
సేకరణ ధరలు సవరించే యోచనలో విజయ డెయిరీ
ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం
రూ.250 కోట్ల నష్టాల ఊబిలో రాష్ట్ర ప్రభుత్వ సంస్థ
విజయ సేకరించే పాలలో 85 శాతం ఆవు పాలే
ప్రైవేటుకంటే లీటర్‌కు దాదాపురూ.10 అధికంగా చెల్లిస్తున్న సంస్థ
అధిక ధరవల్లే నష్టమంటున్న అధికారులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ విజయ డెయిరీ రైతుల నుంచి సేకరిస్తున్న ఆవు పాల ధరను తగ్గించాలని యోచిస్తోంది. అదే సమయంలో గేదె పాల ధరను లీటర్‌కు రూ.4 వరకు పెంచడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. గేదె పాల ధరను రూ.3 వరకు పెంచుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటివరకు అమలులోకి రాలేదు.
అప్పుల భారం పైపైకి
విజయ డెయిరీ సంస్థకు దాదాపు రూ.1,000 కోట్ల టర్నోవర్ ఉన్నప్పటికీ.. ప్రస్తుతం దాదాపు రూ.250 కోట్ల నష్టాల్లో ఉంది. ప్రతినెలా రూ.13కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు నష్టాలు వస్తున్నట్లు తెలిసింది. రైతులకు నెలనెలా చెల్లించాల్సిన పాల బకాయిలు కూడా ఇవ్వలేని దుస్థితిలోకి సంస్థ వెళ్లినట్లు అధికారవర్గాల సమాచారం. ప్రస్తుతం మూడునాలుగు బకాయిలు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. ఆవుపాల సేకరణ ధర అధికంగా ఉండడమే అందుకు కారణమని చెబుతున్నారు.
ప్రైవేటు కంటే రూ.10 అదనం
విజయ డెయిరీ ప్రతీరోజు 4.5 లక్షల లీటర్ల పాలను సేకరిస్తోంది. అందులో 85 శాతం మేరకు ఆవు పాలే ఉంటున్నాయి. ప్రైవేట్ డెయిరీ సంస్థలు ఆవు పాలు లీటర్‌కు రూ.32 నుంచి రూ.33 చెల్లించి సేకరిస్తుండగా.. విజయ డెయిరీ మాత్రం రూ.42 ఇస్తోంది. గేదె పాలు లీటర్‌కు రూ.48 చెల్లిస్తోంది. ఆవుపాల సేకరణతో సంస్థకు ఆదాయం కంటే నష్టమే ఎక్కువగా వస్తోందని ఆ సంస్థ ఉన్నతాధికారి ఒకరు వాపోయారు. మరోవైపు సంస్థలో టన్నుల కొద్దీ పాలపొడి నిల్వలు పేరుకుపోయినట్లు సమాచారం.
మార్కెటింగ్‌లో బలహీనం
రాష్ట్రంలో గేదె పాలకంటే ఆవు పాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నట్లు సమాచారం. ఆవు పాలకు ప్రైవేట్ సంస్థలకంటే విజయ డెయిరీ అధిక ధర ఇస్తుండటంతో రైతులు ఆవు పాలు ఈ సంస్థకు పోస్తూ.. గేదె పాలను స్థానికంగా అధిక ధరకు అమ్ముకుంటున్నారని చెబుతున్నారు. ప్రైవేట్ డెయిరీలు డీలర్లకు లీటర్‌పై దాదాపు రూ.10 వరకు మార్జిన్ ఇస్తుండగా, విజయ డెయిరీ రూ.5–6 మాత్రమే ఇస్తోంది. దీంతో డీలర్లు ఈ సంస్థ పాలు, పాల ఉత్పత్తులు అమ్మేందుకు ముందుకు రావటంలేదని సమాచారం.
తన ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించడంలోనూ సంస్థ విఫలమవుతోందన్న విమర్శలు కూడా ఉంది. దీంతో ప్రైవేట్ సంస్థలతో పోటీని తట్టుకోవడంలో విజయ డెయిరీ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అంగన్‌వాడీలకు ప్రస్తుతం లక్ష లీటర్ల పాలను విక్రయిస్తున్నట్లు, అలాగే గురుకులాలకు కూడా పాలను సరఫరా చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఒక ఉన్నతాధికారి తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని దేవాలయాలకు ఈ సంస్థ నెయ్యిని సరఫరా చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment