సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో సహకార డెయిరీ పునరుద్ధరణకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే దేశంలోనే రెండో అతిపెద్ద పాల కర్మాగారంగా పేరొందిన చిత్తూరు విజయ డెయిరీ పునరుద్ధరణకు జూలై 4న సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేసిన విషయం విదితమే. తాజాగా ప్రకాశం డెయిరీని పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అమూల్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుని నవంబర్‌లో భూమిపూజకు ఏర్పాట్లు చేస్తోంది.
అమూల్ రూ.400 కోట్ల పెట్టుబడి
ప్రకాశం డెయిరీకి ప్రకాశం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 95.42 ఎకరాల భూములతోపాటు కోట్లాది రూపాయల విలువైన యంత్ర పరికరాలు ఉన్నాయి. 2013 ఫిబ్రవరి 13న టీడీపీ హయాంలో ప్రభుత్వ అనుమతి లేకుండా ఇండియన్ కంపెనీస్ యాక్టు–1956 కింద పీడీసీఎంపీయూ లిమిటెడ్ పేరిట కంపెనీగా మార్చిన ఈ డెయిరీని ఆ తర్వాత దశల వారీగా నిర్వీర్యం చేశారు. ఈ డెయిరీకి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది.
డెయిరీకి చెందిన పాత బకాయిలు రూ.108.32 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. కాగా, ఇక్కడ రూ.400 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు అమూల్ సుముఖత వ్యక్తం చేసింది. పాల ఫ్యాక్టరీతో పాటు వెన్న తయారీ యూనిట్, నెయ్యి ప్లాంట్, మిల్క్ పౌడర్ ప్లాంట్, యూహెచ్‌టీ ప్లాంట్లతో పాటు అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసే బాలామృతం తయారీ యూనిట్ ఏర్పాటు చేయబోతున్నారు.
అప్పట్లో పథకం ప్రకారం నిర్వీర్యం
సహకార డెయిరీ రంగాన్ని పథకం ప్రకారం గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. సహకార స్ఫూర్తితో ఏర్పాటైన పాల యూనియన్లను ప్రభుత్వ అనుమతి లేకుండానే మాక్స్ సొసైటీలుగా.. ఆ తర్వాత కంపెనీలుగా మార్చుకున్నారు. ఇలా 2016 జనవరి 6న విశాఖ మిల్క్ యూనియన్, 2013 జూన్ 18న గుంటూరు, 2013 ఫిబ్రవరి 13న ప్రకాశం జిల్లా యూనియన్లు కంపెనీల యాక్టు–1956 కింద మార్చేశారు. 2017 జనవరి 23న పులివెందుల డెయిరీ, 2018 జూలై 31న రాజమండ్రి డెయిరీ, 2018 నవంబర్ 30న కంకిపాడు మినీ డెయిరీ, 2019 మార్చి 15న మదనపల్లి డెయిరీ ఇలా వరుసగా 8 సహకార డెయిరీలు మూతపడ్డాయి.
వైఎస్ జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తున్న ప్రభుత్వం.. మూతపడిన డెయిరీలకు పూర్వ వైభవం తెచ్చేందుకు పునరుద్ధరణను వేగవంతం చేసింది. ఇప్పటికే మదనపల్లి డెయిరీని అందుబాటులోకి తీసుకొచ్చింది. 2021 నుంచి దీనిని అమూల్ సంస్థ విజయవంతంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే చిత్తూరు డెయిరీకి ఉన్న రూ.182 కోట్ల అప్పులను తీర్చిన ప్రభుత్వం అమూల్ సహకారంతో పూర్వవైభవం తెచ్చేందుకు జూలై 4న సీఎం భూమి పూజ చేశారు. ఇక్కడ అమూల్ సంస్థ రూ.385 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. దేశంలోనే అతిపెద్ద ఐస్ క్రీం ప్లాంట్‌తో పాటు పాల కర్మాగారం, బటర్, పాల పొడి, చీజ్, పన్నీర్, యాగర్ట్ స్వీట్స్, యూహెచ్‌టీ విభాగాలను ఏర్పాటు చేస్తున్నారు. 10 నెలల్లో లక్ష టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా ముందుకెళ్తోంది.
పునరుద్ధరణ దిశగా ప్రకాశం డెయిరీ
Published Thu, Oct 5 2023 2:35 AM | Last Updated on Thu, Oct 5 2023 2:35 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment