Banaskantha district
-
పేదలను దోచుకున్నోళ్లే... నన్ను తిడుతున్నారు: ప్రధాని మోదీ
అహ్మదాబాద్: ‘‘ఆటంక్, లట్కానా, భట్కానా (అడ్డుకోవడం, ఆలస్యం చేయడం, తప్పుదోవ పట్టించడం)... కాంగ్రెస్ నమ్ముకున్న సూత్రం ఇదే’’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. పేదలను లూటీ చేసినవారు తనను దూషిస్తున్నారని చెప్పారు. అవినీతికి చరమగీతం పాడినందుకు నిత్యం తిడుతున్నారని ఆక్షేపించారు. గతంలో గుజరాత్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు అవినీతికి ఆస్కారమున్న పనులు తప్ప ప్రజలకు మంచి చేసే పనులు చేయలేదని ఆరోపించారు. మోదీ శుక్రవారం గుజరాత్లో బనస్కంతా జిల్లా కాంక్రేజ్ గ్రామంలో ఎన్నికల సభలో ప్రసంగించారు. కరువు పీడిత ప్రాంతాలకు నర్మదా జలాలను తీసుకొచ్చిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదేనని చెప్పారు. సర్దార్ సరోవర్ డ్యామ్ నిర్మాణానికి కాంగ్రెస్ అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించిందని ఆరోపించారు. పేదలను దోచుకొనేవారిపై చర్యలు తప్పవు కాంగ్రెస్ పాలనలో దేశంలో మధ్యలో వదిలేసిన 99 తాగునీటి సరఫరా పథకాలను పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం రూ.లక్ష కోట్లు ఖర్చు చేసిందని మోదీ చెప్పారు. దేశవ్యాప్తంగా 4 లక్షల నకిలీ రేషన్ కార్డులను రద్దు చేశామన్నారు. అవినీతి అడ్డుకోవడం కొందరికి నచ్చడం లేదని, అందుకే తనను దూషిస్తున్నారని వ్యాఖ్యానించారు. పేద ప్రజలను దోచుకొనేవారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. తప్పుడు పనులు చేసి దొరికిపోయినవారు తనను తిడుతున్నారని చెప్పారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లోబీజేపీ మరోసారి విజయం సాధించబోతోందని జోస్యం చెప్పారు. కాంక్రేజ్‌లోని ఔగర్‌నాథ్ ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు చేశారు. కాంగ్రెస్ నేతల బానిస మనస్తత్వం స్వాతంత్య్రానికి ముందు బ్రిటిష్ పాలకులతో కలిసి పనిచేసిన కాంగ్రెస్ నేతలు బానిస మనస్తత్వాన్ని అలవర్చుకున్నారని మోదీ చెప్పారు. బ్రిటిషర్ల చెడు అలవాట్లను కాంగ్రెస్ నాయకులు నేర్చుకున్నారని తెలిపారు. ఆనంద్ జిల్లాలోని సోజిత్రా పట్టణంలో ఎన్నికల ప్రచార ర్యాలీలో మోదీ మాట్లాడారు. కాంగ్రెస్ సమస్య కేవలం సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్ మాత్రమే కాదని, దేశ ఐక్యత కూడా అని చెప్పారు. విభజించు, పాలించు అనే విధానంపైనే కాంగ్రెస్ రాజకీయాలు ఆధారపడి ఉంటాయన్నారు. ప్రజలందరినీ ఏకం చేయాలని సర్దార్ పటేల్ భావించారని, అందుకే ఆయనంటే కాంగ్రెస్‌కు గిట్టదని పేర్కొన్నారు. బీజేపీ విజయాన్ని ఒప్పుకున్న కాంగ్రెస్ గుజరాత్ అసెంబ్లీ తొలి దశ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను (ఈవీఎం) ట్యాంపరింగ్ చేశారన్న కాంగ్రెస్ ఆరోపణలను మోదీ తిప్పికొట్టారు. ‘‘ఓటమి తప్పదని కాంగ్రెస్ నిర్ణయానికి వచ్చింది. అందుకే ఈవీఎంలపై నిందలు మోపుతోంది. తద్వారా బీజేపీ విజయాన్ని పరోక్షంగా అంగీకరించింది’’ అని అన్నారు. ఆయన ఉత్తర గుజరాత్‌లోని పఠాన్ పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ముందు మోదీని తిట్టడం, ఎన్నికలయ్యాక ఈవీఎంలను నిందించడం.. కాంగ్రెస్‌కు తెలిసింది ఈ రెండు విషయాలేనని ఎద్దేవా చేశారు. దేశంలో గత కాంగ్రెస్ ప్రభుత్వాలు పేదలకు దక్కాల్సిన సొమ్మును దోచుకున్నాయని దుయ్యబట్టారు. ధనికుల, పేదల మధ్య అంతరాలు పెంచిన ఘనత కాంగ్రెస్‌దేనని ధ్వజమెత్తారు. -
పాల ఉత్పత్తిలో భారత్ టాప్: ప్రధాని మోదీ
బనస్కాంత (గుజరాత్): భారత్ ఏటా 8.5 లక్షల కోట్ల రూపాయల విలువైన పాలను ఉత్పత్తి చేస్తోందని ప్రధాని మోదీ చెప్పారు. ప్రపంచంలో పాల ఉత్పత్తి దేశాల్లో అగ్రస్థానంలో ఉందన్నారు. దేశ పాల ఉత్పత్తి టర్నోవర్ వరి, గోధుమల కన్నా అధికమన్నారు. డైరీ రంగంలో చిన్నరైతులకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. బనాస్ డైరీకి సంబంధించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చిన్న రైతుల ప్రయోజనం కోసం తమ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందన్నారు. సహకార ఉద్యమ విజయవంతానికి బనాస్ డైరీ ఉదాహరణగా అభివర్ణించారు. బనాస్ కమ్యూనిటీ రేడియో స్టేషన్‌ను ఆయన జాతికి అంకితం చేశారు. చదవండి: (లీటర్ పెట్రోల్ రూ.338.. బస్సు ఛార్జీలు ఏకంగా 35 శాతం పెరిగి..) -
ఇష్టార్జితం లాభాలు పొంగాయి
పాడి ఉన్న ఇళ్లను రెండు గంటల ముందే సూర్యభగవానుడు నిద్రలేపేస్తాడు. తర్వాత తను తీరిగ్గా మేల్కొంటాడు. ఈలోపే నావల్బెన్ దల్సంగ్ భాయ్ తన పనుల్నీ కానిచ్చేస్తారు. 80 గేదెలు, 45 ఆవులు ఉన్నాయి ఆమెకు. పనివాళ్లూ పదిహేను మంది వరకు ఉన్నారు. ఎంతమంది ఉన్నా, అరవై రెండేళ్ల నావల్బెన్ వీలైంతవరకు స్వయంగా తనే పాలు పితుకుతారు. అది మాత్రం పని కాదు ఆమెకు. మనసుకు స్థిమితాన్ని ఇచ్చే ప్రాతఃకాల పూజా వందనం! నావల్బెన్ ఇప్పుడు పాల వ్యాపారి మాత్రమే కాదు. గుజరాత్, బనస్కాంత జిల్లా మహిళలకే ఆదర్శవంతురాలు. అసలైతే ఆమెను సంపాదనపరురాలు అనాలి. మహిళలు సంపాదనపరులు అవడానికి ఆదర్శంగా నిలిచారు నావల్బెన్. అందుకే ఆదర్శ మహిళ. గత ఏడాది నావల్బెన్ రెక్కల కష్టం విలువ కోటీ పదిలక్షల రూపాయలు. అందులో ఆమె లాభం నెలకు 3 లక్షల 50 వేల రూపాయలు. ఎంతమంది పెద్ద ఉద్యోగులకు వస్తుంది ఇంత జీతం! అమ్మపాలైనా, అమ్ముకునే పాలైనా నమ్మకంగా ప్రాణాన్ని నిలబెడతాయి. బతికే సత్తువనిస్తాయి. నావల్బెన్ తన జిల్లాలోని మహిళల ఆలోచనలకు.. (నాలుగు రాళ్లు సంపాదించాలన్న ఆలోచన) ఇలాంటి సత్తువనే ఎక్కించారు. గుజరాత్‌లోని ‘అమూల్ డెయిరీ కోఆపరేటివ్ సొసైటీ’ కూడా తెల్లారితే నావల్బెన్ పంపించే పాల కోసం ఎదురు చూస్తుంటుంది. 2019–20లో అమూల్ కు, మిగతా డెయిరీలకు నావల్బెన్ క్యాన్ల నుంచి వెళ్లిన పాలు 2 లక్షల 21 వేల 595 కిలోలు. విలువ కోటీ పదిలక్షలు. చేతికొచ్చింది 87 లక్షల 95 వేల 900 రూపాయలు. ఖర్చులన్నీ పోగా సగటున నెలకు మూడున్నర లక్షల ఆదాయం. పాలను మనం లీటర్లలో కొలుస్తాం. డెయిరీలు కిలోల్లో కొలుస్తాయి. ఒక లీటరు పాలు కిలో కంటే కాస్త ఎక్కువ బరువు తూగుతాయి. కచ్చితంగా చెప్పాలంటే ఒక లీటరు పాలు 1 కిలో 32 గ్రాములకు సమానం. ∙∙ అమూల్ డెయిరీ గత ఆగస్టులో ‘10 మిలియనీర్ రూరల్ ఉమన్ ఆంట్రప్రెన్యూర్స్’ జాబితాను విడుదల చేసింది. అందులో మొదటి స్థానం నావల్బెన్దే. అందుకు ఆమె సంతోషించినప్పటికీ.. ఉద్యోగాలు చేస్తున్న తన నలుగురు కొడుకుల జీతం మొత్తం కలిపినా కూడా నెలకు తను సంపాదించిన దాని కంటే తక్కువేనని కాస్త ఎక్కువ సంతోషంగా చెబుతారు. నావల్బెన్ పూజ గదిలో ఆమె సంపాదించిన మరికొన్ని గుర్తింపుల ప్రతిమలు, పత్రాలు ఉన్నాయి. రెండు ‘లక్ష్మీ అవార్డు’లు, మూడు ‘బెస్ట్ పుష్పక్ అవార్డు’లు వాటిల్లో ఉన్నాయి. బనస్కాంత జిల్లాకు, గుజరాత్ రాష్ట్రానికే కాదు, మొత్తం దేశంలో బిజినెస్ ఉమన్ అందరికీ నావల్బెన్ ఒక దిక్సూచి అని చెప్పాలి. ఆ దిక్కున తెలవారుజామునే లేచి. పాడితో కలిసి, సూర్య భగవానుని మేల్కొలిపితే ధనం, ఆరోగ్యం పొంగి పొరలుతాయి. -
బస్సు ప్రమాదంలో 18 మంది మృతి
అహ్మదాబాద్ : గుజరాత్లో 40 మంది ప్రయాణికులతో వెళుతున్నఓ బస్ బనస్కాంత జిల్లా అంబాజీ పట్టణం వద్ద బోల్తా పడింది. త్రిశూలియా ఘాట్ వద్ద వేగంగా దూసుకుచ్చిన లగ్జరీ బస్సు బోల్తా పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణీకులుండగా 18 మంది మరణించారు. ఘటనపై సమాచారం అందగానే 108 బృందంతో పాటు పోలీసులు ఘటనాస్ధలానికి చేరుకున్నారు. బస్సులో చిక్కుకున్న వారిని స్ధానికుల సహకారంతో పోలీసులు వెలుపలికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా ఈ ప్రమాదంలో 5 గురు వ్యక్తులు మరణించారని అధికారులు వెల్లడించారు. కాగా బస్సు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. -
యువత సహజీవనం: హైకోర్టు సంచలన తీర్పు
అహ్మదాబాద్: ఆమె 19 ఏళ్ల హిందూ యువతి. అతను 20 ఏళ్ల ముస్లిం యువకుడు. స్కూల్ మేట్స్ అయిన ఆ ఇద్దరూ చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. పెద్దవాళ్ల బలవంతం కారణంగా కొన్నాళ్ల నుంచి దూరంగా ఉంటున్న వీళ్లు ఇకపై నిరభ్యంతరంగా సహజీవనం చెయ్యొచ్చని అహ్మదాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. గుజరాత్లో పాక్ సరిహద్దు గ్రామం ధనేరా(బనస్కాంత జిల్లా)కు చెందిన ముస్లిం యువకుడు, అదే ఊరికి చెందిన హిందూ అమ్మాయి మధ్య కొన్నేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. గత జులైలో ఇద్దరూ పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ అబ్బాయి మైనర్ కావడంతో(భారత వివాహ చట్టాల ప్రకారం 21 ఏళ్లు నిండితేగానీ అబ్బాయి పెళ్లికి అర్హుడు) పెళ్లి సాధ్యం కాలేదు. దీంతో ఇద్దరూ కలిసే ఉండాలని నిర్ణయించుకున్నారు. సెప్టెంబర్‌లో పెద్దవాళ్లు ఎంటర్ అయి.. అమ్మాయిని ఇంటికి తీసుకుపోయారు. చివరికి ఆ అబ్బాయి.. ప్రియురాలితో కలిసే ఉండేందుకు అనుమతించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశాడు. కోర్టు ఆదేశాల మేరకు బనస్కాంత్ పోలీసులు అమ్మాయిని విచారణకు హాజరుపర్చగా, ‘నేను ప్రేమించిన వాడితోనే ఉంటాన’ని ఈ కేసు విచారణకు ఏర్పాటైన ద్విసభ్య ధర్మాసనం ముందు అమ్మాయి చెప్పింది. ఇరు పక్షాల వాదనలు విన్న సీనియర్ జడ్జిలు జస్టిస్ అఖిల్ ఖురేషీ, జస్టిస్ బీరేన్ వైష్ణవ్‌లు సోమవారం తుది తీర్పు చెప్పారు. ‘భారతీయ సమాజంలో వివాహ వ్యవస్థపై ఒత్తిడి ఉన్న మాట వాస్తవమే. సహజీవన సంబంధాలు(లివ్ ఇన్ రిలేషన్స్) మెట్రో నగరాలు, పట్టణాల్లోనే మాత్రమే గోచరిస్తాయి. ఈ నేపథ్యంలో ఒక మేజర్ అమ్మాయి ఏ ప్రాంతంలో(గ్రామమో, పట్టణమో) ఉంటున్నప్పటికీ ఆమెకు న్యాయసహకారం అందించకుండా ఉండలేం. ఆమెకు ఇష్టమైన చోట ఉండగోరే హక్కును కాదనలేం. దరిమిలా 19 ఏళ్ల అమ్మాయి తనకు ఇష్టమైతే 20 ఏళ్ల యువకుడి(పిటిషనర్)తో కలిసే ఉండొచ్చు(సహజీవనం చెయ్యొచ్చు)’అని తీర్పు సందర్భంగా జడ్జిలు వ్యాఖ్యానించారు. 21 ఏళ్లు నిండగానే అమ్మాయిని పెళ్లి చేసుకునే విధంగా అబ్బాయితో అఫిడవిట్ దాఖలుచేయించారు. -
గుజరాత్లో యువతిపై సామూహిక అత్యాచారం
బనస్కాంతా జిల్లాలోని కత్వా గ్రామ సమీపంలో 20 ఏళ్ల యువతిని ఇద్దరు యువకులు కిడ్నాప్ చేసి ఆపై పలు మార్లు అత్యాచారం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బుధవారం సట్మాల గ్రామంలోని తన ఇంటికి ఒంటరిగా వెళ్తున్న యువతిని మోటర్‌సైకిళ్లపై వచ్చిన ఇద్దరు యువకులు అటకాయించారు. బలవంతంగా మోటర్‌సైకిళ్లపై ఆమెను పొలాల్లోకి తీసుకు వెళ్లారు. అనంతరం ఆ యువతిని బంధించి రాత్రంతఆ పలుమార్లు అత్యాచారం చేశారు. ఆ యువతి కిడ్నాపర్ల చెర నుంచి శనివారం తప్పించుకుంది. జరిగిన విషయాన్ని ఆమె తల్లితండ్రులకు తెలిపింది. దాంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితులు కత్వా గ్రామానికి చెందిన విష్ణుజీ ఠాకూర్ హక్కాజీ ఠాకూర్ అనే వ్యక్తులుగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులిద్దరు పరారీలో ఉన్నారని తెలిపారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు వివరించారు. వారిద్దరిని సాధ్యమైనంత త్వరగా అరెస్ట్ చేస్తామని పోలీసులు ధీమా వ్యక్తం చేశారు. సామూహిక అత్యాచారానికి గురైన యువతిని ఆరోగ్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు చెప్పారు.