నయనతార ఆ మాట నిర్మొహమాటంగా చెప్పేసింది..! | Sekhar Kammula special interview | Sakshi
Sakshi News home page

నయనతార ఆ మాట నిర్మొహమాటంగా చెప్పేసింది..!

Published Sat, Apr 26 2014 11:19 PM | Last Updated on Mon, Aug 20 2018 7:19 PM

నయనతార ఆ మాట నిర్మొహమాటంగా చెప్పేసింది..! - Sakshi

నయనతార ఆ మాట నిర్మొహమాటంగా చెప్పేసింది..!

 శేఖర్ కమ్ములకు సినీ ఓనమాలు నేర్పింది అమెరికా. కానీ... ఆయన సినిమాల్లో అక్కడి ధోరణే కనిపించదు. అచ్చ తెలుగుదనం కనిపిస్తుంది. సమాజంపై ప్రేమ... వ్యవస్థను మార్చాలనే తపన కనిపిస్తుంది. అందుకే... ఈ తరం దర్శకుల్లో శేఖర్‌ది ఓ ప్రత్యేకమైన సంతకం. హిందీ ‘కహానీ’కి రీమేక్‌గా ఆయన తీసిన ‘అనామిక’  మే 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా శేఖర్‌తో ‘సాక్షి’ జరిపిన ప్రత్యేక భేటీ.
 
 తొలి రీమేక్ అనుభవం ఎలా ఉంది?
 కొత్తగా ఉంది. అయితే... తీసే విషయంలో నా అభిమతానికి భిన్నంగా వెళ్లాల్సి వచ్చింది. మామూలుగా నా సినిమాల్ని నేనే రాసుకుంటాను. కానీ... ఈ సినిమా విషయంలో తొలిసారిగా మరో వ్యక్తి సహకారం తీసుకోవాల్సి వచ్చింది. ఆయనే యండమూరి వీరేంద్రనాథ్. ‘కహానీ’ ఇతివృత్తం మాత్రమే తీసుకొని సాధ్యమైనంతవరకూ కథలో, కథనంలో మార్పు చేశాం. సినిమా అంతా నా బాణీలోనే ఉంటుంది. ఇప్పటివరకూ నా దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నింటినీ నా బిడ్డలుగా భావించాను. ఈ సినిమా మాత్రం నా దత్తపుత్రిక.
 
 అన్ని మంచి సినిమాలున్నా... ‘కహానీ’పైనే దృష్టి పెట్టారేం?
 ‘కహానీ’ సినిమాను అసలు నేను చూడలేదు. ఈ సినిమా నిర్మాతలు ‘కహానీ’ హక్కులు తీసుకొని.. దాన్ని నాతో తీయాలనుకున్నారు. వాళ్ల కోసమే ‘కహానీ’ చూశాను. నచ్చింది. అయితే... మన సినిమాల్లో ఉండాల్సిన అంశాలేవీ ఈ కథలో లేవు. పైగా హీరోయిన్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్. ఇలాంటి సినిమా చేయడం రిస్కేమో అనిపించింది. అలాంటి సమయంలో ఢిల్లీలో నిర్భయ సంఘటన జరిగింది. స్త్రీ సమస్యల నేపథ్యంలో ఓ సినిమా తీయాలనే ఆలోచన అప్పుడే కలిగింది నాకు. నా దగ్గర అలాంటి కథలేం లేవు. అప్పటికే ‘కహానీ’ ప్రపోజల్ నా ముందుండడంతో... ఇది కూడా ఓ స్త్రీ పోరాటం నేపథ్యమే కాబట్టి ప్రస్తుత సమయంలో ఇలాంటి సినిమాలు చేయడం అవసరం అనిపించి ఒప్పుకున్నాను.
 
 ఈ సినిమాలో నయనతారను గర్భవతిగా కాకుండా మామూలుగానే చూపించారు. కథ రీత్యా అది రిస్కేమో?
 స్త్రీ శక్తిని చూపించాలనే తలంపుతో ఇంత కష్టపడి సినిమా తీస్తున్నప్పుడు, ఆమె సమాజాన్ని చీటింగ్ చేస్తున్నట్టు చూపించడం సమంజసం కాదు అనిపించింది. స్వచ్ఛంగా, నిజాయితీగా తాను ఎందుకు పోరాటం చేయకూడదు అనిపించింది. అది కష్టమైనా, కథలో చిన్న మార్పు చేశాం. ‘కహానీ’ చూడని వారికే కాదు,  చూసిన వారికీ కొత్తగా అనిపిస్తుంది.
 
