పాల వ్యాపారంలో 'లాభాల' రహస్యం ఇదే..
'కుక్కలు పెంచుకునే వాళ్లు.. పశుకాపరులకు పాఠాలు చెప్పొద్దు. అసలు గోవుల గురించి మీకేం తెలుసు? నా ఇంట్లో 500 ఆవులున్నాయి. అవి ఇచ్చే పాలతోనే వ్యాపారం చేస్తున్నా' అంటూ రెండు రోజుల కిందట బీజేపీ నాయకులపై విరుచుకుపడ్డారు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్. దాద్రీ ఘటనను ఉద్దేశించి ఆయన ఈ కామెంట్లు చేశారు. కాగా, లాలూ వ్యాఖ్యలను బిహార్ బీజేపీ చీఫ్ సుశీల్ కుమార్ మోదీ తీవ్రంగా తిప్పికొట్టారు.
'పాల వ్యాపారం ముసుగులో లాలూ యాదవ్ నల్ల ధనాన్ని చెలామణి చేస్తున్నారు. పశువుల దాణా కుంభకోణంలో ఆయన వెనకేసుకున్న డబ్బునే.. డైరీ ఫామ్ లో లాభాలుగా చూపుతున్నారు' అని సుశీల్ మోదీ బుధవారం ట్వీట్ చేశారు. లాలూకు గోవుల పట్ల ఎలాంటి గౌరవం లేదని, అది హిందువులకు పూజ్యనీయమనే విషయాన్ని కూడా ఆయన అంగీకరించరని, అందుకే గోమాంసం తినేవాళ్లను వెనకేసుకొస్తున్నారని మోదీ విమర్శించారు.
మరొ నాలుగు రోజుల్లో తొలివిడత పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఆర్జేడీ- జేడీయూ- కాంగ్రెస్ పార్టీల కూటమి, బీజేపీ- ఎల్జేపీల ఎన్డీఏలు పరస్పర విమర్శల పర్వాన్ని మరింత ఉదృతం చేశాయి. అక్టోబర్ 12న తొలివిడిత పోలింగ్ జరగనుంది.