అలాంటిదేమీ లేదు!
ఇంటర్వ్యూ
సినిమాల్లో తప్ప బయట ఎక్కడా ఎక్కువ కనిపించదు నయనతార. ఫంక్షన్లకు అంతగా రాదు. పార్టీలకు వెళ్లదు. ఇక మీడియా అంటే ఆమడ దూరంలో ఉంటుంది. దాంతో నయన్ మనసులో ఏముందో ఎవరికీ పెద్దగా తెలియదు. తెలుసుకోవాలని ఉంది అంటే... ఎట్టకేలకు పెదవి మెదిపింది. మనసు విప్పి మాట్లాడింది. తన అలవాట్లు, అభిరుచులు, అభిప్రాయాలను ఇలా మన ముందు పరిచింది!
* మీడియాకి దూరంగా ఉంటారెందుకు?
నాకు తక్కువ మాట్లాడటం అలవాటు. అందుకే ఇంటర్వ్యూలు నచ్చవు. అయినా రెండు మూడు ఇంటర్వ్యూలు బాగానే ఉంటాయి. కానీ నాలుగోసారి ఇంటర్వ్యూ ఇవ్వాలంటే అవే ప్రశ్నలు, అవే జవా బులు. నాకూ బోర్, చదివేవాళ్లకీ బోర్.
* ఎలాంటివారికి దగ్గరవుతారు?
ఆత్మవిశ్వాసం ఉన్నవారు, నిజాయితీ కలవారు మాత్రమే నా ఫ్రెండ్స్ లిస్ట్‌లో ఉంటారు.
* మీ గ్లామర్ సీక్రెట్?
హీరోయిన్ కచ్చితంగా అందంగా ఉండాలి. నా మొదటి సినిమా అప్పుడు నాకది తెలియలేదు. అందుకే అప్పుడు నాలో ఒకలాంటి ‘రానెస్’ ఉండేది. తర్వాత నా ఫిజిక్‌ని మార్చుకున్నాను. అందం అనేది దేవుడిచ్చిన వరం. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలా అని తినకుండా కడుపు మాడ్చుకోమంటే మాత్రం నావల్ల కాదు.
* మీ దృష్టిలో యాక్టర్‌కి ఉండాల్సిన క్వాలిటీస్?
నిజాయితీ, నిబద్ధత ఉండాలి. నువ్వు ఇండస్ట్రీలో నిలబడగల వన్న నమ్మకం ముందు నీకు ఉండాలి. వీటన్నిటితో పాటు కాస్తో కూస్తో అదృష్టం కూడా ఉండాలి.
* పుకార్లకి బాధపడతారా?
అదేం లేదు. కొంతమందికి పుకార్లు సృష్టించడం ఇష్టం. కొంత మందికి వాటిని వినడం ఇష్టం. చుట్టూ అలాంటివాళ్లు ఎప్పుడూ ఉంటారు. కానీ వాళ్లు నా ఆత్మ విశ్వా సాన్ని ఎప్పుడూ దెబ్బతీయలేరు.
* ఎప్పుడూ వివాదాల్లో ఉంటారుగా?
కావాలని ఎవరూ వివాదాల్లో ఇరుక్కోరు. కాకపోతే సెలెబ్రిటీలు అయినందుకు ఆ మూల్యం చెల్లించు కోవాల్సి వస్తోంది. మేమూ మనుషులమే. మాకూ ఆవేశాలు, అను భూతులు, మనో వేదనలు ఉంటాయి. అది అర్థమైతే అలా ఏదేదో రాసి మమ్మల్ని బాధపెట్టరు.
* మీ దృష్టిలో ప్రేమంటే?
భావోద్వేగాల సమాహారం. సంతోషం, దుఃఖం, కోపం, బాధ... అన్నీ కలగలిసి ఉంటాయి దానిలో. నిజానికి ఇవన్నీ ఉన్న ప్రేమే సక్సెస్ అవుతుంది. వీటిలో ఏది మిస్సయినా వెలితి ఉంటుంది.
* కానీ ఆ ప్రేమ ఫెయిలైతే..?
అంతకన్నా పెద్ద బాధ మరొకటి ఉండదు. ప్రేమ అనేది జీవితంలోకి రాగానే ఒక రకమైన పాజిటివిటీ లైఫ్‌లో నిండిపోతుంది. కానీ ఆ ప్రేమ దూరమైతే జీవితమే చిన్నాభిన్నమైపోయిన ఫీలింగ్ కలుగుతుంది. అయినా దాన్ని అధిగమించి ముందుకు సాగిపోవాలి. ఎందుకంటే... జీవితంలోకి ప్రేమ వస్తుంది. ప్రేమ విఫలమైనా జీవితం ఉంటుంది.
* ప్రేమ పెళ్లి బెటరా? పెద్దలు కుదిర్చింది బెటరా?
దేవుడు చూపించింది బెటర్. అవును. మనకు ఎవరు రాసిపెట్టి ఉంటే వాళ్లే మన జీవితంలోకి వస్తారు. ప్రేమ పెళ్లి అయినా, పెద్దలు కుదిర్చిన పెళ్లి అయినా... దేవుడు పంపిన వ్యక్తితోనే మనకు పెళ్లవుతుంది.
* మీకు భక్తి ఎక్కువనుకుంటా?
అవును. నేను క్రిస్టియన్‌ని. కానీ అన్ని గుళ్లకీ వెళ్తాను. పూజలు, ప్రార్థనలు చేస్తాను. నాకు అన్ని మతాలు, అందరు దేవుళ్లూ ఒకటే!
* ఫ్రీ టైమ్‌లో ఏం చేస్తారు?
సినిమాలు విపరీతంగా చూస్తాను. అదీ ఇదీ అని లేదు. ఏ సినిమా అయినా చూసేస్తా. మ్యూజిక్ వింటా.
* ఒకవేళ మీరు నటి కాకపోయి ఉంటే?
చార్టెడ్ అకౌంటెంట్ అయ్యుండేదాన్ని.
* ఇంకా తీరని కోరిక ఏదైనా ఉందా?
అలాంటిదేం లేదు. ఇన్నేళ్ల నా కెరీర్‌లో ఎన్నో మంచి సినిమాలు చేశాను. దాదాపు అందరు సూపర్‌స్టార్స్‌తో నటించాను. ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్నాను. ఇంతకంటే ఇంకేం కావాలి!