కృష్ణా జిల్లా వట్టిగుడిపాడు గ్రామంలోని ఆర్బీకేలో పాలు పోస్తున్న మహిళ
3 లీటర్లకే రూ.200 వస్తోంది గతంలో పూటకు 8 లీటర్లు పోసేవాళ్లం. రూ.200 కూడా వచ్చేది కాదు. ఇప్పుడు అమూల్ కేంద్రంలో 3 లీటర్లు పోస్తే రూ.200కు పైగా వస్తోంది. ఈ కేంద్రం ఏర్పాటైన తర్వాతే మిగిలిన కేంద్రాల్లో కూడా రేటు పెంచారు. పాడి గేదెల కొనుగోలు కోసం లోన్ కూడా ఇచ్చారు. చాలా సంతోషంగా ఉన్నాం.
– ఎస్‌కే.అసాబి, పెదకాకాని, గుంటూరు జిల్లా
రైతులకు ఒక్క వ్యవసాయం ద్వారా మాత్రమే కాకుండా, ఇతరత్రా అనుబంధ రంగాల ద్వారా అదనపు ఆదాయం వచ్చేలా చూడాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగా సహకార డెయిరీ దిగ్గజం అమూల్‌ను రాష్ట్రానికి తీసుకొచ్చి ప్రైవేట్ డెయిరీల దోపిడీకి ముకుతాడు వేస్తోంది. తద్వారా పాల సేకరణలో స్పష్టమైన మార్పు కళ్లెదుటే కనిపిస్తోంది. పాల ధర పెరిగింది. చెల్లింపుల్లో పారదర్శకత వచ్చింది. పాడి ఇక బరువు కానేకాదని, నాలుగు డబ్బులు కళ్లజూడొచ్చనే భరోసా కలిగింది.
సాక్షి, అమరావతి : జగనన్న పాల వెల్లువ ద్వారా పాడి రైతుకు భద్రత, ఆర్థిక భరోసా లభిస్తోంది. ప్రైవేటు డెయిరీల అడ్డగోలు దోపిడీకి కళ్లెం పడింది. ఇదివరకు పాలల్లో వెన్న శాతమెంతో.. ఎస్‌ఎన్‌ఎఫ్ (సాలిడ్ నాట్ ఫ్యాట్ – ఘన పదార్థాలు) శాతమెంతో రైతులకు తెలిసేది కాదు. కేంద్రంలో ఎంత చెబితే అంతే. ఆ లెక్కలే పుస్తకాల్లో రాసుకొని 15 రోజులకో నెలకో డబ్బులు ఇచ్చేవారు. ఎక్కువ పాలు పోసే వారికి ఒక ధర.. తక్కువ పాలు పోసే వారికి మరో ధర.. సీజన్‌లో ఓ ధర.. అన్ సీజన్‌లో మరో ధర చెల్లిస్తూ అందినకాడికి దోచుకునే వారు. వెన్న శాతాన్ని పరిగణనలోకి తీసుకొని పాలు సేకరించే ప్రైవేట్ డెయిరీలు నాణ్యతను గాలికొదిలేసేవి. దీంతో వెన్న శాతం పెంచి చూపేందుకు రైతుల నుంచి సేకరించే పాలల్లో నాసిరకం నూనెలు, హానికరమైన కొవ్వు పదార్థాలు కలిపి కృత్రిమంగా కల్తీ చేసిన పాలనమ్మి సొమ్ము చేసుకునే వారు. కొలతల్లో మోసాలకు పాల్పడేవారు.
ఈ నేపథ్యంలో సహకార రంగంలోని డెయిరీలను బలోపేతం చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమూల్‌తో ఒప్పందం చేసుకుంది. అనంతరం 2020 డిసెంబర్‌లో ‘జగనన్న పాల వెల్లువ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తొలుత 3 జిల్లాలతో ప్రారంభమైన ఈ పథకం ఇప్పుడు 7 జిల్లాలకు విస్తరించింది. ప్రతి రోజు సగటున లక్ష లీటర్ల చొప్పున ఇప్పటి వరకు 2.46 కోట్ల లీటర్ల పాలు సేకరించింది. ఇందుకు సంబంధించి రైతుల ఖాతాల్లో రూ.104.89 కోట్లు జమ అయింది. ఉత్తరాంధ్రతో పాటు మిగిలిన జిల్లాల్లో విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మార్పు ఇలా..
► 2020 అక్టోబర్ వరకు పది శాతం వెన్న కలిగిన లీటరు గేదె పాలకు సంగం డెయిరీ కేవలం రూ.56 ఇచ్చేది. ప్రారంభంలోనే అమూల్ లీటరుకు 11 శాతం వెన్న, 9 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్‌తో సేకరించే గేదె పాలకు రూ.71.47.. 5.4 శాతం వెన్న, 8.7 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్‌తో ఆవు పాలకు రూ.34.20 చొప్పున రైతుల ఖాతాలకు నేరుగా జమ చేసింది.
