సినిమా రివ్యూ: అనామిక
సినిమా రివ్యూ: అనామిక
Published Thu, May 1 2014 2:21 PM | Last Updated on Sat, Sep 2 2017 6:47 AM
నటీనటులు:
నయనతార, హర్షవర్ధన్ రాణే, వైభవ్, పశుపతి, నరేశ్
ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్
కెమెరా: విజయ్ సి. కుమార్
పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం: కీరవాణి
దర్శకత్వం: శేఖర్ కమ్ముల
ప్లస్ పాయింట్స్:
నయనతార
క్లైమాక్స్
కెమెరా
మైనస్ పాయింట్స్:
తొలిభాగం
ఫీల్ లేకపోవడం
థ్రిల్లర్ సినిమాకు తగ్గ స్క్రీన్ ప్లే లేకపోవడం
యూత్ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ తో ఆకట్టుకున్న శేఖర్ కమ్ముల తన టేస్ట్ కు దూరంగా బాలీవుడ్ లో విజయవంతమైన 'కహానీ' చిత్రాన్ని రీమేక్ గా 'అనామిక' చిత్రాన్ని రూపొందించారు. కహానీ చిత్రం ద్వారా విమర్శకుల ప్రశంసలందుకున్న విద్యాబాలన్ పాత్రను తెలుగు, తమిళంలో నయనతార పోషించింది. కహానీ చిత్రానికి కొన్ని మార్పులు వేసి రూపొందించిన అనామిక చిత్రం మే 1 తేది గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దేశవ్యాప్తంగా ఆదరణ లభించిన 'కహానీ' చిత్రం మాదిరిగానే అనామిక తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుందా అనే విషయాన్ని తెలుసుకోవడానికి కథ గురించి తెలుసుకుందాం!
కథ:
అమెరికాలో అనామిక (నయనతార) ఓ సాఫ్ట్ వేర్ ప్రొఫేషనల్. తప్పిపోయిన తన భర్త అజయ్ శాస్త్రి (హర్షవర్ధన్ రాణే) ఆచూకీ తెలుసుకునేందుకు హైదరాబాద్ చేరుకున్న అనామిక పాతబస్తీలోని ఓ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తుంది. అయితే అజయ్ శాస్త్రి కిడ్నాప్ గురయ్యాడనే విషయాన్ని అనామిక తెలుసుకుంటుంది. తన భర్తను ఆచూకీ తెలుసుకోవడానికి అనామిక కు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? చివరకు అజయ్ శాస్త్రిని కలుసుకుందా? అజయ్ శాస్త్రిని కలుసుకున్నఅనామిక ఎలాంటి నిర్ణయం తీసుకుంది? అనే ప్రశ్నలకు జవాబే ఈ చిత్రం.
నటీనటుల పెర్పార్మెన్స్:
అనామికగా నయనతార పాత్రే ఈ చిత్రంలో కీలకం. కెరీర్ లో నయనతార మరో విభిన్నమైన పాత్రను పోషించారు. తనకు అందివచ్చిన అనామిక పాత్రను పోషించడంలో నయన సక్సెస్ అయ్యారనే చెప్పవచ్చు. తన భర్త కోసం వెతుక్కుంటూ వచ్చి, ఇబ్బందులకు గురయ్యే మహిళపై సానుభూతి సహజంగానే ఉంటుంది. అయితే ఆ సానుభూతిని ప్రేక్షకుల్లో నయనతార కలిగించలేకపోయింది. ఓవరాల్ గా నయనతార మంచి ఫెర్ఫార్మెన్స్ నే అందించింది.
కథలో బాగంగా వచ్చే ఇన్స్ పెక్టర్ సారధి (వైభవ్ రెడ్డి), హోంమంత్రి (నరేశ్), దర్యాప్తు అధికారి (పశుపతి) లాంటి పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా.. వారి పాత్ర పరిధి మేరకు పర్వాలేదనిపించారు. హర్షవర్ధన్ పాత్ర గురించి చెప్పుకోవాల్సినంతగా లేదు.
సాంకేతిక నిపుణుల పనితీరు:
థ్రిలర్ నేపథ్యంగా రూపొందిన ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోరు కు అత్యంత ప్రాదాన్యత ఉంటుంది. నటీనటుల ఎమోషన్స్, పరిస్థితులను తగినట్టుగా కీరవాణి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోరు 'అనామిక'కు అదనపు ఆకర్షణగా నిలిచింది. పాటలు ఈ చిత్రంలో ఎక్కువ స్కోప్ లేకపోవడంతో ఒకటి, రెండింటితో సరిపెట్టారు. ఎడిటింగ్ పై దర్శకులు మరింత దృష్టి పెట్టాల్సిందనిపించింది. విజయ్ కుమార్ పనితీరు బాగుంది.
ఇక 'కహానీ' రీమేక్ అనగానే అనేక రకాలైన పోలికలు ఉండటం సహాజం. కహానీలో విద్యాబాలన్ గర్బవతి. గర్భవతిగా ఉన్న ఓ యువతి భర్త కోసం వెతుక్కుంటూ వచ్చిందనే కథలోనే సానుభూతి క్రియేట్ అవుతుంది. అయితే ఓ యువతి కష్టాల్లో ఉందనే అంశమే ఆ పాత్రపై సానుభూతి కలిగిస్తుందనే భావనతో నయనతారను ప్రెగ్నెంట్ గా చూపించకూడదని శేఖర్ కమ్ముల నిర్ణయం తీసుకున్నారు. అయితే విద్యాబాలన్ పాత్రపై కలిగే సానుభూతిని తెరమీద అనామిక పాత్రకు కల్పించడంలో దర్శకులు కొంత సఫలం కాలేదనే చెప్పవచ్చు. తొలిభాగం కథను చాలా నెమ్మదిగా నడిపించిన శేఖర్ కమ్ముల.. క్లైమాక్స్ లో విజృంభించాడనే చెప్పవచ్చు. థ్రిల్లర్ సినిమాలో ఉండే పక్కా స్క్రీన్ ప్లే, ఇంట్రస్ట్ కలిగించే సన్నివేశాలు.. ఏం జరుగబోతుందనే టెన్సన్ ను కలిగించడంలో దర్శకుడు కొంత తడబాటుకు గురయ్యాడు. కొన్ని పాత్రల విషయంలో అనేక సందేహాలను రేకేత్తించారు. అలాంటి సందేహాలను నివృత్తి చేసుకునే బాధ్యతను దర్శకుడు ప్రేక్షకుడికే వదిలివేయడం ఓ మైనస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఈ చిత్రంలో కొన్ని లోపాలున్నా, కహానీ రేంజ్ లో సానుభూతి సంపాదించుకోలేకపోయినా... అనామిక ఓ మోస్తారుగా ఆకట్టుకునేలా ఉందని చెప్పవచ్చు.
ట్యాగ్: అనామిక 'స్పీచ్ లెస్'
Advertisement
Advertisement