నూతన చైర్మన్‌ని అభినందిస్తున్న పాలకవర్గ సభ్యులు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు డెయిరీ చైర్మన్‌గా 15 ఏళ్ల పాటు కొనసాగిన చల్లా శ్రీనివాస్ శకం ముగిసింది. శ్రీనివాస్ బుధవారం డెయిరీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా సమావేశమై డెయిరీ పాలకవర్గం కొత్త చైర్మన్‌గా మంత్రి శిద్దా రాఘవరావు సమీప బంధువు శిద్దా వెంకటేశ్వరరావును ఎన్నుకున్నారు. ఇక నుంచి శిద్దా వెంకటేశ్వరరావు ఒంగోలు డెయిరీ కొత్త చైర్మన్‌గా కొనసాగుతారు. అప్పుల్లో కూరుకుపోయిన ఒంగోలు డెయిరీని గట్టెక్కించడంలో పాత చైర్మన్ చల్లా శ్రీనివాస్ విఫలమయ్యారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. కంపెనీ యాక్టులోని డెయిరీకి రుణాలు తీసుకురావడంలోనూ ఆయన వైఫల్యం చెందారు. మరోవైపు బకాయిల కోసం పాడి రైతులతో పాటు ఉద్యోగులు, పాలకవర్గంపై ఒత్తిడి పెంచారు. రైతులకు రూ.11 కోట్లకుపైనే బకాయిలివ్వాల్సి ఉండగా ఉద్యోగుల బకాయిలతో కలిపి రూ.18 కోట్లకుపైగా ఉన్నట్లు సమాచారం. రైతులతో పాటు డెయిరీ ఉద్యోగుల ఒత్తిడులు భరించలేని పాత చైర్మన్ చల్లా శ్రీనివాస్ కొత్త చైర్మన్ శిద్దా వెంకటేశ్వరరావుతో ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది.
ఈ మేరకు రైతులకు, ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలకు సంబంధించి రూ.20 కోట్లు శిద్దా వెంకటేశ్వరరావు తక్షణమే చెల్లించాలి. తర్వాత బ్యాంకుల ద్వారా రుణం తెచ్చుకొని వడ్డీతో సహా ఇచ్చిన మొత్తాన్ని శిద్దా తిరిగి తీసుకోవాలి. ఇందుకు ప్రతిఫలంగా ఒంగోలు డెయిరీ చైర్మన్ కుర్చీ ఆయనకివ్వాలి. దీనికి శిద్దా వెంకటేశ్వరరావు అంగీకరించినట్లు సమాచారం. దీంతో బుధవారం మధ్యాహ్నం అత్యవసరంగా సమావేశమైన డెయిరీ పాలకవర్గం శిద్దా వెంకటేశ్వరరావును కొత్త చైర్మన్‌గా ఎన్నుకుంది. మొత్తం తంతు నడిపించిన పాత చైర్మన్ చల్లా శ్రీనివాస్ తన పదవికి రాజీనామా చేశారు. నిబంధనల మేరకు చైర్మన్‌గా ఎన్నుకున్న వ్యక్తి పాల సొసైటీకి అధ్యక్షుడిగా ఉండాలి. దీంతో పాత చైర్మన్ చల్లా శ్రీనివాస్ సొంత గ్రామం ఓగూరు–బి పాల సొసైటీ అధ్యక్షునిగా శిద్దా వెంకటేశ్వరరావును ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత డెయిరీ పాలకవర్గం శిద్దాను కొత్త చైర్మన్‌గా ఎంపిక చేసింది. దీంతో 15 ఏళ్లు డెయిరీ చైర్మన్‌గా కొనసాగిన చల్లా శ్రీనివాస్ ఎట్టకేలకు తన పదవిని కోల్పోయారు.
అప్పుల ఊబిలో ఒంగోలు డెయిరీ
రూ.80 కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన ఒంగోలు డెయిరీ పంచాయితీ ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు చేరింది. అధికార పార్టీ కనుసన్నల్లో నడుస్తున్న డెయిరీ పాలకవర్గం రైతులు, ఉద్యోగుల బకాయిలు చెల్లించకపోవడంపై రైతులు ఇటు ఉద్యోగులు గడిచిన రెండేళ్లుగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. డెయిరీ కంపెనీ యాక్టులో ఉన్నందున ప్రభుత్వం ఎటువంటి సహాయం చేయలేదు. పాలకవర్గం అప్పుల కోసం ప్రయత్నించినా బ్యాంకులు అప్పులిచ్చే పరిస్థితి లేకుండాపోయింది. ఒంగోలు డెయిరీని అప్పుల్లో కూరుకుపోయేలా చేసిన పాలకవర్గంపై విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా పాడి రైతులు, డెయిరీ ఉద్యోగులు వ్యవహారాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. డెయిరీ పరిస్థితిపై జిల్లాకు చెందిన మంత్రి శిద్దా రాఘవరావు పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్ధన్, ఎమ్మెల్సీ కరణం బలరాంలతో అధిష్టానం చర్చించింది. డెయిరీ అప్పుల్లో కూరుకుపోవడానికి పాలకవర్గం తప్పిందాలే కారణమని అధికార పార్టీ నేతలు సైతం ముఖ్యమంత్రికి వివరించారు. డెయిరీని ఆదుకోవాలంటూ విన్నవించారు. రైతులు, ఉద్యోగుల జీతాలు చెల్లించేందుకు బ్యాంకు రుణమిప్పిస్తామని ముఖ్యమంత్రి సైతం హామీ ఇచ్చినా అది నెరవేరలేదు.
వివాదంలో కొత్త చైర్మన్ ఎంపిక
ఒంగోలు డెయిరీ కొత్త చైర్మన్ ఎంపిక వివాదంగా మారింది. పరిస్థితి ఇబ్బందికరంగా మారడంతో చైర్మన్ చల్లా శ్రీనివాస్ తన సొంత ప్రయత్నంగా మంత్రి శిద్దా రాఘవరావు సమీప బంధువు శిద్దా వెంకటేశ్వరరావుతో మాట్లాడుకొని చైర్మన్ పదవి అతనికి అప్పగించారు. బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి వద్ద రివ్యూ సమావేశంలో ఉన్న పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్ధన్, మంత్రి శిద్దా రాఘవరావులకు విషయం తెలిసింది. తమకు తెలియకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారంటూ పాత చైర్మన్ చల్లా శ్రీనివాస్‌ను ఇరువురు నేతలు ఫోన్‌లో మందలించినట్లు సమాచారం. హుటాహుటిన ముఖ్యమంత్రి వద్దకు విజయవాడ రావాలని వారు చల్లా శ్రీనివాస్‌ను ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే అక్కడకు వెళ్లినా ప్రయోజనం ఉండదని ముందు సమస్య నుంచి తాను గట్టెక్కాలని భావించిన చల్లా శ్రీనివాస్ హుటాహుటిన పాలకవర్గం సమావేశం ఏర్పాటు చేసి తన పదవికి రాజీనామా చేసి కొత్త చైర్మన్ శిద్దా వెంకటేశ్వరరావును ఎంపిక చేశారు.
డెయిరీని ఆదుకుంటారనే...: చల్లా
కందుకూరు మండలం ఓగూరు–బి పాలకేంద్రం ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్న శిద్దా వెంకటేశ్వరరావు డెయిరీ నిబంధనల ప్రకారం చైర్మన్‌గా ఎన్నుకున్నట్లు మాజీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావు తెలిపారు. ప్రస్తుతం ఆర్ధిక సంక్షోభంలో ఉన్న డెయిరీని ఆదుకుంటారనే ఉద్దేశంతో శిద్దా వెంకటేశ్వరరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని తెలిపారు. నెలరోజుల్లో రైతులకు, కార్మికులకు మేలు జరిగేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు. తాను మాత్రం డైరెక్టర్‌గా కొనసాగుతానన్నారు.
డెయిరీ అభివృద్ధికి కృషి చేస్తా..: శిద్దా
అనంతరం నూతన చైర్మన్ శిద్దా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ డెయిరీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. అయితే డైరెక్టర్లు సహాయ సహకారాలు అందించాలని కోరారు. పైగా డెయిరీ కంపెనీ యాక్టులో ఉంది కనుక చాలా జాగ్రత్తగా నడపాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే సందర్భంలో పాలరైతుల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు ఐదు రోజుల్లో డెయిరీలో ఏయే సమస్యలు ఉన్నయో తెలుసుకొని ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో మళ్లీ విలేకర్ల సమావేశంలో తెలియజేస్తానని తెలిపారు. అనంతరం పాలకవర్గ సభ్యులు, శ్రేయోభిలాషులు, మిత్రులు నూతన చైర్మన్‌ని అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment