- హిందూపురంలో భారీ ర్యాలీ, రాస్తారోకో
-హెరిటేజ్ కోసం ఏపీ డెయిరీని నాశనం చేస్తున్నారంటూ మండిపాటు
హిందూపురం అర్బన్
పాల బిల్లులు చెల్లించడంతో పాటు ధర పెంచాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా హిందూపురంలో బుధవారం పాడి రైతులు రోడ్డెక్కారు. హిందూపురం ప్రాంతంలోని 17 మండలాలకు చెందిన వేలాదిమంది రైతులు పాడిరైతుల సంఘం అధ్యక్షుడు రవీంద్ర, ఏపీరైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి నాయకత్వంలో పాల టిన్నులు పట్టుకుని స్థానిక ఏపీ డెయిరీ కేంద్రం నుంచి సద్భావన సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు.
అక్కడ బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. వీరి ఆందోళనకు అఖిలపక్ష పార్టీలు, రైతుసంఘాల నాయకులు మద్దతు తెలిపారు. రాస్తారోకోను ఉద్దేశించి రైతుసంఘం జిల్లా కార్యదర్శి పెద్దన్న, వైఎస్సార్‌సీపీ నేత కొండూరు వేణుగోపాల్‌రెడ్డి, కాంగ్రెస్ నేత కేటీ శ్రీధర్ మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన హెరిటేజ్ డెయిరీని అభివద్ధి చేసుకోవాలన్న తలంపుతో ఏపీ డెయిరీని నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. పాడి రైతులకు కోట్లాది రూపాయల బకాయిలను చెల్లించడం లేదని, లీటర్ ధరను కూడా రూ.26 నుంచి రూ.16కు తగ్గించి వేశారని తెలిపారు. గతంలో చిత్తూరు డెయిరీని ఇదేవిధంగా నాశనం చేసి..హెరిటేజ్‌ను అభివద్ధి చేసుకున్నారని గుర్తు చేశారు.