
పోసాని కృష్ణమురళితో మాట్లాడుతున్న ఆయన సతీమణి
అబద్ధపు వాంగ్మూలంతో అక్రమ అరెస్టులకు కుట్ర!
నిబంధనలకు విరుద్ధంగా 164 సీఆర్‌పీసీ వాంగ్మూలం నమోదు
ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో బరితెగించిన సీఐడీ
చట్టబద్ధ దర్యాప్తు ప్రక్రియను భ్రష్టుపట్టిస్తున్న చంద్రబాబు సర్కారు
న్యాయ ప్రక్రియను అపహాస్యం చేస్తూ కుట్ర
టీడీపీ ప్రధాన కార్యాలయం చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలంతో కుతంత్రం
జీవితంలో ఏనాడూ చూడని వ్యక్తుల పేర్లను కూడా చెప్పించే కుయుక్తి
మద్యం విధానంపై కేసులో అక్రమ అరెస్టులకు పన్నాగం
తప్పుడు వాంగ్మూలంతో సంబంధం లేని వ్యక్తులను ఇరికించే స్కెచ్
రెడ్‌బుక్ రాజ్యాంగ కుట్రలతో చంద్రబాబు ప్రభుత్వం యథేచ్ఛగా విధ్వంసానికి బరితెగిస్తోంది. టీడీపీ కూటమి నియంతృత్వ పాలన రాష్ట్రంలో రాజ్యాంగ హక్కులను కాలరాస్తోంది. పౌరుల ప్రాథమిక హక్కులను పాశవికంగా అణచివేస్తోంది. చట్టబద్ధ దర్యాప్తు ప్రక్రియను భ్రష్టు పట్టిస్తోంది. ధర్మబద్ధ న్యాయ ప్రక్రియను మంటగలుపుతోంది. అందుకోసం పోలీసు శాఖ ద్వారా అధికారిక గూండాగిరీకి పాల్పడుతోంది. సీఐడీ విభాగాన్ని తమ కక్ష సాధింపు చర్యలకు సాధనంగా చేసుకుంటోంది. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ పచ్చ కుట్రలకు అంతకంతకూ పదునుపెడుతోంది. వైఎస్సార్‌సీపీ హయాంలో మద్యం విధానంపై టీడీపీ కూటమి ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసు దర్యాప్తు తీరే చంద్రబాబు కుతంత్రానికి తాజాగా మరో తార్కాణం. ఏకంగా 164 సీఆర్‌పీసీ పేరిట అబద్ధపు వాంగ్మూలం నమోదుకు తెగబడటం బాబు కుట్రకు పరాకాష్ట.
ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని బుధవారం రాత్రి హైదరాబాద్‌లో అక్రమంగా అరెస్ట్ చేయడం టీడీపీ కూటమి ప్రభుత్వ కక్షసాధింపు కుతంత్రంలో తాజా పర్వం. ఏనాడో చేసిన సాధారణ వ్యాఖ్య ఆధారంగా టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడింది. ఆయన్ను అక్రమంగా అరెస్ట్ చేసి వికటాట్టహాసం చేస్తోంది. చంద్రబాబు ప్రభుత్వ రెడ్‌బుక్ రాజ్యాంగ అమానుష పాలనలో మరెన్ని దారుణాలను చూడాల్సి వస్తుందోనని యావత్ రాష్ట్రం బెంబేలెత్తిపోతోంది.
సాక్షి, అమరావతి/సాక్షి రాయచోటి/రాయచోటి, గచ్చిబౌలి: చంద్రబాబు ప్రభుత్వం మరోసారి రెడ్‌బుక్ కుట్రకు బరితెగించింది. ప్రముఖ సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళిని అక్రమంగా అరెస్ట్ చేసి తన రాజకీయ వికృతరూపాన్ని నిస్సిగ్గుగా ప్రదర్శించింది. అన్నమయ్య జిల్లా సంబేపల్లి పోలీసులు పోసాని కృష్ణ మురళిని హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఆయన నివాసంలో బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. ఆయన్ను హైదరాబాద్ నుంచి అన్నమయ్య జిల్లాకు తరలిస్తున్నారు. గతంలో కుట్రపూరితంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ఆయనపై టీడీపీ, జనసేన పార్టీలు అక్రమ ఫిర్యాదులు చేశాయి. తద్వారా తాము ఎప్పుడు అనుకుంటే అప్పుడు అక్రమంగా అరెస్ట్ చేసి తరలించేందుకు ముందస్తు పన్నాగం పన్నాయి.
ఆ ఫిర్యాదులపై పోసాని కృష్ణ మురళిని ఇప్పటివరకు విచారించడంగానీ ఇతరత్రా దర్యాప్తు ప్రక్రియగానీ కొనసాగలేదు. కానీ హఠాత్తుగా బుధవారం ఆయన్ను అరెస్ట్ చేసి అన్నమయ్య జిల్లాకు తరలించడం గమనార్హం. అసలు ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో కూడా స్పష్టంగా చెప్పలేదు. అన్నమయ్య జిల్లా సంబేపల్లి పోలీస్ స్టేషన్‌లో గతంలో నమోదు చేసిన కేసులో అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించి ఆయన్ను పోలీసులు బలవంతంగా తమ వాహనంలో తరలించారు. అసలు సంబేపల్లి పోలీస్ స్టేషన్‌లో తనపై ఎవరు ఫిర్యాదు చేశారు..? ఏ విషయంలో ఫిర్యాదు చేశారో చెప్పాలని పోసాని కృష్ణ మురళి ప్రశ్నించినా పోలీసులు సరైన సమాధానమే ఇవ్వలేదు. ఆయన్ని అరెస్ట్ చేస్తున్నట్టు ఓ నోటీసు ఇచ్చి తమతో తీసుకుపోయారు.
కుటుంబ సభ్యులకు కనీస సమాచారం లేదు...
పోసాని అరెస్ట్ గురించి ఆయన కుటుంబ సభ్యులకు పోలీసులు కనీస సమాచారం కూడా ఇవ్వకపోవడం గమనార్హం. ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఎక్కడికి తీసుకు వెళుతున్నారో కూడా చెప్పలేదు. యూనిఫాంలో ఇద్దరు పోలీసులు, మఫ్టీలో మరో ఇద్దరు పోలీసులు వచ్చి ఆయన్ను బలవంతంగా తమతో తీసుకుపోయారు. పోసాని అనారోగ్యంతో ఉన్నారని, కనీసం మందులు అయినా తీసుకెళ్లనివ్వాలని కుటుంబ సభ్యులు ఎంతగా కోరినా పోలీసులు పట్టించుకోలేదు.
తమ న్యాయవాది వచ్చే వరకు ఆగాలని అభ్యర్ధించినా ఆలకించకుండా బలవంతంగా తమతో తీసుకెళ్లారు. నిబంధనల ప్రకారం పోలీసులు ఎవర్ని అయినా అరెస్ట్ చేస్తే అందుకు సంబంధించిన పూర్తి వివరాలను కుటుంబ సభ్యులకు తెలపాలి. వారు న్యాయ సహాయం పొందేందుకు అవకాశం కల్పించాలి. కనీసం ఈ ప్రాథమిక సూత్రాలను కూడా పాటించకుండా పోలీసులు పోసాని కృష్ణమురళిని అక్రమంగా అరెస్ట్ చేసి తమతో తీసుకుపోయారు. కాగా పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నట్టు సంబేపల్లి పోలీసులు చెప్పారు.
కానీ ఆయన కుటుంబ సభ్యులకు ఇచ్చిన సమాచారంలో ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ నంబరు ఇవ్వడం గమనార్హం. అంటే ఉద్దేశపూర్వకంగానే వేర్వేరు పోలీస్ స్టేషన్ల వివరాలు ఇచ్చి ఆయన కుటుంబ సభ్యులకు సందిగ్దంలోకి నెట్టేశారు. నిబంధనలకు విరుద్ధంగా అరెస్ట్ చేస్తున్నందున తరువాత న్యాయపరమైన అభ్యంతరాలు తలెత్తకుండా న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించేందుకే ఈ ఎత్తుగడ వేశారని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అంటే పక్కా ముందస్తు కుట్రతోనే పోసాని కృష్ణ మురళిని అరెస్ట్ చేసినట్టు తేటతెల్లమవుతోంది.
111, ఇతర సెక్షన్ల కింద కేసులు..
సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోసానిపై అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో 111, 196, 353, 299, 366(3)(4), 341, 61(2) సెక్షన్ల కింద సీఐడీ పోలీసులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేసులు నమోదు చేశారు.
నేడు కోర్టులో హాజరు పరిచే అవకాశం
పోసానిని గచ్చిబౌలిలోని ఆయన నివాసంలో బుధవారం రాత్రి 8.45 గంటలకు సంబేపల్లె ఎస్‌ఐ భక్తవత్సలం ఆధ్వర్యంలో అరెస్టు చేసినట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు నిర్ధారించారు. పోలీసు వాహనంలో అన్నమయ్య జిల్లాకు తరలిస్తున్నట్లు తెలిపారు. కోర్టుకు హాజరు పరిచేముందు పూర్తి వివరాలు తెలియజేస్తామని చెప్పారు. ఓబులవారిపల్లె పీఎస్, సంబేపల్లె పీఎస్‌లలో పోసానిపై కేసులు నమోదైనట్లు చర్చించుకుంటున్నారు. గురువారం ఉదయం రాజంపేట లేదా రైల్వేకోడూరు కోర్టులో పోసానిని హాజరుపరిచే అవకాశాలు ఉన్నట్లు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. పోసానికి దారిలో వైద్య పరీక్షలు చేయించినట్లు సమాచారం.
ముందస్తు కుట్రతోనే అక్రమ ఫిర్యాదులు...
పోసాని కృష్ణ మురళిని లక్ష్యంగా చేసుకుని చంద్రబాబు ప్రభుత్వం గత ఏడాదే ముందస్తు కుట్రలకు తెరతీసింది. అందులో భాగంగానే చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లతోపాటు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై తప్పుడు వ్యాఖ్యలు చేశారని టీడీపీ కూటమి నేతలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు చేశారు. ఒకే రోజు ఆంధ్ర ప్రదేశ్‌లో అన్ని జిల్లాల్లోనూ పదుల సంఖ్యలో ఫిర్యాదులు చేయడం గమనార్హం.
వాటిలో కొన్ని కేసులను ప్రభుత్వం సీఐడీకి బదిలీ చేసింది కూడా. కాగా ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వంపై రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. శాసనసభ వేదికగా ప్రభుత్వ వైఫల్యాలు బట్టబయలవుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ రాజకీయాలకు తెరతీసింది. అందులో భాగంగానే గతంలో ఎప్పుడో చేసిన ఫిర్యాదుపై ప్రస్తుతం స్పందిస్తూ పోసాని కృష్ణ మురళిని అరెస్ట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment