పొంగిన సిరులు! | Dairy farmers happy with AP Govt Jagananna Paala Velluva | Sakshi
Sakshi News home page

పొంగిన సిరులు!

Published Mon, Nov 20 2023 4:09 AM | Last Updated on Mon, Nov 20 2023 7:11 AM

Dairy farmers happy with AP Govt Jagananna Paala Velluva - Sakshi

సాక్షి, అమరావతి: నిండా మూడేళ్లు కూడా నిండని అమూల్‌ సంస్థ రాష్ట్రంలో ఇప్పుడు రోజుకు 2.85 లక్షల లీటర్ల పాలను సేకరిస్తూ పాడి రైతన్నల ఇళ్లలో సిరులను పొంగిస్తోంది. మూడు జిల్లాలతో మొదలైన అమూల్‌ ప్రస్థానం ఇప్పటికే 19 జిల్లాలకు విస్తరించి గ్రామగ్రామాన క్షీరాభిషేకం చేస్తోంది. మూతపడ్డ డెయిరీల పునరుద్ధరణ, పాడి రైతులకు గిట్టుబాటు ధర లక్ష్యంతో సహకార రంగంలో దేశంలో నెంబర్‌ 1 స్థానంలో ఉన్న అమూల్‌తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది.

జగనన్న పాల వెల్లువ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి పాడి రైతులకు రక్షణ కల్పిస్తూ పాల సేకరణ, నాణ్యమైన పాల వినియోగ చట్టం 2023 తీసుకొచ్చింది. అమూల్‌ వచ్చిన తర్వాత ఏడు సార్లు పాల సేకరణ ధరలను  పెంచడంతో లీటర్‌కు రూ.4 మేర అదనపు ప్రయోజనం కల్పిస్తామంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీకి మిన్నగా జగనన్న పాల వెల్లువ పథకం ద్వారా రూ.10 నుంచి రూ.20 వరకు పాడి రైతులు అదనంగా లబ్ధి పొందుతున్నారు.

గతంలో ఎన్నడూ లేని స్థాయిలో గేదె పాలకు లీటర్‌కు రూ.112, ఆవుపాలకు రూ.53.86 చొప్పున ధర లభిస్తుండడంతో అమూల్‌కు పాలు పోసే వారి ఆనందానికి అవధుల్లేకుండా ఉంది. అమూల్‌ రాకతో ప్రైవేట్‌ డెయిరీలు సైతం అనివార్యంగా సేకరణ ధరలను పెంచాల్సి వచ్చింది. దీనివల్ల పాడి రైతులకు అదనంగా మేలు జరుగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ కృషి ఫలితంగా మూతపడిన చిత్తూరు డెయిరీతో సహా సహకార సంఘాలు జీవం పోసుకుంటున్నాయి. 

33 నెలల్లో 11.37 కోట్ల లీటర్ల సేకరణ
మూడు జిల్లాలలో 2020 డిసెంబర్‌లో ప్రారంభమైన జగనన్న పాలవెల్లువ (జేపీవీ) నేడు 19 జిల్లాలకు విస్తరించింది. 400 గ్రామాలలో 14,845 మందితో మొదలైన ఈ ఉద్యమంలో నేడు 4,114 గ్రామాలలో  3,79,850 మంది భాగస్వాములయ్యారు. 33 నెలల్లో 11.37 కోట్ల లీటర్ల పాలను సేకరించగా రూ.512.83 కోట్లు చెల్లించారు. అమూల్‌కు ప్రస్తుతం రోజుకు సగటున 2,84,755 లీటర్ల చొప్పున పాలు పోస్తున్నారు.

రాష్ట్రంలోని ప్రైవేట్‌ డెయిరీలు రోజుకు సగటున 6 లక్షల లీటర్ల చొప్పున పాలను సేకరిస్తున్నారు. నిండా 33 నెలలు కూడా నిండని అమూల్‌ సంస్థ ఇప్పటికే రోజుకు 2.85 లక్షల లీటర్ల పాలను సేకరిస్తోందంటే పాడి రైతులకు ఎంతో మేలు చేస్తోందో ఊహించవచ్చు. పాలు పోసే రైతులకు ప్రతి 10 రోజులకోసారి నేరుగా వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తోంది.

పాడి రైతులకు రూ.2,604.06 కోట్ల అదనపు లబ్ధి
అమూల్‌ ప్రారంభంలో లీటర్‌కు 11 శాతం వెన్న, 9 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్‌తో గేదె పాలకు రూ.71.47 చొప్పున చెల్లించగా 5.4 శాతం వెన్న, 8.7 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్‌తో ఆవు పాలకు రూ.34.20  చొప్పున చెల్లించింది. ప్రస్తుతం గేదె పాలకు రూ.89.76, ఆవుపాలకు రూ.43.69 చొప్పున చెల్లిస్తోంది. అయితే రైతుకు గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ఎస్‌ఎన్‌ఎఫ్, ఫ్యాట్‌ను బట్టి గేదెపాలకు లీటర్‌కు రూ.112, ఆవుపాలకు రూ.53.86 చొప్పున ధర లభిస్తోంది. 18 నెలల్లో పాల సేకరణ ధరను అమూల్‌ ఏడు దఫాలు పెంచింది.

లీటర్‌ గేదె పాలకు రూ.16.09, ఆవుపాలకు రూ.8.36 చొప్పున అదనంగా రైతులు లబ్ధి పొందుతున్నారు. గతంలో రెండేళ్లకోసారి పాల సేకరణ ధరలు పెంచే ప్రైవేట్‌ డెయిరీలు అమూల్‌ రాకతో ఏటా అనివార్యంగా కనీసం రెండుసార్లు పెంచాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ప్రైవేట్‌ డెయిరీలు పాల సేకరణ ధర తప్పనిసరిగా పెంచాల్సి రావడంతో పాడి రైతులకు రూ.2,604.06 కోట్ల మేర అదనంగా ప్రయోజనం చేకూరడం గమనార్హం.

అమూల్‌ ప్రతి సంవత్సరం చివరిలో పోసిన ప్రతి లీటరు పాలకు రూ.0.50 చొప్పున లాయల్టీ బోనస్‌ పాడి రైతులకు చెల్లిస్తోంది. మరోవైపు గత 18 నెలల్లో అమూల్‌ 2,235.45 మెట్రిక్‌ టన్నుల నాణ్యమైన ఫీడ్‌ను లాభాపేక్ష లేకుండా పంపిణీ చేసింది. గేదెలకు రూ.30 వేలు, ఆవులకు రూ.25 వేలు చొప్పున వర్కింగ్‌ క్యాపిటల్‌గా అందిస్తున్న ప్రభుత్వం కొత్తగా పాడి పశువుల కొనుగోలుకు గేదెకు రూ.93 వేలు, ఆవులకు రూ.76 వేలు చొప్పున రుణాలందిస్తోంది. 

ఏఎంసీయూ, బీఎంసీయూలు..
అమూల్‌ ప్రాజెక్టులో భాగంగా 9,899 గ్రామాల్లో పాల సేకరణ కేంద్రాలు, బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా మొదటి దశలో రూ.680 కోట్ల ఉపాధి నిధులతో 3,156 గ్రామాల్లో ఏఎంసీయూ, బీఎంసీయూలను నిర్మిస్తున్నారు. చేయూత లబ్ధిదారులకు వారి ఇష్ట ప్రకారం పాడి పశువుల కొనుగోలుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. వాస్తవాలు ఇలా ఉంటే అమూల్‌కు మేలు చేసేందుకు ప్రభుత్వం రూ.పది వేల కోట్లు ఖర్చు చేసిందని, విలువైన సహకార డెయిరీలను అప్పనంగా అప్పగిస్తోందంటూ ఎల్లో మీడియా దుష్ప్రచారానికి తెగబడింది.

హెరిటేజ్‌ కోసం..
సహకార డెయిరీల రంగం నిర్వీర్యమైంది చంద్రబాబు హయాంలోనే. సహకార స్ఫూర్తితో ఏర్పాటైన పాల యూనియన్లను ప్రభుత్వ అనుమతి లేకుండానే ‘మాక్స్‌’ (మ్యూచ్‌వల్లీ ఎయిడెడ్‌ కో ఆపరేటివ్‌ సొసైటీలు)లోకి మార్చుకుని తర్వాత సొంత కంపెనీలుగా ప్రకటించుకున్నారు. ఇలా చంద్రబాబు హయాంలో విశాఖ, గుంటూరు, ప్రకాశం జిల్లా మిల్క్‌ యూనియన్లు కంపెనీలుగా మారిపోయాయి. పులివెందుల, చిత్తూరుతో సహా 8 డెయిరీలు మూతపడ్డాయి.

అన్నమయ్య జిల్లాలోని యూహెచ్‌టీ ప్లాంట్, ప్రకాశం జిల్లాలోని మిల్క్‌ పౌడర్‌ ప్లాంట్, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఎంసీసీతో పాటు 141 బీఎంసీయూలు మూతపడ్డాయి. హెరిటేజ్‌ కోసం సహకార రంగాన్ని నిర్వీర్యం చేశారు. హెరిటేజ్‌ సేకరణ ధరలు పెంచాల్సి వస్తుందనే భయంతో పాడి రైతులకు ఎక్కడా ధరలు పెరగకుండా కట్టడి చేశారు. హెరిటేజ్‌ బాగుంటే చాలు పాడి రైతులు ఎలా పోయిన ఫర్వాలేదని చంద్రబాబు భావించారు. 

‘చిత్తూరు’లో క్షీరధారలు..
మూతపడిన డెయిరీల పునరుద్ధరణలో భాగంగా ఇప్పటికే మదనపల్లి డెయిరీని పునరుద్ధరించగా 2021 నుంచి అమూల్‌ సంస్థ విజయవంతంగా నిర్వహిస్తోంది. చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ కోసం ఆ డెయిరీకి ఉన్న రూ.182 కోట్ల అప్పులను తీర్చింది. ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ ప్రాజెక్టు కోసం అమూల్‌ సంస్థ రూ.385 కోట్ల పెట్టుబడులు పెడుతోంది.

ఇలా ఒకపక్క సహకార రంగాన్ని బలోపేతం చేస్తుంటే ఒంగోలు డెయిరీని ఆమూల్‌కు అప్పగిస్తే వదిలేసిందని, విలువైన ఆస్తులు కట్టబెడుతున్నారంటూ ఎల్లో మీడియా బురద చల్లడంపై విస్మయం వ్యక్తమవుతోంది. పాడి రైతులకు మేలు జరిగే చర్యలను సైతం అడ్డుకునే యత్నాలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement