జంతువుల కొవ్వు కలిసిందని చెప్పు.. నాగేశ్వర్‌కు బెదిరింపులు | Threats to Professor Nageshwar From TDP On TTD Laddu Issue | Sakshi
Sakshi News home page

జంతువుల కొవ్వు కలిసిందని చెప్పు.. నాగేశ్వర్‌కు బెదిరింపులు

Feb 11 2026 4:08 AM | Updated on Feb 11 2026 4:08 AM

Threats to Professor Nageshwar From TDP On TTD Laddu Issue

ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌కు బెదిరింపులు 

పందికొవ్వు, ఆవుకొవ్వు, బాత్రూం రసాయనాలు కలిశాయని ఎందుకు చెప్పడం లేదంటూ హూంకరింపులు 

అవే కాకుండా మరికొన్ని దారుణమైనవి కలిశాయని చెప్పాలంటూ దాదాపు 20 నుంచి 30 ఫోన్లు.. మూడు రోజుల క్రితమే ఫిర్యాదు చేసినా పట్టించుకోని మంత్రి లోకేశ్‌

సాక్షి, అమరావతి: ‘‘ఒరేయ్‌.. నా కొడకా.. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో పందికొవ్వు, ఆవుకొవ్వు, బాత్రూం రసాయనాలు కలిశాయని ఎందుకు చెప్పవురా నువ్వు.. ఇదే కాదు ఇంత కన్నా దారుణమైంది కలిసిందని కూడా చెప్పాలి.’’ అంటూ కొంతమంది ఆగంతకులు ఫోన్లు చేసి తనను బెదిరిస్తున్నట్లు ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌  వెల్లడించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో మంగళవారం ఆయన ఓ వీడియో విడుదల చేశారు. కొద్ది రోజులుగా లడ్డూలో కల్తీ జరిగిందంటూ చంద్రబాబు, పవన్, లోకేశ్‌ చేస్తున్న ప్రచారాన్ని నాగేశ్వర్‌ తీవ్రంగా వ్యతిరేస్తున్నారు. 

లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ–సిట్‌ చార్జ్‌షీట్‌లో స్పష్టం చేసిన తరువాత కూడా కలిసిందని నిరూపించాలని యత్నం చేయడం హిందూ దేవుళ్లు, హిందూ సమాజంపై జరుగుతున్న దాడిగా ఆయన అభివర్ణించారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు కూటమి అనుకూల వర్గీయులు బెదిరింపు ఫోన్లు చేస్తున్నారు. జంతువుల కొవ్వు, బాత్రూం రసాయనాలే కాకుండా మరికొన్ని దారుణమైనవి లడ్డూలో కలిశాయని చెప్పాలంటూ దాదాపు 20 నుంచి 30 ఫోన్లు వచ్చాయని నాగేశ్వర్‌ తెలిపారు. అలా చెప్పడం అన్యాయమవుతుందని, కావున తానలా చెప్పలేనన్నానని ఆయన వివరించారు.  

‘రెడ్‌బుక్‌ రాజ్యాంగం’ వారిపై అమలు కాదా? 
మూడు రోజుల క్రితమే ఈ వేధింపులపై ఫిర్యాదు చేసినా మంత్రి లోకేశ్‌ కనీసం పట్టించుకోలేదని నాగేశ్వర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.  కాల్‌ రికార్డులను లోకేశ్‌ టీమ్‌ జైకు పంపించానని, దీనికి స్పందనగా ఆయన పోలీసులు ఆగంతకులను హెచ్చ­రిం­చారని, మళ్లీ ఆ నెంబర్‌ నుంచి బెదిరింపు ఫో­న్లు రావని చెప్పారని నాగేశ్వర్‌ వివరించారు. అయి­తే ఒకరు కాదు, ఇద్దరు కాదు రోజుకు 20 నుంచి 30 మంది  ఫోన్‌లు చేస్తున్నారని, బెదిరిస్తున్న వారి నంబర్లు రాష్ట్ర మంత్రికి స్వయంగా పంపితే వారిపై రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు చేయాలి కదా అని లోకేశ్‌ను నిలదీశారు. ‘‘మీరు నన్ను కొట్టినా, తిట్టినా, చంపుతామని బెదిరించినా, నేను మాత్రం నిరూపణ కాకుండా, ఆధారాలు లేకుండా దేవుని లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిసిందనే మాటను చచ్చినా అనను. పంది కొవ్వు కలిసిందని, బాత్రూం రసాయనాలు కలిశాయని మీరు వాడుతున్న భాషను నేను వాడను. ఏం చేసుకుంటారో చేసుకోండి. నేను దేనికైనా సిద్ధం.’’ అని ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ స్పష్టం చేశారు. 

కల్తీ జరిగితే నిరూపించండి: 
మరో వైపు లడ్డూ విషయంలో జరుగుతున్న ప్రచారం, వస్తున్న వార్తలపై నాగేశ్వర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఎఫ్‌ఐఆర్‌గానీ, విచారణగానీ జరగకుండా సీఎం చంద్రబాబు లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ ప్రకటన చేయడం, దానిని పట్టుకుని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్, మంత్రి లోకేశ్‌ కూడా అదే మాట్లాడటం దారుణమని మరోసారి నాగేశ్వర్‌ తప్పుబట్టారు.  

Advertisement
 
Advertisement
Advertisement