రాష్ట్రీయ లోక్‌జనశక్తి (ఆర్‌ఎల్‌జేపీ) పార్టీ చీఫ్ పశుపతి కుమార్ పరాస్.. ఎన్డీఏ కూటమి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. బీహార్‌లో ఎన్డీయే భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో తనకు అన్యాయం జరగటంతో ఎన్డీయే కూటమితో పాటు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు మంగళవారం ప్రకటించారు. అయితే ఆయన ప్రతిపక్షాల ఇండియా కూటమికి టచ్‌లో ఉన్నారని తెలుస్తోంది.
పశుపతి పరాస్ ఎన్డీయేకు గుడ్‌బై చెప్పిన వెంటనే ఆర్జేడీ నేత తేజ్‌ప్రతాప్ యాదవ్ స్పందిస్తూ.. బిహార్‌లోని ప్రతిపక్ష కూటమికి ఆహ్వానించారు. ‘ఒకవేళ పశుపతి పరాస్ బీహార్ ప్రతిపక్ష కూటమిలోకి రావాలనుకుంటే.. మేము స్వాగతం చెప్పడానికి ఎప్పుడూ సిద్ధమే. రాజీనామా చేసిన పరాస్‌ను బీజేపీ ఏం చేయలేదు’ అని అన్నారు. అయితే పరాస్.. పలు లోక్‌సభ స్థానాలతో పాటు హాజీపూర్ సెగ్మెంట్‌ను ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.
తనకు ఎంతో కీలకమైన హాజీపూర్ స్థానంలో కచ్చితంగా పోటీ చేస్తానని.. అవసరమైతే ఎన్డీయే కూటమి నుంచి వైదొలగడానికి కూడా సిద్దమేని ఇటీవల పరాస్ ప్రకటించారు. అయితే సోమవారం బీజేపీ.. పరాస్‌ను పక్కనబెట్టి జేడీయూ, లోక్ జనశక్తి పార్టీ (రాం విలాస్)తో సీట్ల పంపకం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో బీజేపీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. పశుపతి పరాస్ ఎన్డీయే నుంచి తప్పుకున్నారు.
మరోవైపు పరాస్‌కు కంచుకోట అయిన హాజీపూర్‌లో బీజేపీ.. లోక్ జనశక్తి పార్టీ (రాం విలాస్) పార్టీ అభ్యర్థికి టికెట్ కేటాయించటం గమనార్హం. ఒకవేళ పరాస్ ఇండియా కూటమిలో చేరితే ఆయనకు హాజీపూర్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కేటాయిస్తుందో లేదో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment