యువత సహజీవనం: హైకోర్టు సంచలన తీర్పు
అహ్మదాబాద్: ఆమె 19 ఏళ్ల హిందూ యువతి. అతను 20 ఏళ్ల ముస్లిం యువకుడు. స్కూల్ మేట్స్ అయిన ఆ ఇద్దరూ చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. పెద్దవాళ్ల బలవంతం కారణంగా కొన్నాళ్ల నుంచి దూరంగా ఉంటున్న వీళ్లు ఇకపై నిరభ్యంతరంగా సహజీవనం చెయ్యొచ్చని అహ్మదాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
గుజరాత్‌లో పాక్ సరిహద్దు గ్రామం ధనేరా(బనస్‌కాంత జిల్లా)కు చెందిన ముస్లిం యువకుడు, అదే ఊరికి చెందిన హిందూ అమ్మాయి మధ్య కొన్నేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. గత జులైలో ఇద్దరూ పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ అబ్బాయి మైనర్ కావడంతో(భారత వివాహ చట్టాల ప్రకారం 21 ఏళ్లు నిండితేగానీ అబ్బాయి పెళ్లికి అర్హుడు) పెళ్లి సాధ్యం కాలేదు. దీంతో ఇద్దరూ కలిసే ఉండాలని నిర్ణయించుకున్నారు. సెప్టెంబర్‌లో పెద్దవాళ్లు ఎంటర్ అయి.. అమ్మాయిని ఇంటికి తీసుకుపోయారు. చివరికి ఆ అబ్బాయి.. ప్రియురాలితో కలిసే ఉండేందుకు అనుమతించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశాడు. కోర్టు ఆదేశాల మేరకు బనస్‌కాంత్ పోలీసులు అమ్మాయిని విచారణకు హాజరుపర్చగా, ‘నేను ప్రేమించిన వాడితోనే ఉంటాన’ని ఈ కేసు విచారణకు ఏర్పాటైన ద్విసభ్య ధర్మాసనం ముందు అమ్మాయి చెప్పింది.
ఇరు పక్షాల వాదనలు విన్న సీనియర్ జడ్జిలు జస్టిస్ అఖిల్ ఖురేషీ, జస్టిస్ బీరేన్ వైష్ణవ్‌లు సోమవారం తుది తీర్పు చెప్పారు. ‘భారతీయ సమాజంలో వివాహ వ్యవస్థపై ఒత్తిడి ఉన్న మాట వాస్తవమే. సహజీవన సంబంధాలు(లివ్ ఇన్ రిలేషన్స్) మెట్రో నగరాలు, పట్టణాల్లోనే మాత్రమే గోచరిస్తాయి. ఈ నేపథ్యంలో ఒక మేజర్ అమ్మాయి ఏ ప్రాంతంలో(గ్రామమో, పట్టణమో) ఉంటున్నప్పటికీ ఆమెకు న్యాయసహకారం అందించకుండా ఉండలేం. ఆమెకు ఇష్టమైన చోట ఉండగోరే హక్కును కాదనలేం. దరిమిలా 19 ఏళ్ల అమ్మాయి తనకు ఇష్టమైతే 20 ఏళ్ల యువకుడి(పిటిషనర్)తో కలిసే ఉండొచ్చు(సహజీవనం చెయ్యొచ్చు)’అని తీర్పు సందర్భంగా జడ్జిలు వ్యాఖ్యానించారు. 21 ఏళ్లు నిండగానే అమ్మాయిని పెళ్లి చేసుకునే విధంగా అబ్బాయితో అఫిడవిట్ దాఖలుచేయించారు.