సాక్షి, అమరావతి: ‘జగనన్న పాల వెల్లువ’ రాష్ట్రమంతా విస్తరించనుంది. మరో మూడు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సహకార రంగంలో పాల డెయిరీలను బలోపేతం చేసే లక్ష్యంతో అంతర్జాతీయంగా పేరొందిన అమూల్ (ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్)తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం 2020 డిసెంబర్‌లో జగనన్న పాలవెల్లువకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. తొలుత రెండు ఉమ్మడి జిల్లాలతో ప్రారంభమై దశలవారీగా ఏడు జిల్లాలకు విస్తరించింది. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ప్రస్తుతం 16 జిల్లాల్లో అమలవుతోంది. మిగిలిన పది జిల్లాలకుగానూ కాకినాడ, కోనసీమలో జూలై నాలుగో వారంలో ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
నిత్యం లక్ష లీటర్ల సేకరణ
జగనన్న పాల వెల్లువ కింద రాష్ట్రవ్యాప్తంగా 16 జిల్లాల పరిధిలోని 2,651 గ్రామాల్లో పాలు సేకరిస్తున్నారు. ఇప్పటివరకు 2.27 లక్షల మంది పాడిరైతులు రిజిస్ట్రేషన్ చేసుకోగా 45,456 మంది రోజూ పాలు పోస్తున్నారు. ప్రస్తుతం ప్రతి రోజూ లక్ష లీటర్ల పాలను అమూల్ సేకరిస్తోంది. అమూల్ తరపున రాయలసీమ జిల్లాల్లో కేరా, కోస్తాంధ్రలో సబర్కాంత్, ఉత్తరాంధ్రలో బనస్కాంత్ యూనియన్లు పాలను సేకరిస్తున్నాయి. ఇప్పటి వరకు అమూల్ కేంద్రాల ద్వారా 1,53,92,363 లీటర్ల ఆవుపాలు, 1,93,74,139 లీటర్ల గేదె పాలు సేకరించారు. పాడి రైతులకు రూ.149.29 కోట్లు చెల్లించారు.
ఇటీవలే పాల సేకరణ ధరలను పెంచడంతో లీటర్‌కు గేదె పాలపై రూ.4.42, ఆవుపాలపై రూ.2.12 మేర రైతులు అదనంగా లబ్ధి పొందుతున్నారు. 11 శాతం కొవ్వు, 9 శాతం ఘన పదార్థాలు (ఎస్‌ఎన్‌ఎఫ్) కలిగిన గేదె పాలకు గరిష్టంగా లీటర్‌కు రూ.79.20 చెల్లిస్తున్నారు. 5.4 శాతం కొవ్వు, 8.7 శాతం ఘన పదార్థాలు (ఎస్‌ఎన్‌ఎఫ్) కలిగిన ఆవుపాలకు గరిష్టంగా లీటర్‌కు రూ.35.78 చొప్పున చెల్లిస్తున్నారు.
అమూల్ రాకముందు లీటర్‌కు రూ.30–31కి మించి లభించేది కాదు. ప్రస్తుతం సగటున లీటర్‌కు గేదె పాలకు రూ.53.50, ఆవుపాలకు రూ.30.24 వరకు ధర లభిస్తోంది. ప్రైవేట్ డెయిరీలతో పోల్చితే లీటర్‌కు రూ.5 నుంచి రూ.20 వరకు రైతులకు అదనంగా లబ్ధి చేకూరుతోంది. అమూల్ రాకతో ప్రైవేట్ డెయిరీలు గత్యంతరం లేక పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. గత మూడేళ్లలో లీటర్‌కు పాలసేకరణ ధరలను రూ.10–12 వరకు పెంచాయి.
ప్రాసెసింగ్ యూనిట్లు, అవుట్‌లెట్స్
రెండు జిల్లాల్లో 100 గ్రామాల్లో మొదలైన పాల సేకరణ దశలవారీగా ఉమ్మడి వైఎస్సార్, చిత్తూరు, ప్రకాశం, గుంటూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, అనంతపురం జిల్లాల్లో 2,651 గ్రామాలకు విస్తరించింది. పునర్విభజన తర్వాత రాజమహేంద్రవరం, నెల్లూరు, అనకాపల్లి జిల్లాలకు విస్తరించింది. కర్నూలు, నంద్యాలతో పాటు కాకినాడ, కోనసీమ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తిరుపతి జిల్లాల్లో పాలసేకరణ ప్రారంభించాల్సి ఉంది.
సెప్టెంబర్ నెలాఖరు కల్లా అన్ని జిల్లాలకు విస్తరించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రైతుల నుంచి సేకరించే పాలను ప్రాసెస్ చేసేందుకు మదనపల్లి, విజయవాడ, విశాఖలో అమూల్ మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు సన్నాహాలు జరుగు తున్నాయి. విజయవాడ, గుంటూరు, విశాఖ, రాజమహేంద్రవరం ప్రాంతాల్లో కంటైనర్ తరహాలో అమూల్ అవుట్‌లెట్స్ ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది.
వచ్చే 3 నెలల్లో విస్తరణ
జగనన్న పాల వెల్లువ పథకాన్ని మరో మూడు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నాం. జూలై నెలాఖరులోగా కోనసీమ, కాకినాడ జిల్లాల్లో చేపడతాం. మిగిలిన జిల్లాల్లో కూడా సెప్టెంబర్ కల్లా విస్తరించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. దశలవారీగా పాల సేకరణ గ్రామాలను పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.
– అహ్మద్ బాబు, ఎండీ, ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్
Comments
Please login to add a commentAdd a comment