సాక్షి, అమరావతి: లాభాల వెల్లువతో పాడి రైతన్నల్లో దరహాసం విరబూస్తోంది. ‘జగనన్న పాల వెల్లువ’ ద్వారా ఇప్పటికే ఏడు ఉమ్మడి జిల్లాల్లో పాలను సేకరిస్తున్న అమూల్ సంస్థ తాజాగా పాలసేకరణ ధరను మూడోసారి పెంచింది. లీటర్ గేదె పాలపై రూ.4.42, ఆవు పాలపై రూ.2.12 చొప్పున పెంచడంతో పాడి రైతన్నలకు మరింత లాభం చేకూరుతోంది. పెంచిన సేకరణ ధరలు అమూల్ ప్రస్తుతం పాలను సేకరిస్తున్న పది జిల్లాల్లో ఆదివారం నుంచే అమలులోకి రాగా మరో నాలుగు జిల్లాల్లో రెండు మూడు రోజుల్లో వర్తించనున్నాయి. ప్రైవేట్ డెయిరీల ఇష్టారాజ్యంతో ఇన్నేళ్లూ తీవ్రంగా నష్టపోయిన పాడి రైతులకు ‘అమూల్’ రాకతో సాంత్వన లభిస్తోంది.
14 జిల్లాల్లో అమూల్..
‘జగనన్న పాల వెల్లువ’ కార్యక్రమానికి 2020 డిసెంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మూడు జిల్లాలతో ప్రారంభమైన ఈ పథకం ప్రస్తుతం ఏడు జిల్లాలకు (పునర్విభజన అనంతరం 14 జిల్లాలు) విస్తరించింది. దీని ద్వారా అమూల్ సంస్థ ప్రారంభంలో పాల సేకరణకు లీటర్‌కు గరిష్టంగా 11 శాతం వెన్న, 9 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్ (వెన్నలేని ఘన పదార్థాలు)తో గేదె పాలకు రూ.71.47 చొప్పున చెల్లించింది. 5.4 శాతం వెన్న, 8.7 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్ కలిగిన ఆవు పాలకు రూ.34.20 చొప్పున రైతులకు చెల్లించింది. అయితే గత 17 నెలల్లో రెండుసార్లు సేకరణ ధరలను అమూల్ పెంచడంతో రైతులకు లాభం చేకూరింది. తాజాగా మూడోసారి సేకరణ ధరలను పెంచింది.
తాజాగా మరోసారి..
ఇప్పటివరకు లీటర్ గేదె పాలకు రూ.74.78, ఆవుపాలకు రూ.35.78 చొప్పున చెల్లిస్తుండగా తాజాగా అమూల్ తరపున జగనన్న పాల వెల్లువ ద్వారా పాలను సేకరిస్తోన్న సబర్కంత్ జిల్లా కో ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్ మరింత పెంచుతూ నిర్ణయం తీసుకుంది. లీటర్‌కు గరిష్టంగా గేదెపాలపై రూ.4.42, ఆవుపాలపై రూ.2.12 చొప్పున పెంచింది. దీంతో గరిష్టంగా గేదె పాలకు రూ.79.20, ఆవు పాలపై రూ.37.90 చొప్పున పాడి రైతులకు సేకరణ ధర లభిస్తోంది. వెన్నపై కిలోకు రూ.40, ఎస్‌ఎన్‌ఎఫ్‌పై కిలోకు రూ.15 చొప్పున పెంచడంతో వెన్న రూ.720, ఘన పదార్థాలపై రూ.269 చొప్పున పాడిరైతులకు చెల్లిస్తున్నారు.
దళారులు లేకుండా నేరుగా డబ్బులు..
తాజాగా సేకరణ ధరల పెంపుతో 1,94,377 మంది రైతులకు అదనపు లబ్ధి చేకూరనుంది. ప్రస్తుతం 28,763 మంది పాల ఉత్పత్తిదారులు రోజూ 96 వేల లీటర్ల చొప్పున అమూల్’కు పాలు పోస్తున్నారు. ఇప్పటి వరకు 2.91 కోట్ల లీటర్ల పాలను సేకరించగా రైతులకు రూ.124.48 కోట్లు చెల్లించారు. ప్రైవేట్ డెయిరీలతో పోలిస్తే జగనన్న పాల వెల్లువ కేంద్రాల్లో పాలు పోసే రైతులు అదనంగా రూ.21.13 కోట్ల మేర లబ్ధి పొందారు. దళారీలకు తావు లేకుండా రైతుల నుంచి నేరుగా పాలు సేకరించడమే కాకుండా పది రోజులకోసారి వారి ఖాతాల్లోనే జమ చేస్తున్నారు. ఏడాదిలో కనీసం 180 రోజుల పాటు పాలు పోసిన పాడి రైతులకు ప్రోత్సాహకంగా లీటర్ పాలకు అర్ధ రూపాయి చొప్పున లాయల్టీ ఇన్సెంటివ్ చెల్లిస్తుండటంతో పాల వెల్లువపై ఉత్సాహంగా ముందుకొస్తున్నారు.
గతంతో పోలిస్తే ఎంతో లాభం..
నాకు మూడు పాడి గేదెలున్నాయి. రోజూ ఉదయం 10 లీటర్లు, సాయంత్రం 10 లీటర్ల చొప్పున పాలు పోస్తున్నా. గతంలో లీటర్‌కు రూ.40–50కి మించి ఇచ్చేవారు కాదు. ఈ రోజు 8.8 శాతం వెన్న, 9.2 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్‌తో 10.7 లీటర్లు పాలు పోస్తే లీటర్‌కు రూ.63.36 చొప్పున ఏకంగా రూ.677.95 ఇస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది.
– కుసుం నాగమల్లేశ్వరి, నంబూరు, గుంటూరు
పాల వెల్లువతో మంచి రోజులు
నాకు రెండు పాడిగేదెలున్నాయి. ఈరోజు (ఆదివారం) ఉదయం 6.50 లీటర్లు, సాయంత్రం 5.38 లీటర్లు పాలు పోశా. 8.8 వెన్న శాతం, 8.7 ఎస్‌ఎన్‌ఎఫ్ ఆధారంగా లీటర్‌కు రూ.59.86 చొప్పున ఇచ్చారు. నిన్నటితో పోలిస్తే లీటర్‌కు రూ.3.53 చొప్పున అదనంగా లాభం వచ్చింది. జగనన్న పాల వెల్లువతో మంచి రోజులు వచ్చాయి.
– బొంతు వరలక్ష్మి, కోటపాడు, ఏలూరు జిల్లా
త్వరలో మరో ఐదు జిల్లాల్లో..
జగనన్న పాల వెల్లువ కింద పాలుపోసే పాడి రైతులకు అమూల్ సంస్థ సేకరణ ధరను మూడోసారి పెంచింది. తాజా పెంపుతో రైతులకు మరింత లబ్ధి చేకూరుతోంది. త్వరలో విశాఖ, తూర్పు గోదావరిలో (పునర్విభజన అనంతరం ఐదు జిల్లాలు) కూడా విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.
– అహ్మద్ బాబు, ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్
Comments
Please login to add a commentAdd a comment