► అమూల్.. సీజన్‌తో సంబంధం లేకుండా ఎస్‌ఎన్‌ఎఫ్, వెన్న శాతం ప్రామాణికంగా అన్ని సీజన్‌లలోనూ ఒకే రీతిలో చెల్లిస్తోంది. గతంలో ఏటా లీటరుపై రూ.2 – రూ.5కు మించి పెంచేవారు కాదు. అలాంటిది జగనన్న పాల వెల్లువ మొదలైన 15 నెలల్లోనే లీటరుపై రూ.12 పెంచాల్సిన పరిస్థితి వచ్చింది. అమూల్ వరుసగా రెండుసార్లు ధర పెంచింది.
► ప్రస్తుతం గరిష్టంగా లీటరు ఆవు పాలకు రూ.35.78, గేదె పాలకు రూ.74.78 చొప్పున చెల్లిస్తుంటే ఆ స్థాయిలో ప్రైవేట్ డెయిరీలు చెల్లించలేకపోతున్నాయి. గతంలో కనీస నాణ్యత లేని దాణా (16 శాతం ప్రొటీన్)ను కేవలం 8 నెలలు మాత్రమే రైతులకు సరఫరా చేసే వారు. కానీ అమూల్ మాత్రం 20 – 22 శాతం ప్రొటీన్ కల్గిన దాణా 50 కేజీల బస్తా రూ.1,100 చొప్పున ఏడాది పాటు ఇస్తోంది.
► ఏడాదిలో కనీసం 180 రోజులు పాలు పోసే ఆదర్శ రైతులకు లీటర్‌కు 50 పైసల చొప్పున ఇన్సెంటివ్ వారి ఖాతాల్లో జమ చేస్తోంది. పాడి రైతులకే కాకుండా సొసైటీల నిర్వహణ ఖర్చు కింద లీటర్‌కు రూపాయి చొప్పున చెల్లిస్తోంది.
► ఎలాంటి ఇన్సెంటివ్‌లు చెల్లించని హెరిటేజ్, సంగం లాంటి ప్రైవేట్ డెయిరీలు సొసైటీల నిర్వహణ ఖర్చు కింద లీటర్‌కు 50 పైసలు మాత్రమే చెల్లిస్తున్నాయి. మరో పక్క గేదెలపై రూ.30 వేలు, ఆవులపై రూ.25 వేలు చొప్పున వర్కింగ్ క్యాపిటల్‌గా అందిస్తోన్న ప్రభుత్వం.. కొత్త పాడి పశువుల కొనుగోలుకు గేదెకు రూ.93 వేలు, ఆవుకు రూ.76 వేలు చొప్పున రుణాలందిస్తోంది.
కొలతల్లో మోసాలకు అడ్డుకట్ట
► కొలతల్లో మోసాలకు చెక్ పెట్టేందుకు తూనికలు – కొలతల శాఖకున్న అధికారాలతో పశు వైద్యులను బృందాలుగా ఏర్పాటు చేసి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తోంది. ఈ తనిఖీల్లో ప్రైవేటు డెయిరీలకు చెందిన పాల కేంద్రాల్లో జరిగే మోసాలు వెలుగు చూస్తున్నాయి.
► అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో ఓ ప్రైవేటు డెయిరీకి పాలు పోస్తున్న అమ్మా డెయిరీ పాల కేంద్రంలో రోజుకు 1,200 లీటర్ల పాలు సేకరిస్తున్నారు. అయితే, కిలోకి 970 ఎంఎల్ చూపించాల్సిన మిషన్‌లో 930 ఎంఎల్ చూపిస్తున్నట్టుగా గుర్తించారు. అంటే ఒక్కో రైతు నుంచి 40 ఎంఎల్ చొప్పున రోజుకు 48 లీటర్ల పాలు అధికంగా కాజేస్తున్నట్టుగా గుర్తించారు. పలు కేంద్రాల్లో లైసెన్సుల్లేని వేయింగ్ మిషన్లు వినియోగిస్తున్నట్టుగా గుర్తించారు.
