అంతపెద్ద స్టార్‌ని పాతబస్తీలో తిప్పడం పెద్ద సాహసమే!
‘‘ఇప్పటివరకూ నేను చేసిన సినిమాల కథలన్నీ నా సొంతవి. అంటే... అవన్నీ నా సొంత కూతుళ్లన్నమాట. ‘అనామిక’ మాత్రం నా పెంపుడు కూతురు. ఈ సినిమా ‘కహానీ’ చిత్రానికి రీమేక్ అన్న విషయం తెలిసిందే. అయితే... పేరుకే ఇది రీమేక్. నిజానికి కథలో మన నేటివిటీకి తగ్గట్టు చాలా మార్పులు చేశాం’’ అని శేఖర్ కమ్ముల చెప్పారు. ఆయన దర్శకత్వంలో నయనతార ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘అనామిక’. వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం ప్రచార చిత్రాలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల విలేకరులతో ముచ్చటిస్తూ... ‘‘ఈ సినిమా విషయంలో ప్రఖ్యాత రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌గారు ఎంతో సహకరించారు. ఆయన, నేను కలిసి నాలుగైదు నెలలు కష్టపడి ఈ స్క్రిప్ట్ తయారు చేశాం.
కొత్తవారితో ఎక్కువగా పనిచేసిన నాకు, సీనియర్ టెక్నీషియన్స్‌తో పనిచేసే అవకాశం కలిగించిందీ సినిమా. యండమూరీ, కీరవాణి లాంటి వాళ్లతో నేను పనిచేయడం ఇదే ప్రథమం. అలాగే... తొలిసారి నా సినిమాకు సిరివెన్నెల పాటలు రాశారు. వీరందరితో అసోసియేట్ అవ్వడం కొత్త అనుభూతి’’ అని చెప్పారు శేఖర్. ‘‘నయనతారతో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. అంత పెద్ద స్టార్ హీరోయిన్‌ని పాతబస్తీలో జనాల మధ్య తిప్పుతూ షూటింగ్ చేయడం గొప్ప సాహసమే. కానీ ఈ విషయంలో నయన సహకారం మరచిపోలేనిది. ఆమెకు నేనివ్వబోతున్న ఓ మంచి సినిమా ఇది. ఈ సినిమాతో నయనతార నట సామర్థ్యం ఏంటో రుజువవుతుంది’’ అని నమ్మకంగా చెప్పారు శేఖర్ కమ్ముల.