
పట్నా: ఎన్‌డీఏకు చెందిన ఎంఎల్‌ఏలను ఆకర్షించేందుకు ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ యత్నిస్తున్నారని బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీ చేసిన ఆరోపణలు బిహార్‌లో సంచలనం సృష్టించాయి. నితీశ్ కుమార్ నూతన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేలా లాలూ ఎంఎల్‌ఏలను ప్రలోభపరుస్తున్నారని చెబుతూ సుశీల్ ఒక ఆడియో క్లిప్‌ను విడుదల చేశారు. ఒకటిన్నర నిమిషం నిడివి ఉన్న ఈ ఆడియోలో లాలూ ప్రసాద్ యాదవ్ పిర్‌పైంటి ఎంఎల్‌ఏ లలన్ కుమార్‌తో మాట్లాడుతున్నట్లుగా ఉంది. ‘‘నిన్ను బాగా చూసుకుంటాం. స్పీకర్ ఎన్నికల్లో ఎన్‌డీఏ ఓడిపోయేందుకు సాయం చెయ్యి’’ అని లాలూ అంటున్నట్లు ఆడియోలో ఉంది.
ఇందుకు ఎంఎల్‌ఏ బదులిస్తూ ఇందుకు చాలా ఇబ్బందులుంటాయని చెప్పగా, భయపడవద్దని, ఆర్‌జేడీ స్పీకర్ వస్తారని, ఇందుకుగాను తమ ప్రభుత్వం ఏర్పాటయ్యాక మంత్రి పదవి ఇస్తామని లాలూ చెబుతున్నట్లుంది. సుశీల్‌తో తాను ఉన్నప్పుడే లాలూ కాల్ చేశారని సదరు ఎంఎల్‌ఏ చెప్పారు. ప్రస్తుతం లాలూ పశుగ్రాసం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని బిహార్ డిప్యుటీ సీఎం తార్ కిశోర్ ప్రసాద్ చెప్పారు. ఈ ఆడియోక్లిప్‌పై ఆర్‌జేడీ ఏమీ వ్యాఖ్యానించలేదు. కానీ ఆ పార్టీ ఎంఎల్‌ఏ ముకేశ్ రోషన్ మాత్రం మార్చికల్లా నితీశ్ ప్రభుత్వం పడిపోయి, తేజస్వీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. మరోవైపు బిహార్ అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్‌డీఏకి చెందిన విజయ్ సిన్హా ఎన్నికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment