డెయిరీ వద్ద సమావేశమైన ఉద్యోగులు, ఇన్‌సెట్లో జిల్లా పాల ఉత్పత్తుల సహకార సంఘం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు డెయిరీ కొత్త చైర్మన్ శిద్దా వెంకటేశ్వరరావు యూటర్న్ తీసుకున్నారు. మార్చి 28న ఒంగోలు డెయిరీ కొత్త చైర్మన్ అంటూ ఆర్భాటంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన శిద్దా.. ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. చైర్మన్‌గిరి ముళ్ల కిరీటమంటూ డెయిరీ గేటు తొక్కడం మానుకున్నారు. 10 రోజులుగా పత్తా లేకుండాపోయారు. చైర్మన్‌గా ఎంపికైన నాడు శిద్దా ఆర్భాటంగా విలేకర్ల సమావేశం నిర్వహించారు. పాడి రైతులకు, డెయిరీ ఉద్యోగులకు రూ.20 కోట్లు సొంత డబ్బులు చెల్లిస్తున్నానంటూ ప్రకటించారు.
డెయిరీని ముందుకు నడిపిస్తానంటూ గొప్పలు చెప్పారు. డెయిరీ లాభాల్లోకి వచ్చిన తర్వాతే తమ అప్పును జమ వేసుకుంటానని ప్రకటించారు. డెయిరీ ముందుకు నడిపించేవారు వచ్చారని పాడి రైతులు, ఉద్యోగులు ఒకింత సంబరపడ్డారు. నెల రోజులు గడవక ముందే ఆ ఆశలు ఆవిరయ్యాయి. వ్యాపారస్తుడైన శిద్దా యూటర్న్ తీసుకున్నారు. పైసా చెల్లించకపోగా డెయిరీ వైపు తొంగి చూడటం లేదు. ఏం చేయాలో పాలుపోక డెయిరీ ఉద్యోగులు, పాడి రైతులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. మంగళవారం డెయిరీలో సమావేశమైన ఉద్యోగులు ఎండీకి అల్టిమేటం జారీ చేశారు.
తక్షణం న్యాయం చేయకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ మేరకు డెయిరీ డైరెక్టర్లు బుధవారం సమావేశమవుతున్నారు. చివరిసారిగా డైరెక్టర్లు, జిల్లాకు చెందిన నేతలు, ప్రజాప్రతినిధులు చెప్పి ఆందోళన ప్రారంభిస్తామని డెయిరీ ఉద్యోగ సంఘం నేతలు తెలిపారు.డెయిరీ పరిధిలో పాడి రైతులకు రూ.13 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఉద్యోగుల జీతాలు రూ.3 కోట్లు, కరెంట్ బిల్లు రూ.2 కోట్లు, ట్రాన్స్‌పోర్టు బకాయిలు మరో రూ.2 కోట్లు ఉన్నాయి. ఈ మొత్తాన్ని చెల్లిస్తామని కొత్త చైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేసిన రోజు శిద్దా ప్రకటించారు.
ఇదే జరిగితే డెయిరీ తిరిగి రన్నింగ్‌లోకి వస్తుందని మిగిలిన అప్పుల సంగతి తర్వాత చూసుకోవచ్చునని అందరూ భావించారు. అయితే కొత్త చైర్మన్ శిద్దా నెల కావస్తున్నా పైసా చెల్లించలేదు. పైపెచ్చు తన సొంత డబ్బులిచ్చేది లేదని బ్యాంకు రుణం వస్తేనే చెల్లిస్తానంటూ మెలిక పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు సీఎం ఓకే అంటేనే తాను చైర్మన్‌గా డెయిరీకి వస్తానంటూ శిద్దా అడ్డం తిరిగినట్లు తెలుస్తోంది.పాత చైర్మన్ చల్లా శ్రీనివాస్‌తో ఒప్పందం చేసుకున్న శిద్దా వెంకటేశ్వరరావు రాత్రికి రాత్రే ఒంగోలు డెయిరీ చైర్మన్ అయ్యారు. ఆర్భాటంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.
ఒంగోలు నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఫ్లెక్సీలతో ప్రచారం చేసుకున్నారు. శిద్దా డెయిరీ చైర్మన్ ఎంపిక వ్యవహారం తమకు తెలియదంటూ మంత్రి శిద్దా రాఘవరావు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌తో పాటు పలువురు అధికార పార్టీ నేతలు ముఖ్యమంత్రి వద్ద పంచాయతీ పెట్టారు. ఆగ్రహం చెందిన ముఖ్యమంత్రి ఏప్రిల్ 15న పాత, కొత్త చైర్మన్లను విజయవాడకు పిలిపించారు. జిల్లా మంత్రి, టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యేలకు తెలియకుండా డెయిరీ చైర్మన్ ఎలా అవుతావు అంటూ చివాట్లు పెట్టారు. తర్వాత మాట్లాడదాం పో.. అంటూ పంపించివేశారు.
రెండు రోజుల తర్వాత మరోమారు ముఖ్యమంత్రితో సమావేశం ఉంటుందని అన్ని చక్కబడతాయని అధికార పార్టీ నేతలు ప్రకటించారు. ఇది జరిగి 10 రోజులు కావస్తున్నా సమావేశం ఊసే లేదు. దీంతో శిద్దా యూటర్న్ తీసుకున్నారు. సీఎం చెప్పిన తర్వాతే డెయిరీకి వస్తానంటూ పత్తా లేకుండాపోయారు. ఈ పరిస్థితుల్లో ఒంగోలు డెయిరీ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment