సాక్షి, ప్రతినిధి, ఒంగోలు: అవినీతి,అక్రమాల సాకు చూపి పీడీసీసీబీ చైర్మన్, డీసీఎంఎస్ చైర్మన్లను పదవీచ్యుతులను చేసిన జిల్లా అధికార పార్టీ నేతలు ఒంగోలు డెయిరీ చైర్మన్ చల్లా శ్రీనివాస్‌ను మాత్రం వెనకేసుకు రావడంపై స్వపక్షం నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూడేళ్లలోనే ఒంగోలు డెయిరీని రూ.70 కోట్ల అప్పుల్లోకి నెట్టి పాలకవర్గం చరిత్రకెక్కింది. చైర్మన్ చల్లా అధికార పార్టీ నేతల సేవలో తరించడంలో భాగంగానే డెయిరీ అప్పుల్లో కూరుకుపోయినట్లు డెయిరీ ఉద్యోగులే ఆరోపిస్తుండటం గమనార్హం. డెయిరీ పరిధిలోని వందలాది మంది ఉద్యోగులు, వేలాది మంది రైతుల ప్రయోజనాలను పక్కనపెట్టి పాలకవర్గం అక్రమాలకు తెరలేపినా అధికార పార్టీ నేతలు మాత్రం నోరు మెదపడం లేదు. సాక్షాత్తు ఆ పార్టీ రైతు విభాగం, టీఎన్‌టీయూసీలు 32 రోజుల పాటు పాలకవర్గం అవినీతిపై దీక్షలు చేపట్టడం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయినా కూడా అధికార పార్టీ ముఖ్యనేతలెవ్వరూ స్పందించిన దాఖలాల్లేవు. జిల్లా పార్టీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ మొదలుకొని మంత్రి శిద్దా రాఘవరావు, పార్టీ సీనియర్ నేతలు కరణం బలరాం, శాసనసభ్యులు ఆ దిశగా కన్నెత్తి చూడలేదు. పైపెచ్చు టీడీపీ జిల్లా అధ్యక్షుడు చల్లాకు అండగా నిలుస్తున్నారని ఆ పార్టీ నుంచే విమర్శలున్నాయి.
మరోవైపు పీడీసీసీబీ, డీసీఎంఎస్‌లలో జరిగిన గొడవలను అధికార పార్టీ భూతద్దంలో చూసింది. మెజార్టీ డైరెక్టర్లు పీడీసీసీబీ చైర్మన్ ఈదర మోహన్‌పై ఆరోపణలు చేయగానే మంత్రి, ఎమ్మెల్యేలు స్పందించారు. ఈదర మోహన్‌ను పదవి నుంచి దించేందుకు పావులు కదిపారు. ఇందులో భాగంగా మెజార్టీ డైరెక్టర్లకు మద్ధతుగా నిలిచారు. తామున్నామంటూ భరోసా ఇచ్చారు. ఈదర మోహన్‌కు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి వద్ద పావులు కదిపారు. అటు సహకార శాఖ ఉన్నతాధికారులతో కథ నడిపించారు. అవిశ్వాసం పేరుతో చైర్మన్‌పై ఒత్తిడి పెంచారు. మానసికంగా వేధించారు. తనకు తానుగా పదవిని వదిలి వెళ్లిపోయేలా చేశారు. దాదాపు నాలుగేళ్ల పాటు చైర్మన్‌గా ఉన్న ఈదర మోహన్ చివరి వరకు డైరెక్టర్ల మెప్పు పొందడం గమనార్హం. అయితే చివరి నిమిషంలో మెజార్టీ డైరెక్టర్లు ఆయనకు వ్యతిరేకంగా మారారు. ఈదర అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు చేశారు.
పేరుకు రూ.25 కోట్ల అవినీతి జరిగిందని వారు ఆరోపించినా, దానికి పూర్తి స్థాయి ఆధారాలు చూపించలేదు. ఇందుకోసం విచారణకు డిమాండ్ చేశారు. దీనికి పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌తో పాటు మరికొందరు నేతలు కారణమని ఈదర బహిరంగంగానే విమర్శించారు. డీసీఎంఎస్ చైర్మన్ సైతం అవినీతి ఆరోపణలతోనే పదవిని వదులుకోవాల్సి వచ్చింది. డీసీఎంఎస్‌లో సినిమా కొనుగోళ్ల వ్యవహారం చైర్మన్ బీరం వెంకటేశ్వరరెడ్డితో పాటు మరికొందరిపై ఆరోపణలు రావడానికి కారణమైంది. సహకార శాఖకు చెల్లించాల్సిన మొత్తాలను చెల్లించి డీసీఎంఎస్ చైర్మన్ పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయారు. మొత్తంగా తమపై ఆరోపణలు రావడంతో అటు డీసీఎంఎస్ చైర్మన్, ఇటు పీడీసీసీబీ చైర్మన్లు పదవులను వదిలేసుకున్నారు. వాస్తవానికి అధికార పార్టీ ముఖ్యనేతలు ఇద్దరు చైర్మన్లను పదవుల నుంచి బలవంతంగా దింపివేసినట్లే లెక్క.
ఒంగోలు డెయిరీ చైర్మన్ చల్లా శ్రీనివాస్ విషయంలో అందుకు భిన్నంగా జరుగుతోంది. 2014 వరకు లాభాల్లో ఉన్న ఒంగోలు డెయిరీని గత మూడేళ్లలో చల్లా నేతృత్వంలోని పాలకవర్గం నిండా ముంచేసింది. డెయిరీని రూ.70 కోట్ల అప్పుల్లోకి నెట్టింది. రైతులు, ఉద్యోగులకు ఇవ్వాల్సిన డబ్బులివ్వక రోడ్డున పడేసింది. డబ్బు చెల్లిస్తామంటూ ఉద్యోగులను బతిమిలాడుకొని ఆందోళనలను విరమింపజేసుకున్నా.. హామీలు నెరవేర్చలేదు. ఈ నెల 16 నాటికే ఉద్యోగులకు ఒక నెల జీతాలిస్తామని చెప్పిన చైర్మన్ ఆ హామీని నెరవేర్చలేదు. పాలకవర్గం అక్రమాలపై సాక్షాత్తు అధికార పార్టీ అనుబంధ విభాగాలైన తెలుగు రైతు, టీఎన్‌టీయూసీలే పోరాటానికి దిగాయి. పార్టీ అధిష్టానానికి సైతం విన్నవించారు. అయినా జిల్లా టీడీపీ అధ్యక్షుడు, జిల్లాకు చెందిన మంత్రి, శాసనసభ్యులు ఏ మాత్రం స్పందించటం లేదు. రైతులు, ఉద్యోగుల ప్రయోజనాలను పక్కనపెట్టి చల్లాను కాపాడే ప్రయత్నంలో తలమునకలుగా ఉన్నారు. పార్టీ నేతల తీరుపై సొంత పార్టీ నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. అందరూ కలిసి జిల్లాలో అధికార పార్టీ పరువు బజారున పడవేశారని ఆ పార్టీ వర్గాలే పేర్కొంటుండటం గమనార్హం.
చల్లాపై ప్రేమేల..?
Published Wed, Oct 18 2017 12:21 PM | Last Updated on Wed, Oct 18 2017 12:21 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment