పాడిరైతును చితగ్గొట్టి 'హెరిటేజ్‌కు మిల్క్‌షేక్‌'! | Chandrababu Govt bigwigs undermining Amul for own Heritage dairy | Sakshi
Sakshi News home page

పాడిరైతును చితగ్గొట్టి 'హెరిటేజ్‌కు మిల్క్‌షేక్‌'!

Published Tue, Oct 22 2024 5:23 AM | Last Updated on Tue, Oct 22 2024 1:34 PM

Chandrababu Govt bigwigs undermining Amul for own Heritage dairy

పాల సేకరణ ధరలు దారుణంగా తగ్గించేసిన ప్రైవేటు డెయిరీలు 

లీటర్‌పై సగటున ఆవుపాలకు రూ.10 – 20, గేదె పాలపై రూ.15–30 వరకు నష్టం

రాష్ట్రవ్యాప్తంగా దిక్కుతోచని స్థితిలో 27 లక్షల పాడి రైతు కుటుంబాలు 

బ్యాంకు రుణాలు, అప్పులు తీర్చే దారిలేక పాడిని తెగనమ్ముకుంటున్న దుస్థితి 

సొంత డెయిరీ కోసం అమూల్‌ను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వ పెద్దలు 

11 జిల్లాల్లో నిలిచిపోయిన అమూల్‌ పాల సేకరణ.. మిగిలిన చోట్ల కూడా అంతంత మాత్రమే 

4,798 నుంచి వెయ్యికి తగ్గిపోయిన కేంద్రాల సంఖ్య 

ఐదు నెలల క్రితం అమూల్‌ రైతులు 1.25 లక్షలు.. ఇప్పుడు 20 వేలే 

అమూల్‌ కేంద్రాల మూసివేతతో పాడి రైతులకు ప్రతి నెలా రూ.100 కోట్లకు పైగా నష్టం 

ఇదే అదనుగా ప్రైవేట్‌ డెయిరీలు సేకరణ ధరలు తగ్గించడంతో మరో రూ.వెయ్యి కోట్లకుపైగా నష్టపోతున్న పాడి రైతులు

రోజుకు రూ.326 నష్టం
అనంతపురం జిల్లా రోటరీపురానికి చెందిన ఎర్రి స్వామి రోజూ 14 లీటర్ల పాలు అమూల్‌ కేంద్రానికి పోసేవారు. లీటర్‌ ఆవు పాలకు రూ.43 చొప్పున ఆరు లీటర్లకు రూ.258, గేదె పాలకు లీటర్‌ రూ.83 చొప్పున ఎనిమిది లీటర్లకు రూ.664 కలిపి.. మొత్తం రూ.922 ఆదాయం లభించేది. ఇప్పుడు ఈ కేంద్రం మూతపడింది. ఇదే అదనుగా ప్రైవేట్‌ డెయిరీలు ధర తగ్గించడంతో ఆవు పాలు లీటర్‌ రూ.30, గేదె పాలు రూ.52కి అమ్ముకోవాల్సి వస్తోంది. అంటే ఆవు పాలు లీటర్‌కు రూ.13 నష్టం, గేదె పాలు లీటర్‌కు రూ.31 నష్టం. ఫలితంగా రోజూ రూ.326 చొప్పున నష్టపోతున్నట్లు స్వామి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

ఒక్క గ్రామంలోనే రూ.1.34 లక్షలు నష్టం..
అనంతపురం జిల్లా రోటరీపురంలో నిత్యం 16 మంది రైతులు 160 లీటర్ల ఆవు పాలు, 80 లీటర్ల గేదె పాలు జగనన్న పాలవెల్లువ కేంద్రానికి పోసేవారు. గేదె పాలకు లీటర్‌కు గరిష్టంగా రూ.84, ఆవు పాలకు రూ.43 చొప్పున దక్కేది. కూటమి ప్రభుత్వ నిర్వాకంతో ఈ కేంద్రం మూతపడింది. దీంతో గత్యంతరం లేక ప్రైవేట్‌ వ్యక్తులకు పాలు పోస్తుండటంతో లీటర్‌ ఆవు పాలకు రూ.30, గేదె పాలకు రూ.54 చొప్పున ఇస్తున్నారు. 

