రాజ్యమేలుతున్న మారీచ తంత్రం! | Sakshi Editorial On AP Chandrababu Govt By Vardhelli Murali | Sakshi
Sakshi News home page

రాజ్యమేలుతున్న మారీచ తంత్రం!

Published Sun, Nov 17 2024 12:01 AM | Last Updated on Sun, Nov 17 2024 12:01 AM

Sakshi Editorial On AP Chandrababu Govt By Vardhelli Murali

జనతంత్రం

వారి మాటల్లో మారీచ తంత్రం ఉంటుంది... ఓట్ల కోసం బంగారు జింకలమని చెప్పుకున్నారు కదా! చేతలు మరీచికా సదృశాలు... అమలుకాని హామీలు ఎండమావుల్ని తలపించడం లేదా? ఆంధ్రప్రదేశ్‌ను పరిపాలిస్తున్న కూటమి సర్కార్‌ అనాటమీ ఓ కుతంత్రాన్ని తలపిస్తున్నది. గుండెల్లో గోబెల్స్‌ను పూజిస్తూ జెండాపై ఊసరవెల్లిని ఎగరేసినట్టుగా వారి చర్యల తాత్పర్యం తేటతెల్లం చేస్తున్నది. ఎన్నికల ముందు చేసిన బాసలకూ, ఇప్పుడు మాట్లాడుతున్న భాషకూ పొంతన కుదరడం లేదు. దగా, మోసం, వంచన... మూడు పార్టీల కూటమికి ముచ్చటైన స్ఫూర్తి వాచకాలేమో!

గద్దెనెక్కడం వరకే ఈ దగా పర్వం పూర్తి కాలేదు. ప్రజల ప్రశ్నించే హక్కును హైజాక్‌ చేయడానికి డైవర్షన్‌ కమెండోలను రంగంలోకి దించుతున్నారు. ప్రత్యర్థుల వ్యక్తిత్వ హననం కోసం పాతాళానికి దిగజారుతున్నారు. రణనీతిని రాక్షసరీతి కమ్మేసింది. అసత్యాలను కూడిక చేసి, హెచ్చ వేసి, ఆపైన అచ్చేసి మెదళ్లను కలుషితం చేస్తున్నారు. వారి పరిపాలనా వైఫల్యాలను ఎవరూ ప్రశ్నించకూడదు. ఎన్నికల మేనిఫెస్టో గురించి ఎవరూ మాట్లాడకూడదు. తాము ఎత్తిపోసిన బురదను కడుక్కునే పనికి మాత్రమే ప్రతిపక్షం పరిమితమై ఉండాలి. ఇదీ ఎత్తుగడ!

కూటమి సర్కార్‌ వంచనా శిల్పం ప్రజాస్వామ్యాన్ని కూడా చెరబడుతున్నది. ప్రజల ప్రాథమిక హక్కయిన భావప్రకటనా స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తున్నది. అసభ్య పోస్టింగ్‌లనే ముద్రవేసి హేతుబద్ధమైన విమర్శలపై సైతం లాఠీ ఝళిపిస్తున్నది. నోళ్లు నొక్కేయడానికి తెగిస్తున్న తీరు ఎమర్జెన్సీ కాలాన్ని మరిపిస్తున్నది. 

సమాచార విప్లవ ఫలితంగా ప్రభవించిన సోషల్‌ మీడియా యుగంలో ఉన్నాము. భావప్రకటనా స్వేచ్ఛను సకల జనులకూ అందుబాటులోకి తెచ్చిన యుగమిది. తప్పుడు హామీలిచ్చి తోక జాడిస్తే గతంలో మాదిరిగా ఇప్పుడు జనం మిన్నకుండిపోవడం లేదు. ప్రశ్నిస్తున్నారు. వారి ప్రశ్నలు సోషల్‌ మీడియాలో ప్రతిధ్వనిస్తున్నవి.

ఏ నాయకుడు ఎప్పుడేమి మాట్లాడిందీ సాక్ష్యాధారాలతో జనం చేతిలో ఉంటున్నది కనుక ఇప్పుడు పబ్లిక్‌ ఆడిట్‌ను ఎవరూ తప్పించుకునే పరిస్థితి లేదు. అబద్ధాల పునాదులపై మొలకెత్తిన రాజకీయ నాయకులను ఈ పబ్లిక్‌ ఆడిట్‌ భయ పెడుతున్నది. ఈ భయపెడుతున్న మీడియానే భయపెట్టడానికీ, గొంతునొక్కడానికీ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని ఇప్పుడు ఏపీలో చూస్తున్నాం. 

రాజకీయ పోస్టులు పెడుతున్న దాదాపు 700 మందికి గత కొద్దిరోజులుగా పోలీసులు నోటీసులు పంపించారు. అందులో 176 మందిపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. 55 మందిని చెప్పాపెట్టకుండా అరెస్ట్‌లు చేసి, స్టేషన్‌ మార్చి స్టేషన్‌కు తిప్పారు. హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ దాఖలైతే తప్ప చాలా అరెస్టులను చూపనే లేదు. ఎమర్జెన్సీ కాలంలో కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు జరగలేదు.

అరెస్టయిన, కేసులను ఎదుర్కొంటున్న సోషల్‌ మీడియా యాక్టివిస్టుల పోస్టుల్లో అత్యధికం రాజకీయపరమైనవే. నిజమే, అసభ్య పోస్టులు అనే జాడ్యం సోషల్‌మీడియాలో ప్రమాదకరంగా మారింది. ఈ జాడ్యానికి మందు వేయాల్సిందే! కానీ ఈ పేరుతో సర్కార్‌ తనకు గిట్టని పోస్టులు పెడుతున్నవారిని వేటాడుతున్నది. 

తెలుగుదేశం పార్టీ తరఫున పని చేస్తూ బూతు పోస్టులు పెట్టే వారిపై ఇంతవరకూ ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం, వైసీపీకి అనుకూలంగా ఉండేవారినే వేటాడటం దేన్ని సూచిస్తున్నది? రాజకీయ కక్షనే కదా! ఈ కక్ష ఎంత దూరం వెళ్లిందంటే ఆర్గనైజ్డ్‌ క్రిమినల్స్‌పై పెట్టే సెక్షన్లను ఈ యాక్టివిస్టుల మీద పెడుతున్నారు. టెర్రరిస్టులు, స్మగ్లింగ్, డ్రగ్స్‌ ముఠాలు వగైరాలు ఈ వ్యవస్థీకృత నేరాల పరిధిలోకి వస్తాయి. 

పైగా రెండు మూడేళ్ల కిందటి పోస్టులకు కూడా ఈ యేడు జూలై 1వ తేదీన అమల్లోకి వచ్చిన బీఎన్‌ఎస్‌ సెక్షన్లను ఆపాదిస్తున్నారు. అలా చేయవద్దని ఉన్నత న్యాయస్థానాల తీర్పులున్నప్పటికీ మనవాళ్లు పట్టించుకోవడం లేదు. కొత్తగా వచ్చిన శిక్షాస్మృతి ప్రకారం సైబర్‌ నేరాలు ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ కేటగిరీలోకి వస్తాయి. సోషల్‌మీడియాను కూడా సైబర్‌ నేరాల పరిధిలోకి తీసుకొనిరావడమనేది అచ్చంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వ క్రియేటివిటీ. 

రాజకీయాలకు అనుబంధంగా పనిచేస్తూ సోషల్‌ మీడియాను హోరెత్తించే గ్రూపుల్లో అత్యంత ఆర్గనైజ్డ్‌ గ్రూప్‌ ‘ఐటీడీపీ’ అనే సంగతి జగమెరిగిన సత్యం. ఇది తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్నదనే సంగతి కూడా తెలిసిందే. అసభ్య పోస్టులు, బెదిరింపు పోస్టులు పెట్టడంలో కూడా ‘ఐటీడీపీ’దే అగ్రస్థానమని విశ్లేషకులు ఎవరైనా చెబుతారు. ఇదే విషయాన్ని ప్రముఖ రాజకీయ వ్యాఖ్యాత ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ కూడా వెల్లడించారు. 

తనకు తెలిసినంత వరకూ ఏ రాజకీయ పార్టీకి చెందిన సోషల్‌ మీడియా విభాగం కూడా ఐటీడీపీ స్థాయిలో బూతులకూ, బెది రింపులకూ తెగబడలేదని ఆయన వెల్లడించారు. రాజకీయ ప్రత్యర్థులనే కాదు తన లాంటి తటస్థ రాజకీయ విశ్లేషకులను కూడా వాళ్లు వదిలిపెట్టడం లేదని ఆయన వాపోయారు. 

తెలుగు దేశం అభిమానులు అర్ధరాత్రి, అపరాత్రి కూడా ఫోన్లు చేసి తిడుతున్నారని ఆరోపించారు. తమకు గిట్టనివారు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా కనిపించకపోతే... ఈ–మెయిళ్ల ద్వారా బూతు పంచాంగాలు పంపించడం ఆ పార్టీ అభిమానులకు రివాజుగా మారింది. ఈ పత్రిక సంపాదకుడు కూడా ఇటువంటి బూతు మెయిళ్ల బాధితుడే!

‘ఐటీడీపీ’ వంటి నెంబర్‌ వన్‌ ఆర్గనైజ్డ్‌ సోషల్‌ మీడియా గ్రూప్‌ సభ్యులపై కేసు కూడా పెట్టలేదంటేనే ప్రభుత్వ ఉద్దేశమేమిటో స్పష్టమవుతున్నది. తమ రాజకీయ ప్రత్యర్థుల పైనా, వారి కుటుంబ సభ్యుల పైనా ఏ తరహా పోస్టులను ఈ గ్రూప్‌ సభ్యులు పెట్టారో తెలియదా? ఎంతగా వేధించారో తెలియదా? ఈ ఉద్యమకారుల సృజనాత్మకత కూడా చాలా పదునైనది. 

పేర్లను మార్చుకొని పరకాయ ప్రవేశం చేసి పెట్టిన కామెంట్లతో కల్లోలం సృష్టించడం వారికో హాబీ. వర్రా రవీందర్‌ రెడ్డి అనే వైసీపీ అభిమాని పేరుతో జగన్‌ మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యుల మీద ఓ తెలుగుదేశం అభిమాని పెట్టిన పోస్టులు కూడా అటువంటి కల్లోలాన్నే సృష్టించాయి. దీనిపై దర్యాప్తు జరిపిన పోలీసులు అది రవీందర్‌ రెడ్డి పెట్టిన పోస్టు కాదనీ, మరొకరు పెట్టిన ఫేక్‌ పోస్ట్‌ అనీ తేల్చారు. ఆ రంగులు మార్చిన మారీచు డిని కూడా గుర్తించారు.

జరిగింది ఇదైతే... తెలుగుదేశం పార్టీ విభాగాలన్నీ కలిసి చేసిన నీచప్రచారం మరొకటి! నిన్న అసెంబ్లీలో కూడా ఈ దుష్ప్రచారపు బాణీనే ముఖ్యమంత్రి చంద్రబాబు అందిపుచ్చు కున్నారు. అసెంబ్లీ చరిత్రలో ఇంతకంటే బాధాకరమైన సన్నివేశం మరొకటి కనిపించదు. ‘ఐటీడీపీ’ చేయించిన తప్పుడు ప్రచారానికి ముఖ్యమంత్రి అసెంబ్లీలోనే తందానా అన్నారు. 

తల్లి మీద, చెల్లి మీద జగన్‌ నీచమైన ప్రచారం చేయించారని దారుణమైన నిందను మోపారు. ఇది హీనమైన ప్రచార మనీ, మీ పార్టీ వాళ్లే సృష్టించిన పన్నాగమనీ నిజంగానే మీకు తెలియదా బాబు గారూ! మీ సతీమణి భువనేశ్వరమ్మను అసెంబ్లీలో ఎవరో ఏదో అన్నారని మీరు వెక్కి వెక్కి ఏడ్చారే! మరి అసెంబ్లీలో ఒక దుష్ప్రచారాన్ని ఉటంకిస్తూ జగన్‌ తల్లి, చెల్లెలి ప్రస్తావన స్వయంగా మీరే తేవడం సమంజసమేనా?

ఎన్నికల్లో గెలవడం కోసమే అలవిగాని హామీలిచ్చామనే సంగతి చంద్రబాబుకు స్పష్టంగా తెలుసు. ఆ వాగ్దానాలను నెరవేర్చలేమనే విషయాన్ని ఆయన నిన్నటి అసెంబ్లీ ప్రసంగంలో నర్మగర్భంగా చెప్పుకొచ్చారు. హామీల అమలుకు డబ్బుల్లేవు గానీ ఆలోచనలున్నాయని, ఆలోచనల్లోంచే సంపద సృష్టి జరుగుతుందనీ, అప్పుడు గానీ సంక్షేమ కార్యక్రమాలు అమలు కాబోవనేది ఆయన ప్రసంగంలోని సారాంశం. 

ఆయన మేధలో ఏయే విత్తనాలను నాటుకున్నారో మనకు తెలియదు. అవి మొలకెత్తి మొక్కగా మారి చెట్టయ్యేది ఎప్పటికో కూడా చెప్పలేము. ఆ చెట్టు పుష్పించి ఫలించిన రోజున ఆ ఫలాలను పేద వర్గాలకు అందజేయడం జరుగుతుందనే భరోసాతో ఎదురుచూడక తప్పదు. అందరికీ అంత ఓపిక ఉండకపోవచ్చు. తప్పుడు హామీలు ఇచ్చి మోసం చేశారని జనం తిరగబడ వచ్చు. అందుకు విరుగుడు మంత్రమే... ఈ గోబెల్స్‌ నాజీల తరహా విషప్రచారం! ఫాసిస్టు పాలనను తలదన్నేలా అర్ధరాత్రి అరెస్టులు, బెదిరింపులు!

జగన్‌ ఐదేళ్లపాటు విధ్వంస పాలన చేశాడనే విష ప్రచారాన్ని ఐదేళ్లపాటు తెలుగుదేశం నేతలు, యెల్లో మీడియా, ‘ఐటీడీపీ’ బృందాలు నిర్వహించాయి. నిరుపేద బిడ్డలకు కూడా నాణ్యమైన విద్యను అందించే ప్రయత్నాన్ని ఈ కూటమి విధ్వంస పాలనగా పరిగణిస్తున్నది. పల్లెపల్లెకూ, గడప గడపకూ ప్రజావైద్యాన్ని అందుబాటులోకి తేవడం ఈ ముఠాకు విధ్వంసంగా కనిపించింది. ఐదేళ్లలో రెండు లక్షల డెబ్భయ్‌ మూడువేల కోట్ల ప్రజాధనాన్ని ప్రజల చేతికి చేర్చడమే వీరి దృష్టిలో విధ్వంస పాలనైందని అనుకోవాలి. 

వృద్ధాప్యంలో ఉన్న వారి ఇంటి తలుపు తట్టి, పింఛన్‌ డబ్బులు చేతిలో పెట్టడం అరాచక పాలనగానే కనిపించింది. గ్రామస్వరాజ్యాన్ని సాకారం చేసి, పదిహేను వేల మినీ రాజధానులను ఏర్పాటు చేయడం వినాశకర పాలనగా కనిపించింది. ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలేగానీ, పదిహేను వేల పల్లె రాజధానులెందుకని వారికి చిరాకు కలిగి ఉంటుంది.

ఏకబిగిన 17 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలకు అనుమతులు తెచ్చి, అందులో ఐదు కాలేజీలను ప్రారంభించడం విధ్వంసం కాక మరేమిటి? నాలుగు భారీ ఓడరేవులకు పనులు ప్రారంభించడమేమిటి? పది ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం ఎందుకోసం? రైతుల కోసం ఊరూరా ‘ఆర్‌బీకే’ కేంద్రాలు అవసరమా? ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిని ఒక జిల్లాగా పునర్విభజించి పాలనా సంస్కరణలకు తెగబడటమేమిటి? అంతకు ముందు పధ్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న బాబుగారు ఒక్క జిల్లానైనా కొత్తగా చేర్చారా? అది కదా పొదుపంటే! ...ఇటువంటి అనేకా నేక కారణాల రీత్యా జగన్‌మోహన్‌ రెడ్డి విధ్వంస పాలన చేశారనే ప్రచారాన్ని కూటమి ఉద్యమ స్థాయిలో చేపట్టింది. 

ముఖ్యమంత్రి నిన్నటి అసెంబ్లీ ప్రసంగంలో కూడా దానిని కొనసాగించారు. అప్పుల గురించి, అభివృద్ధి గురించి తెలుగు దేశం... యెల్లో మీడియా కూటమి చేసిన అరోపణలకు ఇప్పటికి కొన్ని డజన్ల పర్యాయాలు అధికారిక గణాంకాల ఉటంకింపులతో వైసీపీ వాళ్లు ధీటైన సమాధానాలు చెప్పారు. మొన్నటి బడ్జెట్‌ తర్వాత రెండు గంటల సుదీర్ఘ సమయాన్ని వెచ్చించి జగన్‌ మోహన్‌రెడ్డి కూటమి వాదనను పూర్వపక్షం చేశారు. అయినా సరే చంద్రబాబు నిన్న అదే పాటను మళ్లీ పాడారు. పాడిన పాటే పాడటంపై తెలుగులో మనకు చాలా సామెతలున్నాయి!


వర్ధెల్లి మురళి 
vardhelli1959@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement