పాడి రైతులకు త్వరలో పాల బిల్లులు చెల్లిస్తాం: గుత్తా అమిత్‌రెడ్డి
లాలాపేట (హైదరాబాద్): రాష్ట్రంలోని అన్ని దేవాలయాలకు అవసరమైన నెయ్యిని విజయ డెయిరీ ద్వారానే సరఫరా చేయాలని ఆదేశాలిచ్చామని తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య (విజయ డెయిరీ) నూతన చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి అన్నారు. విజయ డెయిరీ పాలు, పాల ఉత్పత్తుల అమ్మకాలను మరింత పెంచడానికి ముఖ్యమంత్రి ఆదేశాలతో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు, సంక్షేమ హాస్టళ్లకు, పాఠశాలలకు, జైళ్లు, హాస్పిటల్స్‌కు అవసరమైన పాలు, పాల పదార్ధాలు సరఫరా చేయాలని ఆయన సూచించారు.
పాడి రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ సహకారంతో పెండింగ్ పాల బిల్లులను త్వరలో చెల్లించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం లాలాపేటలోని విజయ భవన్‌లో ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న విజయ డెయిరీ పాలు, పాల ఉత్పత్తులను ఆదరించి తెలంగాణ రాష్ట్ర పాడి రైతులను, పాడిపరిశ్రమను బలపరచాలనీ కోరారు.
పాల సేకరణ ధరను మూడు పర్యాయాలు పెంచాం
రాష్ట్రంలోని 32 జిల్లాలోని 40,445 పాడి రైతుల నుంచి 6,148 పాల సేకరణ కేంద్రాల ద్వారా ప్రతి రోజూ సుమారు 4.20 లక్షల లీటర్ల పాలను సేకరిస్తున్నట్లు అమిత్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో నెలకొన్న పాల కొరతను అధిగమించేందుకు 2022 ఫిబ్రవరి నుంచి 2023 సెపె్టంబర్ వరకు పాల సేకరణ ధరను దేశంలో ఎక్కడాలేని విధంగా 3 పర్యాయాలు రూ. 12.48 పైసలు పెంచామన్నారు. దీంతో పాల సేకరణ గణనీయంగా పెరిగిందన్నారు.
అయినప్పటికీ కొన్ని పొరుగు రాష్ట్రాలకు చెందిన కోఆపరేటివ్ డెయిరీలు, ప్రైవేట్ డెయిరీలు పాల సేకరణ ధరలు తగ్గించడంతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ఆవు పాలను తక్కువ ధరకు రూ. 26 నుంచి రూ. 34లకే కొని ఇక్కడ తక్కువ ధరకు అమ్మకాలు చేపట్టాయని, దీంతో తెలంగాణ విజయ డెయిరీ ఉత్పత్తులకు గిరాకీ తగ్గిందన్నారు. అందుకే పాడి రైతుల బిల్లులు చెల్లింపులో కొంత జాప్యం జరిగిందని, దీన్ని నివారించేందుకు చర్యలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment