Dairy business
-
ఎంబీఏ చదువు, మంచి ఉద్యోగం వదిలి.. పాడితో ఉపాధి!
జగిత్యాల అగ్రికల్చర్: ఉన్నత చదువులు చదివిన యువకులు వ్యవసాయంతోపాటు పాడి వంటి అనుబంధ రంగాల వైపు వెళ్లేందుకు నామోషీగా ఫీలవుతుంటారు. దీంతో, చాలీచా లని జీతంతో పట్టణాల్లో మగ్గిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఎంబీఏ చదివి, ప్రైవేట్ ఉద్యోగాన్ని వదులుకొని, ఉన్న ఊరిలో జెర్సీ ఆవుల ఫాం నిర్వహిస్తూ ఉపాధి పొందుతున్నాడు జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్‌కు చెందిన తీపిరెడ్డి సురేశ్‌రెడ్డి(99893 54414). ఉరుకుల పరుగుల జీవితం నచ్చక.. సురేశ్‌రెడ్డి ఎంబీఏ పూర్తయ్యాక రెండేళ్లు హైదరాబాద్‌లో ఉద్యోగం చేశాడు. కానీ ఉరుకుల పరుగుల జీవితం అతనికి నచ్చలేదు. దీంతో వ్యవసాయం చేద్దామని ఇంటికి వచ్చాడు. కానీ చదువుకున్నది వ్యవసాయం చేయడానికి కాదు.. ఏదో ఒక ఉద్యోగం చూసుకో అని తల్లితండ్రులు ముఖం మీదే చెప్పేశారు. అయినప్పటికీ తనకున్న పట్టుదల, ధైర్యంతో మొండిగా ఆవుల ఫాం ఏర్పాటు చేసేందుకు నిర్ణయించుకున్నాడు. స్థానిక తెలంగాణ గ్రామీణ బ్యాంకు నుంచి రుణం తీసుకొని, తమకున్న వ్యవసాయ భూమిలోనే 5 జెర్సీ ఆవులతో ఫాం ప్రారంభించాడు. ప్రస్తుతం 25 ఆవులున్నాయి.. ఫాంలో ప్రస్తుతం 25 జెర్సీ ఆవులు, 10 దూడలున్నాయి. పాలు పితికేందుకు సురేశ్‌రెడ్డి ఇద్దరు బిహార్ కూలీలను నియమించుకున్నాడు. ప్రతీ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫాంలోనే ఉంటూ ఆవులను స్వయంగా పర్యవేక్షిస్తుంటాడు. వాటికి మేత కోసం, ఎకరంలో పచ్చిగడ్డి వేశాడు. ఉదయం, సాయంత్రం ఆవులకు దాణా పెట్టి, పాలు పితుకుతారు. ఆవులు, దూడల పేడ, మూత్రంతో ఈగలు, దోమలు రాకుండా, ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తున్నాడు. లీటర్‌కు రూ.50లకు విక్రయం ప్రతీరోజు ఉదయం, సాయంత్రం 100 లీటర్ల పాల దిగుబడి సాధిస్తున్నట్లు సురేశ్‌రెడ్డి తెలిపాడు. వీటిలో 30 లీటర్లను స్థానిక వినియోగదారులకు లీటర్‌కు రూ.50 చొప్పున పోస్తున్నాడు. మిగిలిన పాలను పాల డిపోకు తీసుకెళ్తున్నాడు. అక్కడ పాలల్లో వెన్న శాతాన్ని బట్టి లీటర్‌కు రూ.30 నుంచి రూ.33 వరకే ఇవ్వడం వల్ల ఆదాయానికి గండి పడుతోంది. అలా కాకుండా వినియోగదారులు పెరిగితే భారీ లాభాలు వచ్చే అవకాశం ఉందంటున్నాడు. దాణా రేట్లు ఏడాదిలో రెట్టింపు కావడం వల్ల ఫాం నిర్వహణ ఖర్చులు పెరిగాయి. దీనికితోడు, ప్రభుత్వం ఇస్తామన్న లీటర్‌కు రూ.4 ఇన్సెంటివ్ రూ.2 లక్షలు రెండేళ్లుగా అందక కొంత ఇబ్బందిగా ఉందని చెబుతున్నాడు. ఎండుగడ్డి సేకరణ పాడి పశువులకు మేత ప్రధానం. ఓవైపు పచ్చిమేత ఇస్తూనే, మరో వైపు ఎండుగడ్డిని ఓ పూట వేస్తుంటారు. ఇందుకోసం సురేశ్‌రెడ్డి వరి పొలాల సమయంలో వరి గడ్డిని కట్టలు కట్టించి, షెడ్డులో నిల్వ చేస్తున్నాడు. రూ.వేలకు వేలు పెట్టి, కొత్తగా పాడి పశువులను కొనుగోలు చేయకుండా, ఆవులకు పుట్టిన పిల్లలకే సమీకృత దాణా ఇస్తూ త్వరగా ఎదిగేలా చేస్తున్నాడు. జగిత్యాలలో షాప్ పెట్టాలనుకుంటున్న జెర్సీ ఆవుల ఫాం ప్రారంభించాక మొదట్లో ఎన్నో కష్టనష్టాలు చూశా. కానీ ఏనాడూ అధైర్యపడలేదు. ఫాంని మరింత లాభాల్లోకి తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తున్న. జగిత్యాలలో వినియోగదారుల కోసం షాప్ పెట్టాలనుకుంటున్న. దాణా రేట్లు తగ్గితే ఆదాయం బాగుంటుంది. – తీపిరెడ్డి సురేశ్‌రెడ్డి, పాడి రైతు, లక్ష్మీపూర్ -
ఇ గోపాలా.. డెయిరీలకు తోడు నీడ
పాల ఉత్పత్తిలో నిరంతరం శ్రమిస్తున్న వారికి అండగా ఉండేందుకు నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్డీడీసీ) ఇ గోపాలా వెబ్‌పోర్టల్‌ని అందుబాటులోకి తెచ్చింది. శ్రీకృష్ణ జన్మాష్టమికి రెండు రోజుల ముందు ఈ వెబ్‌పోర్టల్‌ని కేంద్ర మంత్రి రూపాల ప్రారంభించారు. ప్రధాని మోదీ నిర్ధేశించిన డిజిటల్ ఇండియా లక్ష్యాలకు అనుగుణంగా ఈ వెబ్‌పోర్టల్‌ని రూపొందించినట్టు తెలిపారు. డెయిరీలకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మార్కెటింగ్ విధానాలు, నూతన యాజమాన్య పద్దతులు ఎప్పటికప్పుడు డెయిరీ రంగంలో ఉన్నవారికి తెలియ జేసేందుకు ఇ గోపాలా పేరుతో ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ని కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. ఇ గోపాల అప్లికేషన్ ద్వారా డెయిరీకి సంబంధించి సమాచారంతో పాటు లైవ్ స్టాక్ కొనుగోలు అమ్మకాలు, బ్రీడింగ్ , రోగనిర్థారణ, నివారణ పద్దతులకు సంబంధించిన తాజా సమాచారం అందుబాటులో ఉంటుంది. చదవండి: PMJDY: పీఎంజేడీవై ఖాతాదారులకు రూ.10 వేల ఓవర్ డ్రాఫ్ట్ -
భారత డైరీ మార్కెట్లోకి అమెరికా ఎంట్రీ..
న్యూఢిల్లీ/వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన సందర్బంగా మన పౌల్ర్టీ, డైరీ మార్కెట్లలో అమెరికన్ కంపెనీలకు పాక్షిక వాణిజ్యానికి అనుమతించేందుకు మోదీ సర్కార్ సంసిద్ధమైంది. ప్రపచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా ఉన్న భారత్ సంప్రదాయంగా పాలు, పాల సంబంధిత ఉత్పత్తుల దిగుమతులపై నియంత్రణలు విధిస్తోంది. డైరీ పరిశ్రమపై 8 కోట్లకు పైగా గ్రామీణ కుటుంబాలు జీవనోపాధి పొందుతుండటంతో వీరికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా డైరీ రంగంలో దిగుమతులను దశాబ్ధాలుగా నియంత్రిస్తోంది. అయితే భారత్-అమెరికా వాణిజ్య బంధాన్ని బలోపేతం చేసేందుకు ఈ పరిమితులను పాక్షికంగా సడలించేందుకు నరేంద్ర మోదీ సర్కార్ సన్నద్ధమైందన్న ప్రచారం సాగుతోంది. కాగా స్టెంట్లు వంటి వైద్య పరికరాల ధరలపై ప్రధాని మోదీ నియంత్రణలు విధించడం, ఈకామర్స్ నియంత్రణలు, న్యూ డేటా లోకలైజేషన్ వంటి పరిమితుల నేపథ్యంలో 2019లో ట్రంప్ ప్రభుత్వం భారత్‌కు ప్రత్యేక వాణిజ్య హోదాను తొలగించిన క్రమంలో అమెరికాతో వాణిజ్య బంధాన్ని బలోపేతం చేసేందుకు మోదీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. ట్రంప్ భారత్ పర్యటన నేపథ్యంలో దిగుమతి సుంకాల తగ్గింపు, రాయితీలు ప్రకటిస్తే కొన్ని ఉత్పత్తులపై భారత్‌కు ఈ హోదాను పునరుద్ధరించవచ్చని భావిస్తున్నారు. అమెరికా నుంచి చికెన్ లెగ్స్ దిగుమతులకు అనుమతితో పాటు భారత్ తాజాగా 5 శాతం టారిఫ్, కోటాలతో డైరీ మార్కెట్లోకీ అమెరికాను అనుమతించేందుకు సిద్ధమైంది. డైరీ మార్కెట్లోకి అమెరికాను ఆహ్వానిస్తే గ్రామీణ రంగంలో రైతులతో పాటు పాడిపరిశ్రమపై ఆధారపడిన కుటుంబాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. చదవండి : వెల్కమ్ ట్రంప్..గోడచాటు పేదలు -
దూడలపై శ్రద్ధే అభివృద్ధికి సోపానం
పాడి పరిశ్రమ రైతుకు లాభదాయకంగా ఉండాలంటే శాస్త్రీయ పద్ధతిలో దూడల పోషణపై శ్రద్ధ చూపక తప్పదు. నేటి పెయ్య దూడే రేపటి పాడి పశువు అనేది అందరికీ తెలిసిందే. ఎక్కువ వ్యయ ప్రయాసలతో పాడి పశువులు కొనుగోలు చేసే బదులు, మేలు జాతి పెయ్య దూడలకు సరైన పోషణ అందించినట్లయితే చౌకగా మంచి పాడి పశువులుగా అభివృద్ధి చేసుకోవచ్చు. దూడల పోషణ తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే ప్రారంభం కావాలి. ముఖ్యంగా ఆరు మాసాల చూడి నుంచి ఈనే వరకు అదనంగా దాణా ఇవ్వాలి. దీనివల్ల పుట్టిన దూడ కూడా బలంగా, ఆరోగ్యంగా ఉంటుంది. చూడి పశువులకు చూడితో ఉన్నప్పుడు నట్టల నివారణ మందులు తాగించినట్లయితే దూడకు నట్టల వ్యాధులు సంక్రమించకుండా కాపాడుకోవచ్చు. దూడ పుట్టిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు : 1 దూడ పుట్టిన వెంటనే ముక్కు రంధ్రాల నుంచి, నోటిలో నుంచి జిగురు పొరలను తుడిచి శుభ్రం చేయాలి. 2 ఈనగానే తల్లి దూడ శరీరాన్ని నాకి శుభ్రం చేస్తుంది. అలా కాని పక్షంలో, శుభ్రమైన గోనె పట్టాతో లేదా వరి గడ్డితో శరీరంపై రుద్ది శుభ్రం చేయాలి. దూడకు జున్నుపాలు సమృద్ధిగా తాగించాలి: జున్ను పాలలో తేలికగా జీర్ణమయ్యే మాంసకృత్తులు, విటమిను ‘ఎ’ ఎక్కువ పాళ్లలో ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తిని కలిగించే ఆంటిబాడీస్ కూడా ఎక్కువగా ఉంటాయి. జున్నుపాలు సమృద్ధిగా తాగిన దూడకు 6 నెలల వరకు వ్యాధినిరోధకశక్తి లభిస్తుంది. దూడ ఆరోగ్యంగా త్వరగా పెరగడానికి ఇది ఉపయోగపడుతుంది. మరో ముఖ్య విషయమేమిటంటే.. దూడకు జున్నుపాలు ఈనిన పావుగంట లేదా అరగంట లోపలే అందివ్వాలి. ఈ సమయంలోనే జున్నుపాలలోని రోగనిరోధకశక్తిని కలిగించే ఆంటీబాడీస్ దూడ శరీరానికి పూర్తిగా అందుతాయి. ఆలస్యమైతే ఈ ఆంటీబాడీస్ వినియోగం పూర్తిగా తగ్గుతుంది. దూడకు ఆహారం: పాలు: దూడకు తన శరీర బరువులో పదోవంతు పాలు అవసరం. దూడ శరీరం 20 కిలోలుంటే, దానికి రోజుకు 2 లీటర్ల పాలు కావాలి. అదేవిధంగా దాని శరీర బరువును బట్టి మూడు నెలల వయస్సు వరకు సరాసరి రోజుకు 2 నుంచి 3 లీటర్ల పాలు తాగించాల్సిన అవసరం లేకుండా గడ్డి, దాణాతో పోషించవచ్చు. ఈ మూడు నెలల్లో సుమారు 240 లీటర్ల పాలు దూడకు అవసరం ఉంటుంది. ప్రత్యేక దాణా: దూడలకు త్వరగా జీర్ణమై, పెరుగుదలకు అవసరమైన పోషక పదార్థాలు గల దాణాను, పాలతోపాటు రెండోనెల నుంచి తినటం అలవాటు చేయాలి. దూడల దాణాలో ఎక్కువ మాంసకృత్తులు, తక్కువ పీచుపదార్థాలు ఉండాలి. దూడల దాణాను ఈ కింది దాణా దినుసులను ఆయా పాళ్లలో కలిపి రైతులు తయారు చేసుకోవచ్చు: (1) జొన్నలు, మొక్కజొన్నలు వంటి ధాన్యాలు 40 పాళ్లు (2) వేరుశనగ పిండి 30 పాళ్లు. (3) తవుడు 10 పాళ్లు (4) చేపల పొడి 7 పాళ్లు (5) బెల్లపు మడ్డి 10 పాళ్లు (6) ఖనిజ లవణాల మిశ్రమం 3 పాళ్లు. -
పాల వ్యాపారంలోకి ప్రముఖ నిర్మాత
ఇన్నాళ్లు సినిమా, థియేటర్ల వ్యాపారంతో బిజీబిజీగా ఉన్న నిర్మాత దగ్గుబాటి సురేష్‌బాబు సరికొత్త వ్యాపారాన్ని ప్రారంభించారు. 'హ్యాపీ ఆవులు' పేరుతో స్వచ్ఛమైన పాల ఉత్పత్తికి ఆయన శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ నగర శివార్లలో తనకున్న 30 ఎకరాల వ్యవసాయ భూమిలో 30 ఆవులను పెంచుతున్నారు. మార్కెట్లో లభిస్తున్న పాలు, కూరగాయల్లో రసాయనాల ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇటీవల ఆయన అనారోగ్యానికి గురయ్యారు. దీంతో స్వచ్ఛమైన పాలు, సేంద్రీయ సేద్యంతో కూరగాయలు అందించాలని నిర్ణయానికి వచ్చారు. తన వ్యవసాయ క్షేత్రంలో ఆవులకు సేంద్రీయ ఆహారం, స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నట్టు సురేష్ బాబు తెలిపారు. దీంతో అవి స్వచ్ఛమైన పాలను ఇస్తున్నాయన్నారు. డబ్బు సంపాదించాలనే ధ్యేయంతో కాకుండా స్వచ్ఛమైన పాలకు, బయట దొరుకుతున్న పాలకు ఉన్న తేడా ఏమిటో ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నట్టు ఆయన పేర్కొన్నారు. తన ఫాంలోని ఆవు ఇచ్చిన పాలను లీటరు 150 రూపాయలకు విక్రయించాలని నిర్ణయించామన్నారు. అదేవిధంగా రామానాయుడు స్టూడియోని పూర్తిగా పర్యావరణ అనుకూలమైనదిగా చేయాలనుకుంటున్నానని తెలిపారు. ఇప్పటికే ప్లాస్టిక్బాటిళ్ల స్థానంలో స్టీలు సీసాలను వాడుతున్నామని సురేష్‌బాబు తెలిపారు. -
అప్పుడు గొప్పలు.. ఇప్పుడు తిప్పలు..!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు డెయిరీ కొత్త చైర్మన్ శిద్దా వెంకటేశ్వరరావు యూటర్న్ తీసుకున్నారు. మార్చి 28న ఒంగోలు డెయిరీ కొత్త చైర్మన్ అంటూ ఆర్భాటంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన శిద్దా.. ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. చైర్మన్‌గిరి ముళ్ల కిరీటమంటూ డెయిరీ గేటు తొక్కడం మానుకున్నారు. 10 రోజులుగా పత్తా లేకుండాపోయారు. చైర్మన్‌గా ఎంపికైన నాడు శిద్దా ఆర్భాటంగా విలేకర్ల సమావేశం నిర్వహించారు. పాడి రైతులకు, డెయిరీ ఉద్యోగులకు రూ.20 కోట్లు సొంత డబ్బులు చెల్లిస్తున్నానంటూ ప్రకటించారు. డెయిరీని ముందుకు నడిపిస్తానంటూ గొప్పలు చెప్పారు. డెయిరీ లాభాల్లోకి వచ్చిన తర్వాతే తమ అప్పును జమ వేసుకుంటానని ప్రకటించారు. డెయిరీ ముందుకు నడిపించేవారు వచ్చారని పాడి రైతులు, ఉద్యోగులు ఒకింత సంబరపడ్డారు. నెల రోజులు గడవక ముందే ఆ ఆశలు ఆవిరయ్యాయి. వ్యాపారస్తుడైన శిద్దా యూటర్న్ తీసుకున్నారు. పైసా చెల్లించకపోగా డెయిరీ వైపు తొంగి చూడటం లేదు. ఏం చేయాలో పాలుపోక డెయిరీ ఉద్యోగులు, పాడి రైతులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. మంగళవారం డెయిరీలో సమావేశమైన ఉద్యోగులు ఎండీకి అల్టిమేటం జారీ చేశారు. తక్షణం న్యాయం చేయకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ మేరకు డెయిరీ డైరెక్టర్లు బుధవారం సమావేశమవుతున్నారు. చివరిసారిగా డైరెక్టర్లు, జిల్లాకు చెందిన నేతలు, ప్రజాప్రతినిధులు చెప్పి ఆందోళన ప్రారంభిస్తామని డెయిరీ ఉద్యోగ సంఘం నేతలు తెలిపారు.డెయిరీ పరిధిలో పాడి రైతులకు రూ.13 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఉద్యోగుల జీతాలు రూ.3 కోట్లు, కరెంట్ బిల్లు రూ.2 కోట్లు, ట్రాన్స్‌పోర్టు బకాయిలు మరో రూ.2 కోట్లు ఉన్నాయి. ఈ మొత్తాన్ని చెల్లిస్తామని కొత్త చైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేసిన రోజు శిద్దా ప్రకటించారు. ఇదే జరిగితే డెయిరీ తిరిగి రన్నింగ్‌లోకి వస్తుందని మిగిలిన అప్పుల సంగతి తర్వాత చూసుకోవచ్చునని అందరూ భావించారు. అయితే కొత్త చైర్మన్ శిద్దా నెల కావస్తున్నా పైసా చెల్లించలేదు. పైపెచ్చు తన సొంత డబ్బులిచ్చేది లేదని బ్యాంకు రుణం వస్తేనే చెల్లిస్తానంటూ మెలిక పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు సీఎం ఓకే అంటేనే తాను చైర్మన్‌గా డెయిరీకి వస్తానంటూ శిద్దా అడ్డం తిరిగినట్లు తెలుస్తోంది.పాత చైర్మన్ చల్లా శ్రీనివాస్‌తో ఒప్పందం చేసుకున్న శిద్దా వెంకటేశ్వరరావు రాత్రికి రాత్రే ఒంగోలు డెయిరీ చైర్మన్ అయ్యారు. ఆర్భాటంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఒంగోలు నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఫ్లెక్సీలతో ప్రచారం చేసుకున్నారు. శిద్దా డెయిరీ చైర్మన్ ఎంపిక వ్యవహారం తమకు తెలియదంటూ మంత్రి శిద్దా రాఘవరావు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌తో పాటు పలువురు అధికార పార్టీ నేతలు ముఖ్యమంత్రి వద్ద పంచాయతీ పెట్టారు. ఆగ్రహం చెందిన ముఖ్యమంత్రి ఏప్రిల్ 15న పాత, కొత్త చైర్మన్లను విజయవాడకు పిలిపించారు. జిల్లా మంత్రి, టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యేలకు తెలియకుండా డెయిరీ చైర్మన్ ఎలా అవుతావు అంటూ చివాట్లు పెట్టారు. తర్వాత మాట్లాడదాం పో.. అంటూ పంపించివేశారు. రెండు రోజుల తర్వాత మరోమారు ముఖ్యమంత్రితో సమావేశం ఉంటుందని అన్ని చక్కబడతాయని అధికార పార్టీ నేతలు ప్రకటించారు. ఇది జరిగి 10 రోజులు కావస్తున్నా సమావేశం ఊసే లేదు. దీంతో శిద్దా యూటర్న్ తీసుకున్నారు. సీఎం చెప్పిన తర్వాతే డెయిరీకి వస్తానంటూ పత్తా లేకుండాపోయారు. ఈ పరిస్థితుల్లో ఒంగోలు డెయిరీ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. -
పాల వ్యాపారంలో 'లాభాల' రహస్యం ఇదే..
'కుక్కలు పెంచుకునే వాళ్లు.. పశుకాపరులకు పాఠాలు చెప్పొద్దు. అసలు గోవుల గురించి మీకేం తెలుసు? నా ఇంట్లో 500 ఆవులున్నాయి. అవి ఇచ్చే పాలతోనే వ్యాపారం చేస్తున్నా' అంటూ రెండు రోజుల కిందట బీజేపీ నాయకులపై విరుచుకుపడ్డారు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్. దాద్రీ ఘటనను ఉద్దేశించి ఆయన ఈ కామెంట్లు చేశారు. కాగా, లాలూ వ్యాఖ్యలను బిహార్ బీజేపీ చీఫ్ సుశీల్ కుమార్ మోదీ తీవ్రంగా తిప్పికొట్టారు. 'పాల వ్యాపారం ముసుగులో లాలూ యాదవ్ నల్ల ధనాన్ని చెలామణి చేస్తున్నారు. పశువుల దాణా కుంభకోణంలో ఆయన వెనకేసుకున్న డబ్బునే.. డైరీ ఫామ్ లో లాభాలుగా చూపుతున్నారు' అని సుశీల్ మోదీ బుధవారం ట్వీట్ చేశారు. లాలూకు గోవుల పట్ల ఎలాంటి గౌరవం లేదని, అది హిందువులకు పూజ్యనీయమనే విషయాన్ని కూడా ఆయన అంగీకరించరని, అందుకే గోమాంసం తినేవాళ్లను వెనకేసుకొస్తున్నారని మోదీ విమర్శించారు. మరొ నాలుగు రోజుల్లో తొలివిడత పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఆర్జేడీ- జేడీయూ- కాంగ్రెస్ పార్టీల కూటమి, బీజేపీ- ఎల్జేపీల ఎన్డీఏలు పరస్పర విమర్శల పర్వాన్ని మరింత ఉదృతం చేశాయి. అక్టోబర్ 12న తొలివిడిత పోలింగ్ జరగనుంది. -
పాల వ్యాపారంలోకి మహీంద్రా గ్రూప్
రూ. 750 కోట్లతో బ్రాండ్ కొనుగోలు యోచన ముంబై: కార్పొరేట్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్‌లో భాగమైన మహీంద్రా అగ్రి బిజినెస్... పాలు, పాల ఉత్పత్తుల వ్యాపారంలోకి అడుగుపెట్టనుంది. ఇందులో భాగంగా ఏదైనా ప్రముఖ బ్రాండ్‌ను కొనుగోలు చేయాలని యోచిస్తోంది. దీనికోసం రూ. 150-750 కోట్ల దాకా ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉందని మహీంద్రా అగ్రిబిజినెస్ వర్గాలు తెలిపాయి. పరిశ్రమల సమాఖ్య సీఐఐ బుధవారం నిర్వహించిన చిన్న, మధ్యతరహా పరిశ్రమల సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఈ విషయాలు వివరించాయి. ప్రీమియం ఉత్పత్తులపైనే ప్రధానంగా దృష్టి సారించే అవకాశం ఉందని సంస్థ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. వ్యవసాయ పరికరాల తయారీలో పెద్ద సంస్థల్లో ఒకటి కావడంతో పాటు అగ్రి బిజినెస్‌లోనూ గణనీయంగా కార్యకలాపాలు ఉన్నందున డెయిరీ విభాగంలోకి కూడా ప్రవేశించాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. మహీంద్రా గ్రూప్‌లో భాగమైన మహీంద్రా శుభ్‌లాభ్ సర్వీసెస్ సంస్థ మహారాష్ట్రలో రైతులతో కలిసి కాంట్రాక్ట్ వ్యవసాయ కార్యకలాపాలు నిర్వహిస్తోందని ఆయన వివరించారు. ఈ సంస్థ అత్యధికంగా ద్రాక్షలు ఎగుమతి చేస్తోందని, రైతులకు అవసరమైన సాంకేతిక సహకారాలు కూడా అందిస్తోందని తెలిపారు. ప్రస్తుతం దేశీ డెయిరీ పరిశ్రమ రూ. 3 లక్షల కోట్ల స్థాయిలో ఉంది. ఇందులో దాదాపు 80 శాతం మార్కెట్ అసంఘటితంగానే ఉంది.