ఫలితంగా లీటర్‌పై ఆవుపాలకు రూ.13 చొప్పున రూ.2,080, గేదె పాలకు రూ.30 చొప్పున రూ.2,400లను ఈ గ్రామ పాడిరైతులు రోజూ నష్టపోతున్నారు. ఒక్క ఈ గ్రామంలోనే రోజుకు రూ.4,480 చొప్పున నెలకు రూ.1.34 లక్షలకు పైగా ఆదాయాన్ని పాడి రైతులు కోల్పోతున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా మూతపడిన అమూల్‌ పాల కేంద్రాలతో ప్రతి నెలా రూ.100 కోట్లకు పైగా నష్టపోతున్నారు. పాలసేకరణ ధరలు దారుణంగా తగ్గిపోవడం వల్ల ప్రైవేట్‌ డెయిరీలకు పాలుపోసేవారు మరో రూ.వెయ్యి కోట్లకుపైగా నష్టపోతున్నారు.

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రైవేట్‌ డెయిరీల దోపిడీ మళ్లీ మొదలైంది. కూటమి ప్రభుత్వ నిర్వాకంతో పాల సేకరణ ధరలు గణనీయంగా తగ్గిపోయి పాడి రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. ఒకపక్క పాడి పశువుల ధర రూ.లక్షల్లో ఉంది. మరోపక్క పెరుగుతున్న దాణా ఖర్చులతో పోషణ భారంగా మారింది. ఇలాంటి సమయంలో పాడి రైతుకు గిట్టుబాటు ధర దక్కేలా చూడాల్సిన ప్రభుత్వ పెద్దలు వారి పొట్టగొడుతు­న్నారు. 

తమ కుటుంబ సంస్థ హెరిటేజ్‌కు ప్రయోజ­నం చేకూర్చడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తిరుపతి పరిసరాల్లో గతంలో ఆవు పాలకు లీటర్‌కు రూ.30 నుంచి రూ.38 మధ్య చెల్లించిన హెరిటేజ్‌ డెయిరీ ప్రస్తుతం రూ.23 నుంచి రూ.31కి మించి చెల్లించడం లేదని రైతులు చెబుతు­న్నారు. ఇక గేదె పాలకు గతంలో రూ.40–రూ.50 వరకు చెల్లించిన హెరిటేజ్‌... తాజాగా రూ.35 నుంచి రూ.40కి మించి ఇవ్వడం లేదని పేర్కొంటున్నారు. అదే సమయంలో కాకినాడ జిల్లాలో సోమవారం అమూల్‌కు పాలుపోసిన రైతులకు గేదెపాలకు లీటరుకు గరిష్టంగా రూ.92–93, ఆవు పాలకు రూ.39–40 చెల్లించింది. 

ఇలా జగనన్న పాల­వెల్లువ కేంద్రాల (అమూల్‌) ద్వారా దాదాపు నాలు­గేళ్లపాటు లాభా­లతో పొంగిపోయిన రాష్ట్రంలోని పాడి రైతులు కూటమి సర్కారు కక్షపూరిత చర్యలతో ఇప్పుడు తీవ్ర నష్టాల పాలవుతున్నారు. కొత్త ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన నాలుగు నెలల్లోనే 11 జిల్లాల్లో ఈ కేంద్రాలు మూత­పడ్డాయి. మిగిలిన జిల్లాల్లో కూడా సేకరణ అంతంత మాత్రంగానే పాక్షికంగా సాగుతోంది. ఏ గ్రామానికి వెళ్లినా  వెతలు వర్ణనా­తీ­తంగా ఉన్నాయి. 

ప్రైవేట్‌ డెయిరీల దోపిడీతో పాలకు గిట్టుబాటు ధర లభించక, బ్యాంకు రుణాలు తీర్చే దారి కానరాక రాష్ట్రవ్యాప్తంగా 27 లక్షల పాడి రైతు కుటుంబాలు దిక్కు తోచని స్థితిలో కూరుకు­పోయా­యి. గతంలో చంద్రబాబు హయాంలో పులివెందుల, చిత్తూ­­రుతో సహా 8 సహకార డెయిరీలు మూతప­డ్డా­యి. డెయిరీల పునరుద్ధరణ, పాడి రైతులకు గిట్టు­బాటు ధర, ప్రైవేట్‌ డెయిరీల దోపిడీకి అడ్డుకట్ట వేయ­డమే లక్ష్యంగా 2020లో వైఎస్‌ జగన్‌ ప్రభు­త్వం సహ­కార రంగంలో దేశంలోనే నెం.1గా ఉన్న అమూల్‌తో ఒప్పందం చేసుకుని పాడి రైతులను ఆదుకుంది.

పాడి రైతును చితగ్గొట్టి "హెరిటేజ్‌కు పట్టం"

అమూల్‌ రాకతో పాల విప్లవం.. ఎనిమిది సార్లు సేకరణ ధర పెంపు
అమూల్‌ తొలుత మూడు జిల్లాల్లో ప్రారంభమై 19 జిల్లాలకు విస్తరించింది. 400 గ్రామాల నుంచి 4,798 పల్లెలకు చేరుకుంది. 2020 అక్టోబర్‌లో 10 శాతం వెన్నతో లీటర్‌ ఆవు పాలకు రూ.25–28, గేదె పాలకు రూ.56–60 చొప్పున ప్రైవేట్‌ డెయిరీలు చెల్లించగా, అమూల్‌ ప్రారంభంలోనే 11 శాతం వెన్న, 9 శాతం ఘన పదార్థాలు (ఎస్‌ఎన్‌ఎఫ్‌)తో గేదె పాలకు లీటర్‌ రూ.71.47లు, 5.4 శాతం వెన్న, 8.7 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్‌తో ఆవు పాలకు రూ.34.20 చొప్పున చెల్లించింది. 

ఆ తర్వాత వరుసగా 8 సార్లు పాలసేకరణ ధరలను పెంచి గేదె పాలకు రూ.89.76, ఆవుపాలకు రూ.43.69 చొప్పున చెల్లించింది. ఇలా 40 నెలల్లో గేదెపాలకు లీటర్‌పై రూ.18.29, ఆవుపాలపై రూ.9.49 చొప్పున పెంచడంతో లీటర్‌పై రూ.4 అదనంగా లబ్ధి చేకూరుస్తామన్న హామీ కంటే మిన్నగా గేదె పాలపై రూ.15–20, ఆవు పాలపై రూ.10–15 వరకు అదనంగా లబ్ధి చేకూర్చింది.

రికార్డు స్థాయిలో గిట్టుబాటు ధర..
గతేడాది సెప్టెంబర్, అక్టోబర్‌లో వెన్న శాతాన్ని బట్టి కాకినాడ జిల్లాలో గేదె పాలకు లీటర్‌కు రూ.112, ఆవు పాలకు లీటర్‌కు రూ.53.86 చొప్పున అమూల్‌కు పాలుపోసిన రైతులకు దక్కిన దాఖలాలున్నాయి. వెన్న శాతాన్ని బట్టి లెక్కగట్టి అణా పైసలతో సహా ప్రతి 10 రోజులకోసారి రైతుల ఖాతాలో జమ చేసేవారు. 

లీటర్‌కు ఏటా రూ.2–5 పెంచడమే గగనంగా ఉండే ప్రైవేట్‌ డెయిరీలు అమూల్‌ పోటీని తట్టుకోలేక గేదె పాలకు లీటర్‌పై రూ.14, ఆవు పాలపై రూ.7 వరకు సేకరణ ధర పెంచక తప్పలేదు. ప్రైవేట్‌ డెయిరీలతో పోలిస్తే అమూల్‌ పాల సేకరణ ధరలు 10 శాతం అధికంగానే ఉండేవి. సీజన్‌తో సంబంధం లేకుండా వెన్న, ఘన పదార్థాల శాతాన్ని బట్టి అమూల్‌ ఒకే రీతిలో  చెల్లించి పాడి రైతులకు మేలు చేసింది.

80 శాతం కేంద్రాలు మూత
గతంలో 19 జిల్లాలకు విస్తరించిన అమూల్‌ పాలసే­క­రణ కూటమి సర్కారు సహాయ నిరాకరణతో ప్రస్తుతం ఎనిమిది జిల్లాలకే అది కూడా పాక్షిక సేకరణకు పరిమితమైంది. 4,798 కేంద్రాల్లో జరిగిన పాల సేకరణ వెయ్యి కేంద్రాలకు తగ్గిపోయింది. ఐదు నెలల క్రితం అమూల్‌కు పాలు పోసే వారి సంఖ్య రోజుకు సగటున 1.25 లక్షలు ఉండగా నేడు 20 వేలకు క్షీణించింది. ఇదే సమయంలో పాల సేకరణ 3.95 లక్షల లీటర్ల నుంచి 1.30 లక్షల లీటర్లకు తగ్గిపోయింది.

కుటుంబ సంస్థకు మేలు చేసేందుకే..
సీఎం చంద్రబాబు అధికార పగ్గాలు చేపట్టింది మొదలు సొంత డెయిరీకి మేలు చేస్తూ అమూల్‌ను నీరుగార్చే చర్యలకు శ్రీకారం చుట్టారు. నాలుగు దశాబ్దాల క్రితం సహకార సమాఖ్యగా ఏర్పడిన విజయ డెయిరీ నిలదొక్కుకునేందుకు ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్‌ కో ఆపరేటివ్‌ ఫెడరేషన్‌ (ఏపీడీడీసీఎఫ్‌) దాదాపు దశాబ్దం పాటు చేయూతనిచ్చింది. పాలసేకరణ, రైతుకు మద్దతు ధర, పాల ఉత్పత్తుల లభ్యతను నిర్ధారించేందుకు అవసరమైన యంత్రాంగాన్ని సమకూర్చారు. 

అదే రీతిలో అమూల్‌కు చేయూత నిచ్చేందుకు నియమించిన సిబ్బందిని కూటమి ప్రభుత్వం కొలువుదీరిన రెండో రోజే వెనక్కి రప్పించింది. అంగన్‌వాడీ కేంద్రాలకు రోజూ 50 వేల లీటర్ల పాల సరఫరా బాధ్యతల నుంచి సైతం అమూల్‌ను తప్పించింది. దీంతో సేకరణ కేంద్రాలను మూసివేసే దిశగా అమూల్‌ అడుగులు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తొలుత అనంతపురం, తిరుపతి, శ్రీసత్యసాయి జిల్లాల్లో కేంద్రాలను నిలిపి వేసిన అమూల్‌ అనంతరం గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల సహా 11 జిల్లాల్లో పాలసేకరణను నిలిపి వేసింది. మిగిలిన జిల్లాల్లో నామమాత్రంగా సేకరణ జరుగుతోంది. 

ఇదే అదనుగా ప్రైవేట్‌ డెయిరీలు పాల సేకరణ ధరలను తగ్గించేయడంతో గ్రామీణ మహిళా పాడి రైతుల జీవనోపాధికి గండి పడింది. హెరిటేజ్‌ సహా ప్రధాన ప్రైవేటు డెయిరీలన్నీ పాల సేకరణ ధరలను లీటర్‌పై సగటున ఆవు పాలకు రూ.10–20, గేదె పాలకు రూ.15 నుంచి రూ.30 వరకు తగ్గించేశాయి. తాము చెప్పిందే ధర, ఇచ్చిందే తీసుకోవాలనే విధంగా వ్యవహరిస్తున్నాయి. వెన్న, ఎస్‌ఎన్‌ఎఫ్‌ శాతాలతో సంబంధం లేకుండా 15 రోజులకోసారి సగటు ధర నిర్ణయిస్తుండడంతో ఒక్కో పాడి రైతు సగటున రోజుకు రూ.100–500 వరకు నష్టపోతున్నారు.

గత ప్రభుత్వం పాడి రైతులను ఆదుకుందిలా..
180 రోజుల పాటు పాలుపోసే వారికి లీటర్‌కు రూ.0.50 చొప్పున బోనస్‌ రూపంలో రూ.6.50 కోట్ల అదనపు లబ్ధి చేకూర్చడమే కాకుండా లాభాపేక్ష లేకుండా నాణ్యమైన ఫీడ్‌ పంపిణీ చేశారు. వర్కింగ్‌ క్యాపిటల్‌ రూపంలో గేదెకు రూ.30 వేలు, ఆవుకు రూ.25 వేల చొప్పున, కొత్త పాడి కొనుగోలుకు గేదెకు రూ.93 వేలు, ఆవులకు రూ.76 వేల చొప్పున ఆర్ధిక చేయూత­నిచ్చారు. ఒక్కొక్కటి రూ.12.81 లక్షల అంచనా వ్యయంతో 11,800 పాల సేకరణ కేంద్రాలు (ఏఎంసీయూ), ఒక్కొక్కటి రూ.20.42 లక్షల అంచనాతో 4,796 పాల శీతలీకరణ కేంద్రాల (బీఎంసీయూ) నిర్మాణానికి గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 

మూతపడిన మదనపల్లి డెయిరీని అమూల్‌ సహకారంతో పునరుద్ధరించారు. చిత్తూరు డెయిరీకి ఉన్న రూ.182 కోట్ల అప్పులను తీర్చి రూ.385 కోట్ల పెట్టుబ­డులు పెట్టేందుకు ముందుకొచ్చిన అమూ­ల్‌కు లీజుకిచ్చారు. రూ.70 కోట్లతో రోజుకు లక్ష లీటర్ల సామర్థ్యంతో మిల్క్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను ప్రారంభించారు.

ప్రతి నెలా బోనస్‌ వచ్చేది
అమూల్‌ కేంద్రానికి రోజూ 9 లీటర్లు పాలు పోశాం. ఫ్యాట్, ఎస్‌ఎన్‌ఎఫ్‌ శాతాన్ని బట్టి గరిష్టంగా లీటర్‌కు రూ.85–95 వరకు ఇచ్చేవారు. ప్రతి నెలా బోనస్‌ వచ్చేది. పది రోజులకోసారి బ్యాంక్‌ ఖాతాలో సొమ్ములు జమ చేసేవారు. అమూల్‌ కేంద్రం మూతపడడంతో ప్రెవేట్‌ డెయిరీకి పోయాల్సి వస్తోంది. ఎస్‌ఎన్‌ఎఫ్‌ శాతం ఎంత ఉన్నా లీటరుకి రూ.75కి మించి రావడం లేదు. సగటున రోజుకి రూ.100కిపైగా నష్టపోతున్నా.  
    – ఎనుముల పవనకుమారి, పోతవరం, ప్రకాశం జిల్లా.

పట్టించుకోకపోవడం దారుణం
అమూల్‌ కేంద్రానికి పూటకు 4 లీటర్లు పాలు పోసేవాళ్లం. గేదె పాలు లీటర్‌కు రూ.70కు పైగా వచ్చేది. ఇప్పుడు అమూల్‌ కేంద్రం మూతపడటంతో ప్రైవేట్‌ డెయిరీలు రూ.30కి మించి ఇవ్వడం లేదు. బ్యాంక్‌ రుణాలు ఎలా చెల్లించాలో తెలియడం లేదు. అమూల్‌ కేంద్రాలు మూతపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం.
    – ఎం.భారతి, సముదాయం, తిరుపతి జిల్లా

మళ్లీ బెంగళూరు వలస వెళ్లాల్సిందే...
రోజూ 32 లీటర్ల పాలు అమూల్‌కు పోసేవాళ్లం. లీటరుకు రూ.42 చొప్పున రోజుకు రూ.1,300కిపైగా వచ్చేవి. రెండు రోజులుగా శ్రీజ డెయిరీకి పోస్తున్నా. ఇప్పుడు రోజుకు రూ.900 కూడా రావడం లేదు. అమూల్‌ ద్వారా మహిళా సహకార సంఘంలో నాలుగు ఆవులను రూ.2 లక్షల లోన్‌పై తీసుకున్నా. రుణ వాయిదాలు ఎలా చెల్లించాలో దిక్కు తోచడం లేదు. ఇలాగైతే పాడిని అమ్ముకోవడం మినహా గత్యంతరం లేదు. పాడి రైతులంతా గతంలో మాదిరిగా బెంగళూరు వలస వెళ్లాల్సిందే. 
    – శశికళ, కౌలేపల్లి, శ్రీసత్యసాయి జిల్లా

జగన్‌పై కోపాన్ని మాపై చూపిస్తున్నారు..
రోజూ 20 లీటర్ల వరకు పాలు పోస్తాం. ఈ ఏడాది ఏప్రిల్, మే వరకు ఆవు పాలకు గరిష్టంగా లీటర్‌కు రూ.44,  గేదె పాలకు గరిష్టంగా రూ.67 వరకు లభించింది.  అత్తమీద కోపం దుత్తపై చూపినట్లు జగన్‌పై కోపాన్ని పాడి రైతులపై చూపిస్తున్నారు. ఇలాగైతే పాడి పశువులను అమ్ముకోవాల్సిందే. 
    – పి.ఉమా, కురబాలకోట, అన్నమయ్య జిల్లా

ఇదే పరిస్థితి ఉంటే పాడిని వదిలేస్తాం
వెన్న శాతాన్ని బట్టి గతంలో లీటరుకి రూ.82 వచ్చేది. ప్రస్తుతం వెన్న శాతం ఎంత ఉన్నా రూ.72కు మించి ఇవ్వడం లేదు. గతంలో రూ.80–100 ఉండే ఒక బొద్దు ఎండు గడ్డి ప్రస్తుతం రూ.120 చెల్లించి కొనుగోలు చేస్తున్నాం. గేదెలకు ఎండు గడ్డి వేయకపోతే వెన్న శాతం పెరగదు. తవుడు కిలో రూ.40 చొప్పున కొనుగోలు చేస్తున్నాం. జగన్‌ హయాంలో పాడి రైతులకు గిట్టుబాటు ధర లభించింది. ఇప్పుడు ప్రైవేటు డెయిరీలు పాలసేకరణ ధరలను దారుణంగా తగ్గించేస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే పాడిని వదిలేస్తాం.    
– ఎం.బ్రహ్మయ్య, రాళ్లపాడు, ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా

మేం రోడ్డున పడ్డాం..
అమూల్‌ కోసం మహిళా పాల సహకార సంఘం ద్వారా రోజూ 480 లీటర్ల వరకు సేకరించేవాడ్ని. లీటర్‌కు రూ.1.25 చొప్పున నెలకు రూ.18 వేలు కమిషన్‌ వచ్చేది. ఆ డెయిరీ మూత పడడంతో రోడ్డున పడ్డాం. ఆవులను అయినకాడికి అమ్ముకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు. అమూల్‌ కేంద్రాలు మూతపడకుండా చూడాలని వేడుకున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు.   
 – చంద్రమోహన్, కొండకమర్ల, శ్రీసత్యసాయి జిల్లా 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement