Pashupati
-
Chirag Vs Pashupati: అబ్బాయి వర్సెస్ బాబాయి
జాతీయ రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన వారసత్వ పోరుకు తెర లేచింది. బిహార్‌లో దిగ్గజ నేత దివంగత రాం విలాస్ పాశ్వాన్ వారసత్వం కోసం ఆయన కుమారుడు చిరాగ్, సోదరుడు పశుపతి కుమార్ పారస్ మధ్య జరుగుతున్న పోరు తుది దశకు చేరుకుంది. పాశ్వాన్ ఏకంగా ఎనిమిది సార్లు ఎంపీగా నెగ్గిన హాజీపూర్ లోక్‌సభ స్థానంలో ఈసారి వారిద్దరూ నేరుగా అమీతుమీ తేల్చుకోనున్నారు... పాశ్వాన్ల కంచుకోట హాజీపూర్ లోక్‌సభ స్థానంతో పాశ్వాన్‌లది విడదీయరాని బంధం. లోక్ జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు రాం విలాస్ పాశ్వాన్ 1977 లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారిగా అక్కడ విజయం సాధించారు. మధ్యలో 1984, 2009 మినహా మరో ఏడుసార్లు హాజీపూర్ నుంచే నెగ్గారు. ఆనారోగ్య కారణాలతో పాశ్వాన్ రాజ్యసభకు వెళ్లడంతో తమ్ముడు పశుపతి 2019లో తొలిసారి హాజీపూర్ నుంచి పోటీ చేసి నెగ్గారు. చిరాగ్ 2014తో పాటు 2019లోనూ జముయ్ లోక్‌సభ స్థానం నుంచి నెగ్గారు. 2020లో పాశ్వాన్ మృతి చిరాగ్, పశుపతి మధ్య వారసత్వ పోరుకు దారితీసింది. పాశ్వాన్ వారసుడిని తానేనని పశుపతి ప్రకటించుకోవడంతో ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరిస్తానని చిరాగ్ హెచ్చరించారు. పశుపతి మిగతా నలుగురు ఎల్జేపీ ఎంపీలతో కలిసి తిరుగుబావుటా ఎగరేయడంతో వారందరినీ పార్టీ నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించారు. చివరికి వివాదం ఎన్నికల సంఘం వద్దకు చేరింది. ఎల్జేపీ పేరును, పార్టీ గుర్తును ఈసీ స్తంభింపజేసి పశుపతి వర్గానికి రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ (ఆర్ఎల్జేపీ), చిరాగ్‌కు ఎల్జేపీ (రాం విలాస్) పేర్లు కేటాయించింది. 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్డీఏతో చిరాగ్ తెగదెంపులు చేసుకున్న నేపథ్యంలో పశుపతి 2021లో ఎన్డీఏలో చేరి కేంద్ర మంత్రి అయ్యారు. చిరాగ్ ఇన్, పశుపతి ఔట్ ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో 40 స్థానాలనూ క్లీన్‌స్వీప్ చేయడం లక్ష్యం పెట్టుకున్న బీజేపీ మరోసారి చిరాగ్‌ను చేరదీసింది. అలా మళ్లీ ఎన్డీఏలో చేరిన చిరాగ్, పొత్తులో భాగంగా తమకు కేటాయించే 5 స్థానాల్లో హాజీపూర్ ఉండాల్సిందేనని పట్టుబట్టి సాధించుకున్నారు. దాంతో పశుపతి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. దీనికి తోడు ఆర్ఎల్జేపీకి బీజేపీ ఒక్క సీటు కూడా కేటాయించకపోవడంతో వారం క్రితం కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. తాను హాజీపూర్ నుంచి పోటీ చేయడం ఖాయమని ప్రకటించారు. తనతో పాటు మిగతా నలుగురు ఎంపీలు కూడా మళ్లీ బరిలో దిగి తీరతారని స్పష్టం చేశారు. బాబాయిని ఓడిస్తే పాశ్వాన్ల కంచుకోటైన హాజీపూర్ హస్తగతమవడమే గాక తండ్రి వారసత్వం పూర్తిగా తనదేనని రుజువవుతుందనే భావనతో చిరాగ్ అక్కడి నుంచి బరిలో దిగుతున్నారు. హాజీపూర్‌లో ఎస్సీ సామాజిక వర్గానికి దాదాపు 4 లక్షల ఓట్లున్నాయి. దీనికి తోడు 1.5 లక్షల దాకా ముస్లిం ఓట్లున్నాయి. యాదవులు, రాజ్‌పుత్‌లు, భూమిహార్లతో పాటు కుషా్వహాలు, పాశ్వాన్లు, రవిదాస్ వంటి అత్యంత వెనకబడ్డ సామాజిక వర్గాలకు కూడా చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకుంది. ఈ వర్గాలకు రాం విలాస్ పాశ్వాన్ తిరుగులేని నేతగా కొనసాగారు. 1977లో ఆయన సాధించిన 4.69 లక్షల మెజారిటీ గిన్నిస్ రికార్డుకెక్కింది! 1989లో ఏకంగా 5 లక్షల పై చిలుకు మెజారిటీ సాధించారాయన. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బరిలో బాబాయ్..అబ్బాయ్! గెలుపెవరిదో..
Chirag Paswan Vs Pashupati Paras: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పలు ప్రత్యేకతలు చోటుచేసుకుంటున్నాయి. కుటుంబ సభ్యులే విరోధులుగా బరిలోకి దిగుతున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తన చిన్నాన్న పశుపతి కుమార్ పరాస్‌పై హాజీపూర్ నుంచి పోటీ చేస్తానని లోక్ జనశక్తి పార్టీ నాయకుడు చిరాగ్ పాశ్వాన్ ప్రకటించారు. ‘నాన్న కర్మభూమి అయిన హాజీపూర్ నుంచి లోక్ జనశక్తి పార్టీ (రామ్‌విలాస్), ఎన్డీఏ అభ్యర్థిగా నేను పోటీ చేయడం ఖాయం. ఆయనకు (పశుపతి కుమార్ పరాస్) స్వాగతం (అక్కడ నుంచి పోటీ చేయడానికి). నేను అన్ని సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్నాను. ఎలాంటి సవాళ్లకు నేనెప్పుడూ భయపడలేదు. ఈ ఛాలెంజ్‌ను కూడా స్వీకరిస్తున్నాను’ అని చిరాగ్ పాశ్వాన్ మీడియాతో అన్నారు. హాజీపూర్ నియోజకవర్గం నుండి తన సొంత బాబాయిపై పోటీ చేయడంపై పాశ్వాన్ మాట్లాడుతూ "ఇది నాకు రాజకీయ ఎంపిక కానే కాదు. ఇది నా కుటుంబానికి కూడా ఇబ్బందికరమే. ఇటువంటి నిర్ణయాలు రాజకీయ పార్టీలుగా మాత్రమే కాకుండా కుటుంబ సభ్యుల మనోభావాలు పరిగణనలోకి తీసుకుని తీసుకోవాలి. కుటుంబం నుండి విడిపోవాలనే నిర్ణయం ముందుగా ఆయనే (పశుపతి పరాస్) తీసుకున్నారు" అని పేర్కొన్నారు. బిహార్‌లో రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీకి ఎన్డీఏ సీట్లు నిరాకరించడంతో రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ (RLJP) అధ్యక్షుడు పశుపతి కుమార్ పరాస్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. "నేను (లోక్‌సభ ఎన్నికల్లో) హాజీపూర్ నుండి పోటీ చేస్తాను. మా సిట్టింగ్ ఎంపీలందరూ వారి వారి నియోజకవర్గాల నుండి పోటీ చేస్తారు. ఇది మా పార్టీ నిర్ణయం" అని పరాస్ అన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం బిహార్‌లో సీట్ల పంపకాన్ని ఎన్డీఏ ప్రకటించింది. బీజేపీ 17 స్థానాల్లో, జేడీయూ 16 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు పేర్కొంది. జితన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని హిందుస్థానీ ఆవామ్ మోర్చా (HAM), రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్ఎల్ఎస్పీ) ఒక్కో స్థానంలో పోటీ చేయనుంది. లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) ఐదు స్థానాల్లో పోటీ చేస్తోంది. -
ఇండియా కూటమితో టచ్‌లో పశుపతి పరాస్!
రాష్ట్రీయ లోక్‌జనశక్తి (ఆర్ఎల్జేపీ) పార్టీ చీఫ్ పశుపతి కుమార్ పరాస్.. ఎన్డీఏ కూటమి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. బీహార్‌లో ఎన్డీయే భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో తనకు అన్యాయం జరగటంతో ఎన్డీయే కూటమితో పాటు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు మంగళవారం ప్రకటించారు. అయితే ఆయన ప్రతిపక్షాల ఇండియా కూటమికి టచ్‌లో ఉన్నారని తెలుస్తోంది. పశుపతి పరాస్ ఎన్డీయేకు గుడ్‌బై చెప్పిన వెంటనే ఆర్జేడీ నేత తేజ్‌ప్రతాప్ యాదవ్ స్పందిస్తూ.. బిహార్‌లోని ప్రతిపక్ష కూటమికి ఆహ్వానించారు. ‘ఒకవేళ పశుపతి పరాస్ బీహార్ ప్రతిపక్ష కూటమిలోకి రావాలనుకుంటే.. మేము స్వాగతం చెప్పడానికి ఎప్పుడూ సిద్ధమే. రాజీనామా చేసిన పరాస్‌ను బీజేపీ ఏం చేయలేదు’ అని అన్నారు. అయితే పరాస్.. పలు లోక్‌సభ స్థానాలతో పాటు హాజీపూర్ సెగ్మెంట్‌ను ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. తనకు ఎంతో కీలకమైన హాజీపూర్ స్థానంలో కచ్చితంగా పోటీ చేస్తానని.. అవసరమైతే ఎన్డీయే కూటమి నుంచి వైదొలగడానికి కూడా సిద్దమేని ఇటీవల పరాస్ ప్రకటించారు. అయితే సోమవారం బీజేపీ.. పరాస్‌ను పక్కనబెట్టి జేడీయూ, లోక్ జనశక్తి పార్టీ (రాం విలాస్)తో సీట్ల పంపకం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో బీజేపీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. పశుపతి పరాస్ ఎన్డీయే నుంచి తప్పుకున్నారు. మరోవైపు పరాస్‌కు కంచుకోట అయిన హాజీపూర్‌లో బీజేపీ.. లోక్ జనశక్తి పార్టీ (రాం విలాస్) పార్టీ అభ్యర్థికి టికెట్ కేటాయించటం గమనార్హం. ఒకవేళ పరాస్ ఇండియా కూటమిలో చేరితే ఆయనకు హాజీపూర్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కేటాయిస్తుందో లేదో వేచి చూడాలి. -
Bihar: అబ్బాయ్‌వైపే బీజేపీ మొగ్గు
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీహార్‌లో బాబాయ్ వర్సెస్ అబ్బాయ్ రాజకీయం రంజుగా మారింది. లోక్‌సభ సీట్ల కేటాయింపుతో బీహార్‌లో బాబాయ్ వర్సెస్ అబ్బాయ్ రాజకీయం తెరపైకి వచ్చింది. నిన్న మొన్నటి వరకు లోక్ జనశక్తిని పార్టీ (ఆర్ఎల్జేపీ) శాసించి మోదీ వర్గంలో కేబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన బాబాయ్ పసుపతి పరాస్ ఇప్పుడు రాజకీయ మనుగడ కోసం పోరాడుతుంటే.. మరోవైపు తన తండ్రి స్థాపించిన లోక్ జన శక్తి పార్టీ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టిన అబ్బాయి చిరాగ్ పాశ్వాన్ వైపే బీజేపీ మొగ్గు చూపింది. బీజేపీ తీరుపై అసంతృప్తి గత కొంత కాలంగా పసుపతి పరాస్ కేంద్ర మంత్రివర్గం నుండి వైదొలగుతారని ఊహాగానాలు ఊపందుకున్నాయి. అతని ఎమ్మెల్యేలు ఇండియా కుటమికి మద్దతు పలుకుతున్నారని, వారం క్రితం చిరాగ్ పాస్వాన్ సైతం బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నారంటూ రాష్ట్ర రాజకీయాల్లో చర్చలు జోరుగా సాగాయి. ఈ వరుస పరిణామాలపై పశుపతి పరాస్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ పార్టీ ఆర్ఎల్జేపీ కూడా ఎన్డీయేలో భాగమేనని తెలిపారు. అంతేకాదు తమ పార్టీ తలుపులు తెరిచే ఉన్నాయని పశుపతి పరాస్ అన్నారు. ఎక్కడికైనా వెళ్లే స్వేచ్ఛ తమకు ఉందని ఎన్డీయేను హెచ్చరించారు. పాశ్వాన్ వైపే మొగ్గు అదే సమయంలో ఒకప్పుడు తనను తాను ప్రధాని నరేంద్ర మోదీకి ‘హనుమంతుడు’గా అభివర్ణించుకున్న పాశ్వాన్ ఎన్డీయేతో పొత్తు పెట్టుకున్నారు. పొత్తులో భాగంగా పాశ్వాన్ ఆశించిన ఆరు సీట్లలో ఐదు స్థానాలను దక్కించుకున్నారు. అయితే, ఆ జాబితాలో అతని దివంగత తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్‌కు చెందిన హాజీపూర్ లోక్‌సభ స్థానం ఉంది. అంచనాలు తారుమారు రామ్ విలాస్ పాశ్వాన్ సోదరుడు పశుపతి పరాస్ హాజీపూర్ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో అదే స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తారుమారు చేశాయి. 6 శాతం పాశ్వాన్ వర్గం ఓట్లు చిరాగ్ పాస్వాన్‌కు కలిసొచ్చాయి. పొత్తులో భాగంగా లోక్‌సభ సీట్ల పంపిణీలో బాబాయ్ పశుపతి పరాస్‌ను కాదనుకుని అబ్బాయి చిరాగ్ పాస్వాన్తో పొత్తు పెట్టుకునేందుకు కారణమయ్యాయి. కాగా, చిరాగ్ పాశ్వాన్ తండ్రి దివంగత నేత రామ్ విలాస్ పాశ్వాన్ హాజీపూర్ నుండి ఎనిమిది సార్లు గెలుపొందారు. వాటిలో నాలుగు వరుస విజయాలున్నాయి. చిరాగ్ పాస్వాన్ పార్టీ సమస్తిపూర్, జముయి, వైశాలి, ఖగారియా లోక్‌సభ స్థానాల్లో పోటీకి దిగనుంది. ఎవరికెన్ని సీట్లంటే? లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీహార్‌లో పొత్తులు ఖరారయ్యాయి. అలయన్స్‌లో భాగంగా రాష్ట్రంలో ఉన్న 40 లోక్‌సభ స్థానాలకు గాను పెద్దన్నగా వ్యవహరిస్తున్నబీజేపీ (17), సీఎం నితీష్‌కుమార్ పార్టీ జనతాదళ్ యూనైటెడ్ (16), లోక్‌జనశక్తి పార్టీ (5), బీహార్ మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ పార్టీ హిందుస్థాన్ ఆవామ్ మోర్చాకి (1), రాష్ట్రీయ లోక్ మోర్చా పార్టీకి (1) సీట్లు కేటాయించింది. మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుంది. -
ECI: చిరాగ్, పారస్‌లకు వేర్వేరు ఎన్నికల గుర్తులు
న్యూఢిల్లీ: చీలికతో వివాదంగా మారిన లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) సమస్యకు కేంద్ర ఎన్నికల సంఘం తాత్కాలిక పరిష్కారం చూపింది. ఇంతకాలం వినియోగంలో ఉన్న పార్టీ పేరు, పార్టీ ఎన్నికల గుర్తు(ఇల్లు గుర్తు)ను చీలిక వర్గాలైన చిరాగ్ పాశ్వాన్, పశుపతి కుమార్ పారస్‌లు వాడొద్దని గతంలోనే ఈసీ ఆదేశాలివ్వడం తెల్సిందే. తాజాగా ఇరు వర్గాలకు వేర్వేరు పేర్లు, ఎన్నికల గుర్తులు కేటాయించింది. చిరాగ్ పాశ్వాన్ వర్గానికి ‘లోక్ జనశక్తి పార్టీ(రాం విలాస్)’ పేరును, హెలికాప్టర్ గుర్తును కేటాయిస్తున్నట్లు ఈసీ పేర్కొంది. పారస్ వర్గానికి ‘రాష్ట్రీయ లోక్ జన శక్తి’ పేరును, ఎన్నికల గుర్తుగా ‘కుట్టుమిషన్’ను ఇస్తున్నట్లు ఈసీ వెల్లడించింది. ఉప ఎన్నికల్లో ఈ పేర్లు, గుర్తులను వాడుకోవచ్చని ఈసీ ఇరు వర్గాలకు వేర్వేరుగా లేఖలు రాసింది. ‘‘ బిహార్‌లో ఉప ఎన్నికల కోసం ఏ ఇతర పార్టీకి కేటాయించని ‘గుర్తుల జాబితా’లో ఉన్నవేవైనాకావాలంటే మీరు వాడుకోవచ్చు. అది మీ ఇష్టం. కానీ, మీ రెండు వర్గాల గుర్తులు ఒకేలా మాత్రం ఉండకూడదు’’ అని ఈసీ స్పష్టంచేసింది. -
స్పీకర్ నిర్ణయం: చిరాగ్‌కు భారీ షాక్...
న్యూఢిల్లీ: తన బాబాయి పశుపతి పరాస్‌ను లోక్‌సభలో పార్టీ పక్షనేతగా గుర్తిస్తూ స్పీకర్ ఓంబిర్లా తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) నాయకుడు చిరాగ్ పాశ్వాన్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. చిరాగ్ పిటిషన్‌పై జస్టిస్ రేఖా పిళ్లై శుక్రవారం విచారణ జరిపారు. ఈ వ్యాజ్యానికి విచారణార్హత లేదని చెప్పారు. నిజానికి చిరాగ్ పాశ్వాన్‌కు జరిమానా విధించాలని భావించామని, ఆయన తరపు న్యాయవాది విజ్ఞప్తి మేరకు ఆ ఆలోచన విరమించుకున్నామని పేర్కొన్నారు. ఎల్జేపీ చీలిక వర్గం నాయకుడైన పశుపతి పరాస్‌ను లోక్‌సభలో ఆ పార్టీ పక్షనేతగా గుర్తిస్తూ స్పీకర్ జూన్ 14న సర్క్యులర్ జారీ చేశారు. -
వాళ్లంతా నాకు టచ్‌లోనే ఉన్నారు: చిరాగ్ పాశ్వాన్
న్యూఢిల్లీ/పట్నా: బిహార్‌లో నితీశ్ కుమార్ ప్రభుత్వం ఐదేళ్ల పాటు పాలన సాగించలేదని లోక్‌జనశక్తి పార్టీ ఎంపీ చిరాగ్ పాశ్వాన్ అన్నారు. త్వరలోనే జేడీ(యూ)లో చీలిక వస్తుందని, ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు తనతో టచ్‌లో ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆశీర్వాద్ యాత్రలో భాగంగా ఉత్తర బిహార్ జిల్లాలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన చిరాగ్ పాశ్వాన్ సీఎం నితీశ్ కుమార్‌పై విమర్శలు గుప్పించారు. తనను దెబ్బ కొట్టేందుకే తన బాబాయ్ పశుపతి పరాస్తో చేతులు కలిపిన నితీశ్ కుమార్.. ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇప్పించారని ఆరోపించారు. జేడీయూలోని ఇతర నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారని, రాష్ట్రంలో ఎన్డీయే కూటమి స్థిరంగా కొనసాగలేదని, త్వరలోనే మధ్యంతర ఎన్నికలు వస్తాయని చిరాగ్ జోస్యం చెప్పారు. నితీశ్ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమని పునరుద్ఘాటించారు. ఈ క్రమంలో రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ)తో చేతులు కలుపుతారా అన్న ప్రశ్నకు బదులుగా.. ఎన్నికల సమయానికి ఈ పొత్తు గురించి ఆలోచిస్తానని బదులిచ్చారు. పాశ్వాన్ అసలైన రాజకీయ వారసుడిని నేనే: పశుపతి దివంగత కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ అసలైన రాజకీయ వారసుడిని తానేనని, ఆయన సోదరుడు పశుపతి పరాస్ పేర్కొన్నారు. ‘‘హిందూ వారసత్వ చట్ట ప్రకారం చిరాగ్ ఆయన ఆస్తులకు వారసుడేమో గానీ, నేను మాత్రమే ఆయన రాజకీయ వారసుడిని’’ అని వ్యాఖ్యానించారు. కాగా బిహార్ ఎన్నికలు-2020 సమయంలో జేడీయూను వ్యతిరేకిస్తూ అభ్యర్థులను రంగంలోకి దించిన చిరాగ్ పాశ్వాన్... తన నిర్ణయంతో ఆ పార్టీ ఓట్లకు గండికొట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చిరాగ్‌తో విభేదించిన ఎంపీ పశుపతి ఇటీవలే ఎల్జేపీలో తిరుగుబాటు లేవనెత్తి జాతీయాధ్యక్ష పదవి చేపట్టారు. బిహార్‌లో ఏడు సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీగా పని చేసిన ఆయన కేంద్ర కేబినెట్ విస్తరణలో భాగంగా మంత్రి పదవి దక్కించుకున్నారు. ఇక జేడీయూ నేత రామచంద్ర ప్రసాద్ సింగ్ (63)కు సైతం బిహార్ నుంచి కేంద్ర మంత్రిగా అవకాశం లభించింది. -
ప్రధాని నా వైపు ఉంటారని ఆశించా.. కానీ: చిరాగ్ భావోద్వేగం
న్యూఢిల్లీ: కష్టకాలంలో ప్రధాని నరేంద్ర మోదీ తనకు అండగా నిలబడతారని ఆశించానని లోక్ జనశక్తి పార్టీ ఎంపీ, దివంగత కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తనయుడు చిరాగ్ పాశ్వాన్ అన్నారు. తన రాముడి కోసం ఈ హనుమంతుడు చేయాల్సిందంతా మనస్ఫూర్తిగా చేశాడని, కానీ తాను ఆశించింది జరగలేదని పేర్కొన్నారు. తండ్రి మరణం తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టిన చిరాగ్‌కు.. బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన బాబాయ్ పశుపతి పరాస్తో విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల పశుపతి నలుగురు ఎంపీలతో కలిసి పార్టీలో తిరుగుబాటు లేవనెత్తారు. ఈ నేపథ్యంలో పార్టీ జాతీయాధ్యక్ష పదవి నుంచి చిరాగ్‌ను తొలగించడం సహా ఎల్జేపీ పార్లమెంటరీ నేతగా ఆయనే ఉంటారని రెబల్ ఎంపీలు స్పష్టం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో పాశ్వాన్ అసలైన వారుసుడెవరో ప్రజలే తేలుస్తారంటూ జూలై 5 నుంచి ఆశీర్వాద యాత్ర చేసేందుకు చిరాగ్ సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఎన్డీటీవీతో మాట్లాడిన ఆయన.. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న ప్రతి నిర్ణయానికి మేం మద్దతునిచ్చాం. ఆర్టికల్ 370 రద్దు, సీఏఏ(పౌరసత్వ సవరణ చట్టం), ఎన్ఆర్సీ వంటి అంశాలను స్వాగతించాం. బిహార్ సీఎం నితీశ్ కుమార్ పార్టీ మాత్రం వీటికి అనుకూలంగా లేదు. అయినప్పటికీ ఈ హనుమంతుడు రాముడి కోసం అన్నింటికీ సిద్ధమయ్యాడు. అయితే, నేను కష్టకాలంలో ఉన్నపుడు నా ప్రధాని నావైపు ఉంటారని ఆశించాను. కానీ, అలా జరగలేదు. ఈ సమస్యను నాకు నేనుగా పరిష్కరించుకోవాలని, ఎవరూ నాకు సహకారం అందించరని త్వరలోనే నాకు బోధపడింది. అంతేకాదు.. నేను వారి మద్దతు ఆశించేందుకు అర్హుడిని కూడా కాదని అర్థమైంది’’అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. అదే విధంగా.. ‘‘నా సొంత కుటుంబ సభ్యులే నాకు వెన్నుపోటు పొడిచారు. నా తండ్రి లాంటి మా బాబాయ్.. నా కొడుకు వంటి నా సోదరుడు(ప్రిన్స్ రాజ్) నాకు ద్రోహం చేశారు. మా బాబాయ్... మా నాన్నకు చాలా సన్నిహితంగా ఉండేవారు. కానీ ఆయనను కూడా మోసం చేశారు. బాబాయ్.. నాకంటే పెద్దవారు కదా.. ఆయనకు ఏదైనా సమస్య ఉంటే నాతో మాట్లాడాల్సింది. ఇద్దరం కలిసి పరిష్కారం కనుగొనేవాళ్లం. కానీ ఆయన ఇలా చేయడం సరికాదు. నాకు మాత్రమే కాదు.. నాన్నకు కూడా ఆయన ద్రోహం చేశారు. ఇదంతా చూస్తూ నాన్న అస్సలు సంతోషంగా ఉండరు’’ అని చిరాగ్ ఉద్వేగపూరితంగా మాట్లాడారు. చదవండి: పాశ్వాన్ వారసుడెవరో ప్రజలే తేలుస్తారు ఎల్జేపీ: అసలు విషయం ఇదేనా.. అందుకే పశుపతి రాజీనామా?! -
ఎల్జేపీ: అసలు విషయం ఇదేనా.. అందుకే పశుపతి రాజీనామా?!
పట్నా/న్యూఢిల్లీ: ఇటీవల లోక్‌జనశక్తి పార్టీలో తిరుగుబాటు లేవనెత్తి ఆ పార్టీ పార్లమెంటరీ నేతగా ఎన్నికైన ఎంపీ పశుపతి కుమార్ పరాస్‌కు కేంద్ర మంత్రివర్గంలో చోటుదక్కనుందా... జేడీయూను ఎదిరించిన అన్న కొడుకు చిరాగ్ పాశ్వాన్‌ను నైతికంగా దెబ్బకొట్టినందుకు ఆయనకు అగ్రతాంబూలం దక్కనుందా.. అన్న ఊహాగానాలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పశుపతి చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. ఎల్జేపీ పగ్గాలు ఎవరి చేతిలో ఉండాలన్న అంశంపై బాబాయ్- అబ్బాయ్ మధ్య వివాదం కొనసాగుతున్న వేళ.. ‘‘నేను కేంద్ర మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేయగానే.. పార్లమెంటరీ పార్టీ నేతగా రాజీనామా చేస్తాను’’ అని పశుపతి పేర్కొన్నారు. కాగా ప్రధాని మోదీ ఇటీవల కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు నిర్వహిస్తుండటంతో కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. గత గురువారం నుంచి ప్రారంభమైన సమావేశాల్లో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఎన్డీయేలో భాగస్వామి అయిన ఎల్జేపీలో తిరుగుబాటు అనంతరం తాము ఇదే కూటమిలో కొనసాగుతామని పశుపతి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పశుపతి వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. నితీశ్ కుమార్‌తో కలిసి ఆయన పావులు కదిపుతున్నారా అన్న అనుమానాలకు బలం చేకూరుతోంది. మరోవైపు.. చిరాగ్ పాశ్వాన్ సైతం బీజేపీకి ఎప్పుడూ కూడా వ్యతిరేకంగా ఒక్కమాట కూడా మాట్లాడలేదు. పైగా ప్రధాని మోదీ రాముడు అయితే, తాను హనుమంతుడినంటూ గతంలో అభిమానం చాటుకున్నారు కూడా. ఈ నేపథ్యంలో ఒకవేళ కేంద్ర మంత్రి వర్గ విస్తరణ జరిగితే పశుపతికి పదవి ఇస్తే బాగానే ఉంటుందని కొంతమంది స్థానిక(బిహార్) బీజేపీ నేతలు అభిప్రాయపడుతుండగా, మరో వర్గం మాత్రం చిరాగ్ పాశ్వాన్‌కే మద్దతు తెలుపుతున్నట్లు సమాచారం. ఇక బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో(2020) చిరాగ్ పాశ్వాన్ జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ, బీజేపీకి అనుకూల వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దాదాపు 35 స్థానాల్లో జేడీయూ సీట్లకు గండికొట్టగా.. ఆయా చోట్ల బీజేపీకి అనుకూల పవనాలు వీయడం గమనార్హం. ఇక తాజా పరిణామాలు, ప్రకటనలతో బిహార్ రాజకీయాలు ఒక్కసారిగా దేశమంతా చర్చనీయాంశమయ్యాయి. చదవండి: LJP: మత్తు ఇచ్చి నాపై లైంగికదాడి: ఆ ఎంపీపై సంచలన ఆరోపణలు ‘నువ్వు నా రక్తం కావు; ఇక మీ బాబాయ్ చచ్చిపోయాడు’ -
ఎల్జేపీలో ముసలం.. నితీశ్ చాణక్యం!
గతేడాది బిహార్ ఎన్నికల సందర్భంగా ఎన్డీయేలో భాగస్వామ్యమైన చిరాగ్ పాశ్వాన్, మరో భాగస్వామి నితీశ్ కుమార్‌కు కంట్లో నలకలా మారారు. ఎన్డీయే కూటమితో పోటీ చేయకుండా కావాలని చిరాగ్ విడిగా పోటీ చేసి నితీశ్‌కు చికాకులు తెచ్చారు. ఒకపక్క బీజేపీతో స్నేహం చేస్తూనే మరోపక్క నితీశ్ కుమార్ పార్టీకి పోటీగా అభ్యర్థులను నిలిపారు. అయితే చివరకు అతికష్టం మీద ఎన్డీయే అధికారాన్ని నిలబెట్టుకుంది. బిహార్ ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ.. ఎల్జేపీ అభ్యర్థుల కారణంగా, దాదాపు 35 సీట్లను జేడీయూ కోల్పోయింది. దాంతో తొలిసారి మిత్రపక్షం బీజేపీ కన్నా తక్కువ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఎల్జేపీని బలహీన పర్చే ప్రయత్నాలను జేడీయూ ముమ్మరం చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అప్పటి నుంచి అదను కోసం చూస్తున్న నితీశ్ చాణక్యం వల్లనే తాజాగా ఎల్జేపీలో ముసలం పుట్టిందంటున్నారు. చిరాగ్‌ను ఒంటరి చేసేలా... మిగతా ఎంపీలకు దగ్గరవుతూ నితీశ్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఎల్జేపీకి ఉన్న 6గురు ఎంపీల్లో ఐదుగురు చిరాగ్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ వేరు కుంపటి పెట్టుకొని, తమను ప్రత్యేకంగా గుర్తించాలని స్పీకర్‌కు లేఖ రాయడం కలకలం సృష్టించింది. లోక్ జనశక్తి అధినేత పదవిని సైతం చిరాగ్ వదులుకొని తన బాబాయి పశుపతి కుమార్ పరాస్‌కు పగ్గాలు అప్పజెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక నితీశ్ పావులు కదిపినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఎల్జేపీ ఎంపీలతో నితీశ్ నేరుగా సంప్రదింపులు జరిపారని, ఈ వ్యవహారాన్ని జేడీయూ నేత మహేశ్వర్ హజారీ ద్వారా నడిపించారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. రామ్‌విలాస్ మృతితో బీజాలు పశుపతి పరాస్తో మహేశ్వర్ హజారీకి సత్సంబంధాలున్నాయి. అలాగే బాబాయి, కొడుకు మధ్య విబేధాలున్నాయి. రామ్‌విలాస్ పాశ్వాన్ మరణానంతరం పశుపతికి, చిరాగ్‌కు మధ్య సంబంధాలు క్షీణించాయి. ఎన్నికల్లో విడిగా పోటీచేయాలన్న చిరాగ్ నిర్ణయాన్ని అప్పట్లోనే పశుపతి వ్యతిరేకించారు. అప్పట్లో ఇద్దరి మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పశుపతిని నితీశ్ దగ్గరకు తీశారని సదరువర్గాల సమాచారం. దీంతో పాటు తిరుగుబాటు చేసిన ఎంపీల్లో ఒకరైన వీణా సింగ్ జేడీయూ నుంచి సస్పెండయిన ప్రజాప్రతినిధి భార్య. తిరిగి నితీశ్ దగ్గర మంచి మార్కులు కొట్టేయాలని ఈ నేత ఎంతో యత్నిస్తున్నారు. దాంతో వీణాసింగ్ మద్దతు సులభంగానే పరాస్‌కు లభించింది. అలాగే మరో ఎంపీ అనారోగ్యం పాలైనప్పుడు నితీశ్ వ్యక్తిగతంగా ఆయన బాగోగులపై ఆరా తీశారు. ఇలా ప్రతి ఎంపీతో ఏదోరకంగా సత్సంబంధాలు నెరపడం, అటు పశుపతిని దువ్వడం ద్వారా నితీశ్ తాను అనుకున్నది సాధించారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే ఎల్జేపీకి ఉన్న ఏకైక ఎంఎల్ఏ డిప్యూటీ స్పీకర్ ఎన్నికల్లో జేడీయూకు మద్దతు పలికారు. నితీశ్ పంచన చేశారు. ఉన్న ఒక్క ఎంఎల్సీ బీజేపీలో చేరారు. అప్పుడైనా చిరాగ్ మేలుకొని ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తాను మోదీకి హనుమంతుడి లాంటివాడినని చిరాగ్ ఎంత చెప్పుకున్నా, ప్రస్తుతం నితీశ్‌తో సంధి తప్ప ఆయన్ను కాపాడే మార్గాలేవీ లేవంటున్నారు. చిరాగ్ ఎన్డీయేలో ఉంటూనే జేడీ (యూ)ను లక్ష్యంగా చేసుకోవడం వెనుక బీజేపీ పెద్దల హస్తం ఉండొచ్చనే వాదనలు అప్పట్లో వినిపించాయి. నితీశ్‌ను బలహీనపర్చి... తమపై ఆధారపడేలా చేసే గేమ్‌ప్లాన్‌లో భాగంగానే చిరాగ్‌ను జేడీయూపైకి ప్రయోగించారని అంటారు. చివరకు అదే జరిగింది. జేడీయూకు కంటే బీజేపీకి ఎక్కవ స్థానాలు గెలిచినా... ఎన్నికలకు ముందు ప్రకటించిన మేరకు నితీశ్‌ను ముఖ్యమంత్రిగా చేసి... బీజేపీ క్రెడిట్ కొట్టేసింది. ఇప్పుడు చిరాగ్... ఒంటరిగా మిగిలే పరిస్థితులు వచ్చినపుడు అది ఎల్జేపీ అంతర్గత వ్యవహారమని బీజేపీ అంటోంది. రాజకీయాలు తెలిసి రావాలంటే చిరాగ్‌కు ఇంకా సమయం పడుతుందేమో. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అమ్మాళీ... ఎంత బొమ్మాళీ!!!! వదలా నిన్నొదలా...
ఉత్తమ విలన్ ‘అరుం.... అరుంధతా? అమ్మాళీ... ఎంత బొమ్మాళీ! పిందె పండైందే... అమ్మ బొమ్మాలే... నిన్ను చంపి ముక్కలు చేయాలని వచ్చానే. కానీ నిన్ను చంపా. ఏడు సంవత్సరాలు ఆడగాలి కరువైన ఈ పిశాచికి ఇంత అందాల బొమ్మ ఎదురుపడుతుందని నేను అనుకోలేదు’ ‘అరుంధతి’ సినిమాలో అఘోరా గొంతు నుంచి డైలాగులు వినిపిస్తున్నప్పుడు రోమాలు నొక్కబొడుచుకుంటాయి. అఘోర... ఎంత శక్తివంతమైన విలన్! ‘వాడి నాలుక మరణశాసనం. వాడి చేతులు యమపాశాలు. ఎంత బలవంతుడైనా వాడిని ఎదురించలేడు. ఏ ఆయుధమూ వాడిని సంహరించలేదు’ ‘అరుంధతి’ సినిమా కథ తయారవుతు న్నప్పుడే నిర్మాత శ్యాంప్రసాద్‌రెడ్డి దృష్టిలో తమిళ నటుడు పశుపతి ఉన్నాడు. కామెడీ అయినా, కర్కశత్వమైనా... పశుపతి రామస్వామి తాను చేస్తున్న పాత్రను అద్భుతంగా పండించ గలడు. అందుకే విలన్ పేరుకు ‘పశుపతి’ అని పేరు పెట్టుకున్నాడు. ‘అఘోర’ పాత్రలో పశుపతి జీవించడం ఖాయం! కానీ... ఒక పెద్ద డౌటు వచ్చింది. ‘అరుంధతి’లో విలన్ పశుపతిగా, అఘోరగా నటించాలి. అఘోరగా పశుపతి ఓకే. మరి ‘పశుపతి’ పాత్రలో పశుపతి? నాట్ ఓకే! ‘పశుపతి’ పాత్రలో రాచరికం ఉట్టి పడాలి. రాచరికంతో కూడిన క్రౌర్యం ఉట్టిపడాలి. ఎందుకో ఆ పాత్రకు పశుపతి సరియైన ఎంపిక కాదనిపించిది.విలన్‌గా పశుపతి పేరు కొట్టేశాడు. విలన్ పేరును మాత్రం కొట్టేయలేదు. విలన్ పేరు పశుపతే! ఆ సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్ ‘అశోక్’ సినిమా చూశాడు శ్యాంప్రసాద్‌రెడ్డి. ఆ సినిమాలో ‘కేకే’గా సోనూ సూద్ విలనిజం రెడ్డిని ఆకట్టుకుంది. అలా తన ‘అరుంధతి’ సినిమాకు విలన్‌గా సోనూ సూద్‌ను అనుకున్నాడు. అయితే పశుపతి క్యారెక్టర్ స్కెచ్‌లు చూసిన సోనూ సూద్ ఆ పాత్రను పెద్దగా ఇష్టపడలేదు. అయితే నిర్మాత ఆసక్తి, ఉత్సాహం చూసి నటించడానికి ఒప్పుకున్నాడు. పశపతి పాత్రకుగానూ ఛాతి, పొట్టపై మంత్రాల టాటూలు వేసుకోవాల్సి వచ్చింది సోనూ సూద్. మేకప్‌కు రోజూ... మూడు గంటల సమయం పట్టేది. అఘోర మేకప్ ఒక ఎత్తయితే... సోనూ నటన మరొక ఎత్తు. ‘అరుంధతి’ విడుదైన తరువాత ఎక్కడ చూసినా ‘అమ్మాళీ... బొమ్మాళీ’ డైలాగే! ‘పశుపతి’ పాత్రలో రాచరికపు అహాన్ని, ‘అఘోరా’లోని భయానకాన్ని సమానస్థాయిలో ప్రదర్శించి ప్రేక్షకలోకంలో జేజేలు అందుకున్నాడు సోనూ. ‘బెస్ట్ విలన్’గా నంది అవార్డ్ కూడా అందుకున్నాడు. పంజాబ్‌లోని మోగ నగరం సోనూ సూద్ స్వస్థలం. చదువుల కోసం నాగపూర్‌కు వచ్చిన సోనూ, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తరువాత మోడలింగ్, ఫ్యాషన్ షో, ర్యాంప్ వాక్‌లు చేసేవాడు. ఆ సమయంలోనే సినిమాల్లో నటించాలనే కోరిక బలపడింది. ఒక నెలరోజులు నటనలో శిక్షణ తీసుకున్నాడు. 1999లో ‘కుళ్లళగర్’ అనే తమిళ సినిమాలో సౌమ్య నారాయణ అనే పూజారి పాత్రతో వెండితెరకు పరిచయం అయ్యాడు. ఆ తరువాత మరో తమిళ సినిమాలో గ్యాంగ్‌స్టర్‌గా నటించాడు. 2000 సంవత్సరంలో శివనాగేశ్వర్రావు దర్శకత్వం వహించిన ‘హ్యాండ్సప్’ అనే సినిమాలో నటించాడు. బాలీవుడ్ సినిమాల్లో నటించాలని కలలు కన్న సోనూకు ఆ కల అంత తొందరగా నెరవేరలేదు. 2002లో మాత్రం ‘షాహీద్-ఏ-ఆజామ్’ అనే బాలీవుడ్ సినిమాలో భగత్‌సింగ్ పాత్ర పోషించే అవకాశం లభించింది. మణిరత్నం ‘యువ’ సినిమాలో అభిషేక్ బచ్చన్ తమ్ముడిగా నటించాడు. ‘సూపర్’ సినిమాలో హైటెక్-రాబర్ సోనూ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు సోనూ సూద్. తెలుగులో ‘అరుంధతి’ ఆయన విలనిజాన్ని తారస్థాయికి తీసుకెళితే, ‘దబాంగ్’లో చేడిసింగ్ పాత్రతో విలనిజంలో ఎంత భిన్నత్వాన్ని చూపవచ్చో నిరూపించాడు సోనూ సూద్. నట విద్యాలయంలో సోనూ సూద్ చదువుకుంది నెలరోజులు మాత్రమే... అయితే కెమెరా మాత్రం అతడికి సంవత్సరాలకు సరిపడేంత పాఠాలు నేర్పింది. అందుకే.. సోనూ సూద్ అనే పేరు వినబడగానే స్పందనగా ‘ఉత్తమ విలన్’ అనే మాట కూడా వినబడుతుంది. -
సినిమా రివ్యూ: అనామిక
నటీనటులు: నయనతార, హర్షవర్ధన్ రాణే, వైభవ్, పశుపతి, నరేశ్ ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్ కెమెరా: విజయ్ సి. కుమార్ పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి సంగీతం: కీరవాణి దర్శకత్వం: శేఖర్ కమ్ముల ప్లస్ పాయింట్స్: నయనతార క్లైమాక్స్ కెమెరా మైనస్ పాయింట్స్: తొలిభాగం ఫీల్ లేకపోవడం థ్రిల్లర్ సినిమాకు తగ్గ స్క్రీన్ ప్లే లేకపోవడం యూత్ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ తో ఆకట్టుకున్న శేఖర్ కమ్ముల తన టేస్ట్ కు దూరంగా బాలీవుడ్ లో విజయవంతమైన 'కహానీ' చిత్రాన్ని రీమేక్ గా 'అనామిక' చిత్రాన్ని రూపొందించారు. కహానీ చిత్రం ద్వారా విమర్శకుల ప్రశంసలందుకున్న విద్యాబాలన్ పాత్రను తెలుగు, తమిళంలో నయనతార పోషించింది. కహానీ చిత్రానికి కొన్ని మార్పులు వేసి రూపొందించిన అనామిక చిత్రం మే 1 తేది గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దేశవ్యాప్తంగా ఆదరణ లభించిన 'కహానీ' చిత్రం మాదిరిగానే అనామిక తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుందా అనే విషయాన్ని తెలుసుకోవడానికి కథ గురించి తెలుసుకుందాం! కథ: అమెరికాలో అనామిక (నయనతార) ఓ సాఫ్ట్ వేర్ ప్రొఫేషనల్. తప్పిపోయిన తన భర్త అజయ్ శాస్త్రి (హర్షవర్ధన్ రాణే) ఆచూకీ తెలుసుకునేందుకు హైదరాబాద్ చేరుకున్న అనామిక పాతబస్తీలోని ఓ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తుంది. అయితే అజయ్ శాస్త్రి కిడ్నాప్ గురయ్యాడనే విషయాన్ని అనామిక తెలుసుకుంటుంది. తన భర్తను ఆచూకీ తెలుసుకోవడానికి అనామిక కు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? చివరకు అజయ్ శాస్త్రిని కలుసుకుందా? అజయ్ శాస్త్రిని కలుసుకున్నఅనామిక ఎలాంటి నిర్ణయం తీసుకుంది? అనే ప్రశ్నలకు జవాబే ఈ చిత్రం. నటీనటుల పెర్పార్మెన్స్: అనామికగా నయనతార పాత్రే ఈ చిత్రంలో కీలకం. కెరీర్ లో నయనతార మరో విభిన్నమైన పాత్రను పోషించారు. తనకు అందివచ్చిన అనామిక పాత్రను పోషించడంలో నయన సక్సెస్ అయ్యారనే చెప్పవచ్చు. తన భర్త కోసం వెతుక్కుంటూ వచ్చి, ఇబ్బందులకు గురయ్యే మహిళపై సానుభూతి సహజంగానే ఉంటుంది. అయితే ఆ సానుభూతిని ప్రేక్షకుల్లో నయనతార కలిగించలేకపోయింది. ఓవరాల్ గా నయనతార మంచి ఫెర్ఫార్మెన్స్ నే అందించింది. కథలో బాగంగా వచ్చే ఇన్స్ పెక్టర్ సారధి (వైభవ్ రెడ్డి), హోంమంత్రి (నరేశ్), దర్యాప్తు అధికారి (పశుపతి) లాంటి పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా.. వారి పాత్ర పరిధి మేరకు పర్వాలేదనిపించారు. హర్షవర్ధన్ పాత్ర గురించి చెప్పుకోవాల్సినంతగా లేదు. సాంకేతిక నిపుణుల పనితీరు: థ్రిలర్ నేపథ్యంగా రూపొందిన ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోరు కు అత్యంత ప్రాదాన్యత ఉంటుంది. నటీనటుల ఎమోషన్స్, పరిస్థితులను తగినట్టుగా కీరవాణి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోరు 'అనామిక'కు అదనపు ఆకర్షణగా నిలిచింది. పాటలు ఈ చిత్రంలో ఎక్కువ స్కోప్ లేకపోవడంతో ఒకటి, రెండింటితో సరిపెట్టారు. ఎడిటింగ్ పై దర్శకులు మరింత దృష్టి పెట్టాల్సిందనిపించింది. విజయ్ కుమార్ పనితీరు బాగుంది. ఇక 'కహానీ' రీమేక్ అనగానే అనేక రకాలైన పోలికలు ఉండటం సహాజం. కహానీలో విద్యాబాలన్ గర్బవతి. గర్భవతిగా ఉన్న ఓ యువతి భర్త కోసం వెతుక్కుంటూ వచ్చిందనే కథలోనే సానుభూతి క్రియేట్ అవుతుంది. అయితే ఓ యువతి కష్టాల్లో ఉందనే అంశమే ఆ పాత్రపై సానుభూతి కలిగిస్తుందనే భావనతో నయనతారను ప్రెగ్నెంట్ గా చూపించకూడదని శేఖర్ కమ్ముల నిర్ణయం తీసుకున్నారు. అయితే విద్యాబాలన్ పాత్రపై కలిగే సానుభూతిని తెరమీద అనామిక పాత్రకు కల్పించడంలో దర్శకులు కొంత సఫలం కాలేదనే చెప్పవచ్చు. తొలిభాగం కథను చాలా నెమ్మదిగా నడిపించిన శేఖర్ కమ్ముల.. క్లైమాక్స్ లో విజృంభించాడనే చెప్పవచ్చు. థ్రిల్లర్ సినిమాలో ఉండే పక్కా స్క్రీన్ ప్లే, ఇంట్రస్ట్ కలిగించే సన్నివేశాలు.. ఏం జరుగబోతుందనే టెన్సన్ ను కలిగించడంలో దర్శకుడు కొంత తడబాటుకు గురయ్యాడు. కొన్ని పాత్రల విషయంలో అనేక సందేహాలను రేకేత్తించారు. అలాంటి సందేహాలను నివృత్తి చేసుకునే బాధ్యతను దర్శకుడు ప్రేక్షకుడికే వదిలివేయడం ఓ మైనస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఈ చిత్రంలో కొన్ని లోపాలున్నా, కహానీ రేంజ్ లో సానుభూతి సంపాదించుకోలేకపోయినా... అనామిక ఓ మోస్తారుగా ఆకట్టుకునేలా ఉందని చెప్పవచ్చు. ట్యాగ్: అనామిక 'స్పీచ్ లెస్'