Sidda venkateswara rao
-
చేతగాకపోతే దిగిపో..!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు డెయిరీ చైర్మన్ శిద్దా వెంకటేశ్వరరావు డెయిరీకి రాకపోవడం, మౌనం వీడకపోవడంతో డెయిరీ కష్టాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పాడి రైతులు, ఉద్యోగుల్లో ఆందోళన అధికమవుతోంది. చేతనైతే డెయిరీని ఆదుకోవాలి.. లేకపోతే పదవికి రాజీనామా చేయాలంటూ ఇటు పాడి రైతులు, అటు ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. శిద్దా మౌనం డెయిరీని మరింత ఊబిలోకి నెడుతోంది. తక్షణం బోర్డు మీటింగ్ నిర్వహించాలంటూ మంగళవారం ఉద్యోగులు, పాడి రైతులు ఎండీపై ఒత్తిడి పెంచారు. బుధవారం బోర్డు మీటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. బోర్డు మీటింగ్ నిర్వహించాలంటూ ఒకరోజు ముందస్తుగా డైరెక్టర్లతో పాటు అందరికీ నోటీసులివ్వాల్సి ఉంది. నోటీసులపై చైర్మన్ శిద్దా సంతకాలు చేయాల్సి ఉంది. ఇదే విషయంపై మాట్లాడేందుకు ఎండీ ప్రయత్నించినా చైర్మన్ శిద్దా వెంకటేశ్వరరావు అందుబాటులో లేరు. ఆయన ఫోన్లో ఎవరికీ పలికే పరిస్థితి లేదు. మంగళవారం శిద్దా స్పందించకపోవడంతో బుధవారం బోర్డు మీటింగ్ జరిగే పరిస్థితి లేదు. మంగళవారం సైతం డైరెక్టర్ స్వయాన శిద్దా వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్లారు. బోర్డు సమావేశం సంగతి తేల్చమని కోరినట్లు సమాచారం. అయితే, ఆ వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఆలస్యం కావడంతో నోటీసులు మంగళవారం అందించే పరిస్థితి లేదు. బోర్డు మీటింగ్‌కు చైర్మన్ శిద్దా అంగీకరించే పక్షంలో బుధవారం అందరికీ నోటీసులు అందజేస్తే గురువారం బోర్డు మీటింగ్ జరిగే అవకాశం ఉంటుంది. డెయిరీకి ఉపయోగపడనప్పుడు శిద్దాను చైర్మన్‌గా ఎందుకు ఎన్నుకున్నారంటూ పాడి రైతులు, ఉద్యోగులు నిలదీయడంతో డైరెక్టర్ల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. శిద్దాను చైర్మన్‌గా ఎన్నుకుని మోసపోయామని పలువురు డైరెక్టర్లు రైతులు, ఉద్యోగుల వద్ద సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వస్తోంది. సీఎం చెబితేనే చైర్మన్‌గా కొనసాగుతానంటూ శిద్దా అడ్డం తిరగడంపై డైరెక్టర్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. నాడు శిద్దాను డైరెక్టర్లే చైర్మన్‌గా ఎన్నుకున్నారు. ఆ రోజు సీఎం, మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎవ్వరూ లేరు. నాడు చైర్మన్‌గా అంగీకారం తెలిపిన శిద్దా.. ఇవాళ ముఖ్యమంత్రి చెబితేనే చైర్మన్‌గా కొనసాగుతానని మెలిక పెట్టడాన్ని వీరు జీర్ణించుకోలేకున్నారు. రూ.20 కోట్లు డబ్బులిచ్చి ఆదుకుంటానంటేనే డైరెక్టర్లు, పాలకవర్గం శిద్దాను చైర్మన్‌గా ఎన్నుకుంది. డెయిరీని నడిపిస్తే తర్వాత చూసుకోవచ్చని అందరూ భావించారు. అయితే, శిద్దా ఇప్పుడు అడ్డం తిరగడంతో అందరూ దోషులుగా మిగిలారు. ఈ పరిస్థితుల్లో శిద్దాను రాజీనామా చేయించడమే మేలని పాలకవర్గం భావిస్తున్నట్లు తెలుస్తోంది. సహకార పరిధిలోకి డెయిరీ... మరోవైపు డెయిరీని సహకార పరిధిలోకి తీసుకొస్తేనే ప్రభుత్వం సహకరిస్తుందని ఇప్పటికే ఉద్యోగులు, పాడి రైతులకు జిల్లా కలెక్టర్ చెప్పినట్లు సమాచారం. మొదట పాలకవర్గాన్ని ఏర్పాటు చేసి డెయిరీని సహకార యాక్టులోకి మార్చేందుకు తీర్మానం చేయాలని, ఆ తర్వాత ప్రభుత్వం డెయిరీని సహకార పరిధిలోకి తీసుకువస్తుందని ఇప్పటికే ఉన్నతాధికారులు సైతం సూచించినట్లు తెలుస్తోంది. దీంతో అధికార పార్టీ నేతలు, డెయిరీ పాలకవర్గం డెయిరీని సహకార పరిధిలోకి మార్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. పాలకవర్గ తీర్మానం అనంతరం చైర్మన్ శిద్దా వెంకటేశ్వరరావుతో రాజీనామా చేయించాలని అధికార పార్టీ నేతలు సైతం నిర్ణయించినట్లు తెలుస్తోంది. సహకార పరిధిలోకి రాకుండా డెయిరీ విషయాన్ని ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి కనిపించటం లేదని, ముందు యాక్టు మారిస్తేనే డెయిరీ విషయాన్ని పరిశీలిస్తామని జిల్లా ఉన్నతాధికారులు సైతం ఉద్యోగులు, రైతు నేతలకు స్పష్టం చేసినట్లు సమాచారం. -
డెయిరీని ఆదుకోకుంటే ఎలా..!
ఒంగోలు టూటౌన్: డెయిరీ ఉద్యోగులు బుధవారం కొత్త చైర్మన్ శిద్దా వెంకటేశ్వరరావును ఆయన ఇంటి వద్ద కలిసి సమస్యలు విన్నవించారు. డెయిరీకి కరెంటు కట్ చేసి మూడు రోజులవుతోందని, దానివలన జనరేటర్ డీజిల్ కోసం రోజుకి లక్ష రూపాయల వరకు ఖర్చవుతోందని వివరించారు. ఇప్పటికే డెయిరీ నష్టాల్లో ఉందని, డెయిరీని ఆదుకోకపోతే ఎలా.. అంటూ ఉద్యోగులు కొత్త చైర్మన్‌కు విన్నవించారు. ముందు కరెంట్ ఇప్పించండి అని కోరగా, స్పందించిన చైర్మన్.. దానికిప్పుడు రూ.2 కోట్లు ఖర్చవుతుందని, ఎక్కడ తీసుకోస్తామని, సీఎం చంద్రబాబు నుంచి ఎలాంటి అనుమతి రాలేదని పేర్కొన్నారు. అందుకే డెయిరీకి తాను రాలేదని చెప్పడంతో ఉద్యోగులు వెంటనే మాట అందుకుని మీ రాజకీయాలు పక్కన పెట్టండి సార్.. ముందు రాసిచ్చిన లెటర్ ప్రకారం సమస్యలు తీర్చి ఉద్యోగులు, రైతులను ఆదుకోవాలని కోరారు. దీంతో విద్యుత్ అధికారులతో మాట్లాడి విద్యుత్‌ను పునరుద్ధరించేలా చర్యలు తీసుకుంటానని చైర్మన్ చెప్పడంతో ఉద్యోగులు కొంత ఊరట చెందారు. చైర్మన్‌ని కలిసిన వారిలో టీఎన్టీయూసీ జిల్లా ప్రెసిడెంట్ కాటూరి శ్రీనివాసరావు, సెక్రటరీ యు.బ్రహ్మయ్య, వైస్ ప్రెసిడెంట్ ఎం.రాంబాబు, జాయింట్ సెక్రటరీ చింతపల్లి రాంబాబు, మాజీ ప్రెసిడెంట్ ఆర్వీ శేషయ్య, ఉద్యోగులు ఉన్నారు. చెక్‌బుక్‌లు రిటన్... కొత్త చైర్మన్‌గా డెయిరీ పాలకవర్గాన్ని ఎన్నుకున్నాక డెయిరీకి సంబంధించిన చెక్‌బుక్‌లను శిద్దా తన వెంట తీసుకెళ్లారు. దీంతో డెయిరీలో ఉన్న ఆర్థిక లావాదేవీలు ఆగిపోయాయి. బుధవారం తిరిగి ఇన్చార్జి ఎండీ పరుశురామ్‌కు డెయిరీ చెక్‌బుక్కులను ఆయన రిటన్ చేశారు. దీంతో పాటు ఉద్యోగులకు ఒక నెల జీతంగా రూ.45 లక్షలు జమయ్యేలా చర్యలు తీసుకున్నారని ఉద్యోగ సంఘ నాయకుడు కె.శ్రీనివాసరావు తెలిపారు. ఇంకా ఐదు నెలల జీతాలు రావాల్సి ఉందన్నారు.పాలరైతులకు కొన్ని పేమెంట్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. దీంతో ఉద్యోగులు కొంత ఊరట చెంది తిరిగి డెయిరీకి వెళ్లిపోయారు. సాయంత్రం కూడా డైరెక్టర్లరాక కోసం ఎదురుచూపులు... కొత్త చైర్మన్ శిద్దా వెంకటేశ్వరరావుని కలిసిన అనంతరం తిరిగి డెయిరీకి వెళ్లి డైరెక్టర్ల రాక కోసం ఉద్యోగ సంఘ నాయకులు ఎదురు చూశారు. అయినా, ఎవరూ రాకపోవడంతో ఎదురు చూడటాన్ని ఉద్యోగ సంఘ నాయకులు మానుకున్నారు. మొహం చాటేసిన డైరెక్టర్లు... కొద్ది రోజులుగా పాత, కొత్త చైర్మన్లు డెయిరీవైపు కన్నెత్తి చూడకపోవడం, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోవడం, పాల రైతులకు డబ్బు చెల్లించకపోవడం, కొత్త చైర్మన్ ఇచ్చిన హామీలు నెరవేరకపోవడం వంటి సమస్యలు తలెత్తడంతో మళ్లీ ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమయ్యారు. దీనిపై మంగళవారం సమావేశమైన ఉద్యోగులు.. తొలుత పాలకవర్గం డైరెక్టర్లతో సమావేశమవ్వాలని నిర్ణయించుకున్నారు. బుధవారం డైరెక్టర్ల కోసం ఒకటిన్నర వరకు వేచి చూశారు. అయినా, ఒక్కరు కూడా రాకపోవడంతో ఉద్యోగులందరూ కలిసి కొత్త చైర్మన్ ఇంటికి వెళ్లి సమస్యలు విన్నవించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ను కలిసి డెయిరీ సమస్యలు చెప్పాలనుకున్నారు. కానీ, కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో విరమించుకున్నారు. -
అప్పుడు గొప్పలు.. ఇప్పుడు తిప్పలు..!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు డెయిరీ కొత్త చైర్మన్ శిద్దా వెంకటేశ్వరరావు యూటర్న్ తీసుకున్నారు. మార్చి 28న ఒంగోలు డెయిరీ కొత్త చైర్మన్ అంటూ ఆర్భాటంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన శిద్దా.. ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. చైర్మన్‌గిరి ముళ్ల కిరీటమంటూ డెయిరీ గేటు తొక్కడం మానుకున్నారు. 10 రోజులుగా పత్తా లేకుండాపోయారు. చైర్మన్‌గా ఎంపికైన నాడు శిద్దా ఆర్భాటంగా విలేకర్ల సమావేశం నిర్వహించారు. పాడి రైతులకు, డెయిరీ ఉద్యోగులకు రూ.20 కోట్లు సొంత డబ్బులు చెల్లిస్తున్నానంటూ ప్రకటించారు. డెయిరీని ముందుకు నడిపిస్తానంటూ గొప్పలు చెప్పారు. డెయిరీ లాభాల్లోకి వచ్చిన తర్వాతే తమ అప్పును జమ వేసుకుంటానని ప్రకటించారు. డెయిరీ ముందుకు నడిపించేవారు వచ్చారని పాడి రైతులు, ఉద్యోగులు ఒకింత సంబరపడ్డారు. నెల రోజులు గడవక ముందే ఆ ఆశలు ఆవిరయ్యాయి. వ్యాపారస్తుడైన శిద్దా యూటర్న్ తీసుకున్నారు. పైసా చెల్లించకపోగా డెయిరీ వైపు తొంగి చూడటం లేదు. ఏం చేయాలో పాలుపోక డెయిరీ ఉద్యోగులు, పాడి రైతులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. మంగళవారం డెయిరీలో సమావేశమైన ఉద్యోగులు ఎండీకి అల్టిమేటం జారీ చేశారు. తక్షణం న్యాయం చేయకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ మేరకు డెయిరీ డైరెక్టర్లు బుధవారం సమావేశమవుతున్నారు. చివరిసారిగా డైరెక్టర్లు, జిల్లాకు చెందిన నేతలు, ప్రజాప్రతినిధులు చెప్పి ఆందోళన ప్రారంభిస్తామని డెయిరీ ఉద్యోగ సంఘం నేతలు తెలిపారు.డెయిరీ పరిధిలో పాడి రైతులకు రూ.13 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఉద్యోగుల జీతాలు రూ.3 కోట్లు, కరెంట్ బిల్లు రూ.2 కోట్లు, ట్రాన్స్‌పోర్టు బకాయిలు మరో రూ.2 కోట్లు ఉన్నాయి. ఈ మొత్తాన్ని చెల్లిస్తామని కొత్త చైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేసిన రోజు శిద్దా ప్రకటించారు. ఇదే జరిగితే డెయిరీ తిరిగి రన్నింగ్‌లోకి వస్తుందని మిగిలిన అప్పుల సంగతి తర్వాత చూసుకోవచ్చునని అందరూ భావించారు. అయితే కొత్త చైర్మన్ శిద్దా నెల కావస్తున్నా పైసా చెల్లించలేదు. పైపెచ్చు తన సొంత డబ్బులిచ్చేది లేదని బ్యాంకు రుణం వస్తేనే చెల్లిస్తానంటూ మెలిక పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు సీఎం ఓకే అంటేనే తాను చైర్మన్‌గా డెయిరీకి వస్తానంటూ శిద్దా అడ్డం తిరిగినట్లు తెలుస్తోంది.పాత చైర్మన్ చల్లా శ్రీనివాస్‌తో ఒప్పందం చేసుకున్న శిద్దా వెంకటేశ్వరరావు రాత్రికి రాత్రే ఒంగోలు డెయిరీ చైర్మన్ అయ్యారు. ఆర్భాటంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఒంగోలు నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఫ్లెక్సీలతో ప్రచారం చేసుకున్నారు. శిద్దా డెయిరీ చైర్మన్ ఎంపిక వ్యవహారం తమకు తెలియదంటూ మంత్రి శిద్దా రాఘవరావు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌తో పాటు పలువురు అధికార పార్టీ నేతలు ముఖ్యమంత్రి వద్ద పంచాయతీ పెట్టారు. ఆగ్రహం చెందిన ముఖ్యమంత్రి ఏప్రిల్ 15న పాత, కొత్త చైర్మన్లను విజయవాడకు పిలిపించారు. జిల్లా మంత్రి, టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యేలకు తెలియకుండా డెయిరీ చైర్మన్ ఎలా అవుతావు అంటూ చివాట్లు పెట్టారు. తర్వాత మాట్లాడదాం పో.. అంటూ పంపించివేశారు. రెండు రోజుల తర్వాత మరోమారు ముఖ్యమంత్రితో సమావేశం ఉంటుందని అన్ని చక్కబడతాయని అధికార పార్టీ నేతలు ప్రకటించారు. ఇది జరిగి 10 రోజులు కావస్తున్నా సమావేశం ఊసే లేదు. దీంతో శిద్దా యూటర్న్ తీసుకున్నారు. సీఎం చెప్పిన తర్వాతే డెయిరీకి వస్తానంటూ పత్తా లేకుండాపోయారు. ఈ పరిస్థితుల్లో ఒంగోలు డెయిరీ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. -
