పాట్న : ఆర్‌జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ నుంచి వచ్చిన బెదిరింపులతో బీజేపీ నేత సుశిల్ మోదీ తన కొడుకు పెళ్లి వేదికను మార్చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఉండేందుకు పెళ్లి వేదికను మారుస్తున్నట్టు తెలిపారు. సుశిల్ మోదీ తనను పెళ్లికి ఆహ్వానించారని, ఒకవేళ తాను అక్కడకు వెళ్తే తనను బహిర్గతం చేస్తానంటూ తేజ్ ప్రతాప్ యాదవ్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఓ వీడియో వైరల్‌గా మారింది. తేజ్ ప్రతాప్ యాదవ్ కేవలం నిరాశతో ఈ బెదిరింపులకు పాల్పడుతున్నారని సుశిల్ మోదీ అన్నారు. తేజ్ ప్రతాప్ ఎలాంటి అతనో తనకు తెలసునని, దీంతో వేదిక మార్చాలని నిర్ణయించినట్టు మోదీ తెలిపారు.
పెళ్లి కూతురి కుటుంబాన్ని రాజకీయాల ముప్పు, అనవసరపు హింస, బెదిరింపుల నుంచి కాపాడే బాధ్యత తమదని చెప్పారు. ప్రస్తుతం మోదీ పెళ్లి వేదికలను రాజేంద్ర నగర్ శఖా మైదాన్ నుంచి వెటర్నరీ కాలేజీ గ్రౌండ్స్‌కు మార్చారు. లాలూ ప్రసాద్ ఈ వ్యాఖ్యలను ఖండించకపోవడం గమనార్హంగా ఉంది. పెళ్లి మండపాన్ని మారుస్తూ మోదీ తీసుకున్న నిర్ణయంపై తేజ్ ప్రతాప్ కూడా స్పందించారు. సుశిల్ మోదీ తన కొడుకు పెళ్లిని ఎలాంటి భయం బెరుకు లేకుండా చేసుకోవచ్చన్నారు. తాను క్రిమినల్‌ని లేదా టెర్రరిస్టును కాదని పేర్కొన్నారు. మోదీ చాలా భయగ్రస్తులైన డిప్యూటీ సీఎం అని, డిప్యూటీ సీఎం భయపడితే ఇక ప్రజలకు రక్షణ ఎక్కడ ఉంటుందంటూ లాలూ కామెంట్లు చేశారు. కాగ, పలువురు కేంద్ర మంత్రులు, నాలుగు రాష్ట్రాల గవర్నర్లు ఈ వేడకకు హాజరు కానున్నట్టు ధృవీకరణ అయింది.
Comments
Please login to add a commentAdd a comment