుడు. స్కూల్ మేట్స్ అయిన ఆ ఇద్దరూ చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. పెద్దవాళ్ల బలవంతం కారణంగా కొన్నాళ్ల నుంచి దూరంగా ఉంటున్న వీళ్లు ఇకపై నిరభ్యంతరంగా సహజీవనం చెయ్యొచ్చని అహ్మదాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. గుజరాత్లో పాక్ సరిహద్దు గ్రామం ధనేరా(బనస్కాంత జిల్లా)కు చెందిన ముస్లిం యువకుడు, అదే ఊరికి చెందిన హిందూ అమ్మాయి మధ్య కొన్నేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. గత జులైలో ఇద్దరూ పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ అబ్బాయి మైనర్ కావడంతో(భారత వివాహ చట్టాల ప్రకారం 21 ఏళ్లు నిండితేగానీ అబ్బాయి పెళ్లికి అర్హుడు) పెళ్లి సాధ్యం కాలేదు. దీంతో ఇద్దరూ కలిసే ఉండాలని నిర్ణయించుకున్నారు. సెప్టెంబర్‌లో పెద్దవాళ్లు ఎంటర్ అయి.. అమ్మాయిని ఇంటికి తీసుకుపోయారు. చివరికి ఆ అబ్బాయి.. ప్రియురాలితో కలిసే ఉండేందుకు అనుమతించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశాడు. కోర్టు ఆదేశాల మేరకు బనస్కాంత్ పోలీసులు అమ్మాయిని విచారణకు హాజరుపర్చగా, ‘నేను ప్రేమించిన వాడితోనే ఉంటాన’ని ఈ కేసు విచారణకు ఏర్పాటైన ద్విసభ్య ధర్మాసనం ముందు అమ్మాయి చెప్పింది. ఇరు పక్షాల వాదనలు విన్న సీనియర్ జడ్జిలు జస్టిస్ అఖిల్ ఖురేషీ, జస్టిస్ బీరేన్ వైష్ణవ్‌లు సోమవారం తుది తీర్పు చెప్పారు. ‘భారతీయ సమాజంలో వివాహ వ్యవస్థపై ఒత్తిడి ఉన్న మాట వాస్తవమే. సహజీవన సంబంధాలు(లివ్ ఇన్ రిలేషన్స్) మెట్రో నగరాలు, పట్టణాల్లోనే మాత్రమే గోచరిస్తాయి. ఈ నేపథ్యంలో ఒక మేజర్ అమ్మాయి ఏ ప్రాంతంలో(గ్రామమో, పట్టణమో) ఉంటున్నప్పటికీ ఆమెకు న్యాయసహకారం అందించకుండా ఉండలేం. ఆమెకు ఇష్టమైన చోట ఉండగోరే హక్కును కాదనలేం. దరిమిలా 19 ఏళ్ల అమ్మాయి తనకు ఇష్టమైతే 20 ఏళ్ల యువకుడి(పిటిషనర్)తో కలిసే ఉండొచ్చు(సహజీవనం చెయ్యొచ్చు)’అని తీర్పు సందర్భంగా జడ్జిలు వ్యాఖ్యానించారు. 21 ఏళ్లు నిండగానే అమ్మాయిని పెళ్లి చేసుకునే విధంగా అబ్బాయితో అఫిడవిట్ దాఖలుచేయించారు.