చల్లా అవుట్..శిద్దా ఇన్
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు డెయిరీ చైర్మన్‌గా 15 ఏళ్ల పాటు కొనసాగిన చల్లా శ్రీనివాస్ శకం ముగిసింది. శ్రీనివాస్ బుధవారం డెయిరీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా సమావేశమై డెయిరీ పాలకవర్గం కొత్త చైర్మన్‌గా మంత్రి శిద్దా రాఘవరావు సమీప బంధువు శిద్దా వెంకటేశ్వరరావును ఎన్నుకున్నారు. ఇక నుంచి శిద్దా వెంకటేశ్వరరావు ఒంగోలు డెయిరీ కొత్త చైర్మన్‌గా కొనసాగుతారు. అప్పుల్లో కూరుకుపోయిన ఒంగోలు డెయిరీని గట్టెక్కించడంలో పాత చైర్మన్ చల్లా శ్రీనివాస్ విఫలమయ్యారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. కంపెనీ యాక్టులోని డెయిరీకి రుణాలు తీసుకురావడంలోనూ ఆయన వైఫల్యం చెందారు. మరోవైపు బకాయిల కోసం పాడి రైతులతో పాటు ఉద్యోగులు, పాలకవర్గంపై ఒత్తిడి పెంచారు. రైతులకు రూ.11 కోట్లకుపైనే బకాయిలివ్వాల్సి ఉండగా ఉద్యోగుల బకాయిలతో కలిపి రూ.18 కోట్లకుపైగా ఉన్నట్లు సమాచారం. రైతులతో పాటు డెయిరీ ఉద్యోగుల ఒత్తిడులు భరించలేని పాత చైర్మన్ చల్లా శ్రీనివాస్ కొత్త చైర్మన్ శిద్దా వెంకటేశ్వరరావుతో ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రైతులకు, ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలకు సంబంధించి రూ.20 కోట్లు శిద్దా వెంకటేశ్వరరావు తక్షణమే చెల్లించాలి. తర్వాత బ్యాంకుల ద్వారా రుణం తెచ్చుకొని వడ్డీతో సహా ఇచ్చిన మొత్తాన్ని శిద్దా తిరిగి తీసుకోవాలి. ఇందుకు ప్రతిఫలంగా ఒంగోలు డెయిరీ చైర్మన్ కుర్చీ ఆయనకివ్వాలి. దీనికి శిద్దా వెంకటేశ్వరరావు అంగీకరించినట్లు సమాచారం. దీంతో బుధవారం మధ్యాహ్నం అత్యవసరంగా సమావేశమైన డెయిరీ పాలకవర్గం శిద్దా వెంకటేశ్వరరావును కొత్త చైర్మన్‌గా ఎన్నుకుంది. మొత్తం తంతు నడిపించిన పాత చైర్మన్ చల్లా శ్రీనివాస్ తన పదవికి రాజీనామా చేశారు. నిబంధనల మేరకు చైర్మన్‌గా ఎన్నుకున్న వ్యక్తి పాల సొసైటీకి అధ్యక్షుడిగా ఉండాలి. దీంతో పాత చైర్మన్ చల్లా శ్రీనివాస్ సొంత గ్రామం ఓగూరు–బి పాల సొసైటీ అధ్యక్షునిగా శిద్దా వెంకటేశ్వరరావును ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత డెయిరీ పాలకవర్గం శిద్దాను కొత్త చైర్మన్‌గా ఎంపిక చేసింది. దీంతో 15 ఏళ్లు డెయిరీ చైర్మన్‌గా కొనసాగిన చల్లా శ్రీనివాస్ ఎట్టకేలకు తన పదవిని కోల్పోయారు. అప్పుల ఊబిలో ఒంగోలు డెయిరీ రూ.80 కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన ఒంగోలు డెయిరీ పంచాయితీ ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు చేరింది. అధికార పార్టీ కనుసన్నల్లో నడుస్తున్న డెయిరీ పాలకవర్గం రైతులు, ఉద్యోగుల బకాయిలు చెల్లించకపోవడంపై రైతులు ఇటు ఉద్యోగులు గడిచిన రెండేళ్లుగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. డెయిరీ కంపెనీ యాక్టులో ఉన్నందున ప్రభుత్వం ఎటువంటి సహాయం చేయలేదు. పాలకవర్గం అప్పుల కోసం ప్రయత్నించినా బ్యాంకులు అప్పులిచ్చే పరిస్థితి లేకుండాపోయింది. ఒంగోలు డెయిరీని అప్పుల్లో కూరుకుపోయేలా చేసిన పాలకవర్గంపై విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా పాడి రైతులు, డెయిరీ ఉద్యోగులు వ్యవహారాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. డెయిరీ పరిస్థితిపై జిల్లాకు చెందిన మంత్రి శిద్దా రాఘవరావు పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్ధన్, ఎమ్మెల్సీ కరణం బలరాంలతో అధిష్టానం చర్చించింది. డెయిరీ అప్పుల్లో కూరుకుపోవడానికి పాలకవర్గం తప్పిందాలే కారణమని అధికార పార్టీ నేతలు సైతం ముఖ్యమంత్రికి వివరించారు. డెయిరీని ఆదుకోవాలంటూ విన్నవించారు. రైతులు, ఉద్యోగుల జీతాలు చెల్లించేందుకు బ్యాంకు రుణమిప్పిస్తామని ముఖ్యమంత్రి సైతం హామీ ఇచ్చినా అది నెరవేరలేదు. వివాదంలో కొత్త చైర్మన్ ఎంపిక ఒంగోలు డెయిరీ కొత్త చైర్మన్ ఎంపిక వివాదంగా మారింది. పరిస్థితి ఇబ్బందికరంగా మారడంతో చైర్మన్ చల్లా శ్రీనివాస్ తన సొంత ప్రయత్నంగా మంత్రి శిద్దా రాఘవరావు సమీప బంధువు శిద్దా వెంకటేశ్వరరావుతో మాట్లాడుకొని చైర్మన్ పదవి అతనికి అప్పగించారు. బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి వద్ద రివ్యూ సమావేశంలో ఉన్న పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్ధన్, మంత్రి శిద్దా రాఘవరావులకు విషయం తెలిసింది. తమకు తెలియకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారంటూ పాత చైర్మన్ చల్లా శ్రీనివాస్‌ను ఇరువురు నేతలు ఫోన్లో మందలించినట్లు సమాచారం. హుటాహుటిన ముఖ్యమంత్రి వద్దకు విజయవాడ రావాలని వారు చల్లా శ్రీనివాస్‌ను ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే అక్కడకు వెళ్లినా ప్రయోజనం ఉండదని ముందు సమస్య నుంచి తాను గట్టెక్కాలని భావించిన చల్లా శ్రీనివాస్ హుటాహుటిన పాలకవర్గం సమావేశం ఏర్పాటు చేసి తన పదవికి రాజీనామా చేసి కొత్త చైర్మన్ శిద్దా వెంకటేశ్వరరావును ఎంపిక చేశారు. డెయిరీని ఆదుకుంటారనే...: చల్లా కందుకూరు మండలం ఓగూరు–బి పాలకేంద్రం ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్న శిద్దా వెంకటేశ్వరరావు డెయిరీ నిబంధనల ప్రకారం చైర్మన్‌గా ఎన్నుకున్నట్లు మాజీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావు తెలిపారు. ప్రస్తుతం ఆర్ధిక సంక్షోభంలో ఉన్న డెయిరీని ఆదుకుంటారనే ఉద్దేశంతో శిద్దా వెంకటేశ్వరరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని తెలిపారు. నెలరోజుల్లో రైతులకు, కార్మికులకు మేలు జరిగేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు. తాను మాత్రం డైరెక్టర్‌గా కొనసాగుతానన్నారు. డెయిరీ అభివృద్ధికి కృషి చేస్తా..: శిద్దా అనంతరం నూతన చైర్మన్ శిద్దా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ డెయిరీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. అయితే డైరెక్టర్లు సహాయ సహకారాలు అందించాలని కోరారు. పైగా డెయిరీ కంపెనీ యాక్టులో ఉంది కనుక చాలా జాగ్రత్తగా నడపాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే సందర్భంలో పాలరైతుల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు ఐదు రోజుల్లో డెయిరీలో ఏయే సమస్యలు ఉన్నయో తెలుసుకొని ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో మళ్లీ విలేకర్ల సమావేశంలో తెలియజేస్తానని తెలిపారు. అనంతరం పాలకవర్గ సభ్యులు, శ్రేయోభిలాషులు, మిత్రులు నూతన చైర్మన్‌ని అభినందించారు. -
'ఇండస్ట్రీ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం'
విజయవాడ (లబ్బీపేట): రాష్ట్రంలో గ్రానైట్ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గ్రానైట్ ఇండస్ట్రీ(ఎఫ్ఏపీజీఐ) చైర్మన్ శిద్దా వెంకటేశ్వరరావు చెప్పారు. రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన గ్రానైట్ ఇండస్ట్రీస్, క్లస్టర్స్ యజమానుల సమావేశం ఆదివారం విజయవాడలోని హోటల్ గేట్‌వేలో జరిగింది. ఈ సమావేశంలో 13 జిల్లాలతో కూడిన నూతన ఫెడరేషన్ ఆఫ్ ఏపీ గ్రానైట్ ఇండస్ట్రీని ఏర్పాటుచేశారు. ఫెడరేషన్ చైర్మన్‌గా ఎన్నికైన శిద్దా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రానైట్ పరిశ్రమపై ఆధారపడి లక్షలాదిమంది జీవనోపాధి పొందుతున్నారన్నారు. తమ ఇండస్ట్రీకి ప్రభుత్వపరంగా ఏం చేయాలి, ప్రభుత్వానికి తామేమి చేయాలనే దానిపై ఫెడరేషన్ కృషి చేస్తుందన్నారు. ఈ సమావేశంలో సుమారు 200 మందికిపైగా సభ్యులు పాల్గొన్నారు. ఫెడరేషన్ కార్యవర్గం ఫెడరేషన్ ఆఫ్ ఏపీ గ్రానైట్ ఇండస్ట్రీ చైర్మన్‌గా శిద్దా వెంకటేశ్వరరావు(ప్రకాశం), వైస్ చైర్మన్లుగా కోట మురళీధర్(శ్రీకాకుళం) అంగర రాజేష్(విశాఖపట్నం), మారం వెంకరెడ్డి(ప్రకాశం), ఆర్.లక్ష్మీనారాయణ (ప్రకాశం), కె.వి.శ్రీనివాస్(చిత్తూరు), బి.సుశీల్‌కుమార్(అనంతపురం) ఎంపికయ్యారు. జనరల్ సెక్రటరీగా డాక్టర్ సీహెచ్.రావు(శ్రీకాకుళం), జాయింట్ సెక్రటరీలుగా కె.ఎం.హరికుమార్(శ్రీకాకుళం), సి.శ్రీనివాసరావు(విశాఖపట్నం), ఎన్.వి.రెడ్డి(ప్రకాశం), జి.మధు(అనంతపురం), బొడ్డు సుబ్బారావు(ప్రకాశం), తిరుపతిరెడ్డి, ఎం.ఎ.అజీమ్(ఒంగోలు), అల్లు నగేష్(శ్రీకాకుళం) నియమితులు కాగా, కోశాధికారిగా వై.శివప్రసాద్(విజయవాడ)ను నియమించారు. చీఫ్ పాట్రన్‌గా ఆర్.వీరమణి, హానరరీ చైర్మన్‌గా డాక్టర్ కె.సుబ్బారెడ్డిలను నియమించారు. వీరితో పాటు మరో 25 మందిని అడ్వయిజరీ బోర్డు సభ్యులుగా నియమితులయ్యారు.