‘పాడి’కి మేలి మలుపు | Financial aid to dairy farmers with Jagananna Pala Velluva | Sakshi
Sakshi News home page

‘పాడి’కి మేలి మలుపు

Published Sun, Aug 13 2023 1:29 AM | Last Updated on Sun, Aug 13 2023 12:22 PM

Financial aid to dairy farmers with Jagananna Pala Velluva - Sakshi

కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం గిడిచాంలోని పాలకేంద్రంలో పాలు పోస్తున్న మహిళా పాడి రైతు

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఇనమనమెల్లూరు గ్రామానికి చెందిన కరమూడి శైలజకు రెండు పాడి గేదెలు­న్నాయి. ఇది వరకు ప్రైవేట్‌ డెయిరీకి రోజూ పాలు పోసేది. ఫ్యాట్, ఎస్‌ఎన్‌ఎఫ్‌ (సాలిడ్స్‌ నాట్‌ ఫ్యాట్‌) శాతం ఎంత ఉన్నప్పటికీ లీటర్‌కు గరిష్టంగా రూ.80కి మించి చెల్లించే వారు కాదు. జగనన్న పాల వెల్లువ కేంద్రంలో రోజుకు 3 లీటర్ల పాలు పోస్తే ఎస్‌ఎన్‌ఎఫ్‌ 9 శాతం, ఫ్యాట్‌ 13 శాతం రావడంతో లీటర్‌­కు రూ.103 చొప్పున చెల్లించారు. ఏకంగా లీటర్‌కు రూ.23 అదనంగా ఆదాయం వచ్చింది. ఈ లెక్కన రోజుకు రూ.69 చొప్పున నెల­కు రూ.2,100 వరకు అదనంగా ఆదాయం వస్తుండడం పట్ల ఆమె ఆనందానికి అవధుల్లేవు. 

కాకినాడ జిల్లా వేమవరానికి చెందిన యాదాల వరలక్ష్మికి రెండు ఆవులున్నాయి. ప్రైవేటు కేంద్రానికి ప్రతీ రోజూ పాలు పోసేది. ఎస్‌ఎన్‌ఎఫ్, ఫ్యాట్‌ శాతం ఎంత ఉన్నా.. లీటర్‌కు గరిష్టంగా రూ.35కు మించి వచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఇటీవలే ప్రారంభించిన జగనన్న పాల కేంద్రంలో ఎస్‌ఎన్‌ఎఫ్‌ 9 శాతం, ఫ్యాట్‌ 6.6 శాతంతో తొలి రోజు 2.58 లీటర్ల పాలు పోస్తే లీటర్‌కు రూ.53.86 చొప్పున రూ.138.96 వచ్చింది. ఈమె రెండు పూటలా పాలు పోస్తోంది. ఈ లె­క్కన రోజుకు 5 లీటర్లు పోస్తే.. రోజుకు అదనంగా రూ.94.30 చొప్పన నెలకు రూ.2,829 అదనపు ఆదాయం వస్తోందని ఆమె ఆనందంతో చెబుతోంది.   

‘అన్నా.. ఇది పాల బాటిల్‌..
నీళ్ల బాటిల్‌ కంటే తక్కువ ఖరీదు.. నీళ్ల కంటే పాలే చవకగా దొరుకుతున్నాయి. ఇలాగైతే ఎలా బతికేదన్నా.. అని పాడి రైతులు నాతో చెప్పుకుని బాధపడ్డారు. మనందరి ప్రభుత్వం రాగానే ఈ పరిస్థితిని కచ్చితంగా మారుస్తాం’ అని నాడు ప్రతిపక్ష నేతగా వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేస్తున్నప్పుడు చెప్పిన మాటలివి. ఆ మాట మేరకు అక్షరాలా పరిస్థితిని మార్చేశారనేందుకు ఇప్పుడు ఊరూరా కళకళలాడుతున్న జేపీవీ కేంద్రాలే నిదర్శనం.  

పంపాన వరప్రసాదరావు, సాక్షి, అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది పాడి రైతులు నేడు జగనన్న పాల వెల్లువ (జేపీవీ) పథకం కింద పాలు పోస్తూ కోట్లాది రూపాయలు అదనంగా లబ్ధి పొందుతున్నారు. ప్రైవేటు డెయిరీలు, వ్యాపారులు, దళారీలు వారిస్తున్నా, ఒత్తిళ్లు తీసుకొస్తున్నా.. తాము మాత్రం జగనన్న కేంద్రంలోనే పాలు పోస్తామంటూ ముందుకొస్తున్నారు. పాలవెల్లువ పథకం ఇటీవలే ప్రారంభమైన కాకినాడ జిల్లానే తీసుకుంటే.. హెరిటేజ్, వల్లభ, శ్రీ చక్ర, తిరుమల, జెర్సీ, దొడ్ల, విశాఖ డెయిరీలు పాలు సేకరిస్తుంటాయి. ఇప్పటి వరకు ఇవి గేదె పాలకు లీటర్‌కు గరిష్టంగా రూ.80, ఆవు పాలకు రూ.35కు మించి ఇస్తున్న దాఖలాలు లేవు.

అలాంటిది పాల వెల్లువ పథకం ద్వారా నేడు రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో గేదె పాలకు లీటర్‌కు రూ.103, ఆవు పాలకు రూ.53.86 చొప్పున ధర లభిస్తోంది. ఇంత మార్పు వస్తుందని ఊహించలేదని తుని, పిఠాపురం, ప్రత్తిపాడు మండలాల్లోని పాడి రైతులు చెబుతున్నారు. ప్రైవేటు కేంద్రాల కంటే కనీసం లీటర్‌కు రూ.10–30 వరకు అదనంగా వస్తుందని హర్హం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు డెయిరీల వల్ల ఏళ్ల తరబడి తాము మోసపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక నుంచి జేపీవీ కేంద్రానికే పాలు పోస్తామని స్పష్టం చేస్తున్నారు.  

పక్కాగా వెన్న, ఎస్‌ఎన్‌ఎఫ్‌ శాతం 
పాలల్లో వెన్న, ఎస్‌ఎన్‌ఎఫ్‌ (ఘన  పదార్థాలు) శాతం ఎంత ఉందో లెక్కించేందుకు ప్రైవేట్‌ డెయిరీలు ఒక శాస్త్రీయ పద్దతి అంటూ పాటించే వారు కాదు. పాడి రైతుల్లో నూటికి 90 శాతం పెద్దగా చదువుకోని వారే. వారు కేంద్రానికి పాలు తీసుకురాగానే, వాటిని పూర్తిగా మిక్స్‌ చేయకుండా, ఎస్‌ఎన్‌ఎఫ్‌ శాతాన్ని పరిగణనలోకి తీసుకోకుండా మొక్కుబడిగా ఫ్యాట్‌ శాతాన్ని లెక్కించి ధర నిర్ణయించి ఖాతా పుస్తకాల్లో రాసుకునే వారు. అడిగితే ఓ కాగితం ముక్క మీద రాసిచ్చేవారు. దాణా, ఇతర అవసరాల కోసం తీసుకున్న అప్పును మినహాయించుకొని మిగిలిన మొత్తాన్ని 15 రోజులకో, నెలకో ఇచ్చేవారు.

పాలు ఎక్కువ పోసే వారికి ఒక ధర, తక్కువ పోసే వారికి మరో ధర, సీజన్‌లో ఓ ధర.. అన్‌ సీజన్‌లో మరో ధర ఉండేది. కొందరు కొలతల్లోనూ మోసానికి పాల్పడే వారు. ‘జగనన్న పాల వెల్లువ’ మొదలైన తర్వాత ఈ పరిస్థితిలో స్పష్టమైన మార్పు వచ్చింది. అమూల్‌ రాకతో ప్రైవేటు డెయిరీల అడ్డగోలు దోపిడీకి కొంతమేర కళ్లెం పడింది. రైతుకు పాల ధర పెరగడమే కాదు.. పాలల్లో నాణ్యత, చెల్లింపుల్లో పారదర్శకత పెరిగింది. ప్రైవేటు కేంద్రాల్లో టెస్టింగ్‌ మిషన్‌ ఒకటే ఉంటుంది.

అదే జేవీపీ కేంద్రంలో మాత్రం అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ మిల్క్‌ ఎనలైజర్‌ (వెన్న, ఎస్‌ఎన్‌ఎఫ్‌ శాతం, ప్రొటీన్, వాటర్‌ శాతాన్ని లెక్కించేందుకు), ్రస్ట్రిరర్‌ (పాలు మిక్స్‌ చేయడానికి) సాప్ట్‌వేర్‌ సిస్టమ్‌ ద్వారా పాల సేకరణ జరిగేందుకు వీలుగా ప్రత్యేకంగా కంప్యూటర్, ప్రింటర్, వేయింగ్‌ స్కేల్‌ వంటి పరికరాలను ఏర్పాటు చేశారు. కేంద్రానికి పాలు రాగానే మిక్స్‌ చేసిన పాలను ్రస్ట్రిరర్‌పై పెట్టి, ఆ శాంపిల్‌ను మళ్లీ ఎనలైజర్‌లో ఉంచి వెన్న, ఘన పదార్థాల శాతాన్ని ఖచ్చితంగా లెక్కించి.. తూకం వేసి తీసుకొని ధరను నిర్ధారిస్తారు. వెన్న శాతం లెక్కింపు లేదా ధర నిర్ణయంలో ఎలాంటి దళారీ, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రత్యేకంగా సా‹ఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

అమూల్‌కు, హెరిటేజ్‌కు మధ్య ఎంత తేడా!
2020 డిసెంబర్‌లో 3 జిల్లాలతో ప్రారంభమైన జేపీవీ పథకం నేడు 18 జిల్లాలకు విస్తరించింది. 400 గ్రామాలలో 14,845 మందితో మొదలైన ఈ ఉద్యమం నేడు 3,691 గ్రామాలకు విస్తరించగా, 3.18 లక్షల మంది భాగస్వాములయ్యారు. 31 నెలల్లో 9.58 కోట్ల లీటర్ల పాలు సేకరించారు. ప్రస్తుతం 85 వేల మంది పాడి రైతులు ప్రతి రోజూ 1.86 లక్షల లీటర్ల పాలు పోస్తున్నారు. 2020 అక్టోబర్‌ వరకు 11 శాతం వెన్న, 9 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్‌తో లీటర్‌కు హెరిటేజ్‌ కంపెనీ గేదె పాలకు రూ.58.43, ఆవు పాలకు రూ.31.58 చెల్లించింది. సంగం డెయిరీ గేదె పాలకు రూ.58.90, ఆవు పాలకు రూ.32.87 చొప్పున చెల్లించేవారు.

అమూల్‌ ప్రారంభంలోనే లీటర్‌ గేదె పాలకు 11 శాతం వెన్న, 9 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్‌తో రూ.71.47, ఆవు పాలకు 5.4 శాతం వెన్న, 8.7 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్‌తో రూ.34.20 చొప్పున చెల్లించారు. ఆ తర్వాత గడిచిన 31 నెలల్లో అమూల్‌ ఎనిమిదిసార్లు పాల సేకరణ ధరలు పెంచగా, ప్రైవేటు డెయిరీలు కేవలం మూడు సార్లు మాత్రమే పెంచాయి. హెరిటేజ్‌ ప్రస్తుతం గేదె పాలకు లీటర్‌ రూ.77కు పెంచామని చెబుతున్నప్పటికీ, రైతులకు వివిధ కారణాలు చెబుతూ వాస్తవంగా చెల్లిస్తున్నది రూ.66.50 మాత్రమే.

అదే సంగం డెయిరీ లీటర్‌కు రూ.80.30కు పెంచామని చెబుతున్నా, వాస్తవంగా రైతులకు చెల్లిస్తున్నది మాత్రం రూ.69.35 మాత్రమే. అమూల్‌ మాత్రం ఖచ్చితంగా 11 శాతం ఫ్యాట్, 9 శాతం ఎస్‌ఎ¯Œన్‌ఎఫ్‌తో గేదె పాలకు లీటర్‌కు రూ.89.76, ఆవు పాలకు రూ.43.69 చొప్పున చెల్లిస్తోంది. ప్రైవేటు డెయిరీలు గరిష్టంగా గేదె పాలకు 11 శాతం, ఆవు పాలకు 5 శాతం ఫ్యాట్‌కు లాక్‌ చేసి ఆ తర్వాత ఎంత ఫ్యాట్‌ ఉన్నా సరే 11 శాతం కిందే పరిగణించి సొమ్ములు చెల్లిస్తున్నాయి. అమూల్‌ మాత్రం ఎలాంటి లాక్‌ సిస్టమ్‌ లేకుండా పాలల్లో ఉండే ఫ్యాట్‌ శాతం లెక్కగట్టి అణాపైసలతో సహా చెల్లిస్తోంది. ఫలితంగా గేదె పాలకు గరిష్ట ధర 103, ఆవు పాలకు రూ.53.86 ధర రైతులకు లభిస్తోంది.

పాడి రైతులకు అన్ని విధాలా భరోసా
గతంలో కనీస నాణ్యత లేని దాణా (16 శాతం ప్రొటీన్‌)ను కేవలం ఎనిమిది నెలలు మాత్రమే రైతులకు సరఫరా చేసే వారు. అమూల్‌ మాత్రం 20–22 శాతం ప్రోటీన్‌ కల్గిన దాణా 50 కేజీల బస్తా రూ.1100 చొప్పున ఏడాది పాటు ఇస్తోంది. పైగా ఏడాదిలో కనీసం 180 రోజులు పాలు పోసే ఆదర్శ రైతులకు లీటర్‌కు 50 పైసల చొప్పున ఇన్సెంటివ్‌ వారి ఖాతాల్లో జమ చేస్తోంది. వార్షిక ఆదాయాన్ని బట్టి ఏటా లీటర్‌కు 5 శాతం చొప్పున బోనస్‌ చెల్లిస్తోంది. పాడి రైతులకే కాకుండా సొసైటీల నిర్వహణ ఖర్చు కింద లీటర్‌కు రూపాయి చొప్పున చెల్లిస్తోంది.

హెరిటేజ్, సంగం లాంటి ప్రైవేటు డెయిరీలు ఏజెంట్లకు కమిషన్‌ ఇస్తాయే తప్ప పాలుపోసే రైతులకు ఎలాంటి ఇన్సెంటివ్‌ ఇవ్వవు. మరొక పక్క గేదెలపై రూ.30 వేలు, ఆవులపై రూ.25 వేలు చొప్పున వర్కింగ్‌ క్యాపిటల్‌గా అందిస్తోన్న ప్రభుత్వం.. కొత్త పాడి పశువుల కొనుగోలుకు గేదెకు రూ.93 వేలు, ఆవుకు రూ.76 వేలు చొప్పున రుణాలందిస్తోంది. ఇలా ఇప్పటి వరకు 321 పాడి రైతులకు గేదెల కొనుగోలుకు రూ.3.69 కోట్ల రుణాలిచ్చింది. వర్కింగ్‌ క్యాపిటల్‌ కింద 7,517 మందికి రూ.36.61 కోట్ల ఆర్థిక చేయూతనిచ్చింది. 

ప్రైవేట్‌ డెయిరీలకు పాలు పోసే వారికీ రూ.4,283 కోట్ల లబ్ధి
కల్తీకి అడ్డుకట్ట వేసి, నాణ్యత పెంచేందుకు ఎస్‌ఎన్‌­ఎఫ్‌ కనీసం 8.7 శాతం ఉంటేనే గేదె పాలు, 8.5 శాతం ఉంటేనే ఆవుపాలు కొనుగోలు చేస్తామన్న నిబంధన అమూల్‌ పెట్టడంతో విధిలేని పరిస్థితుల్లో హెరిటేజ్, సంగం వంటి ప్రైవేటు డెయిరీలు సైతం ఎస్‌ఎన్‌ఎఫ్‌ శాతాన్ని పెంచి 2021 మార్చి నుంచి పాల సేకరణకు శ్రీకారం చుట్టాయి. ‘ఆటోమేటిక్‌ మిల్క్‌ కలెక్షన్‌ యూనిట్‌’ వంటి ఆధునిక యంత్ర పరికరాలను ప్రభుత్వం సొసైటీలకు అందించడంతో కొన్ని ప్రైవేటు డెయిరీలు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో వాటిని సమకూర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జేపీవి అమలు కాని ప్రాంతాల్లో ప్రైవేటు డెయిరీలకు పాలు పోసే రైతులకు ఆదాయం పెరిగింది. ఫలితంగా రూ.4,283 కోట్ల మేర రాష్ట్ర వ్యాప్తంగా పాడి రైతులు లబ్ధి పొందారు. 