క్వాలిటీ కంట్రోల్ ల్యాబొరేటరీ బలోపేతం
► వినియోగదారులకు నాణ్యమైన, సురక్షితమైన పాల లభ్యతపై భరోసా కల్పించే లక్ష్యంతో రాష్ట్రంలో సహకార పాల డెయిరీల్లో డెన్మార్క్ టెక్నాలజీతో కూడిన అత్యాధునిక మిల్క్ ఎనలైజర్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
► రాజమండ్రి, జి.కొత్తపల్లి, ఒంగోలు, మదనపల్లి, పులివెందుల, అనంతపురం సహకార డెయిరీల్లో క్వాలిటీ కంట్రోల్ ల్యాబొరేటరీలను ప్రభుత్వం బలోపేతం చేసింది. వీటి ద్వారా కొవ్వు, ప్రొటీన్స్, లాక్టోస్, ఎస్‌ఎన్‌ఏఎఫ్ వంటి వాటితో పాటు 24 పారా మీటర్స్‌లో కల్తీ పదార్థాలను గుర్తించి సరిచేస్తుంది. ఆకస్మిక తనిఖీల్లో సేకరించిన మిల్క్‌ను ఎనలైజర్స్ ద్వారా పరిశీలించి, కల్తీని గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు చర్యలు చేపట్టారు.
► జగనన్న పాల కేంద్రాలు లేని చోట మాత్రం కొన్ని ప్రైవేటు డెయిరీలు పాల సేకరణలో పాత పద్ధతినే కొనసాగిస్తున్నాయి. ఫ్యాట్, ఎస్‌ఎన్‌ఎఫ్ శాతాలను బట్టి జరిగే చెల్లింపులను పరిశీలిస్తే అమూల్ చెల్లిస్తున్న పాల ధర కంటే తక్కువ ధర చెల్లిస్తున్నట్లు అనంతపురం, కృష్ణా, ప్రకాశం, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో క్షేత్ర స్థాయి పరిశీలనలో వెలుగు చూసింది.
► అమూల్ కేంద్రాల కంటే ప్రైవేట్ కేంద్రాల్లో వెన్న, ఎస్‌ఎన్‌ఎఫ్ 0.2 నుంచి 0.5 శాతం తక్కువగా చూపి, అంటే లీటర్‌కు రూ.4 చొప్పున తక్కువ చెల్లించేందుకు యత్నిస్తుండగా, నిరంతర తనిఖీలతో అడ్డుకట్ట వేస్తున్నారు.
కల్తీకి అడ్డుకట్ట వేసిన అమూల్
► కల్తీకి అడ్డుకట్ట వేసేందుకు ఎస్‌ఎన్‌ఎఫ్ కనీసం 8.7 శాతం ఉంటేనే గేదె పాలు, 8.5 శాతం ఉంటేనే ఆవుపాలు కొనుగోలు చేస్తామన్న నిబంధన అమూల్ పెట్టడంతో విధిలేని పరిస్థితుల్లో హెరిటేజ్, సంగం వంటి ప్రైవేటు డెయిరీలు సైతం ఎస్‌ఎన్‌ఎఫ్ శాతాన్ని పెంచి 2021 మార్చి నుంచి పాలు సేకరిస్తున్నాయి.
► నాణ్యతకు పెద్ద పీట వేసేందుకు ‘ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్’ వంటి ఆధునిక యంత్ర పరికరాలను ప్రభుత్వం సొసైటీలకు అందించడంతో కొన్ని ప్రైవేటు డెయిరీలు తమ కేంద్రాల్లో కొద్దిపాటి యంత్ర పరికరాలైనా ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అమూల్ రాకతో పాల నాణ్యత విషయంలో పాడి రైతులకు అవగాహన పెరగడం, బిల్లుల చెల్లింపుల్లో పారదర్శకత పెరగడంతో ప్రైవేటు డెయిరీల దోపిడీకి అడ్డుకట్ట పడింది.
జగనన్న పాలవెల్లువతో ఎంతో మేలు
15 ఏళ్లుగా పాడి పశువుల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నాం. గతంలో లీటరుకు రూ.43 ఇచ్చేవారు. పాలలో వెన్న శాతాన్ని తక్కువ చేసి చూపించి, మాకు రావాల్సిన ఆదాయాన్ని వారి జేబుల్లో వేసుకునే వారు. జగనన్న పాల వెల్లువ ప్రారంభమైన తర్వాత లీటరు పాలకు రూ.66కు పైగా చెల్లిస్తున్నారు. కచ్చితమైన కొలత, వెన్న శాతం ఉంటోంది. పాలు పోసిన వెంటనే మా మొబైల్‌కు ఆ వివరాలతో కూడిన మెసేజ్ వస్తోంది. ఎలాంటి అవకతవకలు లేకుండా ప్రతి 10 రోజులకొకసారి పాల బిల్లు చెల్లిస్తోంది.
– కుడుముల సుజాత, నల్లపురెడ్డిపల్లె, పులివెందుల, వైఎస్సార్ జిల్లా
Comments
Please login to add a commentAdd a comment