‘మీకెందుకా శ్రమ.. అప్పటికి జైలులో ఉంటారు’
న్యూఢిల్లీ: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఈ మధ్య ఏ మాత్రం కలిసి రావడం లేదు. ఆయనపై మరోసారి కేసుల పరంపర మొదలైంది. ఆయన బిహార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దాదాపు ఐదు రకాల అవినీతి కార్యక్రమాలకు పాల్పడ్డారనే కేసుకు సంబంధించి విచారణను ఎదుర్కోనున్నారు. ఈ కేసును ఆపించే ప్రయత్నం చేసినా సుప్రీంకోర్టులో ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. దీంతో ఇక లాలూ నేరుగా కేంద్రంపై సమరశంఖం పూరించారు. ఆగస్టు చివరివారంలో పట్నాలోని గాంధీ మైదాన్‌లో ఓ భారీ ర్యాలీ నిర్వహించ తలపెట్టారు.
ఇందులో కేంద్ర ప్రభుత్వం సాధిస్తున్న కక్షపూరిత విధానాలను, ప్రధాని నరేంద్రమోదీని విమర్శించగానే కేసులు పెడుతున్న వైనాన్ని దాదాపు ఆరోజు సభకు హాజరయ్యే ఐదు లక్షలమందితోపాటు దేశ ప్రజానీకానికి చెప్పాలని అనుకుంటున్నారు. ఈ భారీ బహిరంగ సభలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఉంటారని స్పష్టం కాగా తాను కూడా వస్తున్నానంటూ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. అలాగే, బీఎస్పీ అధినేత్రి మాయావతికి కూడా ఇప్పటికే ఆహ్వానం పంపించారంట. ములాయం సింగ్, వామపక్ష నేతలైన సీతారాం ఏచూరి, డీ రాజా కూడా వస్తారని లాలూ హింట్ ఇచ్చారు.
ఇక ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను సంప్రదించలేదని లాలు చెప్పుతున్నారు. మరోపక్క, ప్రస్తుతం తన మద్దతుతో బిహార్ ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్న నితీశ్ కుమార్ ఈ వేదికను పంచుకుంటారా లేదా అని ఇంకా సుస్పష్టం కాలేదు. ఈలోగా, లాలూ ఆశలపై నీళ్లు చల్లినట్లుగా బిహార్ బీజేపీ ఉన్నత శ్రేణి నేత సుశీల్ కుమార్ మోదీ స్పందిస్తూ.. ‘లాలూ ప్రసాద్ యాదవ్ ఇలాంటి పనులు చేయాలనుకోవడం అవగాహన రాహిత్యం, పరిపక్వత లేని చర్య. ఎందుకంటే వచ్చే ఆగస్టు నాటికే ఆయనను బహుశా జైలులో ఉండొచ్చు. కాబట్టి లాలూ అంత శ్రమపడకుండా ఉండటమే మంచిది’ అంటూ ట్వీట్‌లో విమర్శించారు.
దీనికి వెంటనే స్పందించిన లాలూ కూడా ‘హా..హా.. నా పేరు లాలూ.. ఇలా నన్ను కుంగదీయాలనుకునే వారిని చూసి జాలేస్తుంది’ అంటూ లాలూ రీ ట్వీట్ చేశారు. అన్న ప్రకారం లాలూ భారీ బహిరంగ సభ పెట్టి తీరతారా? లేదా సుశీల్ మోదీ చెప్పినట్లు మరోసారి జైలు పాలవుతారా అనేది వేచి చూడాల్సిందే.