 ఇక ముందు రీమేక్‌లు చేస్తారా?
 చేయను. మాతృక కంటే సినిమా బాగుండాలి, ఫలానా సన్నివేశం కంటే భిన్నంగా ఉండాలి, నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేయాలి... ఇలా ఇన్ని రకాల ఆలోచనలతో నేను సినిమా చేయలేను. నా శైలిలో, నా మనసుకు దగ్గరగా, నా ఆలోచనలకు అనుగుణంగా సినిమాలు తీయడంలో ఉన్నంత హాయి ఈ రీమేక్‌ల వల్ల ఉండదు. అందుకే ఇక చేయను.
 
 విద్యాబాలన్‌తో పోల్చి చూస్తే... నయనతార ఎలా చేశారు?
 విద్యాబాలన్ గొప్ప నటి. ‘కహానీ’లో ఆమె గొప్పగా నటించింది అనడం కంటే... గర్భవతిగా జీవించింది అనాలి. కానీ అదేమీ లేకుండానే ఎమోషన్స్ పలికించడం నిజంగా ఓ సవాలు. ఆ విధంగా చూసుకుంటే నయనతార పాత్రధారణే కష్టమైంది. దాన్ని తాను బాగా చేసిందనే చెప్పాలి.
 
 కానీ ఆమె సరిగ్గా సహకరించ లేదనీ, డేట్స్, ప్రమోషన్ విషయంలో ఇబ్బందులకు గురిచేసిందనీ బయట టాక్...
 సినిమా ప్రమోషన్ విషయంలో దూరంగా ఉండాలనేది ఆమె పాలసీ అనుకుంటా. తమిళంలో కూడా ఆమె ప్రమోషన్లలో పాల్గొనడం తక్కువే. అయితే... హీరో ఉన్న సినిమాలకు ప్రమోషన్‌కి రాకపోయినా ఫర్లేదు. కానీ ఇలాంటి సినిమాకు మాత్రం తప్పకుండా రావాలి. ఈ విషయాన్ని ఆమె ముందుంచితే... అది నా పాలసీ కాదు అని నిర్మొహమాటంగా చెప్పారు. ఆర్టిస్టుగా... నిర్మాతల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ... సినిమా మనది అనుకొని ముందుకెళ్లే వారు కొందరు... సినిమాను ఒక ఉద్యోగంలా చేసేసి డబ్బులు తీసుకొని వెళ్లే పోయేవారు కొందరు. నయనతార రెండో కేటగిరికి చెందిన నటి. తన పాత్ర వరకూ ఎంత కష్టపడాలో అంత కష్టపడుతుంది. సినిమా అయిపోయాక తనకు సంబంధం లేనట్టే ఉంటుంది.
 
 చాలామంది ఆర్టిస్టులకు లైఫ్ ఇచ్చిన మీ ముందు ఒక నటి ఇలా ప్రవర్తిస్తే... మీకెప్పుడూ చిరాకు అనిపించలేదా? కొత్తమ్మాయిని పరిచయం చేస్తే పోయేదే అని ఎప్పుడూ అనిపించలేదా?
 నేను అనుకున్నవారిలో నయనతారతో పాటు అనుష్క కూడా ఉంది. అలాగే కొత్తమ్మాయితోనూ చేయాలనుకున్నాను. కానీ నిర్మాతలు మాత్రం ఇది ద్విభాషా చిత్రం కాబట్టి, రెండు భాషల్లో పాపులరైన నటి అయితే బావుంటుందని చెప్పారు. తెలుగులో నాపై, తమిళంలో హీరోయిన్‌పై బిజినెస్ అవుతుందని వాళ్ల అభిప్రాయం. అందుకే నయనతారను తీసుకున్నాం.
 
 ఈ సినిమా వల్ల నయనతారకే ప్లస్. ఈ విషయంలో నయన అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదని పలువురి అభిప్రాయం...
 హీరోయిన్లపై ఇంత డబ్బు పెట్టి సినిమాలు తీసేవాళ్లే లేరు. కానీ తీశారు. నాకైతే సినిమాను బాగా ప్రమోట్ చేయాలని ఉంది. ఆ ఆలోచన తనకూ ఉండాలిగా. బాలీవుడ్‌లో విద్యాబాలన్ గర్భిణిగా రోడ్ల వెంట తిరిగారు.
 
