Jagananna Pala Velluva: సాధికారతకు ఊతం | CM YS Jaganmohan Reddy Comments In Amul Pala Velluva program | Sakshi
Sakshi News home page

Jagananna Pala Velluva: సాధికారతకు ఊతం

Published Thu, Dec 30 2021 1:57 AM | Last Updated on Thu, Dec 30 2021 2:32 PM

CM YS Jaganmohan Reddy Comments In Amul Pala Velluva program - Sakshi

అమ్మే వారు అనేక మంది ఉన్నప్పుడు.. కొనేవాడు ఒక్కడే ఉంటే అతడు ఎంత ధర చెబితే అంతే. దాన్నే బయ్యర్స్‌ మోనోపలీ అంటారు. కొనేవాళ్లు ఇద్దరు ముగ్గురున్నా గ్రూపుగా ఏర్పడతారు. అప్పుడు అమ్మే వారంతా కట్టకట్టుకుని అదే రేటుకు ఇవ్వక తప్పని పరిస్థితి. ఇలాగైతే అమ్మే వారికి అన్యాయమే జరుగుతుంది. మన రాష్ట్రంలో పాడి రైతుల విషయంలో ఈ పరిస్థితి చూస్తున్నాం. దీన్ని మార్చడానికి మన ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకుని ‘ఏపీ పాల వెల్లువ’ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. తద్వారా పోటీ వాతావరణం కల్పించి పాలు విక్రయించే అక్కచెల్లెమ్మలకు అండగా నిలిచింది.  
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: మహిళా సాధికారతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పాడి రైతులకు ముఖ్యంగా పాలు పోసే అక్క చెల్లెమ్మలకు అదనపు ఆదాయం కల్పించడానికే అమూల్‌ను తీసుకువచ్చామని, వారి ఆర్థిక చైతన్యానికి ఈ పాలవెల్లువ కార్యక్రమం ఊతమిస్తోందని చెప్పారు. కృష్ణా జిల్లాలో 264 గ్రామాల్లో ఏపీ పాలవెల్లువ కార్యక్రమం కింద పాల సేకరణ కార్యక్రమాన్ని బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు.

అమూల్‌ను ఎదుర్కోవడానికి మిగిలిన డెయిరీలు కూడా రేట్లు పెంచుతుండటం మంచి పరిణామం అని, కారణం ఏదైనా పాడి రైతులకు మేలు జరుగుతోందని సంతోషం వ్యక్తం చేశారు. ఇవాళ కృష్ణా జిల్లాలో శ్రీకారం చుడుతున్న పాల సేకరణ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న సబర్‌ కాంత మిల్క్‌ యూనియన్‌ ఎండీ డాక్టర్‌ బీఎం పటేల్‌కు అభినందనలు తెలుపుతున్నానని, నేటి నుంచి కృష్ణా జిల్లా రైతులకు, అక్కచెల్లెమ్మలకు మరింత మెరుగైన ధర లభించబోతుందన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 
ఏపీ పాలవెల్లువ కార్యక్రమాన్ని తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, పక్కన మంత్రులు సీదిరి అప్పలరాజు, వెలంపల్లి శ్రీనివాస్‌ తదితరులు  

గ్రామీణ స్థాయిలో ఆర్థిక స్వావలంబన
► మహిళా సాధికారతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం మనది. ఏపీ అమూల్‌ పాల వెల్లువ పథకం ద్వారా గ్రామీణ స్థాయిలో ఆర్థిక స్వావలంబనకు, ప్రత్యేకంగా మహిళా సాధికారతకు ఇది ఊతమిస్తుంది. కృష్ణా జిల్లాలో పాల సేకరణకు 264 గ్రామాలను ఈ దశలో ఎంపిక చేయగా, ఆయా గ్రామాల్లో 37,474 మంది పాడి రైతులను గుర్తించాం. 
► కృష్ణా జిల్లాలో ఇటీవల లాంఛనంగా 51 కేంద్రాల్లో పాల సేకరణను ప్రారంభిస్తే.. వారం రోజుల్లోనే 18,414 లీటర్ల పాలు సేకరించాం. 941 మంది పాడి రైతులకు రూ.8.15 లక్షల బిల్లు కూడా చెల్లించాం. రైతులకు ప్రతి లీటరుకు అదనంగా రూ.20కి పైగా లాభం వచ్చింది. 
► ఉదాహరణకు చాట్రాయి మండలం సోమవరానికి చెందిన పి.వెంకటనర్మమ్మ అనే సోదరి గతంలో కృష్ణా మిల్క్‌ యూనియన్‌కు పాలు పోయగా, లీటరుకు రూ.44.80 వచ్చింది. ఇప్పుడు అమూల్‌ పాల వెల్లువ కేంద్రంలో పాలు పోయగా, లీటరుకు రూ.74.78 వచ్చింది. అంటే లీటరు పాలపై ఆమె దాదాపు రూ.30 అదనంగా సంపాదించింది.

సెప్టెంబర్‌కు 17,629 గ్రామాలు లక్ష్యం 
► ప్రకాశం జిల్లాలో 245 గ్రామాల్లో, చిత్తూరులో 275 గ్రామాల్లో, వైఎస్సార్‌లో 149 గ్రామాల్లో, గుంటూరులో 203 గ్రామాల్లో, పశ్చిమ గోదావరి జిల్లాలో 174 గ్రామాల నుంచి.. మొత్తంగా 1,046 గ్రామాల నుంచి అమూల్‌  ఇప్పటికే పాల సేకరణ చేస్తోంది. 2022 సెప్టెంబర్‌ నాటికి 17,629 గ్రామాల నుంచి పాల సేకరణకు ప్రణాళికలు రచించాం. 
► ఏడాది కాలంలో ఐదు జిల్లాల్లో అమూల్‌ పాల సేకరణ ప్రారంభమవ్వగా, ఇవాళ ఆరవ జిల్లాలో మొదలైంది. మిగిలిన ఏడు జిల్లాలకూ విస్తరించే పనులు వేగంగా జరుగుతున్నాయి. 
► గత ఏడాది డిసెంబర్‌ నుంచి ఈ ఐదు జిల్లాల్లో ఇప్పటి వరకు 30,951 మంది మహిళా పాడి రైతుల నుంచి అమూల్‌ 168.50 లక్షల లీటర్లు పాల సేకరణ చేసింది. దాదాపు రూ.71 కోట్లు చెల్లించాం. ఇది పెద్ద విషయం కాదు. ఇతర డెయిరీలకు పాల సరఫరా చేస్తే వచ్చే దానికంటే దాదాపు రూ.10 కోట్లు అదనంగా వచ్చిందన్నది మనం గమనించాలి. ఇదే అక్కచెల్లెమ్మలు గతంలో వాళ్లకే పాలు పోసి ఉంటే రూ.61 కోట్లే వచ్చేవి.

పాలు పోసేవారే యజమానులు
► రైతులకు అత్యధిక రేటు ఇస్తారు. వాళ్ల దగ్గరున్న ప్రాసెసింగ్‌ మరెవ్వరి దగ్గరా లేదు. పాల నుంచి చాక్లెట్స్, ఇతర ఉత్పత్తులు తయారు చేసే స్థాయికి ఎదిగిన సంస్థ అమూల్‌.  
► మిల్క్‌ ప్రాసెసింగ్‌లో దేశంలో మొదటి స్థానంలో, ప్రపంచంలో 8వ స్థానంలో ఉంది. ఇది మనందరికీ గర్వకారణం. పాలు పోసే రైతులే అమూల్‌ యజమానులు. 
► ఈ కంపెనీలో వాటాదారులు అంతా మీరే. లాభాపేక్ష అనేది అమూల్‌కు లేదు. సంస్థ గడించే లాభాలను ఏడాదికి ఒకసారి బోనస్‌ రూపంలో తిరిగి అక్కచెల్లెమ్మలకు వెనక్కి ఇచ్చే గొప్ప ప్రక్రియ అమూల్‌లోనే ఉంది.
► పాల బిల్లును కేవలం పది రోజుల్లోనే పాడి రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయడం వల్ల అక్కచెల్లెమ్మలకు ఆర్థికంగా మరింత మేలు జరుగుతుంది. అమూల్‌తో ఇబ్బంది పడే పరిస్థితి రాదు, ఉండదు. 

సంస్థ బాగే రైతుల బాగు
► ఇదొక సహకార రంగ సంస్థ. సంస్థ బాగుంటే రైతులు బాగుంటారు. సంవత్సరంలో కనీసం 182 రోజులు అంటే ఆరు నెలలు సొసైటీకి పాలు పోసిన మహిళా పాడి రైతులకు అమూల్‌ ద్వారా ఏడాది చివరిలో ప్రతి లీటరుపై 50 పైసలు బోనస్‌గా కూడా చెల్లిస్తున్నారు. 
► ఈ సంస్థ నాణ్యమైన పశుదాణాను కూడా తక్కువ ధరకే సరఫరా చేస్తోంది. ఎంసీయూ, ఏఎంసీయూలలో అందుబాటులో ఉంచుతున్నారు.

ప్రైవేటు వ్యక్తుల ఆక్రమణలో డెయిరీలు
► సహకార రంగ డెయిరీలలో బాగున్న వాటిలో కొన్నింటిని.. దురదృష్టవశాత్తు కొంత మంది ప్రైవేటు వ్యక్తులు పూర్తిగా ఆక్రమించుకున్నారు. అవి వాళ్ల ప్రైవేటు ఆస్తుల కింద మారిపోయాయి.
► ప్రభుత్వానికి ఇది ఒక సమస్య అయితే.. రెండోది ప్రభుత్వంలోని వ్యక్తులకు ప్రైవేటు డెయిరీల్లో వాటాలు ఉండటం వల్ల, పాలుపోసే అక్కచెల్లెమ్మలకు మంచి ధర ఇప్పించాలన్న తపన, తాపత్రయం ఉండేది కాదు.

ఈ పరిస్థితి ఎందుకు?
► మన రాష్ట్రంలో ఎందుకు ఈ పరిస్థితి ఉంది? అమూల్‌ వస్తే తప్ప మన రైతులకు, మన అక్కచెల్లెమ్మలకు మెరుగైన రేటు రాని పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనిపై అందరూ ఆలోచించాలి. 
► నా పాదయాత్రలో ప్రతి జిల్లాలో పాలుపోసే రైతులు, అక్కచెల్లెమ్మలు నా దగ్గరకు వచ్చి కలిసేవారు. ‘ఒక లీటరు మినరల్‌ వాటర్‌ ధర రూ.23 అయితే, ఒక లీటరు పాలు ధర కూడా రూ.23. ఇలాగైతే ఏ రకంగా బతకగలుగుతాం?’ అని ప్రతి జిల్లాలో బాధపడేవాళ్లు. నేను కూడా ఇదే ప్రస్తావించేవాడిని.
► అందుకే అధికారంలోకి రాగానే అమూల్‌ సంస్థతో ఒప్పందం చేసుకుని, పాల సేకరణ చేపట్టాం. అమూల్‌కు, మిగిలిన సంస్థలకు ఉన్న తేడా ఏంటన్నది మనం గుర్తు పెట్టుకోవాలి. అమూల్‌ అనేది కంపెనీ కాదు.. మనలాంటి వాళ్లు కలిసికట్టుగా ఒక్కటైతే అమూల్‌ అవుతుంది.  

ఈ పరిస్థితిని మారుస్తున్నాం
► ఈ పరిస్థితిని మార్చాలని మన ప్రభుత్వం మనసా, వాచా, కర్మణా కట్టుబడి రకరకాల కార్యక్రమాలు చేస్తోంది. రాష్ట్రంలో పాడి ఎక్కువగా ఉన్న 4,796 గ్రామాలను గుర్తించాం. ఆయా గ్రామాల్లో బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాం. 
► ప్రతి మహిళా డెయిరీ సహకార సంఘానికి అనుబంధ గ్రామాల్లో కూడా పాల సేకరణ చేయడానికి ఆటోమేటిక్‌ మిల్క్‌ కలెక్షన్‌ యూనిట్స్‌ను ఏర్పాటు చేస్తున్నాం. రూ.979 కోట్లతో బీఎంసీయూలు, 12,883 ఏఎంసీయూల నిర్మాణం కోసం మరో రూ.1,600 కోట్లు ఖర్చు చేస్తున్నాం. 
► వీటి ద్వారా అక్కచెల్లెమ్మలకు భరోసా వస్తుంది. మోసం ఉండదు. ఎంత ఎస్‌ఎన్‌ఎఫ్‌ ఉందని వాళ్లే మీటర్‌ పెట్టి చూసుకోగలుగుతారు. ఎవరి ప్రమేయం లేకుండా బిల్లు వస్తుంది. ఇంత ధర వస్తుందనేది తెలుస్తుంది.
► ప్రభుత్వ చర్యలతో అక్కచెల్లెమ్మలకు ఇవ్వాల్సిన డబ్బు ఎగ్గొట్టి దోచుకున్న డెయిరీలకు, వాటి ద్వారా లబ్ధి పొందుతున్న వారికి దిక్కుతోచడం లేదు. అమూల్‌ రావడంతో వాళ్లు కూడా రేట్లు పెంచుతున్నారు. మనకు  కావల్సింది అదే. 
► దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో మీకు ఇంకా మంచి చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో క్యాంప్‌ కార్యాలయం నుంచి పశు సంవర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, అమూల్‌ ప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సబర్‌ కాంత మిల్క్‌ యూనియన్‌ (సబర్‌ డెయిరీ) ఎండీ డాక్టర్‌ బీ ఎం పటేల్‌ హాజరయ్యారు. 


రైతులకు అండగా ప్రభుత్వం
► మన రైతులు అమ్మబోతే అడవి కొనబోతే కొరివి.. అనే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు కాబట్టే.. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి, ప్రభుత్వమే మార్కెట్‌లోకి రంగ ప్రవేశం చేసింది. తద్వారా వ్యవసాయ ఉత్పత్తులను తక్కువ ధరకే కొనుగోలు చేస్తూ.. రైతులకు ఇబ్బందికర పరిస్థితులు సృష్టించే దళారులను సవాల్‌ చేసింది. 
► ఈ రేటు కంటే తక్కువకు అమ్మాల్సిన పనిలేదని, ఆ ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పడంతో.. దళారులు అంతకన్నా ఎక్కువ రేటు ఇచ్చి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రెండున్నరేళ్లుగా అనేక ఉత్పత్తులను ధరల స్థిరీకరణ నిధి ద్వారా కొనుగోలు చేసి రైతులకు తోడుగా నిలబడగలిగాం.
► ధాన్యం, కూరగాయలు, పండ్లతో పాటు పాడి రైతులకు, ముఖ్యంగా అక్కచెల్లెమ్మలకు ఎలా న్యాయం చేయాలన్న ఆలోచనతోనే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ దిశగా అడుగులు వేశాం.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement