నావల్బెన్ – 80 గేదెలు, 45 ఆవులకు యజమాని
పాడి ఉన్న ఇళ్లను రెండు గంటల ముందే సూర్యభగవానుడు నిద్రలేపేస్తాడు. తర్వాత తను తీరిగ్గా మేల్కొంటాడు. ఈలోపే నావల్బెన్ దల్సంగ్ భాయ్ తన పనుల్నీ కానిచ్చేస్తారు. 80 గేదెలు, 45 ఆవులు ఉన్నాయి ఆమెకు. పనివాళ్లూ పదిహేను మంది వరకు ఉన్నారు. ఎంతమంది ఉన్నా, అరవై రెండేళ్ల నావల్బెన్ వీలైంతవరకు స్వయంగా తనే పాలు పితుకుతారు. అది మాత్రం పని కాదు ఆమెకు. మనసుకు స్థిమితాన్ని ఇచ్చే ప్రాతఃకాల పూజా వందనం!
నావల్బెన్ ఇప్పుడు పాల వ్యాపారి మాత్రమే కాదు. గుజరాత్, బనస్కాంత జిల్లా మహిళలకే ఆదర్శవంతురాలు. అసలైతే ఆమెను సంపాదనపరురాలు అనాలి. మహిళలు సంపాదనపరులు అవడానికి ఆదర్శంగా నిలిచారు నావల్బెన్. అందుకే ఆదర్శ మహిళ. గత ఏడాది నావల్బెన్ రెక్కల కష్టం విలువ కోటీ పదిలక్షల రూపాయలు. అందులో ఆమె లాభం నెలకు 3 లక్షల 50 వేల రూపాయలు. ఎంతమంది పెద్ద ఉద్యోగులకు వస్తుంది ఇంత జీతం! అమ్మపాలైనా, అమ్ముకునే పాలైనా నమ్మకంగా ప్రాణాన్ని నిలబెడతాయి. బతికే సత్తువనిస్తాయి. నావల్బెన్ తన జిల్లాలోని మహిళల ఆలోచనలకు.. (నాలుగు రాళ్లు సంపాదించాలన్న ఆలోచన) ఇలాంటి సత్తువనే ఎక్కించారు.
గుజరాత్‌లోని ‘అమూల్ డెయిరీ కోఆపరేటివ్ సొసైటీ’ కూడా తెల్లారితే నావల్బెన్ పంపించే పాల కోసం ఎదురు చూస్తుంటుంది. 2019–20లో అమూల్ కు, మిగతా డెయిరీలకు నావల్బెన్ క్యాన్‌ల నుంచి వెళ్లిన పాలు 2 లక్షల 21 వేల 595 కిలోలు. విలువ కోటీ పదిలక్షలు. చేతికొచ్చింది 87 లక్షల 95 వేల 900 రూపాయలు. ఖర్చులన్నీ పోగా సగటున నెలకు మూడున్నర లక్షల ఆదాయం. పాలను మనం లీటర్‌లలో కొలుస్తాం. డెయిరీలు కిలోల్లో కొలుస్తాయి. ఒక లీటరు పాలు కిలో కంటే కాస్త ఎక్కువ బరువు తూగుతాయి. కచ్చితంగా చెప్పాలంటే ఒక లీటరు పాలు 1 కిలో 32 గ్రాములకు సమానం.
∙∙
అమూల్ డెయిరీ గత ఆగస్టులో ‘10 మిలియనీర్ రూరల్ ఉమన్ ఆంట్రప్రెన్యూర్స్’ జాబితాను విడుదల చేసింది. అందులో మొదటి స్థానం నావల్బెన్‌దే. అందుకు ఆమె సంతోషించినప్పటికీ.. ఉద్యోగాలు చేస్తున్న తన నలుగురు కొడుకుల జీతం మొత్తం కలిపినా కూడా నెలకు తను సంపాదించిన దాని కంటే తక్కువేనని కాస్త ఎక్కువ సంతోషంగా చెబుతారు. నావల్బెన్ పూజ గదిలో ఆమె సంపాదించిన మరికొన్ని గుర్తింపుల ప్రతిమలు, పత్రాలు ఉన్నాయి. రెండు ‘లక్ష్మీ అవార్డు’లు, మూడు ‘బెస్ట్ పుష్పక్ అవార్డు’లు వాటిల్లో ఉన్నాయి. బనస్కాంత జిల్లాకు, గుజరాత్ రాష్ట్రానికే కాదు, మొత్తం దేశంలో బిజినెస్ ఉమన్ అందరికీ నావల్బెన్ ఒక దిక్సూచి అని చెప్పాలి. ఆ దిక్కున తెలవారుజామునే లేచి. పాడితో కలిసి, సూర్య భగవానుని మేల్కొలిపితే ధనం, ఆరోగ్యం పొంగి పొరలుతాయి.
Comments
Please login to add a commentAdd a comment