Ongole Dairy
-
పునరుద్ధరణ దిశగా ప్రకాశం డెయిరీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో సహకార డెయిరీ పునరుద్ధరణకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే దేశంలోనే రెండో అతిపెద్ద పాల కర్మాగారంగా పేరొందిన చిత్తూరు విజయ డెయిరీ పునరుద్ధరణకు జూలై 4న సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేసిన విషయం విదితమే. తాజాగా ప్రకాశం డెయిరీని పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అమూల్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుని నవంబర్‌లో భూమిపూజకు ఏర్పాట్లు చేస్తోంది. అమూల్ రూ.400 కోట్ల పెట్టుబడి ప్రకాశం డెయిరీకి ప్రకాశం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 95.42 ఎకరాల భూములతోపాటు కోట్లాది రూపాయల విలువైన యంత్ర పరికరాలు ఉన్నాయి. 2013 ఫిబ్రవరి 13న టీడీపీ హయాంలో ప్రభుత్వ అనుమతి లేకుండా ఇండియన్ కంపెనీస్ యాక్టు–1956 కింద పీడీసీఎంపీయూ లిమిటెడ్ పేరిట కంపెనీగా మార్చిన ఈ డెయిరీని ఆ తర్వాత దశల వారీగా నిర్వీర్యం చేశారు. ఈ డెయిరీకి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. డెయిరీకి చెందిన పాత బకాయిలు రూ.108.32 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. కాగా, ఇక్కడ రూ.400 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు అమూల్ సుముఖత వ్యక్తం చేసింది. పాల ఫ్యాక్టరీతో పాటు వెన్న తయారీ యూనిట్, నెయ్యి ప్లాంట్, మిల్క్ పౌడర్ ప్లాంట్, యూహెచ్‌టీ ప్లాంట్లతో పాటు అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే బాలామృతం తయారీ యూనిట్ ఏర్పాటు చేయబోతున్నారు. అప్పట్లో పథకం ప్రకారం నిర్వీర్యం సహకార డెయిరీ రంగాన్ని పథకం ప్రకారం గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. సహకార స్ఫూర్తితో ఏర్పాటైన పాల యూనియన్లను ప్రభుత్వ అనుమతి లేకుండానే మాక్స్ సొసైటీలుగా.. ఆ తర్వాత కంపెనీలుగా మార్చుకున్నారు. ఇలా 2016 జనవరి 6న విశాఖ మిల్క్ యూనియన్, 2013 జూన్ 18న గుంటూరు, 2013 ఫిబ్రవరి 13న ప్రకాశం జిల్లా యూనియన్లు కంపెనీల యాక్టు–1956 కింద మార్చేశారు. 2017 జనవరి 23న పులివెందుల డెయిరీ, 2018 జూలై 31న రాజమండ్రి డెయిరీ, 2018 నవంబర్ 30న కంకిపాడు మినీ డెయిరీ, 2019 మార్చి 15న మదనపల్లి డెయిరీ ఇలా వరుసగా 8 సహకార డెయిరీలు మూతపడ్డాయి. వైఎస్ జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తున్న ప్రభుత్వం.. మూతపడిన డెయిరీలకు పూర్వ వైభవం తెచ్చేందుకు పునరుద్ధరణను వేగవంతం చేసింది. ఇప్పటికే మదనపల్లి డెయిరీని అందుబాటులోకి తీసుకొచ్చింది. 2021 నుంచి దీనిని అమూల్ సంస్థ విజయవంతంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే చిత్తూరు డెయిరీకి ఉన్న రూ.182 కోట్ల అప్పులను తీర్చిన ప్రభుత్వం అమూల్ సహకారంతో పూర్వవైభవం తెచ్చేందుకు జూలై 4న సీఎం భూమి పూజ చేశారు. ఇక్కడ అమూల్ సంస్థ రూ.385 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. దేశంలోనే అతిపెద్ద ఐస్ క్రీం ప్లాంట్‌తో పాటు పాల కర్మాగారం, బటర్, పాల పొడి, చీజ్, పన్నీర్, యాగర్ట్ స్వీట్స్, యూహెచ్‌టీ విభాగాలను ఏర్పాటు చేస్తున్నారు. 10 నెలల్లో లక్ష టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా ముందుకెళ్తోంది. -
నారా వారి ఏలుబడి.. నయవంచనే పెట్టుబడి!
చంద్రబాబు పాలన అంటే ఉత్తుత్తి హామీలు, అబద్ధాలు, నయవంచన గుర్తుకు వస్తాయి. ఆయన ఐదేళ్ల పాలనలో జిల్లాలో దుర్భిక్షం రాజ్యమేలింది. పాడికి పేరొందిన ప్రకాశం జిల్లాలో రైతులకు అండగా ఉన్న ఒంగోలు డెయిరీని నిర్వీర్యం చేశారు. రైతులను నట్టేట ముంచేసి.. వేలాది మంది కార్మికులను రోడ్డు పాల్జేశారు. రుణమాఫీ హామీని గాలికొదిలేసి లక్షలాది మంది కర్షకులను, డ్వాక్రా మహిళలను దగా చేశారు. వెలిగొండ ప్రాజెక్టు పనులు గాలికి వదిలేశారు. ఈ ప్రాజెక్ట్ పేరుతో విడుదలైన అరకొర నిధులు బాబు బినామీలు కాజేశారు. రామాయపట్నం పోర్టు నిర్మాణాన్ని త్రిశంకు స్వర్గంలో పెట్టారు. ఐదేళ్లు కాలక్షేపం చేసిన ఎన్నికల వేళ హడావిడిగా శిలా ఫలకం వేసి వంచన చేశారు. ఇలా అన్ని రంగాల్లో జిల్లాను నట్టేట ముంచేసిన చంద్రబాబు.. ఏదో ఘనకార్యం చేసినట్టుగా ఈ గడ్డపై మహానాడు నిర్వహణకు సిద్ధమయ్యారని జిల్లా వాసులు విమర్శిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: చంద్రబాబు హయాం 2014 నుంచి 2019 వరకు ప్రకాశం జిల్లాలో ఒక్క అభివృద్ధి కూడా జరగలేదు. ప్రధాన ప్రాజెక్టులన్నీ నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఐదేళ్లూ అన్ని మండలాల్లో కరువు తాండవించింది. సాగు, తాగు నీటి కోసం ప్రజలు విలవిల్లాడారు. పశ్చిమాన పలు గ్రామాల్లో ప్రజలు వలసబాట పట్టారు. సార్వత్రిక ఎన్నికల ముందు ఉత్తుత్తి శంకుస్థాపనలతో హడావుడి చేశారు. మళ్లీ అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తానంటూ ప్రగల్భాలు పలికారు. ఐదేళ్ల బాబు నయవంచన పాలనను.. మూడేళ్ల వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో జిల్లాలో జరిగిన అభివృద్ధిని జనం పోల్చుకుంటున్నారు. జగన్‌కు జై కొడుతున్నారు. జిల్లాలో నాడు–నేడు ఒక్కసారి పరిశీలిద్దాం.. పాలేరూ అంతే.. కొండపి నియోజకవర్గంలోని సంగమేశ్వరం వద్ద పాలేరుపై నిర్మించతలపెట్టిన సంగమేశ్వరం ప్రాజెక్టు పనులు టీడీపీ హయాంలో ముందుకు సాగనేలేదు. అప్పటి, నేటి ఎమ్మెల్యే డోల బాలవీరాంజనేయ స్వామి (టీడీపీ) కాంట్రాక్టర్లను మార్చటమే పనిగా పెట్టుకున్నారు. మూడుసార్లు కాంట్రాక్టర్లను మార్చి నిర్లక్ష్యం చేశారు. ఇలా అన్ని రంగాల్లో జిల్లాను గాలికొదిలేశారు. కరువు జిల్లాగా మార్చేశారు. రుణమాఫీ పేరిట దగా 2014 ఎన్నికల ముందు రైతులు, డ్వాక్రా మహిళలు ఎవరూ ఒక్క రూపాయి కూడా బ్యాంకులకు రుణాలు చెల్లించవద్దు. అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తానంటూ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మాట మార్చారు. కమిటీల పేరుతో ఏడాదిన్నరపాటు కాలయాపన చేశారు. పాత ప్రకాశం జిల్లాలో 4.50 లక్షల మంది రైతులు, 7 లక్షల మంది డ్వాక్రా మహిళలు కలిపి సుమారు రూ.11 వేల కోట్లకు పైగా రుణాలు ఉండేవి. కేవలం రూ.3 వేల కోట్లలోపు మాత్రమే రుణాలు మాఫీ చేసి అటు రైతులను, డ్వాక్రా మహిళలను దగా చేశారు. హెరిటేజ్ కోసం ఒంగోలు డెయిరీ మూత... పాడి రైతులకు ఆదాయ వనరుగా ఉన్న ఒంగోలు డెయిరీని చంద్రబాబు తన హెరిటేజ్ కోసం నిలువునా ముంచేశారు. తన పార్టీకి చెందిన డెయిరీ పాలక మండలి చేత సహకార రంగంలో ఉన్న డెయిరీని కంపెనీ చట్టంలోకి మార్పించి దగా చేశారు. డెయిరీ సొమ్ముంతా దోచుకునేటట్లు చేసి చివరకు రూ.100 కోట్ల వరకు అప్పులు చేయించి మరీ డెయిరీని మూతవేయించారు. పాడి రైతులను నట్టేట ముంచారు. వేలాది ఉద్యోగులు, కార్మికులు ఉపాధిలేక రోడ్డున పడ్డారు. వెలిగొండ పనులు నత్త నడక.... ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు ప్రధాన సాగు, తాగు నీటి వనరుగా నిర్మింపతలపెట్టిన వెలిగొండ ప్రాజెక్టు పనులు ఐదేళ్లూ నత్తను తలపించాయి. తన సొంత బినామీ అయిన సీఎం రమేష్‌కు వెలిగొండ పనులను అడ్డగోలుగా నామినేషన్‌పై ఇచ్చి రూ.వందల కోట్లు కాజేశారు. పనుల్లో మాత్రం అడుగు కూడా ముందుకు సాగలేదు. ఒకటో టన్నెల్ పనులు కేవలం 600 మీటర్లు మాత్రమే తవ్వారు. ఆర్అండ్ఆర్ పనులు అసలు చేపట్టనే లేదు. నాడు గాలికొదిలేసిన టీడీపీ నేతలు ఇదే ప్రాజెక్టుపై లేఖల డ్రామాలు మొదలుపెట్టి అసత్య ప్రచారానికి పూనుకున్నారు. ఉత్తుత్తి శంకుస్థాపన జిల్లా ప్రజల చిరకాల కోరిక రామాయపట్నం పోర్టు. టీడీపీ ప్రభుత్వం గ్రాఫిక్స్‌తో కాలయాపన చేశారు. చివరకు ఎన్నికలకు ముందు డ్రామాకు తెరతీశారు. మేజరు పోర్టును మినీపోర్టుగా మార్చేశారు. హడావుడిగా శిలాఫలకం వేశారు. నన్ను తిరిగి గెలిపిస్తే రామాయపట్నం పోర్టు, పేపర్ మిల్లు ఏర్పాటు చేస్తానని ఉత్తుత్తి హామీ ఇచ్చి వెళ్లారు. మారిన గతి.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో అభివృద్ధి పరుగులు తీసింది. వెలిగొండకు భారీగా నిధులు కేటాయించింది. పనుల్లో వేగం పెంచింది. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందేలా గ్రామ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. ప్రతి గ్రామంలో నాలుగైదు రకాల ప్రభుత్వ భవనాలను నిర్మిస్తున్నారు. జిల్లాలో సంక్షేమ పథకాల కింద ఈ ఏడాది దాదాపు రూ.19,600 కోట్లకు పైగా నేరుగా లబ్ధిదారులకు చేరాయి. మార్కాపురంలో మెడికల్ కాలేజీ.. దోర్నాలలో గిరిజన సూపర్ స్పెషాలిటీ వెనుకబడిన పశ్చిమ ప్రకాశంలో ప్రజలకు వైద్యం అందించేందుకు మెడికల్ కాలేజీ, ప్రభుత్వ వైద్యశాల ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరం చేసింది. అందుకోసం 50 ఎకరాలు కేటాయించి, నిర్మాణానికి రూ.475 కోట్లు వెచ్చించనుంది. ఇప్పటికే మెడికల్ కాలేజీ ఏర్పాటుకు శంకుస్థాపన కూడా చేశారు. దోర్నాల మండలం అయినముక్కల గ్రామంలో గిరిజన సూపర్ స్పెషాలిటీ వైద్యశాలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటికే స్థల సేకరణ పూర్తయింది. వైద్యశాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.50 కోట్లు మంజూరు చేసింది. టెండర్ల దశ పూర్తి చేసుకొని పనులు ప్రారంభం కావాల్సి ఉంది. జీజీహెచ్ అభివృద్ధికి రూ.170 కోట్లు జిల్లా కేంద్రం ఒంగోలు నగరంలో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కృషి చేశారు. ప్రభుత్వం నుంచి రూ.170 కోట్లు మంజూరు చేయించారు. జీజీహెచ్ వెనుక 7 ఎకరాలను అదనంగా కేటాయించారు. బెడ్లు పెంచటంతో పాటు అదనపు సౌకర్యాలు, నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు రూ.100 కోట్లు వెచ్చించి సీటీఎంఆర్తో పాటు జీజీహెచ్‌లో అనేక ఆధునికీకరణ పనులు చేపట్టారు. థర్డ్ వేవ్ కోవిడ్‌ను సైతం సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. కోవిడ్ సమయంలో జీజీహెచ్ వేలాది ప్రాణాలను కాపాడింది. జిల్లాకు ఆంధ్రకేసరి యూనివర్శిటీ.. టీడీపీ హయాంలో ఒక్క విద్యా సంస్థ కూడా జిల్లాకు కేటాయించలేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలోనే జిల్లాకు ఆంధ్రకేసరి యూనివర్శిటీని మంజూరు చేసింది. పేర్నమిట్టలో 109 ఎకరాలు కేటాయించింది. అందుకుగాను డీపీఆర్ కోసం రూ.50 లక్షలు రిలీజ్ చేసింది. మొత్తం యూనివర్శిటీ బడ్జెట్ కింద రూ.340 కోట్లు కేటాయించింది. స్కిల్ డెవలప్మెంట్ కోసం ► నిరుద్యోగుల్లో వృత్తి నైపుణ్యం పెంపొందించటానికి (స్కిల్ డెవలప్మెంట్) ఒంగోలులోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీ ప్రాంగణంలో 5 ఎకరాలు కేటాయించింది. ► దోర్నాలలో రూ.3 కోట్లతో సామాజిక ఆరోగ్య కేంద్ర ఏర్పాటుకు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ► గిద్దలూరు పట్టణ ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు సుంకేసుల గ్యాప్ నుంచి నీటిని సరఫరా చేసేందుకు రూ.89 కోట్లతో పనులు చేస్తున్నారు. ► ఒంగోలు నగర అభివృద్ధి కోసం సీఎం వైఎస్ జగన్ ఒంగోలు నగరానికి వచ్చినప్పుడు రూ.400 కోట్లు కేటాయించాలని బాలినేని శ్రీనివాస రెడ్డి కోరారు. దీంతో ఆ ప్రతిపాదనలను పరిశీలించిన ముఖ్యమంత్రి మంజూరు చేస్తున్నట్లు బహిరంగ సభలోనే ప్రకటించారు. ► రూ.54 కోట్లతో నగరంలో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ► చీరాల మండలంలోని వాడరేవు, కొత్తపట్నం సముద్ర తీర ప్రాంతాల్లో రెండు ఫిషింగ్ హార్బర్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటికే వాటికి సంబంధించి స్థల సేకరణ పూర్తయింది. త్వరలో వాటి నిర్మాణానికి టెండర్లు పిలవనున్నారు. వెలిగొండ ప్రాజెక్టు పనులు వేగం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత మొదటి టన్నెల్ నిర్మాణ పనులు పూర్తి చేసింది. రెండో టన్నెల్ 18.679 కిలో మీటర్లకుగాను ఇక కేవలం 4.920 కిలో మీటర్లు మాత్రమే మిగిలి ఉంది. హెడ్ రెగ్యులేటర్ పనులు కూడా వేగవంతం చేసింది. ప్రాజెక్టు పరిధిలోని నిర్వాసితుల కోసం ఇప్పటికే 31,066 ఎకరాల భూ సేకరణ పూర్తి చేసింది. భూ సేకరణ కోసం రూ.418 కోట్లు వెచ్చించింది. ఆర్ఆర్ ప్యాకేజీ కోసం 11 గ్రామాల తరలింపునకు రూ.116 కోట్లు కేటాయించింది. పేద విద్యార్థుల కల సాకారమే ట్రిపుల్ ఐటీ ఇడుపులపాయలో ఉన్న ట్రిపుల్ ఐటీని జిల్లాకు తీసుకొచ్చి పేద విద్యార్థుల కలను సాకారం చేస్తున్నారు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఏటా 4 వేల మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీలో చేరుతుంటారు. ఐదేళ్లపాటు అంటే 20 వేల మంది విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి. ప్రస్తుతం ఇడుపులపాయతో పాటు పేర్నమిట్ట అవతల ఉన్న ఎస్ఎస్ఎన్ ఇంజినీరింగ్ కాలేజీలో నిర్వహిస్తున్నారు. శాశ్వత భవనిర్మాణం కోసం కనిగిరి ప్రాంతంలో స్థల పరిశీలన జరుగుతోంది. -
మొసలి కన్నీరు కారుస్తున్న టీడీపీ
ఒంగోలు డెయిరీ ఓ బ్రాండ్. కేవలం సేకణలోనే కాదు.. పాలతోపాటు పాల ఉత్పత్తుల్లో కమ్మని రుచులు అందించేంది. అందుకే ఒకప్పుడు రైతు కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా ఒంగోలు డెయిరీ మారింది. అప్పట్లో రోజుకు 2.50 లక్షల లీటర్ల పాలు నిత్యం డెయిరీకి వస్తుండేవి. ఇలా గ్రామాల్లోని లోగిళ్లు పాడి, పంటలతో కళకళలాడాయి. అలాంటి డెయిరీని టీడీపీ నాయకులు నిలువునా నిర్వీర్యం చేశారు. కానీ నేటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం డెయిరీల అభ్యున్నతికి విశేష కృషి చేస్తుండటంతో పాల సేకరణదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకార రంగాన్ని గాడిలో పెట్టేందుకు ప్రయోగాత్మకంగా నిర్ణయాలు తీసుకున్నారు. పాడి రైతులకు లాభాలు పెంచడంతో పాటు, ప్రైవేటు డెయిరీల ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయడానికి రాష్ట్రంలో అమూల్ సంస్థను రంగంలోకి దించారు. దీంతో పాడి రైతుల్లో ఆనందం రెట్టింపైంది. గతంలో లీటరు పాలకు కనీసం రూ. 45 కూడా వచ్చే పరిస్థితి ఉండేదు కాదు. కానీ నేడు వెన్న శాతాన్ని బట్టి రూ. 55 నుంచి రూ. 70 వరకు ధర పలుకుతుందంటే అది కేవలం అమూల్ వల్లే అని అందరూ బల్లగుద్ది మరీ చెబుతున్నారు. సీఎం చొరవతో నేడు పాడి రైతులు పాల కేంద్రాలకు పాలను తెచ్చి గుమ్మరించి మరీ వెళుతున్నారు. నాటి టీడీపీ పాల డెయిరీలను చేసిన హననాన్ని గుర్తు చేసుకొని మండి పడుతున్నారు. బాబు డైరెక్షన్.. ఒంగోలు డెయిరీ పెద్దల యాక్షన్ 2014కు ముందు ఒంగోలు డెయిరీ మూడు పువ్వులు.. ఆరు కాయలుగా వెలుగొందింది. కానీ ఆ తరువాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత పచ్చగా డెయిరీని నిర్వీర్యం చేయటానికి పథక రచన చేశారు. నాటి తెలుగుదేశం పార్టీ నాయకులే సంస్థను అప్పుల ఊబిలోకి నెట్టేశారు. నాడు అలా వెలగబెట్టిన నేతలు ప్రస్తుతం డెయిరీని ఆదుకోవాలంటూ గగ్గోలు పెడుతుండటంపై పాలసేకణదారులే నవ్వుకుంటున్నారు. రూ. 100 కోట్లకు పైగా దోపిడీ చల్లా శ్రీనివాసరావు చైర్మన్‌గా ఉన్నా హయాంలో ఏకంగా రూ. 100 కోట్లకు పైగా దోచుకున్నారు. పాలతో పాటు పాలపొడినీ బొక్కి చివరకు డెయిరీని ఒట్టి పోయిన గేదెలా వదిలి వెళ్ళిపోయారు. ఆ సయంలో విసిగిపోయిన పాడి రైతులు, పశుపోషకులు జిల్లా వ్యాప్తంగా టీడీపీ ప్రభుత్వంపై ఆందోళనలకు దిగారు.. రహదారులు స్తంభింపజేశారు. ఎమ్మెల్యేలను గృహదిగ్భంధనం చేశారు. దీంతో దిగివచ్చిన నాటి సీఎం చంద్రబాబు డెయిరీని ఆదుకోవటానికి కొత్త ఎత్తు వేశారు. అప్పు రూపంలో ప్రభుత్వ తరఫున ఏపీడీడీసీఎఫ్ నుంచి రూ. 35 కోట్లు రుణం ఇప్పించారు. కానీ ఆ నిధులను కూడా డెయిరీ అభివద్ధికి వెచ్చించకుండా హారతి కర్పూరంలా కరిగించే పనిలో అధికారులతో కూడిన నూతన కమిటీ మునిగిపోయింది. అందుకుగాను రుణానికి తాకట్టుగా డెయిరీకి చెందిన రూ. 58.98 కోట్ల విలువగల 8.75 ఎకరాలను తనఖా పెట్టారు. దీనికి రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఆయా సందర్భాలలో ప్రకటించిన రెపోరేటు మీద 2 శాతం వడ్డీ చెల్లించాల్సి వచ్చింది. ఈ లెక్క ప్రకారం ప్రస్తుతం ఆ రుణానికి 8.25 శాతం వడ్డీ రేటు పడుతుంది. అందుకుగాను రుణాన్ని 2020 నవంబర్ నుంచి నెల నెలా కంతుల వారీగా వాయిదాలు చెల్లించేవిధంగా మారటోరియం విధించారు. చివరకు అప్పులు తీరకపోగా సంస్థకు మరింత భారంగా మారింది. 17 సంవత్సరాల పాలనలో ధ్వంస రచన ఒంగోలు డెయిరీలో ఏకఛత్రాధిపత్యంగా టీడీపీ పాలకమండలి 17 సంవత్సరాల పాటు కొనసాగింది. 2002 నుంచి 2018 వరకు టీడీపీ నాయకుడు కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓగూరు గ్రామానికి చెందిన చల్లా శ్రీనివాసరావు ఏకైక చైర్మన్‌గా చక్రం తిప్పారు. డెయిరీని నిలువునా దోచుకుంటున్నా అటు పార్టీ, ఇటు చంద్రబాబు ప్రభుత్వం చప్పట్లు కొట్టి మరీ ప్రోత్సహించారు. చల్లా శ్రీనివాసరావును, అప్పటి ఎండీ మేడా శివరామయ్యను హైదరాబాద్ పిలిపించుకున్న డెయిరీని ఏవిధంగానైనా నాశనం చేయాలన్నదే లక్ష్యంగా 2014లోనే చంద్రబాబు వ్యూహం రచించారు. సహకార రంగంలో ఉన్న ఒంగోలు డెయిరీని కంపెనీ చట్టంలోకి మార్చారు. ఇక అప్పటి నుంచే డెయిరీని దోచుకోవటం టీడీపీ పాలకమండలి ప్రారంభించింది. చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ డెయిరీని కాపాడటానికి ఒంగోలు డెయిరీని నిర్వీర్యం చేశారు. ఆ సంగత వదిలి నేడు టీడీపీ నేతలు ఇతర రాజకీయ పార్టీలను ఏకంచేసి పోరాటం చేయటానికి సిద్ధం అవుతుండటాన్ని చూసి దొంగే...దొంగ అన్న చందంగా ఉందని అంతా నవ్వుకుంటున్నారు. -
పాల మాల్యా పాపాల చిట్టా..
ఒంగోలు సబర్బన్: ఒంగోలు డెయిరీని రోజు, రోజుకు పతనావస్థకు చేర్చాలన్న కుతంత్రానికి 2013లోనే బీజం పడింది. ఏవిధంగానైనా సరే డెయిరీని నాశనం చేయాలన్న కుట్రకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలోనే అంకురార్పణ జరిగింది. అప్పటికే పుష్కర కాలంగా చల్లా శ్రీనివాసరావు డెయిరీ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. టీడీపీకి చెందిన నేత కావటంతో చల్లాతోపాటు, అప్పటి ఎండీ మేడా శివరామయ్యను హైదరాబాద్ పిలిపించుకున్న చంద్రబాబు డెయిరీని ఎలాగైనా సరే నాశనం చేయాలన్నదే లక్ష్యంగా 2013లోనే వ్యూహం రచించారు.అప్పట్లో డెయిరీలోని కొందరు ఉద్యోగులు, కొందరు డైరెక్టర్లు ఫేస్బుక్ అకౌంట్ ద్వారా ‘సేవ్ ఒంగోలు డెయిరీ’ పేరుతో డెయిరీలో జరుగుతున్న అక్రమాలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ వచ్చారు. అందులో భాగంగా హైదరాబాద్‌లో చంద్రబాబు నాయుడును కలిసినప్పుడు చైర్మన్, ఎండీలు కలిసి దిగిన ఫొటో కూడా ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశారు. ఆ ఫొటో చూస్తే చైర్మన్ చల్లా శ్రీనివాసరావు పార్టీ నాయకుడు కాబట్టి సరే. ఒక సాధారణ డెయిరీ ఉద్యోగిపై ఎంత ఆప్యాయత కనబరుస్తున్నాడో చంద్రబాబు అన్నట్లు ఉంది. డెయిరీ ఎండీ మేడా శివరామయ్య, చైర్మన్ శ్రీనివాసరావుల భుజాలపై ఆప్యాయంగా చేతులు వేసి మరి ఫొటోలకు ఫోజులిచ్చారు చంద్రబాబు. అప్పుడు ఒంగోలు డెయిరీకి పతనానికి భీజం పడిందన్న మాట. అప్పటి నుంచి డెయిరీ డైరెక్టర్లు కొందరు చైర్మన్ చల్లాను ఫేస్ బుక్‌లో ‘పాల మాల్యా’గా పేరు పెట్టి అతను డెయిరీని దోచుకున్న తీరును ఎండకట్టటం మొదలు పెట్టారు ఉద్యోగులు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఒంగోలు డెయిరీని కాపాడండి చంద్రబాబూ అంటూ పోస్టింగులు పెట్టటం ప్రారంభించారు. అయినా కనికరం లేని చంద్రబాబు ఉద్యోగులు ఆందోళనలు చేసినా, డైరెక్టర్లు పోరాటాలు చేసినా, చివరకు అధికార టీడీపీకి చెందిన పాడి రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనలు చేసినా చివరకు మునిగిపోయే వరకు పట్టించుకోలేదు. నాశనానికి కుట్రదారే తానైనప్పుడు ఆయన డెయిరీని ఎందుకు కాపాడుతారు. ఇప్పటికీ అధికారులతో కూడిన నూతన కమిటీ ఏర్పాటయినప్పటికీ ఏపీడీడీసీఎఫ్ నుంచి రూ.35 కోట్లు అప్పు ఇప్పించినప్పటకీ చివరకు నూతన అధికారులు, నూతన కమిటీ కలిసి నిధులు దుర్వినియోగానికి ఊతమిస్తున్నారు. చివరకు ఏదో విధంగా డెయిరీ తాకట్టులోకి వెళ్లటమే అంతిమ లక్ష్యంగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పాల మాల్యా పాపాల చిట్టా.. ♦ కర్ణాటక ఫెడరేషన్ నుంచి ఒంగోలు డెయిరీకి వచ్చే పాలని పొడిగా మార్చి (జాబ్ వర్క్) వారికి వెనక్కి ఇవ్వాల్సిన పొడి 700 టన్నులు సొంతానికి అమ్ముకున్నారు. ♦ 2016 ఏప్రిల్ 16న సేవ్ ఒంగోలు డెయిరీలో భాగంగా పాలమాల్యా నుంచి ఒంగోలు డెయిరీని కాపాడాలంటూ చంద్రబాబును డైరెక్టర్లు వేడుకున్నారు. ♦ చైర్మన్‌కు చెందిన వ్యక్తి చల్లా సాయికుమార్‌ను టెంపరరీ ఉద్యోగిగా తీసుకొని అత్యంత కీలకమైన పర్చేజ్ మేనేజర్ పోస్ట్ ఇచ్చి దోచుకున్నారు. ♦ నెలకు రూ.50 వేలు జీతం తీసుకునే సీనియర్ ఉద్యోగులున్నా వారిని పక్కన పెట్టిమరీ దోపిడీ చేశారు. ♦ పాడి రైతుల పాల బకాయిలు చెల్లించకుండా విశాఖ డెయిరీ నుంచి రూ.2 కోట్లు తెచ్చుకొని కాజేశారు. ♦ 423 పాల సొసైటీలకు గాను కేవలం 10 సొసైటీల ఆమోదంతో సహకార పరపతి సంఘాన్ని కంపెనీ యాక్టులోకి మార్చిన ఘనుడు. ♦ 2013 జనవరి 27న ఆదివారం జిల్లా కో ఆపరేటివ్ ఆఫీసర్ నుంచి తెల్లకాగితంపై తీసుకున్న ఎన్ఓసీ చివరకు డీసీఓ కొండయ్య సస్పెండ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ♦ హైదరాబాద్‌లో అమ్మిన పాలు తన సొంతానికి రూ.3 కోట్లు వాడుకున్న చైర్మన్ చల్లా. ♦ డెయిరీ ఆస్తులు తనఖా పెట్టి ఆంధ్రాబ్యాంకు, యాక్సిస్ బ్యాంకుల నుంచి దాదాపు రూ.40 కోట్లు రుణాలు తీసుకొని నేరుగా కాజేసిన వైనం. ♦ బ్యాంకులకు తాకట్టు పెట్టిన డెయిరీ నిల్వలు నిలువునా గోడౌన్ వెనుక గోడలు పగులగొట్టి అమ్ముకున్నారు. ♦ అప్పటి ఎండీ మేడా శివరామయ్య చైర్మన్‌కు సహకరించి అతని స్థాయిలో అతనూ దోచుకున్న విషయం అందరికీ తెలిసిందే. దోచుకున్న డబ్బుతో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో దాదాపు 50 ఎకరాలకు పైగా భూములు కొని చివరకు నూతనంగా డెయిరీ పెట్టేం దుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. -
అడుగడుగునా అరాచకాలే
సాక్షి, ఒంగోలు: జిల్లా కేంద్రంలోనే అడుగడుగునా అరాచకం తాండవించింది. అక్రమాన్ని ప్రశ్నించినా, నోరు మెదిపినా అటు జైలుకో లేక ఇటు గృహ నిర్బంధమో తప్పని పరిస్థితులు. సాక్షాత్తు ప్రభుత్వం నిరసనలకు దిగితే భద్రత కల్పించిన పోలీసు యంత్రాంగం, ప్రతిపక్షం, ప్రజాసంఘాలు, ఉద్యోగ సంఘాలు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసినా వెంటాడి కేసులు నమోదు చేసిన ఘటనలు ఎవ్వరూ మరిచిపోలేకపోతున్నారు. గత ఐదేళ్లుగా ఎన్నో అవమానాలను సహించిన జనం ఎన్నికల వేళ తమదైన తీర్పు ఇచ్చేందుకు సమాయత్తమవుతున్నారు. మేమింతే..మారమంతే.. జిల్లా పరిషత్‌కు వెయ్యికోట్లకు పైగా నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో శిథిలావస్థకు చేరిన జిల్లా పరిషత్ కార్యాలయం స్థానంలో సొంత భవనం కట్టుకోవాలని నిర్ణయించారు. ఇందుకు మహాత్మాగాంధీ కాంప్లెక్స్ పేరుతో పంచాయతీరాజ్ కార్యాలయాలు అన్నీ ఒకేచోట ఉండాలని తీర్మానించారు. ఈ మేరకు జెడ్పీ సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. కానీ ఆ స్థలంపై అధికార పార్టీ కన్నుపడింది. ఇంకేముంది జెడ్పీ కార్యాలయ నూతన భవనానికి అనుమతులు రాకుండా అడ్డుకున్నారు. అంతేనా...ఆ స్థలాన్ని తమ పార్టీ కార్యాలయం కోసం కేటాయించాలంటూ అధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు స్వయానా ఈదర హరిబాబును కలిసి అభ్యర్థించడం, దానిని ఈదర హరిబాబు సమర్థనీయంగా అడ్డుకున్న విషయమూ చర్చనీయాంశమే. ప్రభుత్వ భూములపై పెత్తనమేంటి..? స్థానిక కేశవరాజుకుంటకు పడమర భాగంలో ఉన్న ప్రాంతంపై అధికార పార్టీ నేతల కన్నుపడింది. ఏమాత్రం ఆలోచించకుండా ఆ భూమిలోకి అడుగుపెట్టారు. హద్దురాళ్లు వేసుకుంటూ నిర్మాణాలు ప్రారంభించారు. అయితే అప్పటికే ఆ భూముల్లో పట్టాలు ఉన్న వారు తమ భూములంటూ అడ్డుకోగా వారిని తీవ్రంగా హెచ్చరించారు. ఈ సమయంలో వైఎస్సార్ సీపీ నేతలు పేదలకు అండగా ఉండి, అసలు ఆ భూమి ఎవరిదంటూ ఆరా తీయడం ప్రారంభించారు. మరో వైపు ప్రజలు గట్టిగా నిలదీయడంతో కొంతమంది అధికార పార్టీ నేతలు పట్టాలను బయటపెట్టారు. తీరా వాటిని చూస్తే కనీసం సంతకాలు కూడా లేనవి కొన్నయితే మరికొన్నింటిపై తహసీల్దార్ చిరంజీవి సంతకం పెట్టినట్లుగా పేర్కొన్నారు. ఆయన మాత్రం తాను పట్టాలు ఇవ్వలేదని పేర్కొనడం కొసమెరుపు. ఈ క్రమంలో అక్రమ నిర్మాణాలు చేపట్టేందుకు వచ్చిన వారిని తమ సమక్షంలోనే విచారించాలని, వారిని ఎవరు పంపించారో నిగ్గుతేల్చాలంటూ కేశవరాజుకుంట, చినమల్లేశ్వర కాలనీకి చెందిన పలువురు మహిళలు పోలీసు జీపును అడ్డుకున్నారు. దీంతో తమ విధులను అడ్డుకుంటారంటూ ఏకంగా 40 మందిపై కేసులు పెడుతున్నట్లు తాలూకా పోలీసులు పేర్కొన్నారు. తీరా విచారిస్తే ఆ భూమి ఇంకా ఎన్ఎస్పీ స్వాధీనంలోనే ఉంది. అది రెవెన్యూకు కన్వర్షన్ కాలేదు. మరి..పట్టాలు ఎలా చెల్లుబాటవుతాయంటూ పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగడంతో పోలీసులు మౌనం వహించారు. కానీ తమ భూమిలోకి అక్రమంగా ప్రవేశించారంటూ పలువురు కొనుగోలుచేసిన డాక్యుమెంట్లతో ఫిర్యాదులు చేసినా నేటికి వాటిపై కదలిక లేకపోవడానికి కారణం కేవలం అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉండడమేననే భావన వ్యక్తం అవుతోంది. ఒక్కొక్కరికి ఒక్కో రూలా..? ప్రత్యేక హోదా కావాలంటూ టీడీపీ నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టినా, ధర్నాలు, ర్యాలీలు నిర్వహించినా పోలీసులు కేసులు నమోదుచేసిన దాఖలాలు లేవు. కానీ వైఎస్సార్ సీపీ నాయకులు కొద్దిసేపు బస్సులను అడ్డుకున్నారంటూ వారిని పశువులు తోలే వాహనాల్లోకి బలవంతంగా ఎక్కించి దోర్నాలకు తరలించి కేసులు నమోదుచేసిన అనంతరం వదిలిపెట్టిన ఘటనలు నేటికి చిరపరిచితమే. చిరు వ్యాపారులపై ప్రతాపమా..? రంజాన్ మాసం పర్వదినాన ఉపవాసం ఉండి భక్తిశ్రద్ధలతో అల్లాను పూజించే ముస్లింలపై మున్సిపల్ అధికారులు విరుచుకుపడ్డారు. కనీసం ఏంటనేది చెప్పకుండా దుకాణాలను ఇష్టం వచ్చినట్లు ధ్వంసం చేశారు. షాపులను కూల్చవద్దంటూ ముస్లింలు వేడుకున్నా వినలేదు. దశాబ్దాల తరబడి ఊరచెరువు కట్టనే ఆధారం చేసుకొని జీవనం సాగిస్తున్న వారి షాపులను నిర్దాక్షిణ్యంగా కూల్చేశారు. దీంతో ఆ రంజాన్ మాసంలో ముస్లింలు పడిన ఇక్కట్లు చెప్పేవీ కావు. స్థలాలకు పట్టాలు ఉన్నాయని చెప్పినా వాటిని చూపించగా అవి చెల్లవంటూ నగరపాలక సంస్థ కమిషనర్ దుకాణాలను కూల్చేశారు. అయితే ఇదంతా తనకు తెలియకుండా జరిగిందంటూ అధికార పార్టీ నేతలు చెప్పుకొస్తూనే మరో వైపు కోర్టులో ముస్లింలకు ఆ స్థలం దక్కకుండా చేసేందుకు ప్రయత్నాలు చేశారు. అధికారం అండగా.. అడ్డగోలుగా.. ప్రకాశం జిల్లా సహకార కేంద్రబ్యాంకు చైర్మన్ రాజీనామాతో కొత్తనేతను ఎన్నుకోవాల్సి వచ్చింది. పట్టుమని 18 మంది మాత్రమే ఈ ఓటింగ్‌లో పాల్గొంటారు. కానీ శాంతిభద్రతల సమస్య తలెత్తే వ్యవహారం ఉందంటూ చివరకు సహకార శాఖామంత్రి ఆదినారాయణరెడ్డి పాలకవర్గ ఎన్నికలు నిర్వహించకుండా స్టే ఇచ్చేంత వరకు పోలీసులు వ్యవహరించిన తీరు హాస్యాస్పదంగా మారింది. కేవలం 18 మంది వ్యక్తులకు భద్రత కల్పించలేకపోతే ప్రస్తుతం ఎన్నికలను ఏ విధంగా సజావుగా నిర్వహించగలుగుతారా అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. ఓ పద్ధతి, పాడు లేకుండా.. ఆర్టీసీలో సిటీ సర్వీసులు ఉండాలంటూ నగర పౌరులు ఎప్పటినుంచో పోరాటం చేస్తూ వచ్చారు. చివరకు మంత్రి శిద్దా రాఘవరావు హయాంలో వాటిని ఏర్పాటుచేశారు. తూర్పునాయుడుపాలెం ఎమ్మెల్యే ఇంటి వద్ద నుంచి బయల్దేరిన బస్సు గుళ్లాపల్లి గ్రోత్‌సెంటర్‌లో ఉన్న మంత్రి ఫ్యాక్టరీ వద్దకు నడిచింది. దూరం విపరీతంగా ఉండడం, కేవలం నాలుగు సర్వీసులు మాత్రమే రెండు ప్రధాన రూట్లలో తిప్పడంతో ప్రజల ఆశలకు భంగం వాటిల్లింది. దీంతో ఆదాయం తక్కువుగా ఉందంటూ కనీసం మంత్రికి కూడా తెలియకుండానే ఆర్టీసీ అధికారులు సిటీ సర్వీసులకు మంగళం పాడేయడం, అనంతరం ఆటో చార్జీలు పెరిగిపోయాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ తరువాత ఇప్పటి వరకు సిటీ బస్సుల గురించి పట్టించుకునే వారే కరువయ్యారు. ఒంగోలులో సిటీ బస్సుల ఆవశ్యకత ఎంతో ఉన్నా ప్రజాప్రతినిధులెవ్వరూ ఆ దిశగా తీసుకున్న చర్యలు శూన్యమనే చెప్పాలి. ఈ క్రమంలో అరాచకాలు స్వస్తి చెబుదాం..ప్రజాస్వామ్యానికి పట్టం కట్టుకుందాం అంటూ ప్రజల నుంచి వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అంతా ఏకపక్షమే.. ఫ్లెక్సీలు చించారనే అనుమానంపై వైఎస్సార్ సీపీ నేతలకు చెందిన పలువురు యువకులను అదుపులోనికి తీసుకొని 24 గంటల పాటు నిర్బంధించారు. కానీ ట్రంకురోడ్డులో ఫ్లెక్సీలను చించడంతో పాటు మరుసటి రోజు కార్యక్రమం జరగకుండా అడ్డుకునేందుకు యత్నిస్తున్నారని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారంటూ వైఎస్సార్ సీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదుచేసినా స్పందించలేదు. మరుసటి రోజు కేవలం కొద్దిమంది ఎలాగైనా వైఎస్సార్ సీపీ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని యత్నించడం, వారిని నిలువరించడంలో వైఫల్యం చెందిన పోలీసులు తీరా సమస్య ఉధృతరూపం దాల్చిన తరువాత కూడా వైఎస్సార్ సీపీ శ్రేణులు సంయమనం వహిస్తే చివరకు వారిపైనే కేసులు నమోదుచేసి జైలుకు పంపించిన ఘటనల పట్ల జనంలో చర్చలు నడుస్తున్నాయి. ఓట్ల చేర్పులు, మార్పులకు సంబంధించి ఫారంలు సమర్పించాలనుకుంటే వ్యక్తిగతంగా వారే హాజరుకావాలని ఆదేశాలు ఉన్నాయి. అయితే అధికార పార్టీ ఆగడాలు ఆగలేదు. చివరకు ఓ మహిళా బీఎల్ఓ అధికార పార్టీ నేత వాసు ఒత్తిడికి తట్టుకోలేక పడిపోయింది. ఈ మేరకు ఆమె తాలూకా పోలీసులకు ఫిర్యాదుచేసినా నేటికి దానిపై చర్యలు లేవు. కానీ గంపగుత్తగా దరఖాస్తులు మీవద్ద ఎందుకు ఉన్నాయంటూ వాటిని తీసుకొని ప్రశ్నించినందుకు టూటౌన్ పోలీసుస్టేషన్లో కేసు నమోదవడానికి అధికార పార్టీ ఒత్తిళ్లే పనిచేశాయని విమర్శలు నేటికి వినిపిస్తున్నాయి. డెయిరీ సర్వనాశనం.. ఒంగోలు డెయిరీ ఎవరి పాలనలో తీవ్ర సంక్షోభానికి లోనైంది, డెయిరీ పరిస్థితులను చక్కదిద్దేందుకు అధికార పార్టీ ఎందుకు చిత్తశుద్ధితో ముందుకు రాలేదు, లాభాలలో ఉన్న డెయిరీ నష్టాల బాటలో పట్టడానికి కారణాలు ఏమిటి, కారకులు ఎవరనే అంశంపై నేటికి కనీసం కమిషన్ కూడా లేకపోవడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. దీనివల్ల ఎంతమంది పాల రైతులు తమ డబ్బులు నేటికి పొందలేకపోయారంటూ చర్చించుకుంటున్నారు. -
టీడీపీ నేతల పాపాలు.. డెయిరీకి శా‘పాలు’
సాక్షి, ఒంగోలు సబర్బన్: సొంత ఆర్థిక ప్రయోజనాలే పరమావధిగా వ్యవహరించిన జిల్లా టీడీపీ నాయకులు సహకార రంగాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీశారు. అభివృద్ధి చేస్తామని చెబితే నమ్మి ఓట్లేసిన రైతులను నట్టేట ముంచారు. సహకార రంగం కుదేలవుతోందని సీఎం చంద్రబాబుకు తెలిసినా ఆయన అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. పీడీసీసీబీ, డీసీఎంస్‌లో టీడీపీ నేతల పెత్తనం కారణంగా అవి పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాయి. జిల్లాలో సహకార వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం దారుణంగా దెబ్బతీసింది. బాబు ఐదేళ్ల పాలనలో సహకార వ్యవస్థలో ఉన్న ప్రధానమైన సంస్థలన్నీ మూతపడే స్థితికి చేరాయి. సహకార సంఘాలు, సొసైటీల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇక ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. సహకార సంఘాలు బలోపేతమైతే గ్రామీణాభివృద్ధి సాధ్యమవుతుంది. కానీ అధికార టీడీపీ నాయకులు వారి వ్యాపారాల కోసం, ఆర్థిక ప్రయోజనాల కోసం సహకార వ్యవస్థను నాశనం చేశారు. కోలుకోలేని స్థితిలో ఒంగోలు డెయిరీ.. జిల్లాలో ప్రధానంగా సహకార రంగంలో ఉన్న ఒంగోలు డెయిరీని పాలక మండలి చైర్మన్‌గా వ్యవహరించిన టీడీపీ నేత చల్లా శ్రీనివాసరావు మ్యాక్స్ చట్టంలోకి మార్చి కంపెనీ యాక్టులోకి తీసుకెళ్లాడు. డెయిరీ సొమ్ము రూ.80 కోట్లు కాజేసి ఒట్టిపోయిన గేదెలా తయారు చేశాడు. దేశంలోనే ప్రకాశం జిల్లా పాలకు మంచి గిరాకీ ఉంది. దానికితోడు రాష్ట్రంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంతరించుకుంది. రోజూ ఒంగోలు డెయిరీకి 2 లక్షల లీటర్ల పాలు వచ్చేవంటే జిల్లాలో పాడి పరిశ్రమ ఏ విధంగా అభివృద్ది చెందిందో అర్థమవుతుంది. అలాంటి డెయిరీని రూ.80 కోట్లకు పైగా అప్పుల్లోకి కూరుకుపోయేట్టు చేసింది టీడీపీ నాయకులతో కూడిన పాలకమండలి. సుదీర్ఘ కాలం చైర్మన్‌గా ఉన్న చల్లా శ్రీనివాసరావు తన సొంత నిధుల మాదిరిగా డెయిరీ డబ్బును ఖర్చు చేసి చివరకు మూతపడే స్థితికి తీసుకెళ్లాడు. పాలు పోసిన రైతులకు నేటికీ డబ్బు ఇవ్వలేదు. పాలు రవాణా చేసిన ట్రాన్స్పోర్ట్దారులకు కిరాయిలు ఎగ్గొట్టారు. బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు కట్టలేదు. ఫెడరేషన్ నుంచి రూ.35 కోట్లు అప్పు తీసుకుని తిరగి గాడిలో పెడదామన్నా అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఉద్యోగులకు వేతనం ఇవ్వకపోవడంతో డెయిరీ నిర్వహణే ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం అధికారులతో కూడిన పాలక మండలి కూడా డెయిరీకి పూర్వ వైభవం తీసుకురావడానికి ఆసక్తి చూపడం లేదు. రైతులకు ఉపయోగపడని పీడీసీసీబీ ప్రకాశం జిల్లా కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్(పీడీసీసీబీ) పూర్తి స్థాయిలో రైతులకు ఉపయోగ పడే పరిస్థితిలో లేకుండా పోయింది. ఈ బ్యాంకు పరిధిలో 169 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఉన్నాయి. అవన్నీ ఉత్సవ విగ్రహాల్లా ఉండిపోయాయి తప్పితే వ్యవసాయ రుణాలు ఇచ్చే పరిస్థితిలో లేవు. అసలే ఐదేళ్లుగా వర్షాలు లేక కరువుతో అల్లాడుతున్నా కనీసం ఆరుతడి పంటలకు కూడా పంట రుణాలు ఇచ్చే పరిస్థితి పీడీసీసీ బ్యాంకుకు లేదు. ఎందుకంటే ప్రభుత్వం బ్యాంకుకు సంబంధించిన నిధులు బడా బాబులకు అప్పనంగా ఇచ్చి బ్యాంకును నష్టాల్లోకి నెట్టారు. ♦ పీడీసీసీ బ్యాంకు నుంచి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంవత్సరాల క్రితం స్వయానా ప్రభుత్వమే హామీగా ఉండి ఇంకొల్లు స్పిన్నింగ్ మిల్లుకు కోట్లాది రూపాయలు అప్పుగా ఇప్పించింది. తర్వాత కాలంలో చంద్రబాబునాయుడి దెబ్బకు స్పిన్నింగ్ మిల్లు మూత పడింది. అయితే ఇచ్చిన అప్పును తిరిగి పీడీసీసీ బ్యాంకుకు ఇప్పించాల్సిన ప్రభుత్వం నేటికీ దాని ఊసే పట్టించుకోలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా బ్యాంకుకు దాదాపు రూ.11 కోట్లు మొండి బకాయి కింద ఉండిపోయింది. ♦ అదే విధంగా ముఖ్యమంత్రి సామాజికవర్గానికే చెందిన పీడీసీసీ బ్యాంక్ పాలక మండలి మాజీ చైర్మన్ తన కుటుంబ సభ్యుల పేరుతో, తారకరామ డెయిరీ పేరుతో రూ.4 కోట్లు రుణం తీసుకున్నాడు. అది కాస్తా వడ్డీ పెరిగి రూ.7 కోట్లు అయింది. ఆ బాకీ వసూలు ఊసే లేదు. ♦ బ్యాంకులో నకిలీ ఆభరణాలు పెట్టి రూ.2.50 కోట్లు రుణంగా తీసుకున్నారు. రెండేళ్ల క్రితం ఆ కుంభకోణం కేసులో కొందరిపై చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం ఒక కమిటీని వేసింది. 4,500 పేజీల నివేదిక ప్రభుత్వానికి చేరింది. ఆ కుంభకోణం తాలూకు నిధులు ఇప్పటికీ రికవరీ కాలేదు. ♦ జిల్లాలో 169 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల(పీఏసీఎస్) నుంచి రైతులు ప్రయోజనం పొందాల్సి ఉంటే వాటి ఊసే లేదు. కానీ వారోత్సవాల పేరిట రోజుకు రెండు పీఏసీఎస్‌లలో రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. వాటి వల్ల రైతులకు ఒరగింది మాత్రం శూన్యం. అప్పుల కుప్ప డీసీఎంఎస్ జిల్లా కో ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) పరిస్థితి కూడా అంతే. రైతులకు సంబంధించిన వ్యాపారాలు చేసి తద్వారా వచ్చే లాభాలను రైతు ప్రయోజనాలకు వినియోగించాల్సిన డీసీఎంఎస్ అందుకు భిన్నంగా వ్యవహరించింది పాలకమండలి తీరుతో డీసీఎంఎస్ అప్పుల ఊబిలోకి వెళ్లిపోయింది. పాలక మండలి సభ్యులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం, విలాసవంతమైన జీవితం గడపడం కోసం రూ.13 కోట్లకు పైగా వెచ్చించి సినిమా వ్యాపారం చేశారు. లాభం వచ్చినా కూడా నష్టాలొచ్చాయని చెప్పి చివరకు అప్పు చూపించారు. ఈ నిర్వాకానికి కారణం గతంలో డీసీఎంఎస్ చైర్మన్‌గా ఉన్న చిడిపోతు సుబ్బారావు. ఈయన కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావుకు సమీప బంధువు. అతని స్వార్థానికి డీసీఎంఎస్ నిలువునా బలైపోయింది. ఈ తతంగమంతా జిల్లా సహకార శాఖ అధికారులకు తెలిసినా కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. ఎందుకంటే అధికారులను కూడా వారి విధులు వారు నిర్వర్తించకుండా టీడీపీ నేతలు పెత్తనం చేశారు. -
మంత్రి శిద్దా ఇంటి ముందు డెయిరీ బాధితుల నిరసన
ఒంగోలు సబర్బన్: ఒంగోలు డెయిరీ బాధితులైన పాడి రైతులు, డెయిరీ ఉద్యోగులు, పాలు సరఫరా చేసిన ట్రాన్స్పోర్టర్స్ రాష్ట్ర పర్యావరణ, అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి శిద్దా రాఘవరావు ఇంటి ముందు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన మంత్రి శిద్దా రెండు రోజుల నుంచి దాటవేత ధోరణితో వ్యవహరించటంతో సహనం కోల్పోయిన బాధితులు మంత్రి ఇంటి ముందు బైఠాయించారు. శాంతియుతంగా, సామరస్య పూర్వకంగా నిరసన చేయాలని నిర్ణయించిన బాధితులు మంత్రి ఇంటి రోడ్డులో ఖాళీగా ఉన్న స్థలంలో బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. డెయిరీ బాధితులు చేపట్టిన నిరసనకు రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి శిరిగిరి లలిత సంఘీభావం ప్రకటించారు. అధికార తెలుగుదేశం హయాంలో జిల్లాలోని సహకార సంఘాలను నిలువునా నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. అందులో మొదటిది ఒంగోలు డెయిరీ అన్నారు. కోట్ల రూపాయలు దోచుకోవటానికి సహకార సంఘాల్లో ఉన్న డెయిరీని కంపెనీ చట్టంలోకి తెచ్చి నిలువునా పాడి రైతులను, ఉద్యోగులను మోసం చేశారన్నారు. పొందూరు సహకార సొసైటీ అధ్యక్షుడు వేజెండ్ల రామారావు మాట్లాడుతూ మంత్రి హామీ ఇచ్చి కాలయాపన చేస్తున్నారన్నారు. రెండు రోజుల్లో వచ్చి డైరెక్టర్ల చేత రాజీనామా చేయిస్తానన్న మంత్రి రెండు రోజులుగా తిరుగుతున్నా పట్టించుకోకుండా మళ్లీ పది రోజులని చెప్పి వెళ్లిపోవటం దారుణమని, అందుకే ఆయన ఇంటి ముందు నిరసన వ్యక్తం చేస్తున్నామని పేర్కొన్నారు. నాగులుప్పలపాడుకు చెందిన పాడి రైతు చుండూరి శ్రీరామమూర్తి మాట్లాడుతూ నెలల తరబడి గొడవలు లేకుండా పోరాటం చేస్తున్నామని అన్నారు. రైతులకు మేలు చేస్తానని చెబుతున్న ముఖ్యమంత్రి ఒంగోలు డెయిరీని నిలువునా మోసం చేశారని ధ్వజమెత్తారు. డెయిరీ పాలకమండలి చేసిన అవినీతి, అక్రమాల వల్ల డెయిరీలో పూర్తిగా నష్టపోయింది తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, అభిమానులేనని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు డెయిరీలో ఉద్యోగులు కూడా పార్టీవాళ్లేనని వాపోయారు. ఒంగోలు డెయిరీ పాలు రాష్ట్రంలోనే నాణ్యమైనవని డెయిరీ మహిళా ఉద్యోగులు వివరించారు. ప్రతి రోజూ 1.70 లక్షల లీటర్లు వచ్చే పాలు నేడు రోజుకు 700 లీటర్లకు దిగజారిపోయిందంటే పరిస్థితి ఎంతటి దారుణంగా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. గుట్టుగా డెయిరీలో ఉద్యోగాలు చేసుకోవాల్సిన తాము చెట్ల కింద కూర్చొని తమ గోడు వెళ్లబోసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. శిబిరం వద్దకు మంత్రి శిద్దా... మంత్రి ఇంటి ముందు డెయిరీ బాధితులు నిరసన వ్యక్తం చేస్తున్నారని సమాచారం తెలుసుకున్న మంత్రి శిద్దా రాఘవరావు నగరంలోని పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లి వెంటనే హుటాహుటిన ఇంటి వద్దకు చేరుకున్నారు. నిరసన వ్యక్తం చేస్తున్న డెయిరీ బాధితులతో చర్చించారు. పది రోజుల్లో సమస్య పరిష్కరించేందుకు పూనుకుంటానని చెప్పాను కదా ఇంటి ముందు నిరసన ఏమిటని మండిపడ్డారు. దీంతో పాడి రైతులు, డెయిరీ ఉద్యోగులు నెలల తరబడి సమస్యను సాగదీస్తున్నారని, డెయిరీ మూత పడే పరిస్థితికి చేరుకుందన్నారు. ఒంగోలు ఎమ్మెల్యే వద్దకు వెళితే మండిపడుతున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కొండ్రగుంటపై మండిపడిన మంత్రి: తెలుగుదేశం పార్టీ రైతు విభాగం మాజీ జిల్లా అధ్యక్షుడు కొండ్రగుంట వెంకయ్య డెయిరీలో పాడి రైతులు, ఉద్యోగులు పడుతున్న బాధులు గురించి చెబుతున్నప్పుడు మంత్రి శిద్దా రాఘవరావు ఆయనపై మండిపడ్డారు. డెయిరీ వల్ల పూర్తిగా టీడీపీకి చెందిన వారే పూర్తిగా నష్టపోయారని వాపోయారు. డెయిరీ వల్ల తెలుగుదేశం పార్టీకి పూర్తిగా చెడ్డపేరు వస్తుందని అనటంతో మంత్రికి కోపం వచ్చింది. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఇంట్లోకి రాండి మాట్లాడుకుందామని మంత్రి లోపలకు వెళ్లారు. మంత్రి ఇంటికి వెళ్లకుండా నిరసన దీక్ష వద్దే నిరసనకారులు భీష్మించుకు కూర్చున్నారు. ఇవరూ ఇంట్లోకి రాకపోవటంతో మంత్రే నడుచుకుంటూ తిరిగి నిరసన శిబిరం వద్దకు వచ్చారు. నిరసనకారులతో మాట్లాడుతూ జిల్లా ఇన్చార్జ్ మంత్రి నారాయణతోనూ, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధనరావుతోనూ చర్చించి శనివారం ముఖ్యమంత్రితో డెయిరీ విషయం మాట్లాడతామని వివరించారు. ఆదివారం కొందరు ముఖ్యులు వస్తే డెయిరీ సమస్యపై లోతుగా ఆలోచన చేద్దామని హామీ ఇవ్వటంతో నిరసన విరమించారు. -
చేతగాకపోతే దిగిపో..!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు డెయిరీ చైర్మన్ శిద్దా వెంకటేశ్వరరావు డెయిరీకి రాకపోవడం, మౌనం వీడకపోవడంతో డెయిరీ కష్టాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పాడి రైతులు, ఉద్యోగుల్లో ఆందోళన అధికమవుతోంది. చేతనైతే డెయిరీని ఆదుకోవాలి.. లేకపోతే పదవికి రాజీనామా చేయాలంటూ ఇటు పాడి రైతులు, అటు ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. శిద్దా మౌనం డెయిరీని మరింత ఊబిలోకి నెడుతోంది. తక్షణం బోర్డు మీటింగ్ నిర్వహించాలంటూ మంగళవారం ఉద్యోగులు, పాడి రైతులు ఎండీపై ఒత్తిడి పెంచారు. బుధవారం బోర్డు మీటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. బోర్డు మీటింగ్ నిర్వహించాలంటూ ఒకరోజు ముందస్తుగా డైరెక్టర్లతో పాటు అందరికీ నోటీసులివ్వాల్సి ఉంది. నోటీసులపై చైర్మన్ శిద్దా సంతకాలు చేయాల్సి ఉంది. ఇదే విషయంపై మాట్లాడేందుకు ఎండీ ప్రయత్నించినా చైర్మన్ శిద్దా వెంకటేశ్వరరావు అందుబాటులో లేరు. ఆయన ఫోన్లో ఎవరికీ పలికే పరిస్థితి లేదు. మంగళవారం శిద్దా స్పందించకపోవడంతో బుధవారం బోర్డు మీటింగ్ జరిగే పరిస్థితి లేదు. మంగళవారం సైతం డైరెక్టర్ స్వయాన శిద్దా వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్లారు. బోర్డు సమావేశం సంగతి తేల్చమని కోరినట్లు సమాచారం. అయితే, ఆ వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఆలస్యం కావడంతో నోటీసులు మంగళవారం అందించే పరిస్థితి లేదు. బోర్డు మీటింగ్‌కు చైర్మన్ శిద్దా అంగీకరించే పక్షంలో బుధవారం అందరికీ నోటీసులు అందజేస్తే గురువారం బోర్డు మీటింగ్ జరిగే అవకాశం ఉంటుంది. డెయిరీకి ఉపయోగపడనప్పుడు శిద్దాను చైర్మన్‌గా ఎందుకు ఎన్నుకున్నారంటూ పాడి రైతులు, ఉద్యోగులు నిలదీయడంతో డైరెక్టర్ల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. శిద్దాను చైర్మన్‌గా ఎన్నుకుని మోసపోయామని పలువురు డైరెక్టర్లు రైతులు, ఉద్యోగుల వద్ద సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వస్తోంది. సీఎం చెబితేనే చైర్మన్‌గా కొనసాగుతానంటూ శిద్దా అడ్డం తిరగడంపై డైరెక్టర్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. నాడు శిద్దాను డైరెక్టర్లే చైర్మన్‌గా ఎన్నుకున్నారు. ఆ రోజు సీఎం, మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎవ్వరూ లేరు. నాడు చైర్మన్‌గా అంగీకారం తెలిపిన శిద్దా.. ఇవాళ ముఖ్యమంత్రి చెబితేనే చైర్మన్‌గా కొనసాగుతానని మెలిక పెట్టడాన్ని వీరు జీర్ణించుకోలేకున్నారు. రూ.20 కోట్లు డబ్బులిచ్చి ఆదుకుంటానంటేనే డైరెక్టర్లు, పాలకవర్గం శిద్దాను చైర్మన్‌గా ఎన్నుకుంది. డెయిరీని నడిపిస్తే తర్వాత చూసుకోవచ్చని అందరూ భావించారు. అయితే, శిద్దా ఇప్పుడు అడ్డం తిరగడంతో అందరూ దోషులుగా మిగిలారు. ఈ పరిస్థితుల్లో శిద్దాను రాజీనామా చేయించడమే మేలని పాలకవర్గం భావిస్తున్నట్లు తెలుస్తోంది. సహకార పరిధిలోకి డెయిరీ... మరోవైపు డెయిరీని సహకార పరిధిలోకి తీసుకొస్తేనే ప్రభుత్వం సహకరిస్తుందని ఇప్పటికే ఉద్యోగులు, పాడి రైతులకు జిల్లా కలెక్టర్ చెప్పినట్లు సమాచారం. మొదట పాలకవర్గాన్ని ఏర్పాటు చేసి డెయిరీని సహకార యాక్టులోకి మార్చేందుకు తీర్మానం చేయాలని, ఆ తర్వాత ప్రభుత్వం డెయిరీని సహకార పరిధిలోకి తీసుకువస్తుందని ఇప్పటికే ఉన్నతాధికారులు సైతం సూచించినట్లు తెలుస్తోంది. దీంతో అధికార పార్టీ నేతలు, డెయిరీ పాలకవర్గం డెయిరీని సహకార పరిధిలోకి మార్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. పాలకవర్గ తీర్మానం అనంతరం చైర్మన్ శిద్దా వెంకటేశ్వరరావుతో రాజీనామా చేయించాలని అధికార పార్టీ నేతలు సైతం నిర్ణయించినట్లు తెలుస్తోంది. సహకార పరిధిలోకి రాకుండా డెయిరీ విషయాన్ని ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి కనిపించటం లేదని, ముందు యాక్టు మారిస్తేనే డెయిరీ విషయాన్ని పరిశీలిస్తామని జిల్లా ఉన్నతాధికారులు సైతం ఉద్యోగులు, రైతు నేతలకు స్పష్టం చేసినట్లు సమాచారం. -
ఇక్కట్ల ‘పాలు’
ఒంగోలు డెయిరీ..పాడి పరిశ్రమే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ప్రకాశం జిల్లా రైతులకు కొన్నేళ్ల పాటు ఆదరువుగా ఉన్న సహకార సంస్థ. రైతుల సంక్షేమానికి తోడ్పడుతూ లాభాల బాటలో పయనిస్తున్న డెయిరీని కో ఆపరేటివ్ సొసైటీ నుంచి కంపెనీ యాక్టులోకి మార్చి పథకం ప్రకారం క్రమంగా నిర్వీర్యం చేశారు. పాలకవర్గం, అధికార పార్టీ నేతల స్వార్థ ప్రయోజనాల కోసం వేలాది మంది రైతుల సంక్షేమాన్ని, ఉద్యోగుల జీవితాలను పణంగా పెట్టారు. డెయిరీ నిధులు పక్కదారి పట్టించి దుబారాగా ఖర్చు చేసి.. ఆర్ధిక క్రమశిక్షణ పాటించకుండా నష్టాల ఊబిలోకి నెట్టారు. ఏడాదిగా పాలుపోసిన రైతులకు, ఆరు నెలలుగా ఉద్యోగులకు బకాయిలు చెల్లించకుండా వారిని ఇక్కట్లపాలు చేశారు. బకాయిల కోసం ఎన్ని ఆందోళనలు చేసినా పాలకవర్గానికి, ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదు. అప్పుల బాధతో మనోవేదనకు గురై ఓ పాల ఏజెంట్ గుండెపోటుతో మృతిచెందగా.. పాడి రైతులు, ఉద్యోగుల కుటుంబాల వెతలు అయితే వర్ణనాతీతం. ఒంగోలు టూటౌన్/యర్రగొండపాలెం: ప్రకాశం జిల్లాలో ఒంగోలు డెయిరీ పరిధిలో దాదాపు 450 వరకు పాల సొసైటీలు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 30 వేల మంది వరకు పాలరైతులు ఉన్నారు. వీరంతా పాడినే నమ్ముకుని డెయిరీకి గత కొన్నేళ్లుగా పాలు పోస్తూ వస్తున్నారు. పాడి మీద ఆధారిపడి కుటుంబాన్ని పోషించుకుంటూ పిల్లలను చదివించుకుంటున్నారు. వీరికి ఏడాది కాలంగా డెయిరీ రూ.12 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఒక్కసారిగా పాల బకాయిలు ఆగిపోవడంతో ఆయా రైతుల కుటుంబాల ఆర్థిక పరిస్థితి తల్లకిందులైంది. నేటికీ పాల రైతులు తమ బకాయిలు చెల్లించాలని ఆందోళనలు, రాస్తారోకోలు చేస్తున్నారు. డెయిరీ చైర్మన్‌ను ముట్టడించారు. ఆయన గదికి, డెయిరీ ఎండీ గదికి తాళాలు వేసి మరీ నిరసన తెలిపారు. అర్ధరాత్రి అని కూడా చూడకుండా ఆందోళనలు చేశారు. దీంతో సమస్య ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి వెళ్లింది. అయినా నేటికీ సమస్య పరిష్కారం కాలేదు. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి ఒంగోలు డెయిరీపై మాట్లాడతారని అందరూ ఆశగా ఎదురు చూసినా నిరాశే మిగిలింది. నిలిచిన గేదెల కొనుగోలు రుణాలు పాలరైతులతో పాటు ఒంగోలు డెయిరీ ద్వారా పాడి గేదెల రుణాలు తీసుకున్న రైతులు నాలుగు విధాలుగా చెడాల్సి వచ్చింది. ఒంగోలు విజయ బ్యాంకు ద్వారా పాడిగేదేల రుణాలు పొందిన రైతులు తొలివిడతగా ఒక గేదె తీసుకున్నారు. డెయిరీకి మాత్రం క్రమం తప్పకుండా పాలు పోస్తూ వచ్చారు. అలా పోసిన పాలలో బ్యాంకుకు చెల్లించాల్సిన బకాయి డబ్బులు డెయిరీ మినహాయించుకుని బ్యాంకుకు చెల్లించలేదు. దీంతో బ్యాంక్ రెండో గేదె ఇవ్వడం ఆపేసింది. దీనిపై కూడా రైతులు పలుమార్లు పాత చైర్మన్ చల్లా శ్రీనివాసరావును నిలదీయడంతో ‘‘రేపు, ఎల్లుండి, వచ్చే వారం చెల్లిస్తాం’’ అంటూ మభ్యపెడుతూ వచ్చారు. చివరకు నట్టేట ముంచారు. ప్రస్తుతం పాడి గేదెల రుణాలు తీసుకున్న రైతులు కుటుంబపోషణ కోసం ఉపాధి హామీ పథకం పనులకు పోతున్నారు. వీరికి వచ్చే కూలీ డబ్బులను బ్యాంకు మేనేజర్ అప్పు కింద జమ చేసుకుండటంతో చాలా మంది రైతులు ఖంగుతిన్నారు. చేసేదేమీ లేక అసలు ఉపాధి హామీ పనికే పోవడం మానుకున్నారని టంగుటూరు మండలం పొందూరు పాల కేంద్రం సొసైటీ అధ్యక్షడు రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. పేరుకుపోతున్న ఉద్యోగుల వేతన బకాయిలు ఉద్యోగుల వేతన బకాయిలు నెలనెలకూ కొండలా పేరుకుపోతున్నాయి. నెలకు రూ.45 లక్షల నుంచి రూ.50 లక్షల చొప్పున ఆరు నెలల వేతనం రూ.3 కోట్ల వరకు ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంది. విద్యుత్ బకాయిలు, ట్రాన్స్‌పోర్టు బకాయిలు ఇలా అన్ని పెండింగ్‌లోనే ఉన్నాయి. పరిస్థితి రోజురోజుకూ ఆందోళన కలిగిస్తుండటంతో ఏం చేయాలో తెలియక ఉద్యోగులు కలవరపడుతున్నారు. పాత చైర్మన్, కొత్త చైర్మన్ ఇద్దరూ డెయిరీ గురించి పట్టించుకోవడం లేదు. అటు వైపు కన్నెత్తి చూడటం లేదు. ప్రభుత్వం కూడా దీనిపై ఎక్కడా స్పందించడం లేదు. ఆది నుంచి టీడీపీ నాయకుల చేతుల్లోనే.. డెయిరీ స్థాపించినప్పటి నుంచి పాలకవర్గం ఎక్కువ కాలం టీడీపీ నాయకుల చేతుల్లోనే ఉంది. ప్రశ్నించే వారు లేకనే విలాసాలకు, విందులకు ఇష్టారాజ్యంగా డెయిరీ సొమ్మును ఖర్చు చేశారని పాల కేంద్రం సొసైటీ ప్రెసిడెంట్లు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు. మొత్తం మీద డెయిరీ బకాయిలు 43 కోట్ల రూపాయలు ఉన్నట్లు గత డిసెంబర్లో నిర్వహించిన పాలకవర్గ సమావేశంలో తేల్చారు. కానీ వాస్తవంగా రూ.80 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయని ఉద్యోగులు, పాలరైతులు బల్లగుద్ది చెబుతున్నారు. ప్రస్తుతం డెయిరీ పరిస్థితి చుక్కాని లేని నావలా తయారైంది. ఇప్పటి వరకు చేసిన అప్పులు చెల్లించకపోవడంతో కొత్త అప్పులు పుట్టడం లేదు. అటు ఉద్యోగులు, ఇటు పాల రైతుల కుటుంబాలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి తీసుకువచ్చారు. పాల కేంద్రం మూత యర్రగొండపాలెంలోని ప్రభుత్వ పాల కేంద్రం మూతవేసి దాదాపు 7 నెలలు కావస్తున్నప్పటికీ జిల్లా అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. దీంతో పాల ఉత్పత్తిదారులు ఆందోళనకు గురవుతున్నారు. పాల ఉత్పత్తిదారులకు ఇవ్వాల్సిన రూ.1.30 కోట్ల బకాయిల గురించి ఎవరూ నోరు మెదపడంలేదు. రెండు రోజుల్లో పాలకేంద్రాన్ని తెరుస్తామని, పశుపోషకుల నుంచి పాలను సేకరించే కార్యక్రమాన్ని చేపడతామని స్థానికంగా కేంద్రంలో ఉండే కింది స్థాయి ఉద్యోగులు చెబుతున్నారు. ఈ పాలకేంద్రం పరిధిలో 6 మండలాల నుంచి పాలు దిగుమతి చేసుకుంటున్నారు. 2,500 మంది ఉత్పత్తిదారులు ఉండే ఈ కేంద్రంలో 100 మంది పాలసేకరణ కార్యదర్శులు పనిచేస్తున్నారు. రోజుకు 7 వేల లీటర్ల మేర పాలు సేకరించే సామర్థ్యం ఉన్న ఈ కేంద్రం గత ఏడాది జూన్ నుంచి 550 లీటర్లకు పడిపోయింది. పాలుపోసిన డబ్బులియ్యలా.. ఒంగోలు డెయిరీకి పాలు పోస్తున్నాం. ఆరు నెలలుగా రూ.8200 పాలబాకీ అందాల్సి ఉంది. అడిగినప్పుడల్లా అదిగో ఇస్తాం..ఇదిగో ఇస్తామని చెప్తున్నారేగానీ ఇచ్చింది లేదు. వర్షాలు లేక కరువుతో ఇబ్బంది పడుతున్నాం. గ్రాసం కొని మేపుకోవటానికి చేతిలో చిల్లిగవ్వ లేదు. నాలాగే ఎంతో మంది పాడి రైతులు డెయిరీ నుంచి డబ్బులు రాక ఇబ్బంది పడుతున్నారు. – పాశం రమ, జమ్ములపాలెం, టంగుటూరు మండలం డెయిరీ నుంచి బకాయి రూ.1.40 లక్షలు రావాలి ఒంగోలు డెయిరీకి 18 సంవత్సరాలుగా పాలు పట్టి పంపుతున్నా. రూ.1.40 లక్షల వరకు బిల్లులు రావాల్సి ఉంది. ఈ ప్రాంతంలో ఏజంట్లకు భారీగా డెయిరీ నుంచి డబ్బులు రావాలి. పాడి రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించలేక ఆందోళన చెందుతున్నారు. బిల్లులు వెంటనే అందించి రైతులను, ఏజంట్లను ఆదుకోవాలి. – గల్లా కుమార్, డెయిరీ ఏజంట్, విశ్వనాథపురం, త్రిపురాంతకం మండలం -
నాన్చుడో.. తేల్చుడో..!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు డెయిరీ వివాదం రోజురోజుకూ ముదురుతోంది. నెలరోజుల క్రితం డెయిరీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన శిద్దా వెంకటేశ్వరరావు పట్టుమని పది రోజులు కూడా సీట్లో కూర్చోకుండానే పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఈ నెల 17 ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమర్పించారు. సీఎం ఓకే అంటేనే చైర్మన్‌గా కొనసాగుతానని వద్దంటే రాజీనామా ఆమోదించాలని శిద్దా బంతిని సీఎం కోర్టుకు నెట్టారు. ఇక సీఎం నిర్ణయమే తరువాయి. అయితే డెయిరీ విషయం మళ్లీ మాట్లాడదామని చైర్మన్ శిద్దాతో చెప్పిన ముఖ్యమంత్రి ఆ తరువాత వీరిని పిలవలేదు. ఒకటి రెండుమార్లు జిల్లా మంత్రి శిద్దా రాఘవరావు, ఇన్చార్జ్ మంత్రి నారాయణతో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌లు సమావేశమై డెయిరీ విషయం చర్చించారు. ముఖ్యమంత్రితో మాట్లాడి ఆయన సూచన మేరకు తరుపరి నిర్ణయం తీసుకుందామని మంత్రులు శిద్దా,నారాయణ, జనార్దన్‌లు చైర్మన్ శిద్దాకు చెబుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఎప్పుడు స్పందిస్తారో తెలియని పరిస్థితి. ఇంట్లో చిచ్చుకు యత్నం.. మంత్రి శిద్దా రాఘవరావుకు తెలియకుండానే ఆయన సమీప బంధువైన వెంకటేశ్వరరాను రాత్రికి రాత్రే చైర్మన్ చేయడం వివాదంగా మారింది. దీని వెనుక టీడీపీకి చెందిన ముఖ్యనేతతో పాటు మరికొందరు నేతల ప్రమేయమున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇదే విషయాన్ని జిల్లాలకు చెందిన కొందరు టీడీపీ నేతలు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. మరోవైపు మంత్రి శిద్దా సైతం తనకు తెలియకుండా తన కుటుంబ సభ్యుడిని చైర్మన్ చేసి తన కుటుంబంలో విబేధాలు సృష్టించే ప్రయత్నం చేయడంపై ముఖ్యమంత్రి వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో ముఖ్యమంత్రి పాత, కొత్త చైర్లన్లపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇన్ని గొడవల నేపథ్యంలో డెయిరీ కొత్త చైర్మన్ విషయం ముఖ్యమంత్రి ఇప్పట్లో తేల్చే పరిస్థితి కనిపించడం లేదు. పైగా వెంకటేశ్వరరావును చైర్మన్ గా ముఖ్యమంత్రి ఆమో పరిస్థితి లేదన్నది స్పష్టం. ఆయన రాజీనామాను ఆమోదించకుండా.. విషయాన్ని ఎటూ తేల్చకుండా ముఖ్యమంత్రి నాన్చుడు ధోరణి అవలంబించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అడకత్తెరలో పోకచెక్క.. డెయిరీ చైర్మన్ వెంకటేశ్వరరావు పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. పాత చైర్మన్ చల్లా శ్రీనివాసరావు ప్రోద్భలంతో శిద్దా కొత్త చైర్మన్‌గా ఎన్నికయ్యారు. రూ.20 కోట్లు సొంత డబ్బులు ఇచ్చి డైరీని ముందుకు నడిపిస్తానన్నారు. ఈ పరిస్థితిలో ఎవరో ఒకరు డెయిరీని నడిపిస్తే చాలని భావించిన పాలకవర్గం, ఉద్యోగ, రైతు సంఘాలు శిద్దాను చైర్మన్‌గా ఆమోదించాయి. తమకు తెలియకుండానే డెయిరీ చైర్మన్‌గా శిద్దా వెంకటేశ్వరరావును ఎలా ఎన్ను కుంటారంటూ అధికార పార్టీలోని ఓ వర్గం సీఎంకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం రచ్చకెక్కింది. డెయిరీకి చైర్మన్ డుమ్మా..: ముఖ్యమంత్రి ఎటూ తేల్చక పోవడంతో డెయిరీకి రూ. 20 కోట్లు ఇస్తానన్న చైర్మన్ పైసా ఇవ్వలేదు. తన సొంత డబ్బులు ఇచ్చేది లేదని, బ్యాంకు రుణమొస్తేనే ఇస్తానని మాటమార్చారు. ఆ తరువాత ముఖ్యమంత్రి ఓకే అంటేనే చైర్మన్‌గా ఉంటానని లేకపోతే లేదని ప్రకటించారు. తాజాగా ముఖ్యమంత్రికి ఈ నెల 17నే రాజీనామా లేఖను ఇచ్చినట్లు వెల్లడించారు. చైర్మన్ డెయిరీకి రాకపోవడం, ఉద్యోగులు, రైతుల బకాయిలు చెల్లించే పరిస్థితి లేకపోవడంతో ఆ వర్గాల్లో ఆందోళన మొదలైంది. మళ్లీ ఆందోళనకు సిద్ధం... ఒంగోలు డెయిరీ పరిధిలో పాడి రైతులకు రూ.13 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఉద్యోగుల 5 నెలల జీతాలు రూ.2.5 కోట్లు, పీఆర్సీ అరియన్స్, గ్రాడ్యూటీ, ఎల్ఐసీ డబ్బులు కలిపితే మొత్తం రూ.8 కోట్లు ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంది. కరెంట్ బిల్లులు రూ.2 కోట్లు, ట్రాన్స్‌పోర్టేషన్ రూ.2 కోట్లు చెల్లించాలి. ఇప్పటికే ఉద్యోగులు, రైతు సంఘాలు మంత్రి శిద్దా, టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్, ఎమ్మెల్సీ కరణం బలరాం తదితర నేతలను కలిసినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో సోమవారం కలెక్టర్‌ను కలిసి విన్నవించి మరోమారు ఆందోళనకు దిగేందుకు ఉద్యోగులు, రైతులు సిద్ధమౌతున్నారు. -
‘వెంకటేశ్వరా’.. ఎక్కడున్నావయ్యా!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: లక్షలాది మంది పాడి రైతులు.. వందల మంది ఉద్యోగులతో ఒంగోలు డెయిరీ ఆటలాడుకుంటోంది. పాలకులకు వీరి ఆకలి కేకలు వినపడటంలేదు. వ్యాపారి అయిన శిద్దా వెంకటేశ్వరరావు డెయిరీ చైర్మన్ కావడంతో మంచి జరుగుతుందని అంతా భావించారు. కానీ ఇప్పుడు అసలు కథ బట్టబయలైంది. పాడి రైతులు, డెయిరీ ఉద్యోగుల బకాయిల కింద తన సొంత డబ్బులు పైసా కూడా ఇవ్వవని శిద్దా వెంకటేశ్వరరావు చేతులెత్తేశారు. బ్యాంకు రుణం కోసం డెయిరీ ఆస్తులు తాకట్టు పెడతానని.. రుణం వస్తేనే బకాయిలు చెల్లిస్తానని తేల్చి చెప్పారు. ఇక చంద్రబాబు చెబితేనే డెయిరీకి వస్తానన్నారు. ఆర్భాట ప్రకటనలు ఎక్కడ? నెల రోజుల క్రితం ఒంగోలు డెయిరీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన శిద్దా వెంకటేశ్వరరావు డెయిరీలో ఆర్భాటంగా విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఒంగోలు డెయిరీని ఉద్ధరించడానికే తానొచ్చినట్లు ప్రకటించుకున్నారు. రూ. 20 కోట్లు తన సొంత డబ్బులు పాడి రైతులు, డెయిరీ ఉద్యోగులకు చెల్లిస్తానన్నారు. బ్యాంకు రుణం వచ్చిన తర్వాతనే రూ. 1 ధర్మవడ్డీతో తన అప్పు తిరిగి తీసుకుంటానని స్పష్టం చేశారు. అయితే పట్టుమని నెల కాక ముందే మాట మార్చారు. తన సొంత డబ్బులు రూపాయి కూడా ఇవ్వనని స్పష్టం చేశారు. దీంతో పాడి రైతులు, ఉద్యోగులు మరోమారు రోడ్డెక్కారు. రూ. 13 కోట్ల బకాయిలు ఒంగోలు డెయిరీ పరిధిలో పాడి రైతులకు రూ. 13 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఉద్యోగుల 5 నెలల జీతాలు రూ. 2.5 కోట్లు, పీఆర్సీ అరియన్స్, గ్రాడ్యూటీ, ఎల్ఐసీ కలిపితే మొత్తం రూ. 8 కోట్లు ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంది. కరెంట్ బిల్లులు రూ.2 కోట్లు, ట్రాన్స్‌పోర్టేషన్ కోసం రూ. 2 కోట్లు చెల్లించాలి. కరెంట్ బిల్లులు చెల్లించే పరిస్థితి లేకపోవడంతో వారం క్రితం విద్యుత్ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. కొత్త డెయిరీ చైర్మన్ పైసా ఇవ్వక ఇంటికే పరిమితం కావడంతో ఇటు ఉద్యోగులు, రైతులు కలిసి మంత్రి శిద్దా రాఘవరావుతో పాటు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఎమ్మెల్సీ కరణం బలరాం తదితరులను కలిశారు. డెయిరీ ఆధ్వాన పరిస్థితిపై ఏకరువు పెట్టారు. కొత్త చైర్మన్ వచ్చినా ఒరిగిందేమీ లేదంటూ ఆవేదన చెందారు. దీంతో మంత్రి శిద్దా జోక్యం చేసుకొని విద్యుత్ అధికారులతో మాట్లాడారు. వారం లోపు డబ్బు చెల్లించాలన్న కండిషన్‌తో విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. డెయిరీ సమస్యలు నాలుగు రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయితే సమస్య పరిష్కారం కాలేదు. ఏ నిమిషంలోనైనా తిరిగి విద్యుత్‌ను నిలిపివేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఇంత జరుగుతున్న కొత్త చైర్మన్ శిద్దా వెంకటేశ్వరరావు ఏ మాత్రం స్పందించటం లేదు. రైతులు, ఉద్యోగులు కలిసే ప్రయత్నం చేసినా ఆయన అందుబాటులోకి రావడం లేదు. డెయిరీ ఎండీ ఫోన్ చేసినా చైర్మన్ స్పందించలేదని తెలిసింది. దీంతో ఉద్యోగులు, రైతులు కలిసి సోమవారం డెయిరీ వద్ద ఒంగోలు–కర్నూలు ప్రధాన రహదారిపై గంట పాటు రాస్తారోకో చేశారు. భవిష్యత్ కార్యాచరణ కోసం వీరు మంగళవారం సమావేశం కానున్నారు. పార్టీ పరువు పోయిందట డెయిరీ వ్యవహారం ముఖ్యమంత్రి వద్దకు చేరడంతో పాత, కొత్త చైర్మన్లకు చీవాట్లు పెట్టారు. జిల్లా అధికార పార్టీ పరువు తీశారని సీఎం మండిపడ్డారు. శిద్దా కుటుంబంలో చిచ్చుపెట్టే ప్రయత్నంపై మరింత మండిపడ్డట్లు తెలుస్తోంది. దీంతో బెంబేలెత్తిన కొత్త చైర్మన్ శిద్దా చేతులెత్తేశాడు. ఆయన చైర్మన్ పదవి మున్నాళ్ల ముచ్చటగానే మారింది. కొత్త చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తూ డెయిరీని ఆదుకుంటానని ప్రకటించిన శిద్దా ఇప్పుడు మాట తప్పడంపై పాడి రైతులు, ఉద్యోగులతో పాటు అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రితో పోటీ? డెయిరీ కొత్త చైర్మన్ శిద్దా వెంకటేశ్వరరావు, రాష్ట్ర అటవీ శాఖ మంత్రి శిద్దా రాఘవరావుకు సమీప బంధువు. ఆర్థికంగా బలవంతుడు. శిద్దా రాఘవరావుకు మంత్రి పదవి వల్లే హంగు, ఆర్భాటం వచ్చిందని చైర్మన్ కుటుంబం భావిస్తోంది. దీంతో శిద్దాకు మంత్రికి పోటీగా రాజకీయంగా ఏదో ఒక పదవి సంపాదించాలన్న ఆరాటం వెంకటేశ్వరరావుకు ఉంది. ఆయన బీజేపీలోనూ పని చేశారు. దీంతో మంత్రి, చైర్మన్ కుటుంబాల మధ్య మనస్పర్థలు ఉన్నాయన్న ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఒంగోలు డెయిరీ రూ. 80 కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. డెయిరీ కంపెనీ యాక్టు పరిధిలో ఉండటం, రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం సహకరించకపోవడంతో పాత చైర్మన్ చల్లా శ్రీనివాస్ చైర్మన్ పదవి గుదిబండగా మారింది. దీని నుంచి బయటపడే ప్రయత్నంలో ఆయనకు పదవి కోసం ఆరాటపడే శిద్దా వెంకటేశ్వరరావు కనిపించాడు. దీంతో పాత చైర్మన్ చల్లా రాత్రికి రాత్రే తాను చైర్మన్‌గిరి నుంచి తప్పించుకొని శిద్దాను చైర్మన్ చేశారు. ఎట్టకేలకు పదవి పొందిన శిద్దా ఆర్భాటంగా విలేకర్ల సమావేశం పెట్టి డెయిరీని ఆదుకుంటాడనుకున్నారు. అంతేకాదు జిల్లావ్యాప్తంగా కొత్త చైర్మన్ అంటూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వేసుకున్నారు. అధికార పార్టీ కనుసన్నల్లో ఉన్నా.. ఒంగోలు డెయిరీ చైర్మన్ మార్క్ విషయం మంత్రి శిద్దాతో పాటు మిగిలిన నేతలకు తెలియకపోవడం గమనార్హం. అందరికీ తెలిస్తే శిద్దా వెంకటేశ్వరరావు డెయిరీ చైర్మన్‌గా అంగీకరించరని భావించి పాత చైర్మన్ మొత్తం వ్యవహారాన్ని బయటకు పొక్కనియకుండా చేశారన్న ప్రచారం ఉంది. -
డెయిరీని ఆదుకోకుంటే ఎలా..!
ఒంగోలు టూటౌన్: డెయిరీ ఉద్యోగులు బుధవారం కొత్త చైర్మన్ శిద్దా వెంకటేశ్వరరావును ఆయన ఇంటి వద్ద కలిసి సమస్యలు విన్నవించారు. డెయిరీకి కరెంటు కట్ చేసి మూడు రోజులవుతోందని, దానివలన జనరేటర్ డీజిల్ కోసం రోజుకి లక్ష రూపాయల వరకు ఖర్చవుతోందని వివరించారు. ఇప్పటికే డెయిరీ నష్టాల్లో ఉందని, డెయిరీని ఆదుకోకపోతే ఎలా.. అంటూ ఉద్యోగులు కొత్త చైర్మన్‌కు విన్నవించారు. ముందు కరెంట్ ఇప్పించండి అని కోరగా, స్పందించిన చైర్మన్.. దానికిప్పుడు రూ.2 కోట్లు ఖర్చవుతుందని, ఎక్కడ తీసుకోస్తామని, సీఎం చంద్రబాబు నుంచి ఎలాంటి అనుమతి రాలేదని పేర్కొన్నారు. అందుకే డెయిరీకి తాను రాలేదని చెప్పడంతో ఉద్యోగులు వెంటనే మాట అందుకుని మీ రాజకీయాలు పక్కన పెట్టండి సార్.. ముందు రాసిచ్చిన లెటర్ ప్రకారం సమస్యలు తీర్చి ఉద్యోగులు, రైతులను ఆదుకోవాలని కోరారు. దీంతో విద్యుత్ అధికారులతో మాట్లాడి విద్యుత్‌ను పునరుద్ధరించేలా చర్యలు తీసుకుంటానని చైర్మన్ చెప్పడంతో ఉద్యోగులు కొంత ఊరట చెందారు. చైర్మన్‌ని కలిసిన వారిలో టీఎన్టీయూసీ జిల్లా ప్రెసిడెంట్ కాటూరి శ్రీనివాసరావు, సెక్రటరీ యు.బ్రహ్మయ్య, వైస్ ప్రెసిడెంట్ ఎం.రాంబాబు, జాయింట్ సెక్రటరీ చింతపల్లి రాంబాబు, మాజీ ప్రెసిడెంట్ ఆర్వీ శేషయ్య, ఉద్యోగులు ఉన్నారు. చెక్‌బుక్‌లు రిటన్... కొత్త చైర్మన్‌గా డెయిరీ పాలకవర్గాన్ని ఎన్నుకున్నాక డెయిరీకి సంబంధించిన చెక్‌బుక్‌లను శిద్దా తన వెంట తీసుకెళ్లారు. దీంతో డెయిరీలో ఉన్న ఆర్థిక లావాదేవీలు ఆగిపోయాయి. బుధవారం తిరిగి ఇన్చార్జి ఎండీ పరుశురామ్‌కు డెయిరీ చెక్‌బుక్కులను ఆయన రిటన్ చేశారు. దీంతో పాటు ఉద్యోగులకు ఒక నెల జీతంగా రూ.45 లక్షలు జమయ్యేలా చర్యలు తీసుకున్నారని ఉద్యోగ సంఘ నాయకుడు కె.శ్రీనివాసరావు తెలిపారు. ఇంకా ఐదు నెలల జీతాలు రావాల్సి ఉందన్నారు.పాలరైతులకు కొన్ని పేమెంట్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. దీంతో ఉద్యోగులు కొంత ఊరట చెంది తిరిగి డెయిరీకి వెళ్లిపోయారు. సాయంత్రం కూడా డైరెక్టర్లరాక కోసం ఎదురుచూపులు... కొత్త చైర్మన్ శిద్దా వెంకటేశ్వరరావుని కలిసిన అనంతరం తిరిగి డెయిరీకి వెళ్లి డైరెక్టర్ల రాక కోసం ఉద్యోగ సంఘ నాయకులు ఎదురు చూశారు. అయినా, ఎవరూ రాకపోవడంతో ఎదురు చూడటాన్ని ఉద్యోగ సంఘ నాయకులు మానుకున్నారు. మొహం చాటేసిన డైరెక్టర్లు... కొద్ది రోజులుగా పాత, కొత్త చైర్మన్లు డెయిరీవైపు కన్నెత్తి చూడకపోవడం, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోవడం, పాల రైతులకు డబ్బు చెల్లించకపోవడం, కొత్త చైర్మన్ ఇచ్చిన హామీలు నెరవేరకపోవడం వంటి సమస్యలు తలెత్తడంతో మళ్లీ ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమయ్యారు. దీనిపై మంగళవారం సమావేశమైన ఉద్యోగులు.. తొలుత పాలకవర్గం డైరెక్టర్లతో సమావేశమవ్వాలని నిర్ణయించుకున్నారు. బుధవారం డైరెక్టర్ల కోసం ఒకటిన్నర వరకు వేచి చూశారు. అయినా, ఒక్కరు కూడా రాకపోవడంతో ఉద్యోగులందరూ కలిసి కొత్త చైర్మన్ ఇంటికి వెళ్లి సమస్యలు విన్నవించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ను కలిసి డెయిరీ సమస్యలు చెప్పాలనుకున్నారు. కానీ, కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో విరమించుకున్నారు. -
చల్లా అవుట్..శిద్దా ఇన్
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు డెయిరీ చైర్మన్‌గా 15 ఏళ్ల పాటు కొనసాగిన చల్లా శ్రీనివాస్ శకం ముగిసింది. శ్రీనివాస్ బుధవారం డెయిరీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా సమావేశమై డెయిరీ పాలకవర్గం కొత్త చైర్మన్‌గా మంత్రి శిద్దా రాఘవరావు సమీప బంధువు శిద్దా వెంకటేశ్వరరావును ఎన్నుకున్నారు. ఇక నుంచి శిద్దా వెంకటేశ్వరరావు ఒంగోలు డెయిరీ కొత్త చైర్మన్‌గా కొనసాగుతారు. అప్పుల్లో కూరుకుపోయిన ఒంగోలు డెయిరీని గట్టెక్కించడంలో పాత చైర్మన్ చల్లా శ్రీనివాస్ విఫలమయ్యారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. కంపెనీ యాక్టులోని డెయిరీకి రుణాలు తీసుకురావడంలోనూ ఆయన వైఫల్యం చెందారు. మరోవైపు బకాయిల కోసం పాడి రైతులతో పాటు ఉద్యోగులు, పాలకవర్గంపై ఒత్తిడి పెంచారు. రైతులకు రూ.11 కోట్లకుపైనే బకాయిలివ్వాల్సి ఉండగా ఉద్యోగుల బకాయిలతో కలిపి రూ.18 కోట్లకుపైగా ఉన్నట్లు సమాచారం. రైతులతో పాటు డెయిరీ ఉద్యోగుల ఒత్తిడులు భరించలేని పాత చైర్మన్ చల్లా శ్రీనివాస్ కొత్త చైర్మన్ శిద్దా వెంకటేశ్వరరావుతో ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రైతులకు, ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలకు సంబంధించి రూ.20 కోట్లు శిద్దా వెంకటేశ్వరరావు తక్షణమే చెల్లించాలి. తర్వాత బ్యాంకుల ద్వారా రుణం తెచ్చుకొని వడ్డీతో సహా ఇచ్చిన మొత్తాన్ని శిద్దా తిరిగి తీసుకోవాలి. ఇందుకు ప్రతిఫలంగా ఒంగోలు డెయిరీ చైర్మన్ కుర్చీ ఆయనకివ్వాలి. దీనికి శిద్దా వెంకటేశ్వరరావు అంగీకరించినట్లు సమాచారం. దీంతో బుధవారం మధ్యాహ్నం అత్యవసరంగా సమావేశమైన డెయిరీ పాలకవర్గం శిద్దా వెంకటేశ్వరరావును కొత్త చైర్మన్‌గా ఎన్నుకుంది. మొత్తం తంతు నడిపించిన పాత చైర్మన్ చల్లా శ్రీనివాస్ తన పదవికి రాజీనామా చేశారు. నిబంధనల మేరకు చైర్మన్‌గా ఎన్నుకున్న వ్యక్తి పాల సొసైటీకి అధ్యక్షుడిగా ఉండాలి. దీంతో పాత చైర్మన్ చల్లా శ్రీనివాస్ సొంత గ్రామం ఓగూరు–బి పాల సొసైటీ అధ్యక్షునిగా శిద్దా వెంకటేశ్వరరావును ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత డెయిరీ పాలకవర్గం శిద్దాను కొత్త చైర్మన్‌గా ఎంపిక చేసింది. దీంతో 15 ఏళ్లు డెయిరీ చైర్మన్‌గా కొనసాగిన చల్లా శ్రీనివాస్ ఎట్టకేలకు తన పదవిని కోల్పోయారు. అప్పుల ఊబిలో ఒంగోలు డెయిరీ రూ.80 కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన ఒంగోలు డెయిరీ పంచాయితీ ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు చేరింది. అధికార పార్టీ కనుసన్నల్లో నడుస్తున్న డెయిరీ పాలకవర్గం రైతులు, ఉద్యోగుల బకాయిలు చెల్లించకపోవడంపై రైతులు ఇటు ఉద్యోగులు గడిచిన రెండేళ్లుగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. డెయిరీ కంపెనీ యాక్టులో ఉన్నందున ప్రభుత్వం ఎటువంటి సహాయం చేయలేదు. పాలకవర్గం అప్పుల కోసం ప్రయత్నించినా బ్యాంకులు అప్పులిచ్చే పరిస్థితి లేకుండాపోయింది. ఒంగోలు డెయిరీని అప్పుల్లో కూరుకుపోయేలా చేసిన పాలకవర్గంపై విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా పాడి రైతులు, డెయిరీ ఉద్యోగులు వ్యవహారాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. డెయిరీ పరిస్థితిపై జిల్లాకు చెందిన మంత్రి శిద్దా రాఘవరావు పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్ధన్, ఎమ్మెల్సీ కరణం బలరాంలతో అధిష్టానం చర్చించింది. డెయిరీ అప్పుల్లో కూరుకుపోవడానికి పాలకవర్గం తప్పిందాలే కారణమని అధికార పార్టీ నేతలు సైతం ముఖ్యమంత్రికి వివరించారు. డెయిరీని ఆదుకోవాలంటూ విన్నవించారు. రైతులు, ఉద్యోగుల జీతాలు చెల్లించేందుకు బ్యాంకు రుణమిప్పిస్తామని ముఖ్యమంత్రి సైతం హామీ ఇచ్చినా అది నెరవేరలేదు. వివాదంలో కొత్త చైర్మన్ ఎంపిక ఒంగోలు డెయిరీ కొత్త చైర్మన్ ఎంపిక వివాదంగా మారింది. పరిస్థితి ఇబ్బందికరంగా మారడంతో చైర్మన్ చల్లా శ్రీనివాస్ తన సొంత ప్రయత్నంగా మంత్రి శిద్దా రాఘవరావు సమీప బంధువు శిద్దా వెంకటేశ్వరరావుతో మాట్లాడుకొని చైర్మన్ పదవి అతనికి అప్పగించారు. బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి వద్ద రివ్యూ సమావేశంలో ఉన్న పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్ధన్, మంత్రి శిద్దా రాఘవరావులకు విషయం తెలిసింది. తమకు తెలియకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారంటూ పాత చైర్మన్ చల్లా శ్రీనివాస్‌ను ఇరువురు నేతలు ఫోన్లో మందలించినట్లు సమాచారం. హుటాహుటిన ముఖ్యమంత్రి వద్దకు విజయవాడ రావాలని వారు చల్లా శ్రీనివాస్‌ను ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే అక్కడకు వెళ్లినా ప్రయోజనం ఉండదని ముందు సమస్య నుంచి తాను గట్టెక్కాలని భావించిన చల్లా శ్రీనివాస్ హుటాహుటిన పాలకవర్గం సమావేశం ఏర్పాటు చేసి తన పదవికి రాజీనామా చేసి కొత్త చైర్మన్ శిద్దా వెంకటేశ్వరరావును ఎంపిక చేశారు. డెయిరీని ఆదుకుంటారనే...: చల్లా కందుకూరు మండలం ఓగూరు–బి పాలకేంద్రం ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్న శిద్దా వెంకటేశ్వరరావు డెయిరీ నిబంధనల ప్రకారం చైర్మన్‌గా ఎన్నుకున్నట్లు మాజీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావు తెలిపారు. ప్రస్తుతం ఆర్ధిక సంక్షోభంలో ఉన్న డెయిరీని ఆదుకుంటారనే ఉద్దేశంతో శిద్దా వెంకటేశ్వరరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని తెలిపారు. నెలరోజుల్లో రైతులకు, కార్మికులకు మేలు జరిగేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు. తాను మాత్రం డైరెక్టర్‌గా కొనసాగుతానన్నారు. డెయిరీ అభివృద్ధికి కృషి చేస్తా..: శిద్దా అనంతరం నూతన చైర్మన్ శిద్దా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ డెయిరీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. అయితే డైరెక్టర్లు సహాయ సహకారాలు అందించాలని కోరారు. పైగా డెయిరీ కంపెనీ యాక్టులో ఉంది కనుక చాలా జాగ్రత్తగా నడపాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే సందర్భంలో పాలరైతుల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు ఐదు రోజుల్లో డెయిరీలో ఏయే సమస్యలు ఉన్నయో తెలుసుకొని ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో మళ్లీ విలేకర్ల సమావేశంలో తెలియజేస్తానని తెలిపారు. అనంతరం పాలకవర్గ సభ్యులు, శ్రేయోభిలాషులు, మిత్రులు నూతన చైర్మన్‌ని అభినందించారు. -
చల్లాపై ప్రేమేల..?
సాక్షి, ప్రతినిధి, ఒంగోలు: అవినీతి,అక్రమాల సాకు చూపి పీడీసీసీబీ చైర్మన్, డీసీఎంఎస్ చైర్మన్లను పదవీచ్యుతులను చేసిన జిల్లా అధికార పార్టీ నేతలు ఒంగోలు డెయిరీ చైర్మన్ చల్లా శ్రీనివాస్‌ను మాత్రం వెనకేసుకు రావడంపై స్వపక్షం నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూడేళ్లలోనే ఒంగోలు డెయిరీని రూ.70 కోట్ల అప్పుల్లోకి నెట్టి పాలకవర్గం చరిత్రకెక్కింది. చైర్మన్ చల్లా అధికార పార్టీ నేతల సేవలో తరించడంలో భాగంగానే డెయిరీ అప్పుల్లో కూరుకుపోయినట్లు డెయిరీ ఉద్యోగులే ఆరోపిస్తుండటం గమనార్హం. డెయిరీ పరిధిలోని వందలాది మంది ఉద్యోగులు, వేలాది మంది రైతుల ప్రయోజనాలను పక్కనపెట్టి పాలకవర్గం అక్రమాలకు తెరలేపినా అధికార పార్టీ నేతలు మాత్రం నోరు మెదపడం లేదు. సాక్షాత్తు ఆ పార్టీ రైతు విభాగం, టీఎన్‌టీయూసీలు 32 రోజుల పాటు పాలకవర్గం అవినీతిపై దీక్షలు చేపట్టడం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయినా కూడా అధికార పార్టీ ముఖ్యనేతలెవ్వరూ స్పందించిన దాఖలాల్లేవు. జిల్లా పార్టీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ మొదలుకొని మంత్రి శిద్దా రాఘవరావు, పార్టీ సీనియర్ నేతలు కరణం బలరాం, శాసనసభ్యులు ఆ దిశగా కన్నెత్తి చూడలేదు. పైపెచ్చు టీడీపీ జిల్లా అధ్యక్షుడు చల్లాకు అండగా నిలుస్తున్నారని ఆ పార్టీ నుంచే విమర్శలున్నాయి. మరోవైపు పీడీసీసీబీ, డీసీఎంఎస్‌లలో జరిగిన గొడవలను అధికార పార్టీ భూతద్దంలో చూసింది. మెజార్టీ డైరెక్టర్లు పీడీసీసీబీ చైర్మన్ ఈదర మోహన్‌పై ఆరోపణలు చేయగానే మంత్రి, ఎమ్మెల్యేలు స్పందించారు. ఈదర మోహన్‌ను పదవి నుంచి దించేందుకు పావులు కదిపారు. ఇందులో భాగంగా మెజార్టీ డైరెక్టర్లకు మద్ధతుగా నిలిచారు. తామున్నామంటూ భరోసా ఇచ్చారు. ఈదర మోహన్‌కు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి వద్ద పావులు కదిపారు. అటు సహకార శాఖ ఉన్నతాధికారులతో కథ నడిపించారు. అవిశ్వాసం పేరుతో చైర్మన్‌పై ఒత్తిడి పెంచారు. మానసికంగా వేధించారు. తనకు తానుగా పదవిని వదిలి వెళ్లిపోయేలా చేశారు. దాదాపు నాలుగేళ్ల పాటు చైర్మన్‌గా ఉన్న ఈదర మోహన్ చివరి వరకు డైరెక్టర్ల మెప్పు పొందడం గమనార్హం. అయితే చివరి నిమిషంలో మెజార్టీ డైరెక్టర్లు ఆయనకు వ్యతిరేకంగా మారారు. ఈదర అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు చేశారు. పేరుకు రూ.25 కోట్ల అవినీతి జరిగిందని వారు ఆరోపించినా, దానికి పూర్తి స్థాయి ఆధారాలు చూపించలేదు. ఇందుకోసం విచారణకు డిమాండ్ చేశారు. దీనికి పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌తో పాటు మరికొందరు నేతలు కారణమని ఈదర బహిరంగంగానే విమర్శించారు. డీసీఎంఎస్ చైర్మన్ సైతం అవినీతి ఆరోపణలతోనే పదవిని వదులుకోవాల్సి వచ్చింది. డీసీఎంఎస్‌లో సినిమా కొనుగోళ్ల వ్యవహారం చైర్మన్ బీరం వెంకటేశ్వరరెడ్డితో పాటు మరికొందరిపై ఆరోపణలు రావడానికి కారణమైంది. సహకార శాఖకు చెల్లించాల్సిన మొత్తాలను చెల్లించి డీసీఎంఎస్ చైర్మన్ పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయారు. మొత్తంగా తమపై ఆరోపణలు రావడంతో అటు డీసీఎంఎస్ చైర్మన్, ఇటు పీడీసీసీబీ చైర్మన్లు పదవులను వదిలేసుకున్నారు. వాస్తవానికి అధికార పార్టీ ముఖ్యనేతలు ఇద్దరు చైర్మన్లను పదవుల నుంచి బలవంతంగా దింపివేసినట్లే లెక్క. ఒంగోలు డెయిరీ చైర్మన్ చల్లా శ్రీనివాస్ విషయంలో అందుకు భిన్నంగా జరుగుతోంది. 2014 వరకు లాభాల్లో ఉన్న ఒంగోలు డెయిరీని గత మూడేళ్లలో చల్లా నేతృత్వంలోని పాలకవర్గం నిండా ముంచేసింది. డెయిరీని రూ.70 కోట్ల అప్పుల్లోకి నెట్టింది. రైతులు, ఉద్యోగులకు ఇవ్వాల్సిన డబ్బులివ్వక రోడ్డున పడేసింది. డబ్బు చెల్లిస్తామంటూ ఉద్యోగులను బతిమిలాడుకొని ఆందోళనలను విరమింపజేసుకున్నా.. హామీలు నెరవేర్చలేదు. ఈ నెల 16 నాటికే ఉద్యోగులకు ఒక నెల జీతాలిస్తామని చెప్పిన చైర్మన్ ఆ హామీని నెరవేర్చలేదు. పాలకవర్గం అక్రమాలపై సాక్షాత్తు అధికార పార్టీ అనుబంధ విభాగాలైన తెలుగు రైతు, టీఎన్టీయూసీలే పోరాటానికి దిగాయి. పార్టీ అధిష్టానానికి సైతం విన్నవించారు. అయినా జిల్లా టీడీపీ అధ్యక్షుడు, జిల్లాకు చెందిన మంత్రి, శాసనసభ్యులు ఏ మాత్రం స్పందించటం లేదు. రైతులు, ఉద్యోగుల ప్రయోజనాలను పక్కనపెట్టి చల్లాను కాపాడే ప్రయత్నంలో తలమునకలుగా ఉన్నారు. పార్టీ నేతల తీరుపై సొంత పార్టీ నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. అందరూ కలిసి జిల్లాలో అధికార పార్టీ పరువు బజారున పడవేశారని ఆ పార్టీ వర్గాలే పేర్కొంటుండటం గమనార్హం. -
తమ్ముళ్లు.. తలోదారి!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: అధికార పార్టీ నేతలు జిల్లా ప్రయోజనాలను గాలికొదిలేశారు. ముఖ్యంగా అధికార పార్టీ పాలనలో కొనసాగుతున్న సహకార వ్యవస్థను కొందరు నేతలు నిర్వీర్యం చేస్తున్నా... మిగిలిన వారు చోద్యం చూస్తుండిపోతున్నారు. పార్టీలో తీవ్ర స్థాయికి చేరిన వర్గవిభేదాలే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. మంత్రి శిద్దా రాఘవరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్, ఎమ్మెల్సీ కరణం బలరాం ఎవరికీ వారే అన్న రీతితో వ్యవహరిస్తుండటంతో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. అధిష్టానం సైతం పట్టించుకోక జిల్లాను గాలికొదిలేసింది. జిల్లా ముఖ్యనేతల తీరుపై ఆ పార్టీ దిగువ శ్రేణి నేతలు బహిరంగ విమర్శలకు దిగుతుండటం గమనార్హం. డెయిరీలో పవర్ కట్.. చారిత్రక ఒంగోలు డెయిరీ మూతపడే దిశకు చేరింది. మూడు రోజుల క్రితం దాదాపు కోటి రూపాయల విద్యుత్ బకాయి చెల్లించలేదని విద్యుత్ శాఖ విద్యుత్ సరఫరా నిలిపివేసింది. డెయిరీ పాలకవర్గం విద్యుత్ బకాయిలు చెల్లించే పరిస్థితి లేదు. దీంతో డెయిరీకి విద్యుత్ ఎప్పుడు పునరుద్ధరిస్తారో తెలియని పరిస్థితి. మరోవైపు రైతులకు కోట్లాది రూపాయల పాల బకాయిలు దాదాపు అంతే మొత్తంలో ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లించాల్సి ఉంది. 2014 వరకు కోట్లాది రూపాయల లాభాల్లో ఉన్న డెయిరీని చైర్మన్ చల్లా శ్రీనివాసరావు నేతృత్వంలో పాలకవర్గం అప్పుల్లోకి నెట్టింది. గడిచిన మూడేళ్లలోనే డెయిరీని రూ.70 కోట్ల అప్పుల్లో కూరుకుపోయేలా చేశారు. సొంత ప్రయోజనాలకు ప్రాధాన్యతనిచ్చి చైర్మన్ చల్లా డెయిరీని సర్వనాశనం చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు జీతాల కోసం రైతులు, ఉద్యోగులు అధికార పార్టీకి చెందిన తెలుగురైతు, టిఎన్యుసిల నేతృత్వంలో 32 రోజుల పాటు డెయిరీ వద్దే నిరసన దీక్షలు చేశారు. డెయిరీ వ్యవహారం రాష్ట్ర స్థాయికి చేరింది. రైతులు, ఉద్యోగులు రోడ్డునపడ్డ జిల్లా అధికార పార్టీ నేతలు దాని సంగతి పట్టించుకోలేదు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌తో పాటు కొందరు చైర్మన్ చల్లా శ్రీనివాసరావుకు మద్ధతుగా నిలవడంతో మంత్రి శిద్దా రాఘవరావు, ఎమ్మెల్సీ కరణం బలరాం లాంటి నేతలు డెయిరీని గాలికొదిలేశారు. జరుగుతున్న తంతును చూడటం మినహా వారు జోక్యం చేసుకోలేదు. పీడీసీసీబీలో రగడ.. ఇక అధికార పార్టీ పాలనలోనే కొనసాగుతున్న పీడీసీసీబీ వ్యవహారం గత నెల రోజులుగా జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. చైర్మన్ ఈదర మోహన్ డైరెక్టర్ల మధ్య విభేదాలు మొదలయ్యాయి. చైర్మన్ రూ.25 కోట్లకుపైగా అవినీతికి పాల్పడ్డారని మెజార్టీ డైరెక్టర్లు బహిరంగ విమర్శలకు దిగారు. సీఎం మొదలు రాష్ట్ర స్థాయి అధికారులకు సైతం ఫిర్యాదులు చేశారు. చైర్మన్ ఈదర సైతం డైరెక్టర్లపై ప్రత్యారోపణలకు దిగారు. వీరి గొడవ నెల రోజులుగా పత్రికల్లో పతాక శీర్షికలకెక్కింది. చైర్మన్‌పై డైరెక్టర్లు అవిశ్వాసం పెట్టే వరకు వచ్చింది. ఎట్టకేలకు ఈదర మోహన్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ గొడవ డీసీసీబీని అస్తవ్యస్తంగా మార్చింది. రైతులకు రుణాలిచ్చే పరిస్థితి లేకుండాపోయింది. పాలకవర్గం గొడవలతో బ్యాంకులో డిపాజిట్లు సైతం వెనక్కు తీసుకునే పరిస్థితి నెలకొంది. ఇంత జరుగుతున్నా... అధికార పార్టీ నేతలు సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయలేదు. పైపెచ్చు రెండు వర్గాలుగా విడిపోయి అగ్నికి ఆజ్యం పోసినట్లు గొడవను పెంచారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ చైర్మన్ ఈదరకు మధ్య విభేదాల నేపథ్యంలో ఆయన వర్గం ఈదరను పదవి నుంచి దించేందుకు గట్టిగా ప్రయత్నించినట్లు స్వయంగా ఈదర ఆరోపించిన విషయం తెలిసిందే. జనార్దన్ డైరెక్టర్ల మద్ధతు పలకడంతో మిగిలిన నేతలు డీసీసీబీ సంగతిని పట్టించుకోవడం మానేశారు. అధికార పార్టీ వర్గ విభేదాలతో పీడీసీసీబీ పరువు బజారునపడింది. రైతు ప్రయోజనాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. సినిమాలకు ‘సహకారం’.. ఇక డీసీఎంఎస్‌లో సైతం అక్రమాలు జరిగినట్లు ఆరోపణలొచ్చాయి. పాలకవర్గం సినిమాలను కొనుగోలు వ్యవహారంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు ప్రచారం జరిగింది. దీంతో సినిమా కొనుగోళ్లకు సంబంధించిన డబ్బులను డీసీఎంఎస్ పాలకవర్గం చివరకు చెల్లించాల్సి వచ్చింది. మొత్తంగా అధికార పార్టీ పాలనలో ఉన్న జిల్లాలోని సహకార వ్యవస్థకు సంబంధించిన మూడు విభాగాల్లో అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నాయన్న విమర్శలు వెల్లువెత్తాయి. రెండు నెలలుగా ఈ వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. దీని వల్ల రైతులు, ఉద్యోగుల ప్రయోజనాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అధికార పార్టీ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినా ఆ పార్టీ నేతలు సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయలేదు. మంత్రి శిద్దా, టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల, ఎమ్మెల్సీ కరణం బలరాం తదితర నేతలు వర్గాలుగా విడిపోయి వీటి సంగతి గాలికొదిలారు. అధిష్టానం సైతం పట్టించుకోకపోవడం చూస్తే ప్రజాప్రయోజనాలకు ఏమాత్రం ప్రాధాన్యమిస్తున్నారో అవగతమవుతోంది. -
చరిత్రకు చెద!
►పతనావస్థకు చేరిన ఒంగోలు డెయిరీ ►రైతుల శ్రమ ‘చల్లా’పాలు ►మూడేళ్లలో రూ.80 కోట్లకు పైగా అప్పులు ►రైతుల పాల బకాయిలు చెల్లించలేని దుస్థితి ►అధికార పార్టీ సేవలో తరిస్తున్న పాలకవర్గం ►ఆస్తుల తనఖాకు మరోమారు యత్నం ►ఆదుకోక పోతే మూతే.. ఒంగోలు : ఒంగోలు డెయిరీ 1974 సంవత్సరంలో ఒక చిల్లీ పాయింట్‌గా ప్రారంభమైంది. 1978లో కో ఆపరేటివ్ యూనియన్‌గా మారింది. జిల్లా వ్యాప్తంగా 423 రిజిస్ట్రేషన్ గ్రామ సంఘాలు, 120 కలెక్షన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. వీటికి సొంత భవనాలను నిర్మించారు. 1985 నుంచి డెయిరీ బలోపేతం లక్ష్యంగా రైతులు వారంలో ఒకరోజు ఉచితంగా పాలు పోశారు. తొలుత ఆ డబ్బులతో 6.90 ఎకరాల స్థలం కొన్నారు. 1987లో ఎన్డీడీబీ సహకారంతో ఏషియాలోనే పెద్దదైన పాలపొడి కేంద్రం ఏర్పాటు చేశారు. రోజుకు 30 టన్నుల పాలపొడి ఉత్పత్తి కెపాసిటీతో నిర్మించారు. ఆ తరువాత 70 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. కంభం, కనిగిరి, యర్రగొండపాలెం, దర్శి, కొండమంజులూరులో చిల్లింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. మొత్తంగా ఒంగోలు డెయిరీకి సంబంధించి రూ.450 కోట్ల ఆస్తులు సమకూర్చారు. 2006 నుంచి 2013 వరకు పాల ఫ్యాక్టరీకి పెట్టిన పెట్టుబడి 40 కోట్ల రూపాయలు. బకాయిలు తీరేవరకు ఎన్డీడీబీ డెయిరీని నడిపింది. అప్పటికి ఒక్క రూపాయి కూడా డెయిరీ పరిధిలో అప్పు లేకపోవడం గమనార్హం. కంపెనీ యాక్ట్ కొంప ముంచింది.. 2013లో నిబంధనలకు విరుద్ధంగా ఒంగోలు డెయిరీని చైర్మన్ చల్లా శ్రీనివాసరావు నేతృత్వంలో కంపెనీ యాక్ట్‌లోకి మార్చారు. 423 గ్రామ సంఘాల్లో మెజార్టీ సంఘాల అనుమతి లేకుండా కేవలం పది సంఘాల మద్దతుతో ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. పైగా కో ఆపరేటివ్ శాఖ ఎన్ఓసీని నిబంధనలకు విరుద్ధంగా తెల్ల కాగితంపై డీసీఓ సంతకంతో తీసుకున్నారు. ఈ విషయమై అప్పట్లో ఉన్నతాధికారులు డీసీఓను సస్పెండ్ చేశారు. 2014 నాటికి డెయిరీ ఐదుకోట్ల రూపాయల లాభాల్లో ఉందని ప్రకటించిన పాలకవర్గం అప్పట్లో ఎన్నికల ప్రచారం నిమిత్తం ఒంగోలు వచ్చిన టీడీపీ అధ్యక్షడు చంద్రబాబునాయుడుతో రైతులకు బోనస్‌లు ఇప్పించి సంబరాలు చేసింది. టీడీపీ సేవలో పాలకవర్గం.. ఒంగోలు డెయిరీ రైతులకు మూడు నెలలుగా రూ.13 కోట్ల మేర పాల బకాయిలు, ఉద్యోగులకు రూ.3 కోట్ల జీతాలు ఇవ్వాల్సి ఉంది. మొత్తంగా ప్రస్తుతం రూ.80 కోట్లకు పైగానే డెయిరీ అప్పుల్లో కూరుకుపోయింది. గడచిన మూడేళ్లలోనే డెయిరీ ఇంత పెద్ద స్థాయిలో అప్పుల్లో కూరుకుపోవడానికి పాలకవర్గం అక్రమాలకు పాల్పడటమేనన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పాలకవర్గం మూడు పెద్ద కార్లు కొనుగోలు చేసి దుబారా ఖర్చులను మరింతగా పెంచింది. రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో సైతం ఇదే కార్లను వాడుతూ పెట్రోల్, డీజిల్ ఖర్చును డెయిరీ ఖాతాలోనే జమ చేసినట్లు సమాచారం. ఇక టీడీపీ సమావేశాలకు పాలపొడి, మజ్జిగ, వెన్న సైతం ఈ డెయిరీ నుంచే సరఫరా చేశారు. అధికారపార్టీ ముఖ్య నేతలను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీ మెయింటెనెన్స్ ఖర్చును డెయిరీ నుంచే ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ సమావేశాలు జిల్లాలో ఎక్కడ జరిగినా భోజన ఖర్చుల్లో డెయిరీ భాగస్వామ్యం ఉన్నట్లు పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. టీడీపీ జిల్లా ముఖ్య నేతల వేడుకల ఖర్చులో అగ్రభాగం డెయిరీ నుంచే జమ అయినట్లు ప్రచారం ఉంది. కొత్త అప్పుల కోసం వేట... ఒంగోలు డెయిరీని తమ సొంత ప్రయోజనాల కోసం వాడుకున్న అధికార పార్టీ నేతలు ఇప్పుడు డెయిరీ ఆస్తులను తనఖాపెట్టి మరిన్ని కొత్త అప్పులు తెచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవల సిండికేట్ బ్యాంకులో రూ.20కోట్ల రుణాలకు ప్రయత్నించగా, సంక్షోభంలో ఉన్నట్లు తెలుసుకొని, చివరి నిముషంలో రుణాలు ఇచ్చేందుకు బ్యాంకు వెనుకడుగు వేసినట్లు తెలుస్తోంది. భంగపాటుకు గురైన పాలకవర్గం ప్రత్యామ్నాయంగా ఆంధ్రాబ్యాంకు, ఎస్బీఐలో కూడా రుణాలు తెచ్చేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబును సైతం పాలకవర్గం కలిసి అప్పులు పుట్టించాలంటూ వేడుకున్నట్లు తెలుస్తోంది. మూత దిశగా డెయిరీ.. రోజుకు రెండు లక్షల లీటర్ల పాల సేకరణతో కళకళలాడిన డెయిరీ ప్రస్తుతం పదివేల లీటర్లు సేకరించమే గగనంగా మారింది. రైతులకు సకాలంలో బకాయిలు చెల్లించకపోవడంతో వారంతా ప్రైవేట్ డెయిరీలకు పాలు పోస్తున్నారు. పాల ఫ్యాక్టరీ పరిధిలో 83 మంది పర్మినెంట్ ఉద్యోగులు, 300 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నా వారికి పని లేకుండా పోయింది. రోజులో అరగంట కూడా ఫ్యాక్టరీ పనిచేసిన దాఖలాలు లేవు. డెయిరీ నమ్మకం కోల్పోవడంతో ఇతర జిల్లాల వారు పాలు సరఫరా చేసే పరిస్థితులు లేవు. పాలకవర్గం మారితేనే పూర్వవైభవం గతంలో మాదిరి ఫ్యాక్టరీకి పాలువస్తే ఏడాదికి రూ.40కోట్లకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉండేది. ఈ లెక్కన రెండేళ్లు సక్రమంగా డెయిరీని నిర్వహించినా అప్పుల ఊబి నుంచి బయటపడే అవకాశం ఉంది. అక్రమాలకు పాల్పడుతున్న ప్రస్తుత పాలకవర్గానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి చేయూత ఇచ్చినా అది కూడా దుర్వినియోగమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సమర్ధవంతమైన పాలకవర్గాన్ని నియమించి డెయిరీని ముందుకు నడిపించాలని జిల్లా రైతాంగం కోరుతోంది. -
ఒంగోలు డైరీలో అగ్నిప్రమాదం
ప్రకాశం: జిల్లాలో ఒంగోలు డైరీలో గురువారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్య్కూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. -
డెయిరీ కళకళ
కర్ణాటక నుంచి పాల వెల్లువ నిత్యం 40 ట్యాంకర్ల వరకు రాక ఇప్పటివరకు 60 లక్షల లీటర్లు సరఫరా పూర్తిస్థాయిలో పనిచేస్తున్న పాల పొడి ఫ్యాక్టరీ డెయిరీకి పెరగనున్న ఆదాయం ఒంగోలు డెయిరీకి మంచి రోజు లొచ్చాయి. ఉద్యోగులకు చేతిని ండా పనిదొరికింది. వారానికి రెండు రోజులు పనిచేసే పాల పొడి ఫ్యాక్టరీ గత పదిరోజుల నుంచి పూర్తి స్థాయిలో పని చేస్తోంది. పాల పొడి, వెన్న తయారీ కోసం కర్ణాటక నుంచి పాలు వెల్లువలా వస్తున్నాయి. అక్కడ పాల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుండటంతో పాల పొడి తయారీ, వెన్న తయారీ కోసం ప్రకాశం జిల్లా ఒంగోలు డెయిరీకి తెప్పిస్తున్నారు. కనీసం రోజుకు 30 నుంచి 40 ట్యాంకర్లు అక్కడ నుంచి వస్తున్నాయి. కేజీ పాల పొడి తయారీకి రూ.30, కేజీ వెన్న తయారీకి రూ.15 డెరుురీకి చెల్లిస్తారు. ఈ లెక్కన ఒంగోలు డెయిరీకి రోజుకు నాలుగు లక్షల రూపాయలకు పైగా ఆదాయం వస్తుంది. గత పది రోజులుగా కర్ణాటక నుంచి 60 లక్షల లీటర్ల పాలు వచ్చాయి. రూ.45.50 లక్షల వరకు ఆదాయం సమకూరింది. కర్ణాటక పాలతో కళకళ జిల్లాలో పాడిపరిశ్రమ గత రెండు, మూడేళ్లుగా తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటోంది. పాల దిగుబడి తగ్గిపోయింది. ప్రస్తుతం డెయిరీకి వస్తున్న పాలకు బయట బాగా డిమాండ్ ఉండటంతో పాల పొడి, వెన్న తయారీకి పాలు మిగలని పరిస్థితి. ఈ నేపథ్యంలో గత పది రోజులుగా ఒంగోలు డెయిరీకి పాల పొడి తయారీ కోసం కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నిత్యం పెద్ద సంఖ్యలో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తోంది. ఫ్యాక్టరీ సామర్థ్యానికి మించి పాల ట్యాంకర్లు వస్తుండటంతో డెయిరీ కళకళలాడుతోంది. ట్యా ంకర్లను నిలిపేందుకు కూడా ఖాళీ లేని పరిస్థితి నెలకొంది. అన్‌సీజన్‌లో అంతంతమాత్రమే.. ఒంగోలు డెయిరీలో 20 సంవత్సరాల క్రితం రూ.30 కోట్లకు పైగా ఖర్చు చేసి పాల పొడి ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారు. రోజుకు మూడు నుంచి నాలుగు లక్షల టన్నుల పాల పొడి, వెన్న తయారుచేసే సామర్థ్యం ఫ్యాక్టరీకి ఉంది. ప్రస్తుతం కర్ణాటక నుంచి వస్తున్న పాల వల్ల ఫ్యాక్టరీ పూర్తిస్థాయిలో పనిచేస్తోంది. సాధారణంగా పాల సీజన్లో మాత్రమే ఈ ఫ్యాక్టరీ 24 గంటలూ పనిచేస్తుంది. ఈసారి సీజన్ ప్రారంభమైనా జిల్లాలో పాల ఉత్పత్తి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. వర్షాభావ పరిస్థితులు జిల్లాను వెంటాడుతుండటమే అందుకు కారణం. అన్ సీజన్లో అరుుతే ఫ్యాక్టరీ కేవలం వారానికి రెండు రోజులు పనిచేస్తుంది. స్థానిక పాలతో పాల పొడి, వెన్న తయూరుచేస్తుంది. ఫ్యాక్టరీ ఏ మేరకు పనిచేస్తే ఆ మేరకు డెయిరీకి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం కర్ణాటక పాలతో రోజుకి 35 టన్నుల పాల పొడి, 15 నుంచి 20 టన్నుల వెన్న తయారు చేస్తున్నారు. దీంతో ఫ్యాక్టరీ ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు అవకాశముంటుందని డెయిరీ ఎండీ శివరామయ్య తెలిపారు.