అదనపు ఆదాయం నిజం
మా ఊళ్లో ఏర్పాటు చేసిన జగనన్న పాల వెల్లువ కేంద్రంలో శుక్రవారం 1.32 లీటర్ల పాలు పోశాను. వెన్న 14 శాతం, ఎస్‌ఎన్‌ఎఫ్‌ 10.1 శాతం ఉందని లెక్కించారు. ఆ మేరకు లీటర్‌కు రూ.97.92 చొప్పున రూ.129.25 చెల్లించారు. అదే ప్రైవేటు డెయిరీకి పోస్తే రూ.80కి మించి వచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఇక్కడ పాలు పోయడం వల్ల రూ.30కి పైగా అదనంగా ఆదాయం వచ్చింది.  
    – కాళ్ల మంగ, చిత్రాడ–2, కాకినాడ జిల్లా

నెలకు రూ.3,600 అదనపు ఆదాయం
మాకు మూడు గేదెలున్నాయి. ప్రైవేటు కేంద్రానికి రోజుకు 6–8 లీటర్ల పాలు పోసేవాళ్లం.ఎస్‌ఎన్‌ఎఫ్, ఫ్యాట్‌ శాతం ఎంత ఉన్నా లీటర్‌కు రూ.70–80 మధ్య వచ్చేది. మా గ్రామంలో ఏర్పాటు చేసిన జేపీవి కేంద్రంలో ఎస్‌ఎన్‌ఏఫ్‌ 9.2 శాతం, ఫ్యాట్‌ 12.3 శాతంతో పాలు పోస్తే లీటర్‌కు ఏకంగా రూ.97.92 వచ్చింది. లీటర్‌పై సగటున రూ.20కి పైగా అదనంగా వచ్చింది. ఈ లెక్కన ఐదు లీటర్లకు రూ.120 చొప్పున నెలకు రూ.3,600కు పైగా అదనపు ఆదాయం వచ్చే పరిస్థితి కన్పిస్తోంది. ప్రైవేటు డెయిరీల్లో ఎప్పుడూ ఈ స్థాయిలో  ధర రాలేదు. 
    – పరసా వెంకటసుధ, విరవాడ, పిఠాపురం మండలం, కాకినాడ జిల్లా

గతంలో  రూ.30కి మించి వచ్చేది కాదు 
మాకు రెండు ఆవులున్నాయి. ప్రతి రోజూ 8 లీటర్ల పాలు కేంద్రానికి పోసేవాళ్లం. లీటర్‌కు రూ.30 రావడం గగనంగా ఉండేది. అలాంటిది ఇప్పుడు అమూల్‌ కేంద్రంలో పోస్తే ఎస్‌ఎన్‌ఏఫ్‌ 8.5 శాతం, ఫ్యాట్‌ 4.1 శాతంతో లీటర్‌కు 39.33 వచ్చింది. ఈ లెక్కన లీటర్‌కు అదనంగా రూ.9.33 చొప్పున నెలకు రూ.2,239కు పైగా ఆదనపు ఆదాయం వస్తోంది. ఇక నుంచి ఈ కేంద్రానికే పాలు పోస్తాం.
    – చిట్నీడి వెంకటలక్ష్మి, విరవాడ, పిఠాపురం మండలం కాకినాడ జిల్లా

రైతుల నుంచి మంచి స్పందన
జగనన్న పాల వెల్లువ పథకాన్ని కాకినాడ జిల్లాలో ఈ నెల 3వ తేదీన ప్రారంభించాం. పాడి రైతుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ప్రైవేటు డెయిరీలు, పాల వ్యాపారుల ఒత్తిడి ఎక్కువగా ఉంది. అయినా సరే 96 గ్రామాల్లో ప్రతి రోజూ 200 మందికి పైగా రైతులు 4,500 లీటర్ల పాలు పోస్తున్నారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో అత్యధిక మంది పాడి రైతులకు లీటర్‌ గేదె పాలకు రూ.95, ఆవు పాలకు రూ.53 వరకు ఆదాయం లభిస్తోంది.  
 – డాక్టర్‌ ఎస్‌.సూర్యప్రకాశరావు, జాయింట్‌ డైరెక్టర్, పశు సంవర్థక శాఖ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement