మోదీ బంపర్ ఆఫర్
- లాలూను వదిలెయ్.. బీజేపీ మద్దతు తీస్కో..
- సీఎం నితీశ్‌కు బిహార్ బీజేపీ చీఫ్ సుశీల్ ఓపెన్ ఆఫర్
పట్నా: పశువుల దాణా కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో శరాఘాతం తిన్న ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌పై రాజకీయదాడి మొదలైంది. ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న ఆర్జేడీ, జేడీయూల మధ్య విబేధాలకు ఆజ్యం పోసేలా బిహార్ బీజేపీ చీఫ్ సుశీల్ కుమార్ మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతిపరుడైన లాలూతో తక్షణమే తెగదెంపులు చేసుకోవాలని సీఎం నితీశ్‌కుమార్‌ను సుశీల్ మోదీ కోరారు. ప్రభుత్వం నిలబడేందుకు అవసరమైతే బీజేపీ మద్దతు తీసుకోండని ఓపెన్ ఆఫర్ ప్రకటించారు. దాణా కేసులో సోమవారం సుప్రీం తీర్పు అనంతరం మోదీ పట్నాలో విలేకరులతో మాట్లాడారు.
‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సీఎం నితీశ్‌కు ఓపెన్‌గా చెబుతున్న.. తక్షణమే లాలూ స్నేహాన్ని వదిలెయ్యండి, ప్రభుత్వం పడిపోకుండా బీజేపీ మద్దతు తీస్కోండి’అని సుశీల్ మోదీ వ్యాఖ్యానించారు. గత సార్వత్రిక ఎన్నికల కంటే ముందు 17 సంవత్సరాలపాటు జేడీయూ- బీజేపీలు మిత్రులుగా ఉన్నారని గుర్తుచేశారు. కాగా, లాలూకు వ్యతిరేకంగా చక్రం తిప్పడంలోనూ నితీశ్ కీలక భూమిక పోషించారని సుశీల్ మోదీ ట్విస్ట్ ఇచ్చారు.
సీఎం నితీశ్ కుమార్ ఆదేశాల మేరకే లాలూ ప్రసాద్ యాదవ్‌తోపాటు ఆర్జేడీకి చెందిన మంత్రుల ఫోన్లు ట్యాప్ అయ్యాయని మోదీ చెప్పారు. ‘లాలూ ఎవరెవరితో ఫోన్లో ఏమేం మాట్లాడుతున్నారో నితీశ్‌కు తెలుసు. లాలూను బలహీనపర్చడం ద్వారా 2019లో ప్రధానమంత్రి అభ్యర్థిత్వాన్ని సులువుగా పొందొచ్చన్నది నితీశ్ ఎత్తుగడ’ అని మోదీ ఆరోపించారు.
243 స్థానాలున్న బిహార్ అసెంబ్లీలో ప్రస్తుతం ఆర్జేడీకి 80, జేడీయూకు 71, బీజేపీకి 58, కాంగ్రెస్ పార్టీకి 27 సభ్యుల మద్దతు ఉంది. గత ఎన్నికల్లో ఆర్జేడీ-జేడీయూలు కలిసి పోటీచేసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. కాగా, సుశీల్ మోదీ ఆఫర్ పై సీఎం నితీశ్ స్పందించాల్సిఉంది. దాణా కేసులో లాలూకు వ్యతిరేకంగా వచ్చిన తీర్పు బిహార్ రాజకీయాలను ఎన్ని మలుపులు తిప్పుతుందో వేచిచూడాలి.
(దాణా కుంభకోణం: సుప్రీం కోర్టులో లాలూకు ఎదురుదెబ్బ)