‘జగనన్న పాల వెల్లువ’ పథకంతో పుంజుకున్న పాడి పరిశ్రమ | Dairy industry revived with Jagananna Paala Velluva Scheme | Sakshi
Sakshi News home page

‘జగనన్న పాల వెల్లువ’ పథకంతో పుంజుకున్న పాడి పరిశ్రమ

Published Sat, Nov 6 2021 5:20 AM | Last Updated on Sat, Nov 6 2021 12:43 PM

Dairy industry revived with Jagananna Paala Velluva Scheme - Sakshi

ప్రకాశం జిల్లాలో గత పాలకుల నిర్లక్ష్యంతో ఒట్టిపోయిన పాలధారలు ‘జగనన్న పాల వెల్లువ’ పథకంతో మళ్లీ పుంజుకున్నాయి. పాడి పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ప్రభుత్వ సహకార పాల డెయిరీలను అమూల్‌తో భాగస్వామ్యం చేయడం ద్వారా పాడి రైతుకు గిట్టుబాటు ధరతో ఆర్థిక భరోసా కల్పిస్తోంది. తొలి విడతగా 242 గ్రామాల్లో పాల వెల్లువ కేంద్రాల ద్వారా ప్రతి రోజూ 10 వేల లీటర్ల పాలు సేకరిస్తున్నారు. తద్వారా పాడి రైతులు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. దశల వారీగా జిల్లా వ్యాప్తంగా పాలవెల్లువ సృష్టించనున్నారు. 

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రకాశం జిల్లాలో ‘జగనన్న పాల వెల్లువ’ కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది. టీడీపీ హయాంలో నిలువునా మోసపోయిన పాడి రైతుకు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం చేయూతనిస్తోంది. ఉనికి కోల్పోయిన ఒంగోలు డెయిరీకి అమూల్‌ భాగస్వామ్యం కల్పించి డెయిరీ రంగానికి జవసత్వాలు అందిస్తోంది. టీడీపీ హయాంలోని డెయిరీ పాలక మండలి సహకార రంగంలో ఉన్న ఒంగోలు డెయిరీని కంపెనీ యాక్ట్‌లోకి మార్చింది. ఒక పథకం ప్రకారం అప్పుల ఊబిలోకి నెట్టి ఒట్టిపోయిన గేదెలా తయారు చేసింది. ఇదే అదునుగా హెరిటేజ్‌ డెయిరీతో పాటు ఇతర ప్రైవేట్‌ డెయిరీలు జిల్లా పాడి రైతులకు సరైన ధర ఇవ్వకుండా నిలువు దోపిడీ చేశాయి. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒంగోలు డెయిరీ పరిస్థితిని గమనించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమూల్‌ను రంగంలోకి దించి పాడి రైతులకు పూర్వ వైభవాన్ని సంతరించిపెట్టేలా ప్రణాళికలు రూపొందించారు.  

ఆర్థిక పురోభివృద్ధి దిశగా.. 
జగనన్న పాల వెల్లువతో మహిళలు ఆర్థిక పురోభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నారు. 2020 నవంబరులో ఈ పథకాన్ని జిల్లాలో ప్రారంభించారు. తొలి విడతగా 201 గ్రామాల్లో పాలకేంద్రాలు ప్రారంభించారు. అనంతరం మరో 41 కేంద్రాలను విస్తరింపజేశారు. 242 గ్రామాల్లోని పాల వెల్లువ కేంద్రాల ద్వారా ప్రతిరోజూ 10 వేల లీటర్ల పాలు సేకరించేలా చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు జిల్లాలో 37.12 లక్షల లీటర్ల పాలు సేకరించారు. అందుకుగాను రూ.19.18 కోట్లు మహిళా పాడి రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేశారు. 

పాడి గేదెల ద్వారా ప్రోత్సాహం  
పాలుపోసే రైతులకు పాడి గేదెల కొనుగోలు కోసం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ ద్వారా చేయూతనిస్తున్నారు. అలాగే ఎక్కువ మోతాదులో పాలు ఇచ్చే ముర్రా జాతి గేదెలతో పాటు ఇతర మేలు రకం జాతి గేదెల కొనుగోలు చేపట్టారు. వర్కింగ్‌ కాపిటల్‌ కింద ఒక్కొక్క గేదెకు ప్రధాన మంత్రి పశు కిసాన్‌ క్రెడిట్‌ కార్డు ద్వారా రూ.30 వేలు చొప్పున, మరో రూ.70 వేలు బ్యాంకు ద్వారా అందిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని 178 మంది మహిళా రైతులకు రూ.1.52 కోట్లు రుణాల రూపంలో ఇచ్చారు. సహకార బ్యాంకుతో పాటు కమర్షియల్‌ బ్యాంకుల ద్వారా 194 మంది మహిళా పాడి రైతులకు రూ.2.02 కోట్లు, అదేవిధంగా సెర్ప్‌ ద్వారా 792 మందికి రూ.7.33 కోట్లు అందజేశారు. ఇప్పటి వరకు మొత్తంగా జిల్లాలో మహిళా పాడి రైతులు 1,164 మందికి రూ.10.53 కోట్లు ఇచ్చారు.  

వలంటీర్లతో సర్వే  
జగనన్న పాల వెల్లువ కేంద్రాలను అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసేందుకు వలంటీర్ల ద్వారా సర్వే చేయిస్తున్నారు. మరో వైపు పాడి రైతులకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. జగనన్న పాల వెల్లువకు పాలుపోసే మహిళా రైతుల పశుగణాభివృద్ధి కోసం రైతు భరోసా కేంద్రాల ద్వారా 210 మెట్రిక్‌ టన్నుల పశుగ్రాస విత్తనాలు, 201 మెట్రిక్‌ టన్నుల దాణామృతం (టీఎంఆర్‌) అందించనున్నారు. అలాగే 40 శాతం రాయితీపై పశుగ్రాసాన్ని ముక్కలుగా చేసే ఛాప్‌ కట్టర్స్‌ను రైతులకు ఇస్తున్నారు. జిల్లాలో పాడి పరిశ్రమ అభివృద్ధికి మేలుజాతి పశువుల ఉత్పత్తి కోసం 2020–21 సంవత్సరంలో 110 శాతం లక్ష్య సాధనతో జిల్లాలో 4.50 లక్షల పశువులకు కృత్రిమ గర్భధారణ ఇంజెక్షన్లు చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ రాష్ట్రీయ గోకుల్‌ మిషన్‌ సహకారంతో కనీసం 10 దేశీయ పశువులు కలిగి కృత్రిమ గర్భధారణ సౌకర్యంలేని రైతులకు జిల్లాలో 55 ఆబోతు దూడలను ఉచితంగా అందజేయనున్నారు. 

మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా..
గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాం. జగనన్న పాల వెల్లువ కార్యక్రమం ద్వారా మహిళా పాడి రైతులకు జీవనోపాధి కల్పిస్తున్నాం. ఎలాంటి షూరిటీలు లేకుండా మహిళా పాడి రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తున్నాం.  గ్రామాల్లో పాడి పరిశ్రమకు గత వైభవాన్ని తీసుకొచ్చేలా చర్యలు చేపట్టాం. కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ ప్రతి రోజు జగనన్న పాల వెల్లువ కార్యక్రమంపై సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు చేస్తున్నారు. అమూల్‌ సంస్థ ద్వారా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి ప్రతి ఇంటిలో పాడి పరిశ్రమ ఉండేలా చూస్తున్నాం. 
– డాక్టర్‌ కొప్పరపు బేబీరాణి, జాయింట్‌ డైరెక్టర్, జిల్లా పశుసంవర్థక శాఖ  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement