Amul Dairy
-
‘భార్యను తదేకంగాఎంతసేపు చూస్తారు? : అమూల్ స్పందన, ఈ కార్టూన్లు చూస్తే!
ఉద్యోగులు, పనిగంటలపై కార్పొరేట్ కంపెనీ ఎల్అండ్టీ (L&T) చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఉద్యోగులు వారానికి 90 గంటలు పని చేయాలని, ఇంట్లో కూర్చుని భార్యను ఎంత సేపు చూస్తారూ, ఆదివారం కూడా పని చేయండి అంటూ సుబ్రహ్మణ్యన్ చేసిన సంచలన వ్యాఖ్యలు వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇది సోషల్ మీడియాలో సుదీర్ఘ పని గంటలపై మరోసారి చర్చకు దారి తీసింది. సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలపై ఇప్పటికే నెటిజన్లు మండిపడుతున్నారు. దీనిపై పలువురు ఇండస్ట్రీ పెద్దలుకూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాజాగా ఈ జాబితాలోకి డైరీ బ్రాండ్ అమూల్ చేరింది.అమూల్ ఏమంది?ఎల్ అండ్ టి బాస్ "స్టేర్ ఎట్ వైఫ్" వ్యాఖ్యలపై అమూల్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఒక డూడుల్ విడుదల చేసింది. ఇందులో ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అమూల్ "90 గంటల పని వారం గురించి వివాదం!" అనే శీర్షికతో పాటు ఒక డూడుల్‌ను షేర్ చేసింది! డూడుల్‌లోని టెక్స్ట్ బోల్డ్‌లో L & T లెటర్స్‌తో ((Labour & Toil) "శ్రమ అండ్ కఠోర శ్రమ?" అంటూ సుబ్రహ్మణ్యన్ను విమర్శించింది "మీరు మీ భార్యను ఎంతసేపు తదేకంగా చూడగలరు?" "అమూల్ రోజూ బ్రెడ్‌ను తదేకంగా చూస్తుంది," అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది.#Amul Topical: Controversy about the 90 hour work week! pic.twitter.com/VQlwoLoTx8— Amul.coop (@Amul_Coop) January 14, 2025కాగా ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ వార్తలు, అంశాలపై ప్రత్యేకమైన గ్రాఫిక్స్ ,పోస్టర్లను రూపొందించడంలో అమూల్ కంపెనీబాగా ప్రసిద్ధి చెందింది. క్రీడల నుండి వినోదం వరకు, అన్ని ముఖ్యమైన సందర్భాలు, ప్రధానంగా ప్రముఖులు చనిపోయినపుడు కూడా తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, 90 గంటల పనివారం గురించి కొనసాగుతున్న వివాదంపై కూడా స్పందించడం విశేషం. గతంలో వారానికి 70 గంటలు పని చేయాలనే ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ్ మూర్తి కూడా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇపుడు ఎల్అండ్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యన్ ఇంకో అడుగు ముందుకేసి, 90 గంటలు, "ఇంట్లో కూర్చొని మీరు ఏమి చేస్తారు? భార్యను ఎంత సేపు చూస్తారు,ఆఫీసుకు వెళ్లి పని ప్రారంభించండి." అంటూ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అధిక జీతం , సౌకర్యాలు ఉన్న కార్పొరేట్ కంపెనీల సీఈవోలు, కింది స్థాయి, తక్కువ జీతం పొందే ఉద్యోగుల నుండి అదే స్థాయి నిబద్ధతను ఎందుకు ఆశిస్తారంటూ నెటిజన్లు ప్రశ్నించారు. మరికొంతమంది కార్మిక శ్రమను దోచుకునే వీళ్లకి కార్మిక చట్టాలు, అమలు, కార్మిక సంక్షేమం గురించి మాట్లాడే మనసు ఉండదంటూ మండిపడ్డారు. అంతేకాదు ఈ వివాదంపై అనేక కార్డూన్లు, ఫన్నీ కామెంట్లు,వీడియోలు నెట్టింట సందడి చేశాయి కూడా. Dedicated to the L&T Chairman who wants a 90 hour work week pic.twitter.com/QtPtLjh2ej— Prashant Bhushan (@pbhushan1) January 13, 2025బాలీవుడ్ సూపర్ స్టార్ దీపికా పదుకొనే, ఆర్పీసీ గ్రూప్ చైర్పర్సన్ హర్ష్ గోయెంకా కూడా సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలను ఖండించారు. అలాగే ఎంఅండ్ ఎం అధినేత ఆనంద్ మహీంద్రా 90 గంటల పనివారం చర్చపై స్పందిస్తూ.. తూకం వేసి, పరిమాణం కంటే పని నాణ్యతపై దృష్టి పెట్టాలని సూచించారు. సుదీర్ఘ పని గంటల కంటే ఉత్పాదకత ,సామర్థ్యానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు.బండ చాకిరీ : మన దేశంమరోవైపు అంతర్జాతీయ కార్మిక సంస్థ( ILO) నివేదిక ప్రకారం, భారతదేశం ఇప్పటికే ప్రపంచ ఓవర్ వర్క్ రంగంలో ముందు వరుసలో ఉంది. అదనపు పని విషయంలో ప్రపంచ దేశాల్లో భారతదేశం 13వ స్థానంలో ఉందని వెల్లడించింది. సగటున భారతీయ ఉద్యోగులు ప్రతి వారం 46.7 గంటలు పనిచేస్తారని, భారతదేశంలోని 51శాతం మంది శ్రామిక శక్తి ప్రతి వారం 49 లేదా అంతకంటే ఎక్కువ గంటలు పనిచేస్తుందని, అత్యధికంగా సుదీర్ఘమైన పని గంటలు ఉన్న దేశాలలో భారతదేశం రెండవ స్థానంలో ఉందని కూడా సంస్థ పేర్కొన గమనార్హం. -
అమూల్ డెయిరీకి అంతర్జాతీయ పురస్కారం
మూడు భారతీయ డెయిరీ సంస్థలకు అంతర్జాతీయ డెయిరీ ఫెడరేషన్ (ఐడిఎఫ్) ‘ఇన్నోవేషన్ ఇన్ సస్టయినబుల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ 2024’ ప్రతిష్టాత్మక పురస్కారాలు దక్కాయి. పాడి పశువులకు సోకే జబ్బులకు చేసే చికిత్సల్లో అల్లోపతి యాంటీబయాటిక్ ఔషధాలకు బదులుగా హోమియోపతి ఔషధాలను వాడి చక్కని ఫలితాలు సాధించినందుకు గాను ‘యానిమల్ కేర్’ విభాగంలో అమూల్ డెయిరీకి ఈ పురస్కారం ప్రదానం చేసినట్లు ఐడిఎఫ్ ప్రకటించింది.సుమారు 68 వేల పశువులకు సోకిన 26 రకాల సాధారణ వ్యాధులకు హోమియోపతి మందులతో చికిత్స చేయటం ద్వారా అమూల్ డెయిరీ సత్ఫలితాలు సాధించింది. ఇందుకోసం 2024 మే నాటికి 3.30 లక్షల (30 ఎం.ఎల్. సీసాలు) హోమియోపతి మందులను అమూల్ సొంతంగానే ఉత్పత్తి చేసి, 1.80 లక్షల సీసాలను పాడి సహకార సంఘాల రైతులకు పంపిణీ చేసింది. యాంటీబయాటిక్ ఔషధాల వాడకాన్ని తగ్గించటం ద్వారా పశువుల ఆరోగ్యం మెరుగవుతోంది. పాల ఉత్పత్తులు వినియోగించే ప్రజల ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతోందని ఐడిఎఫ్ తెలిపింది. సంప్రదాయ ఆయుర్వేద (ఈవీఎం) చికిత్సా పద్ధతులతో పాటు హోమియో పశువైద్య పద్ధతులను కూడా అమూల్ ప్రాచుర్యంలోకి తేవటం హర్షదాయకం.పశ్చిమ బెంగాల్‌లోని సుందర్బన్ పాడి, పశు పెంపకందారుల సహకార సంఘానికి ఆర్థిక, సామాజిక విభాగంలో పురస్కారం లభించింది. 4,500 మంది మహిళా రైతులు పూర్తి సేంద్రియ పద్ధతుల్లో పాలు ఉత్పత్తి చేస్తున్నారు. అనేక పాల ఉత్పత్తులను, ఎ2 ఆవు నెయ్యిని తయారు చేస్తున్నారు. సేంద్రియ నాటు కోళ్ల పెంపకంతో పాటు సేంద్రియ పప్పుదినుసులను సైతం ఉత్పత్తి చేసి, ప్రాసెసింగ్ చేసి వినియోగదారులకు నేరుగా విక్రయిస్తూ మహిళా రైతులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధిస్తున్నారు.చదవండి: 90% కేసుల్లో యాంటీబయాటిక్స్ అవసరం లేదుఐడిఎఫ్ పురస్కారం అందుకున్న మరో సంస్థ ‘ఆశా మహిళా మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ’. సౌర విద్యుత్తుతో నడిచే ఇన్స్టంట్ మిల్క్ చిల్లర్లను వినియోగించటం ద్వారా చిన్న, సన్నకారు పాడి రైతుల అభ్యున్నతికి వినూత్న రీతిలో దోహదపడటం ఈ ఎఫ్పిఓ ప్రత్యేకత. -
పాడి రైతుపై బాబు కూటమి ప్రభుత్వం కక్ష
సాక్షి, అమరావతి: పాడి రైతుపై బాబు కూటమి ప్రభుత్వం కక్ష కట్టింది. నాలుగేళ్లుగా గిట్టుబాటు ధర పొందుతున్న రైతుల పొట్టకొడుతోంది. పాలు సేకరించే క్షేత్ర స్థాయి సిబ్బందిని ఉపసంహరించడంతో పాటు అమూల్‌కు సహాయ నిరాకరణ చేస్తూ ప్రైవేటు డెయిరీల దోపిడికీ తెర తీస్తోంది. ముఖ్యంగా సొంత డెయిరీకి మేలు చేయడమే లక్ష్యంగా రాయలసీమ జిల్లాల్లో అమూల్‌కు మోకాలడ్డుతోంది. ప్రభుత్వ పెద్దల నుంచి వస్తున్న ఒత్తిడి తట్టుకోలేక అమూల్ కూడా పాల సేకరణ నిలిపివేస్తోంది. తిరుపతిలో ఈ నెల 21 నుంచి, అనంతపురం జిల్లాలో 11వ తేదీ నుంచి పాల సేకరణ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. మిగిలిన రాయలసీమ జిల్లాల్లోనూ సెప్టెంబర్ 1 నుంచి పాల సేకరణ నిలిపివేసేందుక చర్యలు చేపడుతోంది. బాబు చర్యలు రాష్ట్రంలోని లక్షలాది పాడి రైతులకు శరాఘాతంగా మారాయి. రాష్ట్రంలో పాడి రైతుల్లో అధిక శాతం మహిళలే. వారే ఇప్పుడు అమూల్ పాల సేకరణ కేంద్రాలు కొనసాగించాలంటూ ఆందోళన బాట పట్టారు. తిరుపతి, అనంతపురం జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ల వద్ద వందలాది మహిళలు, రైతులు నిరసన వ్యక్తంచేశారు. అమూల్ రాకతో గడిచిన మూడేళ్లుగా లీటర్‌కు రూ.5 నుంచి రూ.20 వరకు అదనపు లబ్ధి పొందుతున్నామని, బ్యాంకుల నుంచి రకు రుణాలు తీసుకుని కొత్త పశువులను కొన్నామని రైతులు చెబుతున్నారు. అమూల్ కేంద్రాలు మూసివేస్తే, ప్రైవేటు డెయిరీలు పాలసేకరణ ధరలు తగ్గించేస్తాయని, అప్పుడు తమ బతుకులు అంధకారంలో పడతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పొమ్మనకుండా పొగబాబు కూటమి అధికార పగ్గాలు చేపట్టింది మొదలు అమూల్ విషయంలో పొమ్మనకండా పొగపెట్టాలా వ్యవహరిస్తోంది. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో అమూల్ ప్రాజెక్టు విస్తరణ కోసం జిల్లాకో డెయిరీ డెవలప్మెంట్ అధికారిని నియమించారు. గ్రామ సచివాలయాల్లోని డిజిటల్, వెల్ఫేర్, యానిమల్ అసిస్టెంట్స్ పర్యవేక్షణలో పాలసేకరణ జరిగే ప్రతి 15–20 గ్రామాలకో మెంటార్‌నూ, ప్రతి 3–4 సచివాలయాల పరిధిలో ఒక రూట్ ఇన్చార్జిని నియమించారు. మండల స్థాయిలో ఎంపీడీవో, జిల్లా స్థాయిలో పశుసంవర్ధక శాఖ జేడీ, డీఆర్డీఎ పీడీ, జిల్లా సహకార శాఖాధికారులు పర్యవేక్షించేవారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 4వ రోజూనే వీరందర్ని వెనక్కి పంపేసింది. అంగన్వాడీ కేంద్రాలకు పాల సరఫరా బాధ్యతల నుంచి అమూల్‌ను తప్పించింది. అమూల్ ఎస్ఎన్ఎఫ్ శాతాన్ని 8.3 శాతానికి పెంచడం, పాలసేకరణ ధరను రూ.4 వరకు తగ్గించడం ప్రభుత్వ ఒత్తిళ్ల ఫలితమేనని చెబుతున్నారు. 4,798 గ్రామాల్లో జరగాల్సిన పాల సేకరణ ఇప్పుడు 2 వేల గ్రామాలకు పరిమితమైంది. పాలుపోసే వారి సంఖ్య 1.20 లక్షల నుంచి 30వేల మందికి తగ్గిపోయింది. ఇప్పటికే పాల ఉత్పత్తి పెరిగిందనే సాకుతో ప్రైవేటు డెయిరీలు లీటర్‌కు రూ.5 నుంచి రూ.10 వరకు తగ్గించేశాయి. అమూల్ పాలసేకరణ నిలిపివేస్తే, ఇక ప్రైవేటు డెయిరీలదే రాజ్యమని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రైవేటు డెయిరీల దోపిడికీ వైఎస్ జగన్ కళ్లెంప్రైవేటు డెయిరీల దోపిడికీ కళ్లెం వేసి, పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం ద్వారా సహకార డెయిరీలకు పూర్వ వైభవం తేవాలన్న సంకల్పంతో వైఎస్ జగన్ ప్రభుత్వం 2020 డిసెంబర్లో జగనన్న పాల వెల్లువ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సహకార డెయిరీ రంగంలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్న అమూల్‌తో అవగాహన ఒప్పందం చేసుకుంది. పాడి రైతులకు రక్షణ కల్పిస్తూ నాణ్యమైన పాల సేకరణ, సరఫరాయే లక్ష్యంగా దేశంలో ఎక్కడా లేని విధంగా పాల సేకరణ, నాణ్యమైన పాల వినియోగ చట్టం–2023ను తీసుకొచ్చింది. ప్రతి పాడి రైతుకు లీటర్‌పై రూ.4 మేర అదనపు ప్రయోజనం కల్పిస్తామంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీకి మిన్నగా రూ.10 నుంచి రూ.20 వరకు అదనపు లబ్ధి చేకూర్చింది.వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఉద్యమంలా విస్తరణ3 జిల్లలు (వైఎస్సార్, చిత్తూరు, ప్రకాశం)తో మొదలై 19 జిల్లాలకు జగనన్న పాల వెల్లువ విస్తరణ 401 గ్రామాలు, 24,277 మంది రైతులతో మొదలై నేడు 4,798 గ్రామాలు 4.50 లక్షల మంది రైతుల భాగస్వామ్యం రోజూ పాలు పోసే వారి సంఖ్య 800తో మొదలై 1.25 లక్షలకు చేరిక పాల సేకరణ రోజుకు సగటున 1,800 లీటర్ల నుంచి 3.75 లక్షల లీటర్లకు చేరిక అమూల్ ద్వారా 3.5 ఏళ్లలో 20 కోట్ల లీటర్ల పాలసేకరణ రైతుల ఖాతాల్లో జమ అయిన డబ్బు రూ.925 కోట్లు అందించిన ప్రయోజనాలు– 180 రోజులు పాలు పోసే వారికి లీటర్‌కు రూ.0.50 చొప్పున బోనస్ రూపంలో రూ.6.50 కోట్ల అదనపు లబ్ధి– లాభాపేక్ష లేకుండా నాణ్యమైన ఫీడ్ పంపిణీ– వర్కింగ్ క్యాపిటల్ రూపంలో గేదెకు రూ.30 వేలు, ఆవుకు రూ.25 వేలు సాయం– కొత్త పాడి కొనుగోలుకు గేదెకు రూ.93 వేలు, ఆవుకు రూ.76 వేలు సాయం– 9,899 గ్రామాల పరిధిలో ఒక్కొక్కటి రూ.12.81 లక్షల అంచనాతో 11,800 పాల సేకరణ కేంద్రాలు (ఎఎంసీయూ) ఏర్పాటు– ఒక్కొక్కటి రూ.20.42 లక్షల అంచనాతో 4,796 పాల శీతలీకరణ కేంద్రాల (బీఎంసీయూ) నిర్మాణానికి శ్రీకారం– ఎఎంసీయూల్లో రూ.1.50 లక్షల, బీఎంసీయూల్లో రూ.15 లక్షల విలువైన పరికరాల ఏర్పాటు– అమూల్ ద్వారా మూతపడిన మదనపల్లి డెయిరీ పునరుద్ధరణ– చిత్తూరు డెయిరీకి ఉన్న రూ.182 కోట్ల అప్పులను తీర్చి రూ.385 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన అమూల్‌కు లీజుకు. ఇప్పటికే రూ.70 కోట్లతో రోజుకు లక్ష లీటర్ల సామర్థ్యంతో మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభంరైతులకు మరింత లబ్ధిఅమూల్ డెయిరీ 7 సార్లు పాలసేకరణ ధరలు పెంచడంతో 3.5 ఏళ్లలో లీటర్‌కు గేదెపాలపై రూ.18.29, ఆవు పాలపై రూ.9.49 చొప్పున పెరిగింది. ప్రస్తుతం గేదె పాలకు లీటర్‌కు రూ.89.76, ఆవు పాలకు లీటర్‌కు రూ.43.69 చొప్పున చెల్లిస్తున్నారు. అమూల్‌తో పోటీపడి ప్రైవేటు డెయిరీలు కూడా పాల సేకరణ ధరలు పెంచాల్సివచ్చింది. దీంతో వాటికి పాలు పోసే రైతులకు రూ.5 వేల కోట్ల మేర అదనంగా లబ్ధి చేకూరింది. అమూల్ సంస్త ఫ్యాట్, ఎస్ఎన్ఎఫ్ శాతాన్ని పక్కాగా లెక్క గట్టి అణాపైసలతో సహా చెల్లిస్తుండడంతో గరిష్టంగా గేదె పాలకు లీటర్‌కు రూ.100, ఆవు పాలకు రూ.50కు పైగా ధర పొందగలిగారు. పాలుపోసిన 10 రోజుల్లోనే బ్యాంక్ ఖాతాల్లో సొమ్ము జమ చేయడంతో పాడి రైతుల్లో అమూల్ పట్ల నమ్మకం పెరిగింది. పక్కాగా లెక్కగట్టి ఇచ్చేవారుప్రైవేటు డెయిరీలు 15 రోజులకోసారి పాల డబ్బులు చెల్లిస్తే అమూల్ 10 రోజులకే మా ఖాతాల్లో వేస్తోంది. పైగా ఫ్యాట్, ఎస్ఎన్ఎఫ్ శాతాన్ని బట్టి లీటర్‌కు రూ.32 నుంచి రూ.42 వరకు వరకు చెల్లిస్తున్నారు. ఇతర డెయిరీలు పాల శాతాన్ని కచ్చితంగా లెక్కించడంలేదు. రూ.25 నుంచి రూ.30 వరకు మాత్రమే ఇస్తున్నారు. 10 రోజుల్లో 35 లీటర్ల వరకు పాలు పోస్తాం. రూ.1500 వరకు జమవుతోంది. అమూల్ కేంద్రాలను కొనసాగించాల్సిందే..– వెంకటశివారెడ్డి, రంగన్నగారిగడ్డ, తిరుపతి జిల్లామూతపడితే మా బతుకులు అగమ్యగోచరంప్రైవేటు డెయిరీలు 15 రోజుల సరాసరి పాల శాతాన్ని గణించి రేటు నిర్ణయిస్తాయి. అమూల్ ఏ రోజుకారోజే పాల శాతాన్ని లెక్కిస్తుంది. దీంతో గిట్టుబాటు ధర వస్తోంది. పాడి కొనుగోలుకు అమూల్ రుణాలు కూడా ఇప్పించింది. ఇతర డెయిరీల్లో ఈ సౌకర్యం లేదు. 10 రోజుల్లో 30 లీటర్లు పాలు పోస్తా. రూ.1,400 వరకు జమవుతుంది. అమూల్ కేంద్రాలు మూతపడితే మా బతుకులు అగమ్య గోచరంగా మారతాయి.– స్వామిదాస్, తిరుపట్టం, తిరుపతి జిల్లాకలెక్టరేట్ల వద్ద రైతుల ఆందోళనఅనంతపురం అర్బన్/తిరుపతి అర్బన్: అమూల్ పాల సేకరణ రద్దు చేస్తే పాడి రైతులు నష్టపోతారని, పాల వెల్లువ పథకాన్ని కొనసాగించాల్సిందేనంటూ మహిళా పాడి రైతులు అనంతపురం, తిరుపతి కలెక్టరేట్ల వద్ద సోమవారం ఆందోళన చేపట్టారు. అనంతరం అధికారలకు వినతిపత్రాలు అందజేశారు. తిరుపతిలో పెద్ద సంఖ్యలో మహిళా రైతులు కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. అమూల్ పాల సేకరణ కొనసాగించాలని డిమాండ్ చేశారు. అనంతపురంలో ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పరికరాలతో పాల తూకం, వెన్న శాతం, ఎన్ఎన్ఎఫ్ శాతం ఆటోమేటిక్‌గా నమోదవుతూ ప్రతి రైతుకూ వారి ఖాతాల్లోకి పది రోజుల్లో కచ్చితంగా డబ్బు జమయ్యేదని రైతు సంఘం నేతలు చెప్పారు. అమూల్ ద్వారానే రైతులకు మేలు జరిగేదన్నారు. ఎంతో పారదర్శకంగా సాగుతున్న ఈ మొత్తం ప్రక్రియను కూటమి ప్రభుత్వం రద్దు చేస్తోందని మండిపడ్డారు. -
అమూల్ బేబీనే టాప్..!
క్యూట్‌గా ఉన్న చిన్న పిల్లలను చూస్తే వెంటనే అమూల్ బేబీలా ఉన్నారు అంటాం. అంతలా అమూల్ బ్రాండ్ జనాల్లోకి వెళ్లింది. గుజరాత్‌కు చెందిన కంపెనీయే అయినా తెలుగు రాష్ట్రాల్లోను దీని పాల ఉత్పత్తులకు మంచి పేరే ఉంది. ఈ కంపెనీని పాల ఉత్పత్తిలో ప్రపంచవ్యాప్తంగా నంబర్‌వన్ కంపెనీగా మార్చాలని ప్రధాని మోదీ కంపెనీ వాటాదారులను విజ్ఞప్తి చేశారు. 'అమూల్' బ్రాండ్‌ను కలిగి ఉన్న గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్(జీసీఎంఎంఎఫ్)ని ప్రస్తుతం ఎనిమిదో స్థానం నుంచి ప్రపంచంలోనే నంబర్ వన్ డెయిరీ కంపెనీగా మార్చాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గురువారం రైతులు, సహకార సంఘాలకు సంబంధించిన ఇతర వాటాదారులకు ఈ మేరకు ఆయన విజ్ఞప్తి చేశారు. జీసీఎంఎంఎఫ్ స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా అహ్మదాబాద్‌లోని మోతెరా ప్రాంతంలోని నరేంద్ర మోడీ స్టేడియంలో దాదాపు లక్ష మందితో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. సహకార సంఘాలు, ప్రభుత్వం కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. భారతదేశం నేడు ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా అవతరించిందన్నారు. పదేళ్లలో భారతదేశ తలసరి పాల లభ్యత 40 శాతం పెరిగిందని చెప్పారు. ప్రపంచ పాడి పరిశ్రమ 2 శాతం వృద్ధి సాధిస్తుండగా, భారత్ వృద్ధి రేటు 6 శాతంగా ఉందని ఆయన తెలిపారు. ఇదీ చదవండి: మొబైల్ రంగాన్ని శాసించనున్న ఏఐ.. భారత డెయిరీ రంగం మొత్తం టర్నోవర్ రూ.10 లక్షల కోట్లుగా ఉందన్నారు. వరి, గోధుమలు, చెరకు ఉత్పత్తి ఉమ్మడి టర్నోవర్ కంటే చాలా అది చాలా ఎక్కువ అన్నారు. డెయిరీ రంగంలో సేవలందిస్తున్న మొత్తం శ్రామికశక్తిలో 70 శాతం మంది మహిళలే ఉన్నారని చెప్పారు. -
దేన్నీ వదలని ‘డీప్‌ఫేక్’ ముఠా..! ఫొటోలు వైరల్
ఓ ప్రముఖ నటి స్టెప్పులు వేసిన పాటకు మరో నటి స్టెప్పులు వేస్తే ఎలా ఉంటుందో మార్ఫ్ చేసి చూపిస్తే వావ్ అని అబ్బురపడతాం. ఓ 30-40 ఏళ్ల తర్వాత మనం ఎలా కనిపిస్తామో ముందే తెలుసుకోగలిగితే సూపర్ టెక్నాలజీ అని సంబరపడుతాం. అదే టెక్నాలజీ మన ముఖంతో మోసాలకు తెగబడితే.. పరువును బజారులో నిలబెడితే..! సరిగ్గా ఇప్పుడదే జరుగుతోంది. ఇటీవల ప్రముఖ హీరోయిన్ రష్మిక విషయంలో జరిగిందిదే. డీప్‌నెక్ బ్లాక్ డ్రెస్ వేసుకున్న వేరే అమ్మాయి వీడియోను మార్ఫింగ్ చేసి రష్మికలా రూపొందించిన విషయం తెలిసిందే. తాజాగా అమూల్ బ్రాండ్ పై కూడా డీప్ ఫేక్ మరక పడింది. అమూల్ సంస్థ జున్నును శరం పేరుతో మార్కెట్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు సర్క్యులేట్ అవుతున్నాయి. ఇవి ఏఐ ద్వారా సృష్టించినవని.. అటువంటి ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేయలేదని అమూల్ సంస్థ స్పష్టం చేసింది. శరం పేరుతో అమూల్ కొత్త రకం చీజ్ విడుదల చేసినట్లు సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్‌ల్లో ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దానికి కంపెనీతో ఎలాంటి సంబంధం లేదని అమూల్ సంస్థ తేల్చి చెప్పింది. వినియోగదారులు ఫేక్ న్యూస్, ఫేక్ ఫొటోలపై అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఈ చిత్రాన్ని తయారు చేసినట్లు తెలిసింది. తమ బ్రాండ్ పేరు చెడగొట్టేందుకే ఇలాంటి డీప్ ఫేక్ చిత్రాలను వైరల్ చేస్తున్నారని సంస్థ పేర్కొంది. ఈ పోస్టుల ద్వారా తప్పుడు సమాచారం సృష్టించి వినియోగదారులను అనవసరమైన గందరగోళాన్ని సృష్టిస్తున్నారని తెలిపింది. వైరల్ అవుతున్న ఫొటోలో అమూల్ లోగోతో లైట్ ఎల్లో కలర్ ప్యాకెట్, పెద్ద ఫాంట్లో శరం అనే పదాన్ని చిత్రీకరించారు. ఇదీ చదవండి: టోల్‌ప్లాజా తొలగింపుపై మంత్రి కీలక వ్యాఖ్యలు అముల్ బ్రాండ్‌పై ఇలాంటి వైరల్ న్యూస్, ఫొటోలు వైరల్ కావడం కొత్తేమి కాదు. గతంలో అమూల్ లస్సీ ప్యాకెట్లో ఫంగస్ ఉందని సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. ఆ వీడియోలు ఫేక్ అని కేవలం వినియోగదారులను భయాందోళనకు గురి చేస్తున్నారని సంస్థ కొట్టిపారేసింది. -
పునరుద్ధరణ దిశగా ప్రకాశం డెయిరీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో సహకార డెయిరీ పునరుద్ధరణకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే దేశంలోనే రెండో అతిపెద్ద పాల కర్మాగారంగా పేరొందిన చిత్తూరు విజయ డెయిరీ పునరుద్ధరణకు జూలై 4న సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేసిన విషయం విదితమే. తాజాగా ప్రకాశం డెయిరీని పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అమూల్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుని నవంబర్‌లో భూమిపూజకు ఏర్పాట్లు చేస్తోంది. అమూల్ రూ.400 కోట్ల పెట్టుబడి ప్రకాశం డెయిరీకి ప్రకాశం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 95.42 ఎకరాల భూములతోపాటు కోట్లాది రూపాయల విలువైన యంత్ర పరికరాలు ఉన్నాయి. 2013 ఫిబ్రవరి 13న టీడీపీ హయాంలో ప్రభుత్వ అనుమతి లేకుండా ఇండియన్ కంపెనీస్ యాక్టు–1956 కింద పీడీసీఎంపీయూ లిమిటెడ్ పేరిట కంపెనీగా మార్చిన ఈ డెయిరీని ఆ తర్వాత దశల వారీగా నిర్వీర్యం చేశారు. ఈ డెయిరీకి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. డెయిరీకి చెందిన పాత బకాయిలు రూ.108.32 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. కాగా, ఇక్కడ రూ.400 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు అమూల్ సుముఖత వ్యక్తం చేసింది. పాల ఫ్యాక్టరీతో పాటు వెన్న తయారీ యూనిట్, నెయ్యి ప్లాంట్, మిల్క్ పౌడర్ ప్లాంట్, యూహెచ్‌టీ ప్లాంట్లతో పాటు అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే బాలామృతం తయారీ యూనిట్ ఏర్పాటు చేయబోతున్నారు. అప్పట్లో పథకం ప్రకారం నిర్వీర్యం సహకార డెయిరీ రంగాన్ని పథకం ప్రకారం గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. సహకార స్ఫూర్తితో ఏర్పాటైన పాల యూనియన్లను ప్రభుత్వ అనుమతి లేకుండానే మాక్స్ సొసైటీలుగా.. ఆ తర్వాత కంపెనీలుగా మార్చుకున్నారు. ఇలా 2016 జనవరి 6న విశాఖ మిల్క్ యూనియన్, 2013 జూన్ 18న గుంటూరు, 2013 ఫిబ్రవరి 13న ప్రకాశం జిల్లా యూనియన్లు కంపెనీల యాక్టు–1956 కింద మార్చేశారు. 2017 జనవరి 23న పులివెందుల డెయిరీ, 2018 జూలై 31న రాజమండ్రి డెయిరీ, 2018 నవంబర్ 30న కంకిపాడు మినీ డెయిరీ, 2019 మార్చి 15న మదనపల్లి డెయిరీ ఇలా వరుసగా 8 సహకార డెయిరీలు మూతపడ్డాయి. వైఎస్ జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తున్న ప్రభుత్వం.. మూతపడిన డెయిరీలకు పూర్వ వైభవం తెచ్చేందుకు పునరుద్ధరణను వేగవంతం చేసింది. ఇప్పటికే మదనపల్లి డెయిరీని అందుబాటులోకి తీసుకొచ్చింది. 2021 నుంచి దీనిని అమూల్ సంస్థ విజయవంతంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే చిత్తూరు డెయిరీకి ఉన్న రూ.182 కోట్ల అప్పులను తీర్చిన ప్రభుత్వం అమూల్ సహకారంతో పూర్వవైభవం తెచ్చేందుకు జూలై 4న సీఎం భూమి పూజ చేశారు. ఇక్కడ అమూల్ సంస్థ రూ.385 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. దేశంలోనే అతిపెద్ద ఐస్ క్రీం ప్లాంట్‌తో పాటు పాల కర్మాగారం, బటర్, పాల పొడి, చీజ్, పన్నీర్, యాగర్ట్ స్వీట్స్, యూహెచ్‌టీ విభాగాలను ఏర్పాటు చేస్తున్నారు. 10 నెలల్లో లక్ష టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా ముందుకెళ్తోంది. -
‘పాడి’కి మేలి మలుపు
ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఇనమనమెల్లూరు గ్రామానికి చెందిన కరమూడి శైలజకు రెండు పాడి గేదెలున్నాయి. ఇది వరకు ప్రైవేట్ డెయిరీకి రోజూ పాలు పోసేది. ఫ్యాట్, ఎస్ఎన్ఎఫ్ (సాలిడ్స్ నాట్ ఫ్యాట్) శాతం ఎంత ఉన్నప్పటికీ లీటర్‌కు గరిష్టంగా రూ.80కి మించి చెల్లించే వారు కాదు. జగనన్న పాల వెల్లువ కేంద్రంలో రోజుకు 3 లీటర్ల పాలు పోస్తే ఎస్ఎన్ఎఫ్ 9 శాతం, ఫ్యాట్ 13 శాతం రావడంతో లీటర్‌కు రూ.103 చొప్పున చెల్లించారు. ఏకంగా లీటర్‌కు రూ.23 అదనంగా ఆదాయం వచ్చింది. ఈ లెక్కన రోజుకు రూ.69 చొప్పున నెలకు రూ.2,100 వరకు అదనంగా ఆదాయం వస్తుండడం పట్ల ఆమె ఆనందానికి అవధుల్లేవు. కాకినాడ జిల్లా వేమవరానికి చెందిన యాదాల వరలక్ష్మికి రెండు ఆవులున్నాయి. ప్రైవేటు కేంద్రానికి ప్రతీ రోజూ పాలు పోసేది. ఎస్ఎన్ఎఫ్, ఫ్యాట్ శాతం ఎంత ఉన్నా.. లీటర్‌కు గరిష్టంగా రూ.35కు మించి వచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఇటీవలే ప్రారంభించిన జగనన్న పాల కేంద్రంలో ఎస్ఎన్ఎఫ్ 9 శాతం, ఫ్యాట్ 6.6 శాతంతో తొలి రోజు 2.58 లీటర్ల పాలు పోస్తే లీటర్‌కు రూ.53.86 చొప్పున రూ.138.96 వచ్చింది. ఈమె రెండు పూటలా పాలు పోస్తోంది. ఈ లెక్కన రోజుకు 5 లీటర్లు పోస్తే.. రోజుకు అదనంగా రూ.94.30 చొప్పన నెలకు రూ.2,829 అదనపు ఆదాయం వస్తోందని ఆమె ఆనందంతో చెబుతోంది. ‘అన్నా.. ఇది పాల బాటిల్.. నీళ్ల బాటిల్ కంటే తక్కువ ఖరీదు.. నీళ్ల కంటే పాలే చవకగా దొరుకుతున్నాయి. ఇలాగైతే ఎలా బతికేదన్నా.. అని పాడి రైతులు నాతో చెప్పుకుని బాధపడ్డారు. మనందరి ప్రభుత్వం రాగానే ఈ పరిస్థితిని కచ్చితంగా మారుస్తాం’ అని నాడు ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్నప్పుడు చెప్పిన మాటలివి. ఆ మాట మేరకు అక్షరాలా పరిస్థితిని మార్చేశారనేందుకు ఇప్పుడు ఊరూరా కళకళలాడుతున్న జేపీవీ కేంద్రాలే నిదర్శనం. పంపాన వరప్రసాదరావు, సాక్షి, అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది పాడి రైతులు నేడు జగనన్న పాల వెల్లువ (జేపీవీ) పథకం కింద పాలు పోస్తూ కోట్లాది రూపాయలు అదనంగా లబ్ధి పొందుతున్నారు. ప్రైవేటు డెయిరీలు, వ్యాపారులు, దళారీలు వారిస్తున్నా, ఒత్తిళ్లు తీసుకొస్తున్నా.. తాము మాత్రం జగనన్న కేంద్రంలోనే పాలు పోస్తామంటూ ముందుకొస్తున్నారు. పాలవెల్లువ పథకం ఇటీవలే ప్రారంభమైన కాకినాడ జిల్లానే తీసుకుంటే.. హెరిటేజ్, వల్లభ, శ్రీ చక్ర, తిరుమల, జెర్సీ, దొడ్ల, విశాఖ డెయిరీలు పాలు సేకరిస్తుంటాయి. ఇప్పటి వరకు ఇవి గేదె పాలకు లీటర్‌కు గరిష్టంగా రూ.80, ఆవు పాలకు రూ.35కు మించి ఇస్తున్న దాఖలాలు లేవు. అలాంటిది పాల వెల్లువ పథకం ద్వారా నేడు రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో గేదె పాలకు లీటర్‌కు రూ.103, ఆవు పాలకు రూ.53.86 చొప్పున ధర లభిస్తోంది. ఇంత మార్పు వస్తుందని ఊహించలేదని తుని, పిఠాపురం, ప్రత్తిపాడు మండలాల్లోని పాడి రైతులు చెబుతున్నారు. ప్రైవేటు కేంద్రాల కంటే కనీసం లీటర్‌కు రూ.10–30 వరకు అదనంగా వస్తుందని హర్హం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు డెయిరీల వల్ల ఏళ్ల తరబడి తాము మోసపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక నుంచి జేపీవీ కేంద్రానికే పాలు పోస్తామని స్పష్టం చేస్తున్నారు. పక్కాగా వెన్న, ఎస్ఎన్ఎఫ్ శాతం పాలల్లో వెన్న, ఎస్ఎన్ఎఫ్ (ఘన పదార్థాలు) శాతం ఎంత ఉందో లెక్కించేందుకు ప్రైవేట్ డెయిరీలు ఒక శాస్త్రీయ పద్దతి అంటూ పాటించే వారు కాదు. పాడి రైతుల్లో నూటికి 90 శాతం పెద్దగా చదువుకోని వారే. వారు కేంద్రానికి పాలు తీసుకురాగానే, వాటిని పూర్తిగా మిక్స్ చేయకుండా, ఎస్ఎన్ఎఫ్ శాతాన్ని పరిగణనలోకి తీసుకోకుండా మొక్కుబడిగా ఫ్యాట్ శాతాన్ని లెక్కించి ధర నిర్ణయించి ఖాతా పుస్తకాల్లో రాసుకునే వారు. అడిగితే ఓ కాగితం ముక్క మీద రాసిచ్చేవారు. దాణా, ఇతర అవసరాల కోసం తీసుకున్న అప్పును మినహాయించుకొని మిగిలిన మొత్తాన్ని 15 రోజులకో, నెలకో ఇచ్చేవారు. పాలు ఎక్కువ పోసే వారికి ఒక ధర, తక్కువ పోసే వారికి మరో ధర, సీజన్లో ఓ ధర.. అన్ సీజన్లో మరో ధర ఉండేది. కొందరు కొలతల్లోనూ మోసానికి పాల్పడే వారు. ‘జగనన్న పాల వెల్లువ’ మొదలైన తర్వాత ఈ పరిస్థితిలో స్పష్టమైన మార్పు వచ్చింది. అమూల్ రాకతో ప్రైవేటు డెయిరీల అడ్డగోలు దోపిడీకి కొంతమేర కళ్లెం పడింది. రైతుకు పాల ధర పెరగడమే కాదు.. పాలల్లో నాణ్యత, చెల్లింపుల్లో పారదర్శకత పెరిగింది. ప్రైవేటు కేంద్రాల్లో టెస్టింగ్ మిషన్ ఒకటే ఉంటుంది. అదే జేవీపీ కేంద్రంలో మాత్రం అడ్వాన్స్డ్ టెక్నాలజీ మిల్క్ ఎనలైజర్ (వెన్న, ఎస్ఎన్ఎఫ్ శాతం, ప్రొటీన్, వాటర్ శాతాన్ని లెక్కించేందుకు), ్రస్ట్రిరర్ (పాలు మిక్స్ చేయడానికి) సాప్ట్వేర్ సిస్టమ్ ద్వారా పాల సేకరణ జరిగేందుకు వీలుగా ప్రత్యేకంగా కంప్యూటర్, ప్రింటర్, వేయింగ్ స్కేల్ వంటి పరికరాలను ఏర్పాటు చేశారు. కేంద్రానికి పాలు రాగానే మిక్స్ చేసిన పాలను ్రస్ట్రిరర్పై పెట్టి, ఆ శాంపిల్‌ను మళ్లీ ఎనలైజర్‌లో ఉంచి వెన్న, ఘన పదార్థాల శాతాన్ని ఖచ్చితంగా లెక్కించి.. తూకం వేసి తీసుకొని ధరను నిర్ధారిస్తారు. వెన్న శాతం లెక్కింపు లేదా ధర నిర్ణయంలో ఎలాంటి దళారీ, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రత్యేకంగా సా‹ఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అమూల్‌కు, హెరిటేజ్‌కు మధ్య ఎంత తేడా! 2020 డిసెంబర్లో 3 జిల్లాలతో ప్రారంభమైన జేపీవీ పథకం నేడు 18 జిల్లాలకు విస్తరించింది. 400 గ్రామాలలో 14,845 మందితో మొదలైన ఈ ఉద్యమం నేడు 3,691 గ్రామాలకు విస్తరించగా, 3.18 లక్షల మంది భాగస్వాములయ్యారు. 31 నెలల్లో 9.58 కోట్ల లీటర్ల పాలు సేకరించారు. ప్రస్తుతం 85 వేల మంది పాడి రైతులు ప్రతి రోజూ 1.86 లక్షల లీటర్ల పాలు పోస్తున్నారు. 2020 అక్టోబర్ వరకు 11 శాతం వెన్న, 9 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్‌తో లీటర్‌కు హెరిటేజ్ కంపెనీ గేదె పాలకు రూ.58.43, ఆవు పాలకు రూ.31.58 చెల్లించింది. సంగం డెయిరీ గేదె పాలకు రూ.58.90, ఆవు పాలకు రూ.32.87 చొప్పున చెల్లించేవారు. అమూల్ ప్రారంభంలోనే లీటర్ గేదె పాలకు 11 శాతం వెన్న, 9 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్‌తో రూ.71.47, ఆవు పాలకు 5.4 శాతం వెన్న, 8.7 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్‌తో రూ.34.20 చొప్పున చెల్లించారు. ఆ తర్వాత గడిచిన 31 నెలల్లో అమూల్ ఎనిమిదిసార్లు పాల సేకరణ ధరలు పెంచగా, ప్రైవేటు డెయిరీలు కేవలం మూడు సార్లు మాత్రమే పెంచాయి. హెరిటేజ్ ప్రస్తుతం గేదె పాలకు లీటర్ రూ.77కు పెంచామని చెబుతున్నప్పటికీ, రైతులకు వివిధ కారణాలు చెబుతూ వాస్తవంగా చెల్లిస్తున్నది రూ.66.50 మాత్రమే. అదే సంగం డెయిరీ లీటర్‌కు రూ.80.30కు పెంచామని చెబుతున్నా, వాస్తవంగా రైతులకు చెల్లిస్తున్నది మాత్రం రూ.69.35 మాత్రమే. అమూల్ మాత్రం ఖచ్చితంగా 11 శాతం ఫ్యాట్, 9 శాతం ఎస్ఎ¯Œన్ఎఫ్తో గేదె పాలకు లీటర్‌కు రూ.89.76, ఆవు పాలకు రూ.43.69 చొప్పున చెల్లిస్తోంది. ప్రైవేటు డెయిరీలు గరిష్టంగా గేదె పాలకు 11 శాతం, ఆవు పాలకు 5 శాతం ఫ్యాట్‌కు లాక్ చేసి ఆ తర్వాత ఎంత ఫ్యాట్ ఉన్నా సరే 11 శాతం కిందే పరిగణించి సొమ్ములు చెల్లిస్తున్నాయి. అమూల్ మాత్రం ఎలాంటి లాక్ సిస్టమ్ లేకుండా పాలల్లో ఉండే ఫ్యాట్ శాతం లెక్కగట్టి అణాపైసలతో సహా చెల్లిస్తోంది. ఫలితంగా గేదె పాలకు గరిష్ట ధర 103, ఆవు పాలకు రూ.53.86 ధర రైతులకు లభిస్తోంది. పాడి రైతులకు అన్ని విధాలా భరోసా గతంలో కనీస నాణ్యత లేని దాణా (16 శాతం ప్రొటీన్)ను కేవలం ఎనిమిది నెలలు మాత్రమే రైతులకు సరఫరా చేసే వారు. అమూల్ మాత్రం 20–22 శాతం ప్రోటీన్ కల్గిన దాణా 50 కేజీల బస్తా రూ.1100 చొప్పున ఏడాది పాటు ఇస్తోంది. పైగా ఏడాదిలో కనీసం 180 రోజులు పాలు పోసే ఆదర్శ రైతులకు లీటర్‌కు 50 పైసల చొప్పున ఇన్సెంటివ్ వారి ఖాతాల్లో జమ చేస్తోంది. వార్షిక ఆదాయాన్ని బట్టి ఏటా లీటర్‌కు 5 శాతం చొప్పున బోనస్ చెల్లిస్తోంది. పాడి రైతులకే కాకుండా సొసైటీల నిర్వహణ ఖర్చు కింద లీటర్‌కు రూపాయి చొప్పున చెల్లిస్తోంది. హెరిటేజ్, సంగం లాంటి ప్రైవేటు డెయిరీలు ఏజెంట్లకు కమిషన్ ఇస్తాయే తప్ప పాలుపోసే రైతులకు ఎలాంటి ఇన్సెంటివ్ ఇవ్వవు. మరొక పక్క గేదెలపై రూ.30 వేలు, ఆవులపై రూ.25 వేలు చొప్పున వర్కింగ్ క్యాపిటల్‌గా అందిస్తోన్న ప్రభుత్వం.. కొత్త పాడి పశువుల కొనుగోలుకు గేదెకు రూ.93 వేలు, ఆవుకు రూ.76 వేలు చొప్పున రుణాలందిస్తోంది. ఇలా ఇప్పటి వరకు 321 పాడి రైతులకు గేదెల కొనుగోలుకు రూ.3.69 కోట్ల రుణాలిచ్చింది. వర్కింగ్ క్యాపిటల్ కింద 7,517 మందికి రూ.36.61 కోట్ల ఆర్థిక చేయూతనిచ్చింది. ప్రైవేట్ డెయిరీలకు పాలు పోసే వారికీ రూ.4,283 కోట్ల లబ్ధి కల్తీకి అడ్డుకట్ట వేసి, నాణ్యత పెంచేందుకు ఎస్ఎన్ఎఫ్ కనీసం 8.7 శాతం ఉంటేనే గేదె పాలు, 8.5 శాతం ఉంటేనే ఆవుపాలు కొనుగోలు చేస్తామన్న నిబంధన అమూల్ పెట్టడంతో విధిలేని పరిస్థితుల్లో హెరిటేజ్, సంగం వంటి ప్రైవేటు డెయిరీలు సైతం ఎస్ఎన్ఎఫ్ శాతాన్ని పెంచి 2021 మార్చి నుంచి పాల సేకరణకు శ్రీకారం చుట్టాయి. ‘ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్’ వంటి ఆధునిక యంత్ర పరికరాలను ప్రభుత్వం సొసైటీలకు అందించడంతో కొన్ని ప్రైవేటు డెయిరీలు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో వాటిని సమకూర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జేపీవి అమలు కాని ప్రాంతాల్లో ప్రైవేటు డెయిరీలకు పాలు పోసే రైతులకు ఆదాయం పెరిగింది. ఫలితంగా రూ.4,283 కోట్ల మేర రాష్ట్ర వ్యాప్తంగా పాడి రైతులు లబ్ధి పొందారు. అదనపు ఆదాయం నిజం మా ఊళ్లో ఏర్పాటు చేసిన జగనన్న పాల వెల్లువ కేంద్రంలో శుక్రవారం 1.32 లీటర్ల పాలు పోశాను. వెన్న 14 శాతం, ఎస్ఎన్ఎఫ్ 10.1 శాతం ఉందని లెక్కించారు. ఆ మేరకు లీటర్‌కు రూ.97.92 చొప్పున రూ.129.25 చెల్లించారు. అదే ప్రైవేటు డెయిరీకి పోస్తే రూ.80కి మించి వచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఇక్కడ పాలు పోయడం వల్ల రూ.30కి పైగా అదనంగా ఆదాయం వచ్చింది. – కాళ్ల మంగ, చిత్రాడ–2, కాకినాడ జిల్లా నెలకు రూ.3,600 అదనపు ఆదాయం మాకు మూడు గేదెలున్నాయి. ప్రైవేటు కేంద్రానికి రోజుకు 6–8 లీటర్ల పాలు పోసేవాళ్లం.ఎస్ఎన్ఎఫ్, ఫ్యాట్ శాతం ఎంత ఉన్నా లీటర్‌కు రూ.70–80 మధ్య వచ్చేది. మా గ్రామంలో ఏర్పాటు చేసిన జేపీవి కేంద్రంలో ఎస్ఎన్ఏఫ్ 9.2 శాతం, ఫ్యాట్ 12.3 శాతంతో పాలు పోస్తే లీటర్‌కు ఏకంగా రూ.97.92 వచ్చింది. లీటర్‌పై సగటున రూ.20కి పైగా అదనంగా వచ్చింది. ఈ లెక్కన ఐదు లీటర్లకు రూ.120 చొప్పున నెలకు రూ.3,600కు పైగా అదనపు ఆదాయం వచ్చే పరిస్థితి కన్పిస్తోంది. ప్రైవేటు డెయిరీల్లో ఎప్పుడూ ఈ స్థాయిలో ధర రాలేదు. – పరసా వెంకటసుధ, విరవాడ, పిఠాపురం మండలం, కాకినాడ జిల్లా గతంలో రూ.30కి మించి వచ్చేది కాదు మాకు రెండు ఆవులున్నాయి. ప్రతి రోజూ 8 లీటర్ల పాలు కేంద్రానికి పోసేవాళ్లం. లీటర్‌కు రూ.30 రావడం గగనంగా ఉండేది. అలాంటిది ఇప్పుడు అమూల్ కేంద్రంలో పోస్తే ఎస్ఎన్ఏఫ్ 8.5 శాతం, ఫ్యాట్ 4.1 శాతంతో లీటర్‌కు 39.33 వచ్చింది. ఈ లెక్కన లీటర్‌కు అదనంగా రూ.9.33 చొప్పున నెలకు రూ.2,239కు పైగా ఆదనపు ఆదాయం వస్తోంది. ఇక నుంచి ఈ కేంద్రానికే పాలు పోస్తాం. – చిట్నీడి వెంకటలక్ష్మి, విరవాడ, పిఠాపురం మండలం కాకినాడ జిల్లా రైతుల నుంచి మంచి స్పందన జగనన్న పాల వెల్లువ పథకాన్ని కాకినాడ జిల్లాలో ఈ నెల 3వ తేదీన ప్రారంభించాం. పాడి రైతుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ప్రైవేటు డెయిరీలు, పాల వ్యాపారుల ఒత్తిడి ఎక్కువగా ఉంది. అయినా సరే 96 గ్రామాల్లో ప్రతి రోజూ 200 మందికి పైగా రైతులు 4,500 లీటర్ల పాలు పోస్తున్నారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో అత్యధిక మంది పాడి రైతులకు లీటర్ గేదె పాలకు రూ.95, ఆవు పాలకు రూ.53 వరకు ఆదాయం లభిస్తోంది. – డాక్టర్ ఎస్.సూర్యప్రకాశరావు, జాయింట్ డైరెక్టర్, పశు సంవర్థక శాఖ -
ఈషా అంబానీకి సరికొత్త వెపన్ దొరికిందా?
గత ఏడాది రిలయన్స్ రీటైల్ డైరక్టర్‌గా బాధ్యతల్ని చేపట్టిన ముఖేష్ అంబానీ కుమార్తె ఈషా అంబానీకి ఆర్ఎస్ సోధి (రూపిందర్ సింగ్ సోధి) రూపంలో సరికొత్త వెపన్ దొరికిందా? రిలయన్స్ రీటైల్ సామ్రాజ్యాన్ని మరింత విస్తరించేందుకు ఈషా అంబానీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారా? అంటే అవుననే అంటున్నాయి పరిశ్రమ వర్గాలు. కలిసి పనిచేయాలి. కలిసి సంబరాలు చేసుకోవాలి. రియలన్స్ కంపెనీ ఓ సందర్భంలో ఇచ్చిన స్లోగన్ ఇది. ఈ మాట రిలయన్స్ అధినేత కుటుంబానికి అతికినట్లు సరిపోతుంది. ధీరూబాయ్ సృష్టించిన వ్యాపారానికి వారసుడిగా వచ్చి సామ్రాజ్యంలా విస్తరించారు ముఖేష్. ఇప్పుడు అంబానీ ఫ్యామిలీలో థర్డ్ జనరేషన్ రిలయన్స్‌ను మరింత ముందుకు తీసుకువెళ్లడానికి వ్యూహాలు రచిస్తుంది ఈషా అంబానీ.. తండ్రికి తగ్గ తనయగా రిలయన్స్ రీటైల్ విభాగానికి రారాణిగా కొనసాగుతున్న ఈషా అంబానీ.. తండ్రికి తగ్గ తనయగా ఏ రంగంలోకి అడుగు పెట్టినా తన దైన మార్క్‌ను చూపిస్తూ మరిన్ని విజయాలు సాధించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇందులో భాగంగా గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మేనేజిమెంట్ (జీసీఎంఎంఎఫ్నే అమూల్ (AMUL)గా పిలుస్తుంటారు) మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేసిన ఆర్ఎస్ సోధికి ఈషా అంబానీ రిలయన్స్ రీటైల్, ఎఫ్ఎంసీజీ విభాగానికి అడ్వైజర్ బాధ్యతలు అప్పగించనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇదే జరిగితే టెలికాం రంగాన్ని జియో శాసించినట్లే.. రీటైల్ విభాగంలో రిలయన్స్ టార్చ్ బేరర్‌గా ఎదుగుతుందనే అభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి. ఆర్ఎస్ సోధి ఎవరు? ఆర్ఎస్ సోధి ఢిల్లీలో జన్మించారు. మున్సిపల్ స్కూల్లో విద్యనభ్యసించిన ఆయన ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ ఆనంద్ (IIRMA) నుండి ఎంబీఏ పూర్తిచేశారు. అనంతరం అమూల్‌లో సీనియర్ సేల్స్ ఆఫీసర్‌గా చేరారు. 2010 జూన్‌లో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పదోన్నతి పొందారు. సోధీ హయాంలో అమూల్ ప్రపంచంలోని అతిపెద్ద పాలను ఉత్పత్తి చేసే కంపెనీలలో ఒకటిగా ఎదిగింది. 1982లో అమూల్ ఆదాయం రూ.121 కోట్లు ఉన్నప్పుడు కంపెనీలో చేరగా.. 2022-23 నాటికి ఆ సంస్థ ఆదాయం రూ.72,000 కోట్లు దాటింది. ఇలా ఇంతింతై వటుడింతై అన్నట్లు ఎదిగిన అమూల్ సామ్రజ్యంలో సోధీ బాధ్యతలు కీలకమనే చెప్పుకోవాలి. ముఖ్యంగా 'వరల్డ్స్ ఒరిజినల్ ఎనర్జీ డ్రింక్', అమూల్ ధూద్ పీతా హై ఇండియా వంటి ప్రకటనలతో కంపెనీని లాభాల బాట పట్టించడంలో సిద్ధహస్తులయ్యారు. కొరకరాని కొయ్యగా ‘కాంపా కోలా’ సాఫ్ట్ డ్రింక్ మార్కెట్‌ను శాసిస్తున్న కోకోకోలా, పెప్సికోకు చెక్ పెట్టేలా యాభై ఏళ్ల క్రితం అనతి కాలంలోనే మార్కెట్ అగ్రగామి బ్రాండ్‌గా ఎదిగిన ‘కాంపా కోలా’ హక్కులను రిలయన్స్ దక్కించుకుంది. ప్రత్యర్ధులకు కొరకరాని కొయ్యగా తయారైంది. అదే బాటలో ఇండియన్ డైరీ మార్కెట్‌ను శాంసించేలా రిలయన్స్ రీటైల్ విభాగానికి డైరక్టర్‌గా వ్యవహరిస్తున్న ఈషా అంబానీ ఆర్ఎస్ సోధీని నియమించుకోనున్నారు. కాగా, ప్రస్తుతం ఇండియన్ డైరీ మార్కెట్ వ్యాల్యూ రూ.13లక్షల కోట్లుగా ఉంది. 2027 నాటికి రూ.30 లక్షల కోట్లకు వృద్ది సాధించనుంది. రిలయన్స్ రిటైల్ రిలయన్స్ రిటైల్ (Reliance Retail) బిజినెస్ కింద రిలయన్స్ ఫ్రెష్, రిలయన్స్ స్మార్ట్, రిలయన్స్ స్మార్ట్ పాయింట్, జియో మార్ట్, రిలయన్స్ డిజిటల్, జియో స్టోర్, రిలయన్స్ ట్రెండ్స్, ప్రాజెక్ట్ ఈవ్, ట్రెండ్స్ ఫుట్‌వేర్, రిలయన్స్ జువెల్స్, హామ్లేస్, రిలయన్స్ బ్రాండ్స్, రిలయన్స్ కన్జ్యూమర్ బ్రాండ్స్, 7-ఇలెవన్ వంటి బ్రాండ్లు ఉన్నాయి. చదవండి👉 ముగ్గురు పిల్లలకు..చాలా తెలివిగా ముఖేష్ అంబానీ వీలునామా,ఇషాకు రీటైల్ బాధ్యతలు! -
కర్ణాటకలో నందిని Vs అమూల్
-
కన్నడనాట పాల గోల.. ఇప్పుడు నందినీపై పడ్డారని బీజేపీపై విమర్శలు
బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికల వేళ కర్ణాటకలో పాలపై వివాదం చినికిచినికి గాలివానగా మారుతోంది. బెంగళూరులో ఆన్లైన్ ద్వారా అమూల్ పాలు, పెరుగు విక్రయించనున్నట్టు గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఇటీవల చేసిన ప్రకటన కలకలం రేపుతోంది. అమూల్‌కు వ్యతిరేకంగా పలు కన్నడ సంస్థలు సోమవారం నిరసనలు, ధర్నాలు నిర్వహించాయి. గో బ్యాక్ అమూల్, సేవ్ నందిని అంటూ హాష్‌ట్యాగ్‌లతో సోషల్ మీడియాలోనూ నిరసనలు జోరందుకుంటున్నాయి. అమూల్‌ను రాష్ట్రంలోకి తీసుకొచ్చి స్థానిక నందినీ డెయిరీని దెబ్బ తీసేందుకు అధికార బీజేపీ ప్రయత్నిస్తోందని విపక్ష కాంగ్రెస్, జేడీ(ఎస్) విమర్శలు గుప్పిస్తున్నాయి. ‘‘గుజరాత్‌కు చెందిన బరోడా బ్యాంక్ మా విజయ బ్యాంక్‌ను కబళించింది. దేశంలోని నౌకాశ్రయాలు, విమానాశ్రయాలన్నింటినీ గుజరాతీ అయిన అదానీకి కట్టబెడుతున్నారు. ఇప్పుడు నందినీ డెయిరీపై పడ్డారు’’ అంటూ కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య దుయ్యబట్టారు. జేడీ(ఎస్) నేత కుమారస్వామి కూడా అమూల్‌పై విమర్శలతో ట్వీట్లు చేశారు. ఈ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. అమూల్ కర్ణాటకలోకి ప్రవేశించడం లేదని బీజేపీ ఐటీ విభాగం ఇన్చార్జి అమిత్ మాలవీయ చెప్పారు. నందినీ డెయిరీని అమూల్‌లో విలీనం చేస్తారన్నది కూడా కాంగ్రెస్ కుట్రపూరిత ప్రచారం మాత్రమేనన్నారు. బీజేపీ హయాంలోనే నందినీ డెయిరీ భారీగా విస్తరించిందని చెప్పుకొచ్చారు. -
లెజెండరి సింగర్ వాణీ జయరాంకు అమూల్ ఘన నివాళి
లెజెండరి సింగర్ వాణీ జయరాం శనివారం(ఫిబ్రవరి 4న) హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. చెన్నైలోని తన నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు. ఆదివారం ఆమె ప్రభుత్వ లాంఛనాల మధ్య అంత్యక్రియలు ముగిశాయి. ఇక ఆమె మృతితో భారత చలన చిత్ర పరిశ్రమ విషాదంలోకి వెళ్లింది. 5 దశాబ్దాలుగా 14 భాషల్లో తన గాత్రాన్ని అందించారు వాణీ జయరాం. ఇక ఆమె మృతితో భారత చలన చిత్ర పరిశ్రమ విషాదంలోకి వెళ్లింది. తెలగు, తమిళం, కన్నడ, హిందీ, మళయాల చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సినీ ప్రముఖులు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటూ సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు. చదవండి: వచ్చే వారమే ప్రభాస్-కృతి సనన్ నిశ్చితార్థం? ట్వీట్ వైరల్ అలాగే ఆమె మృతికి ప్రముఖ డెయిరీ బ్రాండ్ అమూల్ ఇండియా వినూత్నంగా నివాళులు తెలిపింది. ఆమెకు ప్రత్యేకంగా డూడుల్‌తో సంతాపం తెలిపింది. వాణీ జయరాం పాట పాడుతున్న ఫొటోను డూడుల్‌లో డిజైన్ చేసి ఘన నివాళి అర్పించింది అమూల్. దీనిని తన అధికారిక ట్విటర్లో షేర్ చేస్తూ.. ‘ప్రతి రాగంలో ఆమె కవిత వికసించింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి. రిప్ వాణీ జయరాం’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ప్రస్తుతం అమూల్ ట్వీట్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్న ఆమె డూడుల్ ఫొటో అభిమానులను బాగా ఆకట్టుకుంది. ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే 37వేలకు పైగా వ్యూస్, వందల్లో లైక్స్ వచ్చాయి. చదవండి: ఆయన మరణం తర్వాత నన్ను ఏ సంఘటన కదిలించడం లేదు: సునీత #Amul Topical: Tribute to legendary playback singer of South Indian cinema pic.twitter.com/jSuzQfndkz — Amul.coop (@Amul_Coop) February 5, 2023 -
అమూల్‌పై టీడీపీ టిష్యూ పేపర్ తప్పుడు కథనాలు: మంత్రి అప్పలరాజు
సాక్షి, విశాఖపట్నం: అమూల్ డెయిరీ విషయంలో యెల్లో మీడియా రాస్తున్న తప్పుడు కథనాలపై మండిపడ్డారు మంత్రి సీదిరి అప్పలరాజు. టీడీపీ టిష్యూ పేపర్ ఈనాడులో సర్వం అమూల్ పాలు అంటూ తప్పుడు కథనం రాశారని, సర్వం అమూల్ కాదు.. సర్వం హెరిటేజ్ పాపం అని రాయలన్నారు. విశాఖలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తప్పుడు కథనాలపై నిప్పులు చెరిగారు మంత్రి అప్పలరాజు. ఉక్రోషంతో ప్రభుత్వంపై ఈనాడు వార్తలు రాస్తోందన్నారు. అమూల్ కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతోందని, రైతులకు గౌరవం పెరిగిందంటే అమూల్ వల్లనే కాదా అని ప్రశ్నించారు. జగనన్న పాల వెల్లువ ద్వారా రైతులకు మేలు జరిగిందని స్పష్టం చేశారు. ‘2.5 లక్షల లీటర్లు రోజుకు ఉత్పత్తి చేసే చిత్తూరు డైరీని చంద్రబాబు నాయుడు హయాంలోనే మూసేసారు. ఆ తర్వాత హెరిటేజ్‌ను చంద్రబాబు స్థాపించారు. డెయిరీని మూయించడం కూడా చంద్రబాబు గొప్పగా చెప్పుకున్నారు. ఇటువంటి వాస్తవాలు ఎందుకు రామోజీరావు రాయడం లేదు. 33 ఏళ్ళ, 99 ఏళ్ళ లీజు పాలసీని తీసుకువచ్చింది చంద్రబాబే కదా? రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన అక్రమాలపై ఎందుకు ఈనాడులో రాయలేదు. మిగతా డెయిరీలకు అమూల్‌కు 9 నుంచి 10 రూపాయలు తేడా ఉంది. ఈ డబ్బులన్నీ ఎవరి ఖాతాలోకి వెళ్లాయో చెప్పాలి. అమూల్ రాకపోయి ఉంటే రైతుల పరిస్థితి దారుణంగా ఉండేది. ఋషికొండలో ఏమి జరిగింది? అక్కడ కట్టేది ప్రభుత్వ భవనాలే కదా..ప్రైవేట్ భవనాలు కాదు కదా? రామోజీ ఫిల్మ్ సిటీని కొండలు తవ్వకుండా కట్టారా? వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర.. రామోజీ ఫిల్మ్ సిటీ కట్టేటప్పుడు చుస్తే చనిపోయేవారు. ఏపీకి మొత్తం అప్పు 3.8 లక్షల కోట్లని కేంద్ర మంత్రి చెబితే..దాన్ని వక్రీకరించి సుమారు 10లక్షల అని రాశారు’ అని మండిపడ్డారు మంత్రి అప్పలరాజు. ఇదీ చదవండి: సంగం డెయిరీ దూళిపాళ్ల నరేంద్ర అబ్బ సొత్తు కాదు: మంత్రి అప్పలరాజు -
పాడి రైతులకు పండుగ
సాక్షి, అమరావతి: జగనన్న పాల వెల్లువ ద్వారా పాలను సేకరిస్తున్న అమూల్ సంస్థ తాజాగా ఐదోసారి పాల సేకరణ ధరలను పెంచింది. లీటర్‌కు గరిష్టంగా గేదె పాలపై రూ.3.37, ఆవు పాలపై రూ.1.73 చొప్పున పెంచింది. కిలో వెన్నపై రూ.31, ఘన పదార్థాలపై రూ.12 మేర సేకరణ ధర పెరిగింది. ఈ పెంపు ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో గురువారం నుంచి వర్తించనుంది. దీనిద్వారా 40 వేల మంది రైతులకు అదనంగాలబ్ధి చేకూరనుంది. గత రెండేళ్లలో ఇప్పటికే నాలుగు దఫాలు పాల సేకరణ ధరలను పెంచగా తాజా పెంపుతో ఐదోసారికి చేరుకుంది. మూడు నెలల్లోనే మళ్లీ.. అమూల్ తరఫున రాయలసీమలో కైరా, కోస్తాంధ్రలో సబర్కాంత్, ఉత్తరాంధ్రలో బనస్కాంత్ యూనియన్లు పాలను సేకరిస్తున్నాయి. పథకం ప్రారంభించినప్పుడు లీటర్‌కు గరిష్టంగా గేదె పాలకు రూ.71.47, ఆవు పాలకు రూ.34.20 చొప్పున చెల్లించింది. ప్రస్తుతం లీటర్ గేదె పాలకు రూ.84.15, ఆవు పాలకు రూ.40.73 చొప్పున చెల్లిస్తోంది. అమూల్ తరఫున ఉత్తరాంధ్రలో పాలను సేకరిస్తున్న బనస్కాంత్ జిల్లా కో ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్ సెప్టెంబర్‌లో పాల సేకరణ ధరలు పెంచగా 3 నెలలు తిరగకుండానే మరోసారి పెంచడం గమనార్హం. తాజా పెంపుతో లీటర్‌కు గరిష్టంగా గేదె పాలు రూ.87.52, ఆవు పాలు రూ.42.46 చొప్పున పెరిగాయి. అమూల్ గత రెండేళ్లలో గేదె పాలపై రూ.16.05, ఆవు పాలపై రూ.8.26 మేర పెంచింది. రెండేళ్లలో 5.40 కోట్ల లీటర్ల సేకరణ జగనన్న పాలవెల్లువ ద్వారా 2020 డిసెంబర్లో 3 జిల్లాల్లో పాల సేకరణకు శ్రీకారం చుట్టగా 2 నెలల్లోనే 17 జిల్లాలకు విస్తరించారు. 27,277 మంది రైతులతో మొదలైన ఈ ఉద్యమంలో ఇపుడు ఏకంగా 2,47,958 మంది భాగస్వాములయ్యారు. వంద గ్రామాలతో ప్రారంభమై 2,856 గ్రామాలకు విస్తరించింది. రోజూ సగటున లక్షన్నర లీటర్ల పాలను సేకరిస్తోంది. 1,587 ఆర్బీకేల పరిధిలో 2,49,998 మంది పాడి రైతులు నిత్యం పాలు పోస్తున్నారు. రెండేళ్లలో 5.40 కోట్ల లీటర్ల పాలను సేకరించగా పాడి రైతులకు రూ.232.26 కోట్లు చెల్లించారు. లీటర్‌పై రూ.4 అదనంగా లబ్ధి చేకూర్చేలా కృషి చేస్తామని హామీ ఇవ్వగా ప్రస్తుతం లీటర్ గేదె పాలకు రూ.15 –రూ.20 వరకు, ఆవుపాలకు రూ.10 – రూ.12 వరకు అదనపు లాభం చేకూరుతోంది. అమూల్ రాకతో పోటీ పెరిగి ప్రైవేట్ డెయిరీలు సైతం అనివార్యంగా సేకరణ ధరలను పెంచాల్సి వచ్చింది. ఫలితంగా పాడి రైతులకు అదనంగా రూ.2,400 కోట్ల మేర ప్రయోజనం చేకూరింది. సంక్రాంతికి మిగతా జిల్లాల్లోనూ.. జగనన్న పాల వెల్లువ ద్వారా అమూల్ తరఫున ఉత్తరాంధ్రలో పాలు సేకరిస్తున్న బనస్కాంత్ యూనియన్ ఐదోసారి పాలసేకరణ ధరను పెంచడంతో పాటు వెన్న, ఘనపదార్థాల సేకరణ ధరలను కూడా పెంచింది. ఇప్పటికే 17 జిల్లాల్లో పాలు సేకరిస్తున్నాం. సంక్రాంతి కల్లా మిగిలిన జిల్లాలకు విస్తరించేలా కృషి చేస్తున్నాం. – అహ్మద్‌బాబు, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ -
అమూల్ పాలసేకరణ ధర పెంపు
సాక్షి, అమరావతి: రాయలసీమ జిల్లాల్లో పాలసేకరణ ధరను అమూల్ పెంచింది. ఇటీవలే కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పాలసేకరణ ధరను పెంచిన అమూల్ తాజాగా రాయలసీమ జిల్లాల్లో లీటరు గేదెపాలపై రూ.2.47, ఆవుపాలపై రూ.1.63 చొప్పున పెంచింది. ఈ పెంపు గురువారం నుంచి అమల్లోకి రానుంది. జగనన్న పాలవెల్లువ కింద అమూల్ తరఫున రాయలసీమ జిల్లాల్లో కైరా, కోస్తాంధ్రలో సబర్కాంత్, ఉత్తరాంధ్రలో బనస్కాంత్ యూనియన్లు పాలు సేకరిస్తున్నాయి. ఇటీవలే కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో నాలుగోసారి పాలసేకరణ ధర పెంచగా, రాయలసీమ జిల్లాల్లో నేటినుంచి అమలు చేస్తోంది. రాయలసీమ జిల్లాల్లో లీటరు ఆవుపాలకు (ఫ్యాట్ 3.5 శాతం, ఎస్ఎన్ఎఫ్ 8.5 శాతం) చెల్లిస్తున్న ధరను రూ.30.50 నుంచి రూ.32.13కు పెంచింది. లీటరు గేదెపాలకు (ఫ్యాట్ 6 శాతం, ఎస్ఎన్ఎఫ్ 9 శాతం) చెల్లిస్తున్న ధరను రూ.42.50 నుంచి రూ.44.97కు పెంచింది. కిలో ఘనపదార్థాలకు రూ.7.9 నుంచి రూ.9.5కు పెంచారు. హ్యాండ్లింగ్ చార్జీల కింద లీటరు ఆవుపాలకు (ఫ్యాట్ 4 శాతం ఎస్ఎన్ఎఫ్ 8.5 శాతం) రూ.1.24, గేదెపాలకు (ఫ్యాట్ 8 శాతం, ఎస్ఎన్ఎఫ్ 9.2 శాతం) రూ.1.64 చొప్పున సొసైటీలకు చెల్లించనున్నారు. అమూల్ దాణాపై 50 కిలోల బస్తాకు రూ.10 చొప్పున ఆయా సొసైటీ కార్యదర్శులకు ప్రోత్సాహకం ఇవ్వనున్నారు. ఫలితంగా వైఎస్సార్, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల పరిధిలోని 44 వేలమంది రైతులతోపాటు 3,768 మహిళా పాడిరైతు సంఘాలు లబ్ధిపొందనున్నాయి. అమూల్ రాకతో అదనపు లబ్ధి జగనన్న పాలవెల్లువ పథకాన్ని ఇటీవలే తిరుపతి జిల్లాకు విస్తరించారు. ప్రస్తుతం 17 జిల్లాల్లో 1,644 ఆర్బీకేల పరిధిలోని 2,856 గ్రామాల్లో జగనన్న పాలవెల్లువ అమలవుతోంది. 2,47,958 మంది మహిళా పాడిరైతుల నుంచి రోజూ 1.50 లక్షల లీటర్ల పాలను సేకరిస్తున్నారు. గడిచిన 24 నెలల్లో 5.12 కోట్ల లీటర్ల పాలు సేకరించారు. పాలుపోసిన పదిరోజుల్లోనే డబ్బు చెల్లిస్తున్నారు. ఇప్పటివరకు రూ.219.57 కోట్లు చెల్లించారు. లీటరుపై రూ.4 అదనంగా లబ్ధిచేకూర్చేలా కృషిచేస్తామని పాదయాత్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. ఆ హామీ కంటే మిన్నగా లీటరు గేదెపాలపై రూ.15 నుంచి రూ.20 వరకు, ఆవుపాలకు రూ.10 వరకు అదనంగా లబ్ధిచేకూర్చారు. ప్రైవేటు డెయిరీలు ఇస్తున్న రేట్లతో పోలిస్తే జగనన్న పాలవెల్లువ అమలవుతున్న గ్రామాల్లోని రైతులు రూ.25 కోట్ల వరకు అదనంగా లబ్ధిపొందారు. ప్రభుత్వ చర్యల ఫలితంగా ప్రైవేటు డెయిరీలు కూడా పోటీపడి ధరలను పెంచాల్సి వచ్చింది. మూడేళ్లలో వరుసగా నాలుగుసార్లు పెంచడంతో అమూల్‌తో పోటీని తట్టుకోలేక ప్రైవేటు డెయిరీలు సైతం లీటరుపై రూ.15 వరకు పెంచాల్సి వచ్చింది. ఫలితంగా జగనన్న పాలవెల్లువ పథకం కింద పాలుసేకరిస్తున్న గ్రామాల్లోనే కాదు.. ప్రైవేటు డెయిరీలకు పాలుపోస్తున్న రైతులకు కూడా గతంలో ఎన్నడూ లేని రీతిలో లబ్ధికలిగింది. ఆయా డెయిరీల పరిధిలోని రైతులు మూడేళ్లలో రూ.2,354.22 కోట్ల మేర లబ్ధిపొందగలిగారు. ఇప్పటికే అమూల్ తరఫున పాలు సేకరిస్తున్న సబర్కాంత్, బనస్కాంత్ యూనియన్లు పాలసేకరణ ధర పెంచగా, తాజాగా గురువారం నుంచి రాయలసీమ జిల్లాల్లో పాలుసేకరిస్తున్న కైరా యూనియన్ కూడా నాలుగోసారి పెంచింది. జగనన్న పాలవెల్లువ పథకాన్ని డిసెంబర్ కల్లా మిగిలిన జిల్లాలకు విస్తరించేదిశగా ముందుకెళుతున్నారు. -
‘అమూల్’ రైతులకు అదనపు లాభం
సాక్షి, అమరావతి: లాభాల వెల్లువతో పాడి రైతన్నల్లో దరహాసం విరబూస్తోంది. ‘జగనన్న పాల వెల్లువ’ ద్వారా పాలసేకరణ ధరను అమూల్ సంస్థ తాజాగా మరోసారి పెంచింది. లీటర్ గేదె పాలపై రూ.3.30, ఆవు పాలపై రూ.1.58 చొప్పున పెంచడంతో పాడి రైతన్నలకు మరింత లాభం చేకూరుతోంది. పెంచిన ధరలు గురువారం నుంచి అమలులోకి రానున్నాయి. నాలుగోసారి పెంపు వర్తింపు ‘జగనన్న పాల వెల్లువ’ పథకం 2020 డిసెంబర్లో మూడు జిల్లాల్లో ప్రారంభం కాగా ప్రస్తుతం 16 జిల్లాలకు విస్తరించారు. గత 23 నెలల్లో మూడుసార్లు సేకరణ ధరలను పెంచారు. ఉత్తరాంధ్ర పరిధిలో గత నెలలో పెంచగా, తాజాగా కోస్తాంధ్రలో 10 జిల్లాల పరిధిలో పాలసేకరణ ధరలను నాలుగోసారి పెంచారు. 1.12 లక్షల మందికి అదనపు లబ్ధి కోస్తాంధ్ర పరిధిలో ఇప్పటికే లీటర్ గేదె పాలకు రూ.79.20, ఆవుపాలకు రూ.37.90 చొప్పున చెల్లిస్తుండగా తాజాగా లీటర్‌కు గరిష్టంగా గేదె పాలపై రూ.3.30, ఆవుపాలపై రూ.1.58 పెంచారు. దీంతో గరిష్టంగా గేదె పాలు రూ.82.50, ఆవు పాలు రూ.39.48 చొప్పున సేకరణ ధరలు చేరాయి. వెన్నపై కిలోకు రూ.30, ఎస్‌ఎన్‌ఎఫ్‌పై కిలోకు రూ.11 చొప్పున పెంచడంతో వెన్న ధర రూ.750, ఘన పదార్థాల ధర రూ.280కి చేరుకుంది. గత నెలలో అమలులోకి వచ్చిన పెంపు వల్ల ఉత్తరాంధ్రలో 233 గ్రామాల పరిధిలోని 33,327 మంది రైతులు లబ్ధి పొందగా తాజా పెంపుతో కోస్తాంధ్రలోని బాపట్ల, తూర్పు గోదావరి, ఏలూరు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, ఎస్పీఎస్ ఆర్ నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలో 890 గ్రామాలకు చెందిన 1,12,313 మంది రైతులకు అదనపు లబ్ధి చేకూరనుంది. రూ.208.23 కోట్లు చెల్లింపు రాష్ట్రంలో ప్రస్తుతం 16 జిల్లాల పరిధిలో 2,833 గ్రామాలకు చెందిన 2,44,069 మంది రైతుల నుంచి పాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం 30 వేల మంది పాల ఉత్పత్తిదారులు ప్రతిరోజూ సగటున లక్ష లీటర్ల చొప్పున పాలు పోస్తున్నారు. ఇప్పటివరకు 4.86 కోట్ల లీటర్ల పాలను సేకరించగా రైతులకు రూ.208.23 కోట్లు చెల్లించారు. ప్రైవేట్ డెయిరీలతో పోలిస్తే జగనన్న పాల వెల్లువ కేంద్రాల్లో పాలు పోసే రైతులు అదనంగా రూ.25 కోట్ల మేర లబ్ధి పొందారు. దళారీలకు తావు లేకుండా ప్రతి పది రోజులకోసారి పాలుపోసే రైతుల ఖాతాలకు నేరుగా డబ్బులు జమ చేస్తున్నారు. డిసెంబర్ లోగా రాష్ట్రమంతా విస్తరణ జగనన్న పాల వెల్లువ కింద పాలసేకరణ ధరను అమూల్ నాలుగోసారి పెంచింది. ఇప్పటికే 16 జిల్లాల్లో అమలవుతున్న ఈ పథకాన్ని డిసెంబర్ నెలాఖరులోగా రాష్ట్రమంతా విస్తరించేలా చర్యలు తీసుకుంటున్నాం. – అహ్మద్ బాబు, ఎండీ, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ -
ఫ్యామిలీ డాక్టర్లా క్యాటిల్ డాక్టర్
గ్రామ స్థాయిలో రైతుల ముంగిటే పశువులకు క్రమం తప్పకుండా అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య వివరాలను యానిమల్ హెల్త్ కార్డుల్లో నమోదు చేయాలి. వీటిని ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేయాలి. తద్వారా పశువు ఆరోగ్యం ఎలా ఉంది? టీకాలు ఎప్పుడివ్వాలి? చూలు సమయం ఎప్పుడు? లాంటి వివరాలన్నీ తెలుసుకోవచ్చు. ఆర్బీకేల ద్వారా పశువులకు ఆరోగ్య సేవలను బలోపేతం చేయాలి. ఫ్యామిలీ డాక్టర్ తరహాలో గ్రామాల్లో పశువులకు వైద్యసేవల కోసం క్యాటిల్ డాక్టర్ వ్యవస్థ తెచ్చేందుకు మండలం యూనిట్‌గా కార్యాచరణ రూపొందించాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ప్రతి ఆర్బీకేలో పశు సంవర్ధక శాఖ సహాయకులను నియమించి ఖాళీగా ఉన్న 5,160 పోస్టులను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. వెటర్నరీ డాక్టర్లుగా పట్టాలు పొంది 1,200 మంది నిరీక్షిస్తున్న నేపథ్యంలో ప్రతి గ్రామంలో పశు వైద్యుడు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మండల, జిల్లా, డివిజన్ స్థాయిలో స్టాఫింగ్ ప్యాట్రన్ ఒకే రీతిలో ఉండేలా రేషనలైజేషన్ చేయాలన్నారు. వచ్చే సమావేశం నాటికి తగిన కార్యాచరణతో తనకు నివేదించాలని అధికార యంత్రాంగానికి నిర్దేశించారు. పశుసంవర్ధక శాఖపై సీఎం జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ఆ వివరాలివీ.. సేంద్రీయ పాల ఉత్పత్తులు పురుగు మందులు, రసాయనాలను మితిమీరి వాడటంతో ఆహారం ద్వారా జంతువుల్లో చేరుతున్నాయి. పాలల్లో వాటి అవశేషాల కారణంగా క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక రోగాల బారిన పడుతున్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే స్వచ్ఛమైన పాల ఉత్పత్తులపై రైతులను చైతన్యం చేయాలి. స్వచ్ఛమైన, నాణ్యమైన పాల ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తేవాలి. ప్రధానంగా సేంద్రీయ పాల ఉత్పత్తులపై దృష్టి పెట్టాలి. తక్కువ పెట్టుబడితో సేంద్రీయ పద్ధతుల్లో స్వచ్ఛమైన పాల ఉత్పత్తి సాధించడంపై విస్తృత పరిశోధనలు జరగాలి. ఆ ఫలితాలను రైతులకు అందించే చర్యలు చేపట్టాలి. అమూల్ æద్వారా పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలి. భావి తరాల కోసం.. పాలు, గుడ్లు తీసుకుంటే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని వాటిని వినియోగిస్తాం. కానీ పాలల్లో రసాయన అవశేషాల కారణంగా పిల్లల ఆరోగ్యం దెబ్బతింటున్న పరిస్థితులను చూస్తున్నాం. ఆరోగ్యవంతమైన పిల్లల ద్వారానే మంచి భావి తరాలు నిర్మాణం అవుతాయి. ఇందుకోసం నాణ్యమైన, స్వచ్ఛమైన పాల ఉత్పత్తులను అందించాలి. ఆ దిశగా పశు యాజమాన్యంలో ఉత్తమ పద్ధతులు పాటించేలా అమూల్ ద్వారా రైతులకు నిరంతర అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేపట్టాలి. పశువులకు పౌష్టికాహారం అందించే విషయంలో గ్రామ స్థాయిల్లో రైతులను చైతన్యపర్చాలి. అక్టోబర్‌లో పశువుల బీమా పథకం పశువులన్నింటికీ బీమా సదుపాయం కల్పించాలి. ఇందుకోసం ప్రత్యేక పథకానికి అక్టోబర్ నుంచి శ్రీకారం చుట్టబోతున్నాం. ప్రమాదవశాత్తూ, రోగాల వల్ల పశువులు చనిపోతే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అలాంటి సమయంలో వారికి అండగా నిలిచేందుకు ఈ పథకం ఎంతగానో తోడ్పడుతుంది. వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా పథకాల ద్వారా పశువులను కొనుగోలు చేస్తున్నారు. ఆ పశువులన్నింటికీ బీమా ఉందా? లేదా? అనేది మరోసారి పర్యవేక్షించాలి. ఆడిట్ చేసి అక్టోబరులో పథకం ప్రారంభానికి చర్యలు తీసుకోవాలి. బీమా ప్రీమియంలో 80 శాతం మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం పశుపోషణ ద్వారా రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయం లభించేలా చూడాలి. పశుపోషణ విషయంలో వారికి అండగా నిలవాలి. దీనివల్ల వ్యవసాయంతో పాటు పశుపోషణ ద్వారా అదనపు ఆదాయం ఆర్జించే అవకాశం కలుగుతుంది. తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది. వైఎస్సార్ ఆసరా, చేయూత లబి్ధదారులైన మహిళలకు పశువుల పెంపకం విషయంలో తోడుగా నిలవాలి. బ్యాంకర్లతో మాట్లాడి వారికి ఉదారంగా రుణాలిచ్చేలా కృషి చేయాలి. ప్రతి ఆర్బీకేలో కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లలో పశుపోషణకు సంబంధించిన పరికరాలను అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలి. ‘లంపీ స్కిన్’పై జాగ్రత్త తాజాగా పశువుల్లో లంపీ స్కిన్ వ్యాధి వ్యాపిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి. అడ్డుకట్ట వేసేలా పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలి. ఆరోగ్యకరమైన పశువులకు ఈ వైరస్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సరిపడా మందులు, వ్యాక్సిన్లను అందుబాటులో ఉంచాలి. అవసరమైన మేరకు టీకాలివ్వాలి. సమీక్షలో పశు సంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, పశుసంవర్ధక శాఖ స్పెషల్ సీఎస్ డాక్టర్ పూనం మాలకొండయ్య, సహకార, మార్కెటింగ్ శాఖ ముఖ్యకార్యదర్శి చిరంజీవి చౌదరి, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ ఆర్.అమరేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. నాడు – నేడుతో పశువుల ఆస్పత్రుల రూపురేఖలు మార్చాలి పశువుల ఆస్పత్రుల రూపురేఖలను సమూలంగా మార్చేయాలి. పాఠశాలలు, పీహెచ్‌సీల తరహాలోనే నాడు–నేడు కార్యక్రమం కింద వీటిని చేపట్టాలి. ప్రతి పశువుల ఆస్పత్రిలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించాలి. అధునాతన పరికరాలు అందుబాటులోకి తేవాలి. మండలం యూనిట్‌గా ప్రతి చోటా వెటర్నరీ వైద్య సదుపాయాలు ఉండేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలి. వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవలపై నిరంతరం సమీక్ష చేయాలి. రెండో విడతలో మంజూరు చేసిన వాహనాలను అక్టోబరులో ప్రారంభానికి సిద్ధం చేయాలి. -
పొంగిన పాల సేకరణ ధర
సాక్షి, అమరావతి: ‘జగనన్న పాల వెల్లువ’ ద్వారా పాలను సేకరిస్తున్న అమూల్ సంస్థ తాజాగా నాలుగోసారి పాలసేకరణ ధరను పెంచింది. ఇటీవలే ఆవుపాలపై లీటర్‌కు గరిష్టంగా రూ. 4.12 చొప్పున పెంచగా, తాజాగా గేదె పాలపై రూ.3.93 పెంచింది. అంతేకాక.. పాలుపోసే రైతులతోపాటు సొసైటీలకు అదనపు ప్రోత్సాహకాలను ప్రకటించింది. నెలకు 200 లీటర్లకు పైబడి పాలుపోసే రైతులకు రూ.2.50 వరకు అదనపు ప్రయోజనం చేకూర్చనుంది. మహిళా పాడిరైతు సంఘాల కార్యదర్శులు, సహాయ కార్యదర్శులకు ప్రత్యేక ప్రోత్సాహం కింద లీటర్‌కు పావలా చొప్పున ఇవ్వనున్నారు. ఆదివారం నుంచి ఈ పెంపు, ప్రోత్సాహకాలు అమలులోకి రానున్నాయి. 20 నెలల్లో రూ.181.90 కోట్ల చెల్లింపు ‘జగనన్న పాలవెల్లువ’ కింద 2020 డిసెంబర్లో మూడు జిల్లాల్లో పాల సేకరణకు శ్రీకారం చుట్టగా, 20 నెలల్లో 15 జిల్లాలకు (పునర్విభజన తర్వాత) విస్తరించారు. 2,344 గ్రామాల్లో 2,34,548 మంది నమోదు కాగా, రోజుకు 1.06 లక్షల మంది పాలుపోస్తున్నారు. ఇప్పటివరకు 4.20 కోట్ల లీటర్ల పాలను సేకరించగా రూ.181.90 కోట్లు చెల్లించారు. అమూల్ తరఫున రాయలసీమలో కైరా, కోస్తాంధ్రలో సబర్కాంత్, ఉత్తరాంధ్రలో బనస్కాంత్ యూనియన్లు పాలు సేకరిస్తున్నాయి. ఇక విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో ట్రయిల్ రన్ నిర్వహిస్తుండగా.. కాకినాడ, కోనసీమ జిల్లాల్లో సర్వే జరుగుతోంది. వీటితో పాటు మిగిలిన అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కర్నూలు, నంద్యాల, శ్రీబాలాజీ జిల్లాల్లో డిసెంబర్‌లోగా విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నాలుగోసారి పాలసేకరణ ధర పెంపు పథకం ప్రారంభించినప్పుడు లీటర్‌కు గరిష్టంగా 11 శాతం వెన్న, 9 శాతం ఎస్ఎన్ఎఫ్ (వెన్నలేని ఘన పదార్థాలు)తో గేదె పాలకు రూ.71.47లు, 5.4 శాతం వెన్న, 8.7 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్‌తో ఆవు పాలకు రూ.34.20 చొప్పున చెల్లించిన అమూల్ సంస్థ గడిచిన 20 నెలల్లో మూడుసార్లు పాలసేకరణ ధరలను పెంచింది. ప్రస్తుతంు లీటర్ గేదె పాలకు గరిష్టంగా రూ.80.22, ఆవుపాలకు రూ.37.90 చొప్పున చెల్లిస్తుండగా తాజాగా అమూల్ తరఫున ఉత్తరాంధ్రాలో పాలు సేకరిస్తున్న బనస్కాంత్ జిల్లా కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్ నాలుగోసారి పాల సేకరణ ధర పెంచింది. ఇటీవలే ఆవు పాలకు లీటర్‌పై గరిష్టంగా రూ.4.12ల చొప్పున పెంచిన యూనియన్, తాజాగా గేదె పాలపై లీటర్‌కు రూ.3.93 చొప్పున పెంచింది. దీంతో గరిష్టంగా ఆవుపాల ధర లీటర్ రూ.40.73లకు చేరగా, తాజాగా గేదె పాలు ధర లీటర్‌కు రూ.84.15కు చేరనుంది. అమూల్ సంస్థ గడిచిన 20 నెలల్లో గేదె పాలపై రూ.12.68, ఆవు పాలపై రూ.6.53ల మేర పెంచింది. పాడి రైతులకు ప్రోత్సాహకాలు పాల సేకరణ ధర, రాయల్టీ బోనస్ కాకుండా పాలుపోసే రైతులతో పాటు సొసైటీ నిర్వాహకులకు అదనంగా ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఈ ప్రోత్సాహకాలను ప్రతీనెలా 7వ తేదీన చెల్లించనుంది. పాలుపోసే సామర్థ్యాన్ని బట్టి లీటర్‌కు రూ.0.75 నుంచి రూ.2.25ల వరకు రైతులకు ప్రోత్సాహకాలను అందించనుంది. ఇక సొసైటీ కార్యదర్శులు, సహాయ కార్యదర్శులకు సైతం లీటర్‌పై పావలా రాయితీని ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విధంగా ప్రతీ సొసైటీ పరిధిలో ఒక రూపాయి నుంచి రూ.2.50 వరకు అదనపు ప్రోత్సాహం అందుకోనున్నారు. ప్రైవేటు డెయిరీల పరిధిలో.. ఇక అమూల్ రాకతో పోటీని తట్టుకోలేక ప్రైవేటు డెయిరీలు సైతం పాలసేకరణ ధరను విధిగా పెంచాల్సి వచి్చంది. ఫలితంగా వాటికి పాలుపోసే పాడి రైతులకు అదనపు మేలు చేకూరింది. గతంలో ఎన్నడూలేని రీతిలో లీటర్‌పై రూ.12 నుంచి రూ.15ల వరకు ఆయా డెయిరీలు పెంచాల్సి వచ్చింది. ఫలితంగా 20 నెలల్లో ఏకంగా రూ.2,020.46 కోట్ల మేర రైతులకు అదనపు లబ్ధిచేకూరినట్లుగా అంచనా వేశారు. 20 నెలల్లో నాలుగోసారి పెంపు.. జగనన్న పాల వెల్లువ కింద పాలుపోసే పాడి రైతులకు అమూల్ తరఫున ఉత్తరాంధ్రలో పాలు సేకరిస్తున్న బనస్కాంత్ యూనియన్ నాలుగోసారి పాలసేకరణ ధరను పెంచడంతోపాటు ప్రోత్సాహకాలను కూడా ప్రకటించింది. తాజా పెంపుతో సుమారు 40వేల మంది రైతులకు అదనపు లబ్ధి చేకూరనుంది. ఇప్పటికే 15 జిల్లాల్లో పాలు సేకరిస్తున్నాం. డిసెంబర్ నెలాఖరుకల్లా మిగిలిన జిల్లాలకు విస్తరించేందుకు ఏర్పాట్లుచేస్తున్నాం. – అహ్మద్‌బాబు, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ -
రాష్ట్రమంతటా ‘జగనన్న పాలవెల్లువ’
సాక్షి, అమరావతి: ‘జగనన్న పాల వెల్లువ’ రాష్ట్రమంతా విస్తరించనుంది. మరో మూడు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సహకార రంగంలో పాల డెయిరీలను బలోపేతం చేసే లక్ష్యంతో అంతర్జాతీయంగా పేరొందిన అమూల్ (ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్)తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం 2020 డిసెంబర్లో జగనన్న పాలవెల్లువకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. తొలుత రెండు ఉమ్మడి జిల్లాలతో ప్రారంభమై దశలవారీగా ఏడు జిల్లాలకు విస్తరించింది. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ప్రస్తుతం 16 జిల్లాల్లో అమలవుతోంది. మిగిలిన పది జిల్లాలకుగానూ కాకినాడ, కోనసీమలో జూలై నాలుగో వారంలో ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. నిత్యం లక్ష లీటర్ల సేకరణ జగనన్న పాల వెల్లువ కింద రాష్ట్రవ్యాప్తంగా 16 జిల్లాల పరిధిలోని 2,651 గ్రామాల్లో పాలు సేకరిస్తున్నారు. ఇప్పటివరకు 2.27 లక్షల మంది పాడిరైతులు రిజిస్ట్రేషన్ చేసుకోగా 45,456 మంది రోజూ పాలు పోస్తున్నారు. ప్రస్తుతం ప్రతి రోజూ లక్ష లీటర్ల పాలను అమూల్ సేకరిస్తోంది. అమూల్ తరపున రాయలసీమ జిల్లాల్లో కేరా, కోస్తాంధ్రలో సబర్కాంత్, ఉత్తరాంధ్రలో బనస్కాంత్ యూనియన్లు పాలను సేకరిస్తున్నాయి. ఇప్పటి వరకు అమూల్ కేంద్రాల ద్వారా 1,53,92,363 లీటర్ల ఆవుపాలు, 1,93,74,139 లీటర్ల గేదె పాలు సేకరించారు. పాడి రైతులకు రూ.149.29 కోట్లు చెల్లించారు. ఇటీవలే పాల సేకరణ ధరలను పెంచడంతో లీటర్‌కు గేదె పాలపై రూ.4.42, ఆవుపాలపై రూ.2.12 మేర రైతులు అదనంగా లబ్ధి పొందుతున్నారు. 11 శాతం కొవ్వు, 9 శాతం ఘన పదార్థాలు (ఎస్ఎన్ఎఫ్) కలిగిన గేదె పాలకు గరిష్టంగా లీటర్‌కు రూ.79.20 చెల్లిస్తున్నారు. 5.4 శాతం కొవ్వు, 8.7 శాతం ఘన పదార్థాలు (ఎస్ఎన్ఎఫ్) కలిగిన ఆవుపాలకు గరిష్టంగా లీటర్‌కు రూ.35.78 చొప్పున చెల్లిస్తున్నారు. అమూల్ రాకముందు లీటర్‌కు రూ.30–31కి మించి లభించేది కాదు. ప్రస్తుతం సగటున లీటర్‌కు గేదె పాలకు రూ.53.50, ఆవుపాలకు రూ.30.24 వరకు ధర లభిస్తోంది. ప్రైవేట్ డెయిరీలతో పోల్చితే లీటర్‌కు రూ.5 నుంచి రూ.20 వరకు రైతులకు అదనంగా లబ్ధి చేకూరుతోంది. అమూల్ రాకతో ప్రైవేట్ డెయిరీలు గత్యంతరం లేక పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. గత మూడేళ్లలో లీటర్‌కు పాలసేకరణ ధరలను రూ.10–12 వరకు పెంచాయి. ప్రాసెసింగ్ యూనిట్లు, అవుట్‌లెట్స్ రెండు జిల్లాల్లో 100 గ్రామాల్లో మొదలైన పాల సేకరణ దశలవారీగా ఉమ్మడి వైఎస్సార్, చిత్తూరు, ప్రకాశం, గుంటూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, అనంతపురం జిల్లాల్లో 2,651 గ్రామాలకు విస్తరించింది. పునర్విభజన తర్వాత రాజమహేంద్రవరం, నెల్లూరు, అనకాపల్లి జిల్లాలకు విస్తరించింది. కర్నూలు, నంద్యాలతో పాటు కాకినాడ, కోనసీమ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తిరుపతి జిల్లాల్లో పాలసేకరణ ప్రారంభించాల్సి ఉంది. సెప్టెంబర్ నెలాఖరు కల్లా అన్ని జిల్లాలకు విస్తరించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రైతుల నుంచి సేకరించే పాలను ప్రాసెస్ చేసేందుకు మదనపల్లి, విజయవాడ, విశాఖలో అమూల్ మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు సన్నాహాలు జరుగు తున్నాయి. విజయవాడ, గుంటూరు, విశాఖ, రాజమహేంద్రవరం ప్రాంతాల్లో కంటైనర్ తరహాలో అమూల్ అవుట్‌లెట్స్ ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. వచ్చే 3 నెలల్లో విస్తరణ జగనన్న పాల వెల్లువ పథకాన్ని మరో మూడు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నాం. జూలై నెలాఖరులోగా కోనసీమ, కాకినాడ జిల్లాల్లో చేపడతాం. మిగిలిన జిల్లాల్లో కూడా సెప్టెంబర్ కల్లా విస్తరించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. దశలవారీగా పాల సేకరణ గ్రామాలను పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. – అహ్మద్ బాబు, ఎండీ, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ -
Amul India: సైమండ్స్‌కు వినూత్న నివాళి
గత శనివారం (మే 14) రాత్రి క్వీన్స్‌లాండ్‌లోని టౌన్స్‌విల్లేలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ సైమండ్స్ (46)కు ప్రముఖ డెయిరీ బ్రాండ్ అమూల్ ఇండియా వినూత్నంగా నివాళి తెలిపింది. గతంలో స్పిన్ దిగ్గజం షేన్ వార్న్‌కు కూడా ప్రత్యేకంగా నివాళులర్పించిన డెయిరీ దిగ్గజం.. తాజాగా సైమండ్స్ మృతికి సంతాపంగా ఓ స్పెషల్ డూడుల్‌ను డిజైన్ చేసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by Amul - The Taste of India (@amul_india) సైమండ్స్ ఆన్ ఫీల్డ్ చిత్రాలతో డిజైన్ చేసిన ఈ డూడుల్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుటుంది. ఈ డూడుల్‌లో సైమండ్స్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ చేస్తున్న దృశ్యాలను చిత్రీకరించారు. He Symmolised the game అంటూ హెడ్డింగ్‌ను జోడించారు. ఈ డూడుల్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. అభిమానులు ఈ డూడుల్‌ను షేర్ చేస్తూ రాయ్ (సైమండ్స్ ముద్దు పేరు)కు నివాళి అర్పిస్తున్నారు. 1998లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన సైమండ్స్.. తన మొత్తం కెరీర్లో 198 వన్డేలు, 26 టెస్ట్‌లు, 14 టీ20లు, 39 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. ఆస్ట్రేలియా 2003, 2007 ప్రపంచ కప్‌లు గెలవడంలో రాయ్ కీలక పాత్ర పోషించాడు. 2011లో క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రాయ్ చనిపోక ముందు వరకు వ్యాఖ్యాతగా కొనసాగాడు. చదవండి: కన్నీరు తెప్పిస్తున్న ఆండ్రూ సైమండ్స్ సోదరి లేఖ -
పాడి రైతుకు లాభాల పంట
సాక్షి, అమరావతి: లాభాల వెల్లువతో పాడి రైతన్నల్లో దరహాసం విరబూస్తోంది. ‘జగనన్న పాల వెల్లువ’ ద్వారా ఇప్పటికే ఏడు ఉమ్మడి జిల్లాల్లో పాలను సేకరిస్తున్న అమూల్ సంస్థ తాజాగా పాలసేకరణ ధరను మూడోసారి పెంచింది. లీటర్ గేదె పాలపై రూ.4.42, ఆవు పాలపై రూ.2.12 చొప్పున పెంచడంతో పాడి రైతన్నలకు మరింత లాభం చేకూరుతోంది. పెంచిన సేకరణ ధరలు అమూల్ ప్రస్తుతం పాలను సేకరిస్తున్న పది జిల్లాల్లో ఆదివారం నుంచే అమలులోకి రాగా మరో నాలుగు జిల్లాల్లో రెండు మూడు రోజుల్లో వర్తించనున్నాయి. ప్రైవేట్ డెయిరీల ఇష్టారాజ్యంతో ఇన్నేళ్లూ తీవ్రంగా నష్టపోయిన పాడి రైతులకు ‘అమూల్’ రాకతో సాంత్వన లభిస్తోంది. 14 జిల్లాల్లో అమూల్.. ‘జగనన్న పాల వెల్లువ’ కార్యక్రమానికి 2020 డిసెంబర్లో రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మూడు జిల్లాలతో ప్రారంభమైన ఈ పథకం ప్రస్తుతం ఏడు జిల్లాలకు (పునర్విభజన అనంతరం 14 జిల్లాలు) విస్తరించింది. దీని ద్వారా అమూల్ సంస్థ ప్రారంభంలో పాల సేకరణకు లీటర్‌కు గరిష్టంగా 11 శాతం వెన్న, 9 శాతం ఎస్ఎన్ఎఫ్ (వెన్నలేని ఘన పదార్థాలు)తో గేదె పాలకు రూ.71.47 చొప్పున చెల్లించింది. 5.4 శాతం వెన్న, 8.7 శాతం ఎస్ఎన్ఎఫ్ కలిగిన ఆవు పాలకు రూ.34.20 చొప్పున రైతులకు చెల్లించింది. అయితే గత 17 నెలల్లో రెండుసార్లు సేకరణ ధరలను అమూల్ పెంచడంతో రైతులకు లాభం చేకూరింది. తాజాగా మూడోసారి సేకరణ ధరలను పెంచింది. తాజాగా మరోసారి.. ఇప్పటివరకు లీటర్ గేదె పాలకు రూ.74.78, ఆవుపాలకు రూ.35.78 చొప్పున చెల్లిస్తుండగా తాజాగా అమూల్ తరపున జగనన్న పాల వెల్లువ ద్వారా పాలను సేకరిస్తోన్న సబర్కంత్ జిల్లా కో ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్ మరింత పెంచుతూ నిర్ణయం తీసుకుంది. లీటర్‌కు గరిష్టంగా గేదెపాలపై రూ.4.42, ఆవుపాలపై రూ.2.12 చొప్పున పెంచింది. దీంతో గరిష్టంగా గేదె పాలకు రూ.79.20, ఆవు పాలపై రూ.37.90 చొప్పున పాడి రైతులకు సేకరణ ధర లభిస్తోంది. వెన్నపై కిలోకు రూ.40, ఎస్‌ఎన్‌ఎఫ్‌పై కిలోకు రూ.15 చొప్పున పెంచడంతో వెన్న రూ.720, ఘన పదార్థాలపై రూ.269 చొప్పున పాడిరైతులకు చెల్లిస్తున్నారు. దళారులు లేకుండా నేరుగా డబ్బులు.. తాజాగా సేకరణ ధరల పెంపుతో 1,94,377 మంది రైతులకు అదనపు లబ్ధి చేకూరనుంది. ప్రస్తుతం 28,763 మంది పాల ఉత్పత్తిదారులు రోజూ 96 వేల లీటర్ల చొప్పున అమూల్’కు పాలు పోస్తున్నారు. ఇప్పటి వరకు 2.91 కోట్ల లీటర్ల పాలను సేకరించగా రైతులకు రూ.124.48 కోట్లు చెల్లించారు. ప్రైవేట్ డెయిరీలతో పోలిస్తే జగనన్న పాల వెల్లువ కేంద్రాల్లో పాలు పోసే రైతులు అదనంగా రూ.21.13 కోట్ల మేర లబ్ధి పొందారు. దళారీలకు తావు లేకుండా రైతుల నుంచి నేరుగా పాలు సేకరించడమే కాకుండా పది రోజులకోసారి వారి ఖాతాల్లోనే జమ చేస్తున్నారు. ఏడాదిలో కనీసం 180 రోజుల పాటు పాలు పోసిన పాడి రైతులకు ప్రోత్సాహకంగా లీటర్ పాలకు అర్ధ రూపాయి చొప్పున లాయల్టీ ఇన్సెంటివ్ చెల్లిస్తుండటంతో పాల వెల్లువపై ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. గతంతో పోలిస్తే ఎంతో లాభం.. నాకు మూడు పాడి గేదెలున్నాయి. రోజూ ఉదయం 10 లీటర్లు, సాయంత్రం 10 లీటర్ల చొప్పున పాలు పోస్తున్నా. గతంలో లీటర్‌కు రూ.40–50కి మించి ఇచ్చేవారు కాదు. ఈ రోజు 8.8 శాతం వెన్న, 9.2 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్‌తో 10.7 లీటర్లు పాలు పోస్తే లీటర్‌కు రూ.63.36 చొప్పున ఏకంగా రూ.677.95 ఇస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. – కుసుం నాగమల్లేశ్వరి, నంబూరు, గుంటూరు పాల వెల్లువతో మంచి రోజులు నాకు రెండు పాడిగేదెలున్నాయి. ఈరోజు (ఆదివారం) ఉదయం 6.50 లీటర్లు, సాయంత్రం 5.38 లీటర్లు పాలు పోశా. 8.8 వెన్న శాతం, 8.7 ఎస్ఎన్ఎఫ్ ఆధారంగా లీటర్‌కు రూ.59.86 చొప్పున ఇచ్చారు. నిన్నటితో పోలిస్తే లీటర్‌కు రూ.3.53 చొప్పున అదనంగా లాభం వచ్చింది. జగనన్న పాల వెల్లువతో మంచి రోజులు వచ్చాయి. – బొంతు వరలక్ష్మి, కోటపాడు, ఏలూరు జిల్లా త్వరలో మరో ఐదు జిల్లాల్లో.. జగనన్న పాల వెల్లువ కింద పాలుపోసే పాడి రైతులకు అమూల్ సంస్థ సేకరణ ధరను మూడోసారి పెంచింది. తాజా పెంపుతో రైతులకు మరింత లబ్ధి చేకూరుతోంది. త్వరలో విశాఖ, తూర్పు గోదావరిలో (పునర్విభజన అనంతరం ఐదు జిల్లాలు) కూడా విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. – అహ్మద్ బాబు, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ -
అమూల్ కంటైనర్లకు హైకోర్టు అనుమతి
సాక్షి, అమరావతి: విజయవాడలో అమూల్ సంస్థ పాల ఉత్పత్తుల విక్రయానికి కంటైనర్ బూత్‌ల ఏర్పాటుకు హైకోర్టు అనుమతించింది. అయితే వాటి కార్యకలాపాలను ప్రారంభించవద్దని ఆదేశించింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 12కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అమూల్ కంటైనర్ల ఏర్పాటుకు విజయవాడ కార్పొరేషన్ కౌన్సిల్ తీర్మానం చేయడాన్ని సవాలు చేస్తూ టీడీపీ కౌన్సిలర్ నెలిబండ్ల బాలస్వామి దాఖలు చేసిన పిల్‌పై ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. నామినేషన్ పద్ధతిలో బూత్‌ల ఏర్పాటుకు అనుమతిచ్చారని పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు తెలిపారు. టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతిలో ఎలా ఇస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) చింతల సుమన్ స్పందిస్తూ, బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్స్ (బీఎస్‌వో) ప్రకారమే నడుచుకున్నామని చెప్పారు. ఉచితంగా ఇవ్వలేదని, ఆ ప్రాంతాల్లో భూమి మార్కెట్ విలువలో 10 శాతానికి ఇచ్చామన్నారు. ఎలాంటి రాయితీలు, అదనపు ప్రయోజనాలు లేవన్నారు. దీని వెనుక మహిళా సాధికారిత ఉందన్నారు. మహిళా సంఘాల నుంచి పాలు, ఇతర ఉత్పత్తులు కొని, వాటిని బూత్‌ల ద్వారా విక్రయిస్తుందని తెలిపారు. ఇవి తాత్కాలిక షెడ్లు మాత్రమేనన్నారు. వీటిని రోడ్ల మార్జిన్లలో ఏర్పాటు చేస్తున్నారని, ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగుతుందని ఆదినారాయణరావు చెప్పారు. రాష్ట్రంలో పాల సొసైటీలను ప్రోత్సహించకుండా ప్రభుత్వం అమూల్‌ను ప్రోత్సహిస్తోందన్నారు. దీనికి సుమన్ స్పందిస్తూ, ఇలాంటి వ్యాజ్యాల ద్వారా మహిళా సాధికారితను అడ్డుకుంటున్నారని అన్నారు. వాదనలు విన్న ధర్మాసనం, కంటైనర్ల ఏర్పాటుకు అనుమతించింది. పాడి రైతుల సంక్షేమం కోసం అమూల్‌తో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంపై ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)తో ఈ వ్యాజ్యాన్ని జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. -
ఏపీ ప్రభుత్వ చొరవ.. అమూల్ రాకతో పాలకు మంచి ధర
3 లీటర్లకే రూ.200 వస్తోంది గతంలో పూటకు 8 లీటర్లు పోసేవాళ్లం. రూ.200 కూడా వచ్చేది కాదు. ఇప్పుడు అమూల్ కేంద్రంలో 3 లీటర్లు పోస్తే రూ.200కు పైగా వస్తోంది. ఈ కేంద్రం ఏర్పాటైన తర్వాతే మిగిలిన కేంద్రాల్లో కూడా రేటు పెంచారు. పాడి గేదెల కొనుగోలు కోసం లోన్ కూడా ఇచ్చారు. చాలా సంతోషంగా ఉన్నాం. – ఎస్కే.అసాబి, పెదకాకాని, గుంటూరు జిల్లా రైతులకు ఒక్క వ్యవసాయం ద్వారా మాత్రమే కాకుండా, ఇతరత్రా అనుబంధ రంగాల ద్వారా అదనపు ఆదాయం వచ్చేలా చూడాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగా సహకార డెయిరీ దిగ్గజం అమూల్‌ను రాష్ట్రానికి తీసుకొచ్చి ప్రైవేట్ డెయిరీల దోపిడీకి ముకుతాడు వేస్తోంది. తద్వారా పాల సేకరణలో స్పష్టమైన మార్పు కళ్లెదుటే కనిపిస్తోంది. పాల ధర పెరిగింది. చెల్లింపుల్లో పారదర్శకత వచ్చింది. పాడి ఇక బరువు కానేకాదని, నాలుగు డబ్బులు కళ్లజూడొచ్చనే భరోసా కలిగింది. సాక్షి, అమరావతి : జగనన్న పాల వెల్లువ ద్వారా పాడి రైతుకు భద్రత, ఆర్థిక భరోసా లభిస్తోంది. ప్రైవేటు డెయిరీల అడ్డగోలు దోపిడీకి కళ్లెం పడింది. ఇదివరకు పాలల్లో వెన్న శాతమెంతో.. ఎస్ఎన్ఎఫ్ (సాలిడ్ నాట్ ఫ్యాట్ – ఘన పదార్థాలు) శాతమెంతో రైతులకు తెలిసేది కాదు. కేంద్రంలో ఎంత చెబితే అంతే. ఆ లెక్కలే పుస్తకాల్లో రాసుకొని 15 రోజులకో నెలకో డబ్బులు ఇచ్చేవారు. ఎక్కువ పాలు పోసే వారికి ఒక ధర.. తక్కువ పాలు పోసే వారికి మరో ధర.. సీజన్లో ఓ ధర.. అన్ సీజన్లో మరో ధర చెల్లిస్తూ అందినకాడికి దోచుకునే వారు. వెన్న శాతాన్ని పరిగణనలోకి తీసుకొని పాలు సేకరించే ప్రైవేట్ డెయిరీలు నాణ్యతను గాలికొదిలేసేవి. దీంతో వెన్న శాతం పెంచి చూపేందుకు రైతుల నుంచి సేకరించే పాలల్లో నాసిరకం నూనెలు, హానికరమైన కొవ్వు పదార్థాలు కలిపి కృత్రిమంగా కల్తీ చేసిన పాలనమ్మి సొమ్ము చేసుకునే వారు. కొలతల్లో మోసాలకు పాల్పడేవారు. ఈ నేపథ్యంలో సహకార రంగంలోని డెయిరీలను బలోపేతం చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమూల్‌తో ఒప్పందం చేసుకుంది. అనంతరం 2020 డిసెంబర్లో ‘జగనన్న పాల వెల్లువ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తొలుత 3 జిల్లాలతో ప్రారంభమైన ఈ పథకం ఇప్పుడు 7 జిల్లాలకు విస్తరించింది. ప్రతి రోజు సగటున లక్ష లీటర్ల చొప్పున ఇప్పటి వరకు 2.46 కోట్ల లీటర్ల పాలు సేకరించింది. ఇందుకు సంబంధించి రైతుల ఖాతాల్లో రూ.104.89 కోట్లు జమ అయింది. ఉత్తరాంధ్రతో పాటు మిగిలిన జిల్లాల్లో విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మార్పు ఇలా.. ► 2020 అక్టోబర్ వరకు పది శాతం వెన్న కలిగిన లీటరు గేదె పాలకు సంగం డెయిరీ కేవలం రూ.56 ఇచ్చేది. ప్రారంభంలోనే అమూల్ లీటరుకు 11 శాతం వెన్న, 9 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్‌తో సేకరించే గేదె పాలకు రూ.71.47.. 5.4 శాతం వెన్న, 8.7 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్‌తో ఆవు పాలకు రూ.34.20 చొప్పున రైతుల ఖాతాలకు నేరుగా జమ చేసింది. ► అమూల్.. సీజన్‌తో సంబంధం లేకుండా ఎస్ఎన్ఎఫ్, వెన్న శాతం ప్రామాణికంగా అన్ని సీజన్లలోనూ ఒకే రీతిలో చెల్లిస్తోంది. గతంలో ఏటా లీటరుపై రూ.2 – రూ.5కు మించి పెంచేవారు కాదు. అలాంటిది జగనన్న పాల వెల్లువ మొదలైన 15 నెలల్లోనే లీటరుపై రూ.12 పెంచాల్సిన పరిస్థితి వచ్చింది. అమూల్ వరుసగా రెండుసార్లు ధర పెంచింది. ► ప్రస్తుతం గరిష్టంగా లీటరు ఆవు పాలకు రూ.35.78, గేదె పాలకు రూ.74.78 చొప్పున చెల్లిస్తుంటే ఆ స్థాయిలో ప్రైవేట్ డెయిరీలు చెల్లించలేకపోతున్నాయి. గతంలో కనీస నాణ్యత లేని దాణా (16 శాతం ప్రొటీన్)ను కేవలం 8 నెలలు మాత్రమే రైతులకు సరఫరా చేసే వారు. కానీ అమూల్ మాత్రం 20 – 22 శాతం ప్రొటీన్ కల్గిన దాణా 50 కేజీల బస్తా రూ.1,100 చొప్పున ఏడాది పాటు ఇస్తోంది. ► ఏడాదిలో కనీసం 180 రోజులు పాలు పోసే ఆదర్శ రైతులకు లీటర్‌కు 50 పైసల చొప్పున ఇన్సెంటివ్ వారి ఖాతాల్లో జమ చేస్తోంది. పాడి రైతులకే కాకుండా సొసైటీల నిర్వహణ ఖర్చు కింద లీటర్‌కు రూపాయి చొప్పున చెల్లిస్తోంది. ► ఎలాంటి ఇన్సెంటివ్‌లు చెల్లించని హెరిటేజ్, సంగం లాంటి ప్రైవేట్ డెయిరీలు సొసైటీల నిర్వహణ ఖర్చు కింద లీటర్‌కు 50 పైసలు మాత్రమే చెల్లిస్తున్నాయి. మరో పక్క గేదెలపై రూ.30 వేలు, ఆవులపై రూ.25 వేలు చొప్పున వర్కింగ్ క్యాపిటల్‌గా అందిస్తోన్న ప్రభుత్వం.. కొత్త పాడి పశువుల కొనుగోలుకు గేదెకు రూ.93 వేలు, ఆవుకు రూ.76 వేలు చొప్పున రుణాలందిస్తోంది. కొలతల్లో మోసాలకు అడ్డుకట్ట ► కొలతల్లో మోసాలకు చెక్ పెట్టేందుకు తూనికలు – కొలతల శాఖకున్న అధికారాలతో పశు వైద్యులను బృందాలుగా ఏర్పాటు చేసి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తోంది. ఈ తనిఖీల్లో ప్రైవేటు డెయిరీలకు చెందిన పాల కేంద్రాల్లో జరిగే మోసాలు వెలుగు చూస్తున్నాయి. ► అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో ఓ ప్రైవేటు డెయిరీకి పాలు పోస్తున్న అమ్మా డెయిరీ పాల కేంద్రంలో రోజుకు 1,200 లీటర్ల పాలు సేకరిస్తున్నారు. అయితే, కిలోకి 970 ఎంఎల్ చూపించాల్సిన మిషన్‌లో 930 ఎంఎల్ చూపిస్తున్నట్టుగా గుర్తించారు. అంటే ఒక్కో రైతు నుంచి 40 ఎంఎల్ చొప్పున రోజుకు 48 లీటర్ల పాలు అధికంగా కాజేస్తున్నట్టుగా గుర్తించారు. పలు కేంద్రాల్లో లైసెన్సుల్లేని వేయింగ్ మిషన్లు వినియోగిస్తున్నట్టుగా గుర్తించారు. క్వాలిటీ కంట్రోల్ ల్యాబొరేటరీ బలోపేతం ► వినియోగదారులకు నాణ్యమైన, సురక్షితమైన పాల లభ్యతపై భరోసా కల్పించే లక్ష్యంతో రాష్ట్రంలో సహకార పాల డెయిరీల్లో డెన్మార్క్ టెక్నాలజీతో కూడిన అత్యాధునిక మిల్క్ ఎనలైజర్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ► రాజమండ్రి, జి.కొత్తపల్లి, ఒంగోలు, మదనపల్లి, పులివెందుల, అనంతపురం సహకార డెయిరీల్లో క్వాలిటీ కంట్రోల్ ల్యాబొరేటరీలను ప్రభుత్వం బలోపేతం చేసింది. వీటి ద్వారా కొవ్వు, ప్రొటీన్స్, లాక్టోస్, ఎస్ఎన్ఏఎఫ్ వంటి వాటితో పాటు 24 పారా మీటర్స్‌లో కల్తీ పదార్థాలను గుర్తించి సరిచేస్తుంది. ఆకస్మిక తనిఖీల్లో సేకరించిన మిల్క్‌ను ఎనలైజర్స్ ద్వారా పరిశీలించి, కల్తీని గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు చర్యలు చేపట్టారు. ► జగనన్న పాల కేంద్రాలు లేని చోట మాత్రం కొన్ని ప్రైవేటు డెయిరీలు పాల సేకరణలో పాత పద్ధతినే కొనసాగిస్తున్నాయి. ఫ్యాట్, ఎస్ఎన్ఎఫ్ శాతాలను బట్టి జరిగే చెల్లింపులను పరిశీలిస్తే అమూల్ చెల్లిస్తున్న పాల ధర కంటే తక్కువ ధర చెల్లిస్తున్నట్లు అనంతపురం, కృష్ణా, ప్రకాశం, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో క్షేత్ర స్థాయి పరిశీలనలో వెలుగు చూసింది. ► అమూల్ కేంద్రాల కంటే ప్రైవేట్ కేంద్రాల్లో వెన్న, ఎస్ఎన్ఎఫ్ 0.2 నుంచి 0.5 శాతం తక్కువగా చూపి, అంటే లీటర్‌కు రూ.4 చొప్పున తక్కువ చెల్లించేందుకు యత్నిస్తుండగా, నిరంతర తనిఖీలతో అడ్డుకట్ట వేస్తున్నారు. కల్తీకి అడ్డుకట్ట వేసిన అమూల్ ► కల్తీకి అడ్డుకట్ట వేసేందుకు ఎస్ఎన్ఎఫ్ కనీసం 8.7 శాతం ఉంటేనే గేదె పాలు, 8.5 శాతం ఉంటేనే ఆవుపాలు కొనుగోలు చేస్తామన్న నిబంధన అమూల్ పెట్టడంతో విధిలేని పరిస్థితుల్లో హెరిటేజ్, సంగం వంటి ప్రైవేటు డెయిరీలు సైతం ఎస్ఎన్ఎఫ్ శాతాన్ని పెంచి 2021 మార్చి నుంచి పాలు సేకరిస్తున్నాయి. ► నాణ్యతకు పెద్ద పీట వేసేందుకు ‘ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్’ వంటి ఆధునిక యంత్ర పరికరాలను ప్రభుత్వం సొసైటీలకు అందించడంతో కొన్ని ప్రైవేటు డెయిరీలు తమ కేంద్రాల్లో కొద్దిపాటి యంత్ర పరికరాలైనా ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అమూల్ రాకతో పాల నాణ్యత విషయంలో పాడి రైతులకు అవగాహన పెరగడం, బిల్లుల చెల్లింపుల్లో పారదర్శకత పెరగడంతో ప్రైవేటు డెయిరీల దోపిడీకి అడ్డుకట్ట పడింది. జగనన్న పాలవెల్లువతో ఎంతో మేలు 15 ఏళ్లుగా పాడి పశువుల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నాం. గతంలో లీటరుకు రూ.43 ఇచ్చేవారు. పాలలో వెన్న శాతాన్ని తక్కువ చేసి చూపించి, మాకు రావాల్సిన ఆదాయాన్ని వారి జేబుల్లో వేసుకునే వారు. జగనన్న పాల వెల్లువ ప్రారంభమైన తర్వాత లీటరు పాలకు రూ.66కు పైగా చెల్లిస్తున్నారు. కచ్చితమైన కొలత, వెన్న శాతం ఉంటోంది. పాలు పోసిన వెంటనే మా మొబైల్‌కు ఆ వివరాలతో కూడిన మెసేజ్ వస్తోంది. ఎలాంటి అవకతవకలు లేకుండా ప్రతి 10 రోజులకొకసారి పాల బిల్లు చెల్లిస్తోంది. – కుడుముల సుజాత, నల్లపురెడ్డిపల్లె, పులివెందుల, వైఎస్సార్ జిల్లా -
మార్కెట్లోకి అమూల్ తాజా పాలు, పెరుగు ఉత్పత్తులు
లబ్బీపేట (విజయవాడ తూర్పు): విస్తృత శ్రేణిలో పాలు, పాల ఉత్పత్తులను అమూల్ బ్రాండ్‌తో విక్రయిస్తున్న గుజరాత్ కో–ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్ లిమిటెడ్) గురువారం అమూల్ తాజా పాలు, పెరుగును ఆంధ్రప్రదేశ్ మార్కెట్లోకి విడుదల చేసింది. విజయవాడలోని ఓ హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ బాబు.ఎ ఉత్పత్తులను లాంఛనంగా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పాడి పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. అందులో భాగంగా అమూల్ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో పాల సహకార సంఘాలు ఏర్పాటైనట్లు చెప్పారు. అమూల్ పాల కర్మాగారాన్ని విజయవాడ సమీపంలో ఏర్పాటు చేశారని, అక్కడ అత్యాధునిక సౌకర్యాలున్నాయని తెలిపారు. అమూల్ సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్ మనోరంజన్ పాణి మాట్లాడుతూ.. దేశంలో అతి పెద్ద ఆహార సంస్థ అయిన అమూల్ రైతు సహకార ఉద్యమ శక్తికి మహోన్నతమైన ఉదాహరణగా నిలుస్తుందన్నారు. సీనియర్ జనరల్ మేనేజర్ రాజన్ జంబునాథన్ మాట్లాడుతూ అమూల్ పాలు, పెరుగు ఉత్పత్తులు విజయవాడ మార్కెట్లో అందుబాటులో ఉంటాయని చెప్పారు. -
పాడి రైతులకు అమూల్య్ సహకారం
సాక్షి, అమరావతి: దేశంలో క్షీర విప్లవానికి నాంది పలికిన ‘అమూల్’(ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్) ఏపీలో పాడి పరిశ్రమాభివృద్ధికి సహకారం అందిస్తోంది. 75 ఏళ్ల క్రితం గుజరాత్లో ఎలాంటి పరిస్థితుల్లో అమూల్ ఆవిర్భవించిందో ఇప్పుడు ఏపీలోనూ అదే వాతావరణంలో తాము అడుగు పెట్టినట్లు చెబుతోంది. ‘అమూల్ సహకార సంస్థ కావడంతో రైతులే దాని యజమానులు. లాభాల్లో వాటాలు పంచడం సహకార సంస్థల లక్ష్యం. గ్రామీణ మహిళలు ఆత్మ గౌరవంతో ఇంటి నుంచే ప్రతి నెలా రూ.వేలల్లో ఆదాయాన్ని ఆర్జించే మార్గం చూపడం ద్వారా సాధికారత దిశగా అమూల్ కృషి చేస్తోంది. ‘డైనమిక్ సీఎం’ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా అక్క చెల్లెమ్మలను లక్షాధికారులుగా తీర్చిదిద్దుతోంది. ఇది ఆరంభం మాత్రమేనని, గుజరాత్ కంటే వేగంగా ఆంధ్రప్రదేశ్‌లో విస్తరిస్తామని అమూల్ మేనేజింగ్ డెరెక్టర్ ఆర్ఎస్ సోథి చెప్పారు. రాష్ట్రంలో అమూల్ కార్యకలాపాలపై ‘సాక్షి’ ప్రతినిధికి ఆయన ప్రత్యేకంగా ఇంటరŠూయ్వ ఇచ్చారు. + రాష్ట్రంలోకి అమూల్ అడుగుపెట్టి ఏడాది కావస్తోంది. ఏపీలో అమూల్ అనుభవాలను వివరిస్తారా? – గుజరాత్లో 75 ఏళ్ల క్రితం ప్రైవేట్ డెయిరీల దోపిడీతో పాడి రైతులకు గిట్టుబాటు ధర రాకపోవడంతో వారి సంక్షేమం కోసం అమూల్ సహకార సంస్థ ఆవిర్భవించింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా అటువంటి పరిస్థితులే ఉన్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పాదయాత్ర సమయంలో పాడి రైతులకు సరైన గిట్టుబాటు ధర లభించడం లేదన్న విషయాన్ని గమనించారు. పాలకు కనీసం మంచినీటి బాటిల్ ధర కూడా దక్కడం లేదన్న విషయాన్ని గుర్తించి మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూరుస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టాక ఆయన ఆహ్వానం మేరకు రాష్ట్రంలో అమూల్ కార్యకలాపాలు మొదలయ్యాయి. చిత్తూరు, ప్రకాశం జిల్లాలలో 250 గ్రామాల్లో కార్యకలాపాలు ప్రారంభించాం. ఏడాదిలో ఏడు జిల్లాల్లో 859 గ్రామాలకు విస్తరించాం. చిత్తూరు కడప, అనంతపురం, ప్రకాశం, గుంటూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి రోజుకు లక్ష లీటర్ల పాలను సేకరిస్తున్నాం. + పాడి పరిశ్రమ విషయంలో గుజరాత్, ఆంధ్రప్రదేశ్ మధ్య ఏవైనా తేడాలను గమనించారా? – పాల ఉత్పత్తిలో రెండు రాష్ట్రాలు పోటాపోటీగా ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లో రోజుకు నాలుగు కోట్ల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో 2.5 కోట్లు మిగులు పాలు ఉంటున్నాయి. 20 శాతం మాత్రమే వ్యవస్థీకృత రంగంలో ఉండగా 80 శాతం అసంఘటిత రంగంగా ఉంది. ఈ రంగంలో చాలా అవకాశాలున్నాయి. గుజరాత్‌లా ఆంధ్రప్రదేశ్‌లో వెన్న శాతం అధికంగా ఉండే పాలనిచ్చే గేదెలు అత్యధికంగా ఉన్నాయి. ఇది డెయిరీ రంగంలో వేగంగా విస్తరించడానికి దోహదం చేస్తుంది. + అమూల్ రాకతో ఏపీలో పాడి రైతులకు ఏ మేరకు ప్రయోజనం చేకూరింది? – అమూల్ ప్రైవేట్ సంస్థ కాదు. పూర్తిగా రైతులకు చెందినది. అమూల్ 36 లక్షల మంది రైతులది. ప్రస్తుతం రాష్ట్రంలో 60,000 మంది పాడి రైతులు భాగస్వాములు అయ్యారు. దేశంలో రైతులంతా కష్టపడే తత్వం కలిగినవారే. కానీ ప్రైవేట్ డెయిరీల చేతుల్లో మోసపోతున్నారు. మేం పాలను సేకరించి విక్రయించడం ద్వారా వచ్చిన లాభాలను వారికే ఇస్తాం. మేం ఆంధ్రప్రదేశ్‌లో అడుగు పెట్టకముందు పాడి రైతులకు లీటరుకు రూ.30–31 మాత్రమే లభించేది. మా రాకతో సేకరణ ధర ఏడాదిలో లీటరుకు ఎనిమిది నుంచి తొమ్మిది రూపాయలు పెరిగింది. ఇప్పుడు రైతులు లీటరుకు రూ.39 నుంచి రూ.40 వరకు పొందుతున్నారు. అమూల్ వెన్న శాతం ఆధారంగా రైతులకు చెల్లిస్తుంది. దీనివల్ల కొన్ని చోట్ల లీటరుకు రూ.70 వరకు పొందే అవకాశం లభిస్తోంది. ప్రైవేట్ డెయిరీలు చాలావరకు లీటరుకు ఒక ధరను నిర్ధారించి కొనుగోలు చేస్తాయి. + మహిళా సాధికారికత విషయంలో అమూల్ ఎలా భాగస్వామి అవుతోంది? – మహిళా సాధికారతకు డైనమిక్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా మహిళలకు ఆర్థిక స్వాతంత్రం ఉండాలన్నది ఆయన లక్ష్యం. అందుకే పాడి రైతుల పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇంటివద్దే ఉంటూ ఒక గేదె, ఆవును పెంచుకుంటూ ఆర్థిక స్వావలంబన సాధించవచ్చు. మూడు ఆవులు లేదా గేదెలను కొనుగోలు చేసి పాలు విక్రయించడం ద్వారా ప్రస్తుతం రాష్ట్రంలో మహిళలు నెలకు రూ.12,000 వరకు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. దీనివల్ల మహిళల ఆత్మగౌరవం పెరుగుతుంది. ఇది ప్రారంభం మాత్రమే. రానున్న రోజుల్లో పలు ప్రయోజనాలు చేకూరతాయి. వచ్చే ఐదేళ్లలో గ్రామీణ మహిళల నెలవారీ సంపాదన రూ.20,000కి పెంచడమే అమూల్ లక్ష్యం. గుజరాత్లో నిరక్ష్యరాస్య మహిళలు కేవలం పాలు అమ్మడం ద్వారా ఏడాదికి కోటి రూపాయలు సంపాదిస్తున్న వారు కూడా ఉన్నారు. + రాష్ట్రంలో అమూల్ విస్తరణ కార్యక్రమాలు ఏమిటి? – రెండు జిల్లాలతో ప్రారంభించి ఏడు జిల్లాలకు విస్తరించాం. త్వరలోనే రాష్ట్రంలో అన్ని జిల్లాలకు విస్తరించనున్నాం. రాష్ట్రంలో 50 నుంచి 60 శాతం గ్రామాలకు అమూల్ చేరుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ప్రస్తుతం ఏడు జిలాల్ల నుంచి రోజూ లక్ష లీటర్ల పాలను సేకరిస్తున్నాం. దీన్ని వచ్చే ఐదేళ్లలో 10 లక్షల లీటర్లకు చేర్చాలన్నది లక్ష్యం. ఏపీలో సేకరించిన పాలను పొరుగు రాష్ట్రాలకు కూడా సరఫరా చేస్తాం. ఇందుకు అవసరమైన మౌలిక వసతులను రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సమకూర్చుకుంటున్నాం. + రాష్ట్రంలో పెట్టుబడులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు లాంటి ఆలోచనలు ఉన్నాయా? – ఇంకా వేగంగా పాల సేకరణను విస్తరించే అవకాశం ఉన్నప్పటికీ మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్లు లేకపోవడంతో నెమ్మదిగా విస్తరిస్తున్నాం. నెల రోజుల్లో రాష్ట్రంలో మూడు మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తాం. మదనపల్లి, విజయవాడ, విశాఖపట్నంలో ఇవి ఏర్పాటవుతాయి. దీంతో లక్ష లీటర్ల పాలను ప్రాసెస్ చేసే సామర్థ్యం అమూల్‌కు ఈ నెలాఖరులోగా లభిస్తుంది. రానున్న కాలంలో దీన్ని మూడు నుంచి ఐదు లక్షల లీటర్లకు పెంచుతాం. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోంది. మదనపల్లిలో ప్రభుత్వ మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్‌ను లీజుకు తీసుకుంటుండగా విజయవాడ, విశాఖలో థర్డ్ పార్టీ ప్లాంట్లు నెలకొల్పుతున్నాం. విద్యార్థులకు ఫ్లేవర్డ్ మిల్క్, అంగన్వాడీలకు బాలామృతం సరఫరా కాంట్రాక్టు అమూల్‌కు లభించింది. ఇందుకోసం రూ.100 కోట్లతో త్వరలోనే సొంతంగా తయారీ యూనిట్ నెలకొల్పుతాం. కొద్ది నెలల్లోనే పశుదాణా తయారీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి జిల్లాలోనూ మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలన్నది అమూల్ లక్ష్యం. -
పాడి రైతులకు మంచి రోజులు : సీఎం జగన్
కనీసం ఒక లీటర్ మంచి నీళ్ల సీసా ధర కూడా పాలకు రావడం లేదని, ఇలాగైతే ఎలా బతకాలని అక్కచెల్లెమ్మలు నా పాదయాత్ర సమయంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని మార్చాలని అప్పుడే నిర్ణయించుకున్నా. అందుకే పాలుపోసే అక్కచెల్లెమ్మలకు మంచి రేటు వచ్చేట్టుగా, ఎటువంటి మోసం, దళారులు లేని పరిస్థితిని అమూల్ ద్వారా తీసుకువచ్చాం. ఇప్పటికే ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్, గుంటూరు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో అమూల్ పాల సేకరణ చేస్తోంది. ఇప్పుడు ఏడవ జిల్లాగా అనంతపురంలో అడుగుపెట్టింది. – వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అమూల్‌తో పోటీ వల్లే ప్రైవేట్ డెయిరీలు కూడా పాల రేట్లు పెంచక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అక్క చెల్లెమ్మలకు మంచి జరగాలని, వాళ్లకేదైనా అదనపు ఆదాయం గ్రామంలోనే ఏర్పాటు కావాలన్నదే తమ లక్ష్యం అని స్పష్టం చేశారు. వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడే పరిస్థితి రావడంతో పాటు మెరుగైన అవకాశాలు ఇవ్వాలన్న తపన, తాపత్రయంతో పలు కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. అనంతపురం జిల్లాలో జగనన్న పాల వెల్లువ శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో అమూల్ రంగ ప్రవేశం వల్ల పాడి ఉన్న ప్రతి అక్క, చెల్లెమ్మ, రైతన్నలకు మేలు జరుగుతుందన్నారు. వ్యవసాయం గిట్టుబాటు కావాలంటే కేవలం దానిమీదే ఆధారపడితే సరిపోని పరిస్థితుల్లో పాడిని తోడుగా చేసుకోవాలని చెప్పారు. ఈ నేపథ్యంలో పాల ఉత్పత్తికి, పాడి పెంపుదలకు అమూల్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. అక్క చెల్లెమ్మలే యజమానులు ► అమూల్ ప్రపంచంలోనే ఎనిమిదో స్థానంలో ఉన్న సంస్థ. దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. పాలు పోస్తున్న అక్కచెల్లెమ్మలే అమూల్ యాజమానులు. అందుకే మార్కెట్లో ఏ ఇతర ప్రైవేటు డెయిరీ కంటే అమూల్ ఎక్కువ రేటు ఇచ్చి కొనుగోలు చేస్తుంది. ► పాలు కొనుగోలు చేయడమే కాకుండా ప్రాసెసింగ్‌లో అమూల్‌కు అపార అనుభవం ఉంది. పాల నుంచి నేరుగా చాక్లెట్లు తయారు చేసే స్థాయికి అమూల్ ఎదిగింది. ప్రపంచ సంస్థలతో పోటీ పడుతోంది. అందువల్లే ఎలాంటి మోసాలు, కల్తీ, దళారుల డెడద లేకుండా అక్కచెల్లెమ్మలకు మంచి రేటు ఇస్తోంది. వచ్చిన లాభాలను కూడా బోనస్ రూపంలో ప్రతి ఆరు నెలలకోసారి అక్కచెల్లెమ్మలకు వెనక్కు ఇస్తోంది. సహకార రంగంలో ఇంతకన్నా గొప్ప పరిస్థితి ఎప్పుడూ, ఎక్కడా చూడలేం. ► మన రాష్ట్రంలో సహకార రంగాన్ని నీరుగార్చిన నేపథ్యంలో అక్కడో, ఇక్కడో ఉన్న కొద్దొ గొప్పో డెయిరీలు సహకార రంగంలో ఉన్నప్పటికీ ప్రైవేట్ వ్యక్తుల గుప్పిట్లో ఉన్నాయి. వాస్తవానికి సహకార రంగంలో ఉండటం అంటే ఇలా.. అని చూపించిన పరిస్థితి దేశం మొత్తం మీద అమూల్‌లోనే ఉంది. లాభాలు పాలు పోసే అక్కచెల్లెమ్మలకే వస్తాయి అని అమూల్ చూపించింది. అందుకే అమూల్‌కు అంత ప్రాధాన్యత. అమూల్ రాకతో పోటీతో పాటు మార్పు ►నా పాదయాత్రలో ప్రతి జిల్లాలోనూ పాలు పోసే అక్కచెల్లెమ్మలు, రైతులు వచ్చి వాటర్ బాటిల్ చూపించే వారు. మార్కెట్లో వాటర్ బాటిల్ ధర రూ.23 అయితే, లీటరు పాలు అంత కన్నా తక్కువకే కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. ఇలా అయితే మేం ఎలా బతకాలని అడిగే వారు. ఈ పరిస్థితిని మార్చడానికే ఈ ప్రయత్నాలు చేస్తున్నాం. ► అమూల్ రావడం వల్ల మిగిలిన పాలు సేకరించే డెయిరీలు కూడా పోటీలో లీటరుకు రూ.5 నుంచి రూ.20 వరకు పెంచి ఇవ్వాల్సిన పరిస్థితి. ఇప్పుడే ఎందుకు రేటు పెరిగిందంటే.. గతంలో గ్రామ స్థాయిలో మోసాలే కారణం. పాలు పోసిన వెంటనే గతంలో వాళ్లు చెప్పిందే క్వాలిటీ, ఇచ్చేదే రేటు అనే పరిస్థితులు ఉండేవి. ► రాష్ట్రంలో పాలు సేకరించే ప్రతి చోటా బీఎంసీయూ (బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు) ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో కనిపిస్తోంది. దాదాపు 4,900 బీఎంసీయూలు, 11,690 ఏఎంసీయూ (ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్)లను ఏర్పాటు చేస్తోంది. ► అమూల్ విస్తరించే కొద్దీ, ప్రతి గ్రామంలో ఇవన్నీ పెట్టుకుంటూ వెళ్తాం. వీటి వల్ల అక్కచెల్లెమ్మలు పాలు పోసేటప్పుడు అక్కడికక్కడే.. పాలు పోసిన వెంటనే ఎన్ని లీటర్లు పోశారు.. ఎంత ధర వస్తుందని వివరిస్తూ రశీదు ఇస్తారు. నేరుగా క్వాలిటీ టెస్టింగ్ చేసే అవకాశం ఉంటుంది. మీ కళ్ల ముందే పారదర్శక పద్ధతిలో పాల సేకరణ జరుగుతుంది. మోసాల నివారణకు చర్యలు ► పాల సేకరణలో జరిగే మోసాలను నివారించడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ధ్యాస పెట్టింది. తనిఖీలు విస్తృతంగా చేపట్టింది. దీనివల్ల ఇప్పటికే పలు ప్రాంతాల్లో 20 కేసులు నమోదయ్యాయి. ఇలా పట్టుబడిన కేసుల్లో ప్రైవేటు డెయిరీలు లీటరుకు 45 పైసల నుంచి రూ.10.95 వరకు పాడి రైతులకు తక్కువ చెల్లిస్తున్నట్టు వెల్లడైంది. ► ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో బాలమృతం, అంగన్వాడీ సెంటర్లకు పాల సరఫరాపై అమూల్‌తో అవగాహన ఒప్పందాలపై అధికారులు సంతకాలు చేశారు. అమూల్ ఎండీ ఆర్ఎస్ సోథీ, కైరా మిల్క్ యూనియన్ ఎండీ అమిత్ వ్యాస్, బనస్కాంత మిల్క్ యూనియన్ ఎండీ సంగ్రామ్ చౌదరి, సబర్కాంత మిల్క్ యూనియన్ ఎండీ అనిల్ బయాతీలకు సీఎం జగన్ ధన్యవాదాలు తెలిపారు. దేవుడి దయతో ప్రజలందరికీ ఇంకా మంచి చేసే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నానన్నారు.