
గేదె, ఆవుపాలు లీటరుకు రూ.3 వరకు పెంపు యోచన
ప్రతిపాదనలు రూపొందించిన విజయ డెయిరీ అధికారులు
సాక్షి, హైదరాబాద్: పాడిరైతును ప్రోత్సహించేందుకు విజయ డెయిరీ ప్రస్తుతం రైతులకు ఇస్తున్న ధరలను సవరించాలని నిర్ణయించింది. ఒక్కో లీటరు పాలపై రూ.3 వరకు పెంచాలని భావిస్తోంది. ఇప్పటికే మూడుసార్లు పాల ధరలను సవరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మార్కెట్‌లో లీటరు ఆవుపాల ధర ఇతర ప్రైవేట్, సహకార డెయిరీలతో పోలిస్తే విజయ డెయిరీ దాదాపు రూ.8 నుంచి రూ.9 ఎక్కువగా చెల్లిస్తోంది.
రైతులను మరింత ప్రోత్సహించే దిశగా ఆవు పాలు లీటరుపై గరిష్టంగా రూ.3 వరకు పెంచేలా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీంతో లీటరు ఆవు పాల ధర రూ.42.24, గేదె పాలధర కూడా రూ.51.00 ఉండేలా అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు. ప్రస్తుతం ఈ పెంపు ప్రతిపాదనలు ప్రభుత్వం వద్దకు చేరినట్టు సమాచారం.
రోజుకు 2.8 లక్షల లీటర్లు...
పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర నుంచి అతి తక్కువ ధరకు పాలు తెలంగాణకు దిగుమతి అవుతున్నాయి. కొన్ని ప్రైవేట్ డెయిరీలు, కోఆపరేటివ్ రంగంలోని డెయిరీలు పక్క రాష్ట్రాల నుంచి లీటర్‌కు రూ. 27 నుంచి రూ.32 చొప్పున ఆవుపాలను సేకరించి, మార్కెటింగ్ కమీషన్లను పెంచి మన రాష్ట్రంలో అమ్మకాలను పెంచుకుంటున్నాయి. దీని ప్రభావం విజయ డెయిరీ అమ్మకాలపై పడుతోంది.
వీటితోపాటు విజయ పేరుతో కొన్ని డెయిరీలు అక్రమంగా అమ్మకాలు జరుపుతున్నాయి. ఈ సిబ్లింగ్ విజయ బ్రాండ్ల ద్వారా విజయ తెలంగాణ డెయిరీ పాల అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం రోజుకు విజయ బ్రాండ్ పాలు 2.8లక్షల లీటర్లు అమ్ముడు పోతున్నాయి. ఈ నేపథ్యంలో అమ్మకాలు పెంచే దిశగా కసరత్తు చేస్తున్న విజయ డెయిరీ.. పాడి రైతులందరికీ పాల బిల్లుల చెల్లింపులను వేగవంతం చేయడంతో పాటు ప్రోత్సహించే దిశగా ఈ మేరకు చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తోంది.
తాజాగా విజయ డెయిరీ యంత్రాంగం సమావేశమై మూడు ప్రతిపాదనలు రూపొందించినట్టు సమాచారం. దాదాపు రూ.50 కోట్ల పాత బకాయిల చెల్లింపు కోసం ప్రభుత్వాన్ని కోరనున్నట్లు తెలుస్తోంది. ప్రతి నెలా 5 నుంచి 20వ తేదీ మధ్య పాల బిల్లులు చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment