సాక్షి, అమరావతి: లాభాల వెల్లువతో పాడి రైతన్నల్లో దరహాసం విరబూస్తోంది. ‘జగనన్న పాల వెల్లువ’ ద్వారా పాలసేకరణ ధరను అమూల్ సంస్థ తాజాగా మరోసారి పెంచింది. లీటర్ గేదె పాలపై రూ.3.30, ఆవు పాలపై రూ.1.58 చొప్పున పెంచడంతో పాడి రైతన్నలకు మరింత లాభం చేకూరుతోంది. పెంచిన ధరలు గురువారం నుంచి అమలులోకి రానున్నాయి.
నాలుగోసారి పెంపు వర్తింపు
‘జగనన్న పాల వెల్లువ’ పథకం 2020 డిసెంబర్‌లో మూడు జిల్లాల్లో ప్రారంభం కాగా ప్రస్తుతం 16 జిల్లాలకు విస్తరించారు. గత 23 నెలల్లో మూడుసార్లు సేకరణ ధరలను పెంచారు. ఉత్తరాంధ్ర పరిధిలో గత నెలలో పెంచగా, తాజాగా కోస్తాంధ్రలో 10 జిల్లాల పరిధిలో పాలసేకరణ ధరలను నాలుగోసారి పెంచారు.
1.12 లక్షల మందికి అదనపు లబ్ధి
కోస్తాంధ్ర పరిధిలో ఇప్పటికే లీటర్ గేదె పాలకు రూ.79.20, ఆవుపాలకు రూ.37.90 చొప్పున చెల్లిస్తుండగా తాజాగా లీటర్‌కు గరిష్టంగా గేదె పాలపై రూ.3.30, ఆవుపాలపై రూ.1.58 పెంచారు. దీంతో గరిష్టంగా గేదె పాలు రూ.82.50, ఆవు పాలు రూ.39.48 చొప్పున సేకరణ ధరలు చేరాయి. వెన్నపై కిలోకు రూ.30, ఎస్‌ఎన్‌ఎఫ్‌పై కిలోకు రూ.11 చొప్పున పెంచడంతో వెన్న ధర రూ.750, ఘన పదార్థాల ధర రూ.280కి చేరుకుంది.
గత నెలలో అమలులోకి వచ్చిన పెంపు వల్ల ఉత్తరాంధ్రలో 233 గ్రామాల పరిధిలోని 33,327 మంది రైతులు లబ్ధి పొందగా తాజా పెంపుతో కోస్తాంధ్రలోని బాపట్ల, తూర్పు గోదావరి, ఏలూరు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, ఎస్‌పీఎస్ ఆర్ నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలో 890 గ్రామాలకు చెందిన 1,12,313 మంది రైతులకు అదనపు లబ్ధి చేకూరనుంది.
రూ.208.23 కోట్లు చెల్లింపు
రాష్ట్రంలో ప్రస్తుతం 16 జిల్లాల పరిధిలో 2,833 గ్రామాలకు చెందిన 2,44,069 మంది రైతుల నుంచి పాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం 30 వేల మంది పాల ఉత్పత్తిదారులు ప్రతిరోజూ సగటున లక్ష లీటర్ల చొప్పున పాలు పోస్తున్నారు. ఇప్పటివరకు 4.86 కోట్ల లీటర్ల పాలను సేకరించగా రైతులకు రూ.208.23 కోట్లు చెల్లించారు. ప్రైవేట్ డెయిరీలతో పోలిస్తే జగనన్న పాల వెల్లువ కేంద్రాల్లో పాలు పోసే రైతులు అదనంగా రూ.25 కోట్ల మేర లబ్ధి పొందారు. దళారీలకు తావు లేకుండా ప్రతి పది రోజులకోసారి పాలుపోసే రైతుల ఖాతాలకు నేరుగా డబ్బులు జమ చేస్తున్నారు.
డిసెంబర్ లోగా రాష్ట్రమంతా విస్తరణ
జగనన్న పాల వెల్లువ కింద పాలసేకరణ ధరను అమూల్ నాలుగోసారి పెంచింది. ఇప్పటికే 16 జిల్లాల్లో అమలవుతున్న ఈ పథకాన్ని డిసెంబర్ నెలాఖరులోగా రాష్ట్రమంతా విస్తరించేలా చర్యలు తీసుకుంటున్నాం.
– అహ్మద్ బాబు, ఎండీ, ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్
Comments
Please login to add a commentAdd a comment