 మీ తర్వాతి సినిమా?
 ‘ఆనంద్’ లాంటి మంచి కథ రాశా. ఈ దఫా కొత్తవాళ్లతో కాకుండా యంగ్ స్టార్‌తో చేస్తా.
 
 పదేళ్లయ్యింది ‘ఆనంద్’ వచ్చి. ఇప్పటివరకూ ఆరు సినిమాలు తీశారు. ఇది ఏడో సినిమా. ఎందుకింత ఆలస్యం?
 కథలు తట్టాలి. నాకు డబ్బు ముఖ్యం కాదు. హీరోల డేట్స్ ఉన్నాయి కదా అని గబగబా కథలు తయారు చేసుకోవాలి అనే సినిమా ఈతిబాధలు నాకు లేవు. అవసరం అనిపించినప్పుడు, ఏదైనా చెప్పాలనిపించినప్పుడు ఓ కథ పుట్టుకొస్తుంది. నేను తీసే సినిమాలకు ఆ టైమ్ పడుతుందనుకుంటున్నా. నా సినిమాలు చిన్నవే కానీ, నా పబ్లిసిటీ విషయంలో కానీ, విజయాల విషయంలో కానీ అవి చిన్న సినిమాలు అనిపించవు. నవ్వుకున్నామా, వెళ్లిపోయామా అని కాకుండా సినిమాతో కాసేపు జీవిస్తారు ప్రేక్షకులు. అలా ఉంటాయి నా సినిమాలు. ఆ కథతో వారి జీవితాలు ముడి వేసుకున్న ఫీలింగ్‌లోకెళ్తారు. అలాంటి సినిమాలు రాయడం అంత తేలిక కాదు.
 
 తెలుగు సినిమాను ఉన్నతంగా నిలబెట్టే సామర్థ్యం ఉన్న దర్శకునిగా మిమ్మల్ని చెప్పుకుంటారు. అలాంటి బాధ్యత ఉన్న మీరు నిదానంగా ముందుకెళ్లడం ఎంతవరకు సమంజసం?

 నిదానం నా బ్యాడ్ హ్యాబిట్. మీరన్నట్లు మంచి సినిమాలు తీయాలని, వేగంగా తీయాలని నాకూ ఉంది. అయితే పలు కారణాల వల్ల కుదరడం లేదు. కార్పొరేట్ కంపెనీలతో టై అప్ అయ్యి... చిత్ర నిర్మాణాలు చేపట్టాలని ఉంది. తద్వారా కొత్త టాలెంట్‌ని పరిచయం చేయాలనుంది. ప్రస్తుతం తీస్తే 40 కోట్ల సినిమాలు తీస్తున్నారు. లేకపోతే... ఒకటి, రెండు కోట్ల ఖర్చుతో బూతు సినిమాలు తీస్తున్నారు. ఈ రెండింటి మధ్య... ఖర్చు తక్కువలో సమాజానికి ఉపయోగపడే, మన వ్యక్తిత్వాలను ఆవిష్కరించి, సంప్రదాయాలను గుర్తు చేసే, మంచి సినిమాలు రావాలి.
 
 ఈ మధ్య వచ్చిన సినిమాల్లో మీకు నచ్చినవి?
 ‘మల్లెలతీరంలో సిరిమల్లె చెట్టు, మిణుగురులు’. ఈ రెండూ మంచి ప్రయత్నాలు. మన స్టార్ డెరైక్టర్లు కూడా... ఆ చట్రం నుంచి బయట పడి ఎప్పుడో ఒకప్పుడు ఇది నా సంతకం  అనదగ్గ మంచి సినిమాలు తీయాలి.
 
 ఇప్పుడున్న వారిలో మీకు నచ్చిన దర్శకులు?
 రాజమౌళి, త్రివిక్రమ్. వాళ్లపై విజయాల ఒత్తిడి ఉంది. దాని వల్లే కేవలం వాణిజ్య చిత్రాలే తీస్తున్నారు. నిజానికి వీరిద్దరూ ఎంతో చేయగలరు. రాజమౌళైతే చేయలేనిది లేదు. ఎప్పుడో ఒకప్పుడు వారి నుంచి ‘ఇది నా నిజమైన సంతక’మనే సినిమా వస్తుందని నా ఆశ.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement