Jagananna Pala Velluva: First Phase 14000 Liters Milk Collected 120 Villages - Sakshi
Sakshi News home page

జగనన్న పాల వెల్లువ ద్వారా ‘క్షీర’ సిరులు

Published Sat, Dec 11 2021 9:08 AM | Last Updated on Sat, Dec 11 2021 9:46 AM

Jagananna Pala Velluva: First Phase 14000 Liters Milk Collected 120 Villages - Sakshi

పాడి పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ప్రభుత్వ సహకార పాల డెయిరీలను అమూల్‌తో భాగస్వామ్యం చేయడం ద్వారా పాడి రైతుకు గిట్టుబాటు ధరతో ఆర్థిక భరోసా కల్పిస్తోంది. తొలి విడతలో 120 గ్రామాల్లో పాల వెల్లువ కేంద్రాల ద్వారా ప్రతిరోజు 14 వేల లీటర్ల పాలను సేకరిస్తున్నారు. దశల వారీగా జిల్లా వ్యాప్తంగా పాల వెల్లువ సృష్టించనున్నారు. 

కడప అగ్రికల్చర్‌: వైఎస్సార్‌ జిల్లాలో క్షీర విప్లవానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పాడి రైతుకు చేయూతనిస్తూ ప్రోత్సహిస్తోంది. జగనన్న పాల వెల్లువ పథకంలో భాగంగా ఇప్పటికే అంతర్జాతీయ స్థాయి సహకార డెయిరీగా పేరొందిన అమూల్‌ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. గత ఏడాది నవంబర్‌ నెలాఖరు నుంచి జిల్లాలో కార్యాచరణ ప్రారంభించింది.

ఇందులో భాగంగా పులివెందుల నియోజకవర్గంలోని పులివెందుల, లింగాల, చక్రాయపేట మండలాల్లో పాల శీతలీకరణ కేంద్రాలను ప్రారంభించింది. వివిధ మండలాల్లోని 120 గ్రామాల నుంచి రోజుకు 14,000 లీటర్ల పాలను సేకరించి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. త్వరలో మరో 27 గ్రామాల్లో పాల సేకరణ చేపట్టేందుకు కçసరత్తు చేస్తున్నారు. పాలలో వెన్న శాతం ఆధారంగా రైతులకు ధర చెల్లిస్తున్నారు.

పాడి గేదెల ద్వారా ప్రోత్సాహం.. 
పాలు పోసే రైతులకు పాడి గేదెల కొనుగోలు కోసం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, డీఆర్‌డీఏ, ఏపీజీబీ బ్యాంకుల ద్వారా ప్రభుత్వం చేయూతనిస్తోంది. ఎక్కువ మోతాదులో పాలు ఇచ్చే ముర్రా జాతి గేదెలతోపాటు ఇతర మేలు రకం జాతి గేదెలను కొనుగోలుకు ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం ఒక్కొక్కరికి రూ. 75 వేల చొప్పున రుణాలను మంజూరు చేసింది. పులివెందుల నియోజక వర్గంలోని ఆయా మండలాల్లో 1290 మంది మహిళలకు రుణాలు ఇచ్చారు.

అన్ని గ్రామాల్లో ఏర్పాటుకు..  
జగనన్న పాల వెల్లువ కేంద్రాలను జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసేందుకు వలంటీర్ల ద్వారా సర్వే చేయిస్తున్నారు. మరో వైపు పాడి రైతులకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. జగనన్న పాల వెల్లువకు పాలుపోసే మహిళా రైతుల పశుగణాభివృద్ధి కోసం రైతు భరోసా కేంద్రాల ద్వారా 88 టన్నుల పశుగ్రాస విత్తనాలు, 400 టన్నుల దాణామృతం(టీఎంఆర్‌) అందించారు. దీంతోపాటు ఉపాధిహామీ కింద బహు వార్షిక పశుగ్రాస సాగుకు 280 ఎకరాల మంజూరు చేశారు.

దీపావళి బోనాంజా..
గత ఏడాదిలో పాలు పోసిన రైతులకు దీపావళి పండుగ కానుకగా అమూల్‌ డెయిరీ ప్రతి లీటర్‌కు 50 పైసలు చొప్పున బోనస్‌ను ప్రకటించింది. గత సంవత్సరం నవంబర్‌ నెలలో పాలసేకరణ ప్రారంభించిన రోజు నుంచి ఈ ఏడాది సెప్టెంబర్‌ 30వ తేదీ వరకు కనీసం 157 రోజులు పాలు పోసిన 2012 మంది పాడి రైతులను బోన‹స్‌కు అర్హులుగా గుర్తించారు. వీరి నుంచి సేకరించిన 19,96,775 లీటర్లకు గాను లీటర్‌కు రూ. 50 పైసలు చొప్పున రూ.9,96,346 బోనస్‌ను రైతులు బ్యాంకు అకౌంట్‌లో జమ చేశారు.

వచ్చే ఏడాది నుంచి జిల్లావ్యాప్తంగా
వచ్చే ఏడాది నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో  అమూల్‌ పాల సేకరణ  కేంద్రాలను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నాం. ప్రస్తుతం పులివెందుల నియోజకవర్గంలో 120 గ్రామాలలో 2768 మంది రైతుల నుంచి రోజుకు 14000 లీటర్లను సేకరిస్తున్నాము. త్వరలో అన్ని గ్రామాల నుంచి పాల సేకరణ చేపడతాం.
– వింజమూరి ఉదయకిరణ్, అమూల్‌ డెయిరీ మిల్క్‌ ప్రొక్యూర్మెంట్‌ ఆఫీసర్‌. వైఎస్సార్, చిత్తూరు జిల్లాలు

ఎంత చిక్కనిపాలు పోసినా..
గతంలో ప్రైవేటు వ్యక్తులకు పాలు పోసేవాళ్లం. వాళ్లకు ఎంత చిక్కటిపాలు పోసినా లీటరుకు రూ. 35 ఇచ్చేవారు. దీంతో మేము బాగా నష్టపోయాం. ఇప్పుడు అలా కాదు. మేము పోసిన పాలకు వచ్చిన వెన్న శాతం బట్టి రేటు ఉంటుంది. లీటర్‌కు 48 నుంచి 65 రూపాయల వరకు వస్తుంది. చాలా సంతోషంగా ఉంది.  – మేకల లక్ష్మిదేవి, చక్రాయపేట, మండలం 

బోనస్‌ కింద రూ.3366 వచ్చింది
మేము అమూల్‌కు పోసిన పాలకు నెలనెల డబ్బులు రావడంతోపాటు బోనస్‌ కింద గత ఏడాది నవంబర్‌ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్‌ వరకు రూ. 3366 డబ్బు వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. పాల డబ్బులతోపాటు బోనస్‌ డబ్బులు కూడా రావడం మాకు ఆర్థికంగా వెసులుబాటు లభించింది. మేము సంతోషంగా జీవనం సాగిస్తున్నాం.  – పుష్పవతి, మల్లప్పగారిపల్లె


మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా
గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా జగనన్న పాల వెల్లువ కార్యక్రమం ద్వారా మహిళా పాడి రైతులకు జీవనోపాధి కల్పిస్తున్నాం. దీంతోపాటు బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. పాల సేకరణలో కూడా దళారీ వ్యవస్థ లేకుండా మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా కృషి చేస్తున్నాం. గతంలో లీటరు పాలు తక్కువ రేటుకు పోసేవారు. అమూల్‌ ద్వారా లీటరుకు రూ.45 నుంచి రూ.65 దాకా వస్తుంది. మహిళలంతా సంతోషంగా ఉన్నారు.
– డాక్టర్‌ వీఎల్‌ సత్యప్రకాష్, జాయింట్‌ డైరెక్టర్, పశుసంవర్థక శాఖ, కడప

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement