నయనతార, ధనుష్‌ కేసు విచారణలో ఏం జరిగిందంటే..? | What Happened In Nayanthara And Dhanush's Case Investigation? Also Know About Present Status | Sakshi
Sakshi News home page

నయనతార, ధనుష్‌ కేసు విచారణలో ఏం జరిగిందంటే..?

Published Thu, Jan 9 2025 7:11 AM | Last Updated on Thu, Jan 9 2025 10:42 AM

Nayantara And Danush Issue Present Status

కోలీవుడ్‌ నటి నయనతారపై నటుడు ధనుష్‌ చెన్నై హైకోర్టులో వేసిన పిటిషన్‌పై న్యాయస్థానం నుంచి వచ్చే తీర్పుపై  ఆసక్తి నెలకొంది.  నయనతార తన బయోపిక్‌ను 'నయనతార బిహైండ్‌ ది ఫెయిరీ టెల్‌' పేరుతో డాక్యుమెంటరీ చిత్రాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. దీని విడుదల హక్కులను నెట్‌ప్లిక్స్‌ ఓటిటి సంస్థ పొంది ఇటీవలే విడుదల చేసింది. కాగా ఈ చిత్రంలో నటుడు ధనుష్‌ తన వండర్‌ ఫిలిమ్స్‌ పతాకంపై విజయ్‌ సేతుపతి, నయనతార జంటగా నిర్మించిన నాను రౌడీదాన్‌ చిత్రంలోని రెండు మూడు నిమిషాల నిడివి కలిగిన సన్నివేశాలను ఆ డాక్యుమెంటరీ చిత్రంలో వాడుకున్నారు. 

దీంతో తన అనుమతి లేకుండా తన చిత్రంలోని సన్నివేశాలను వాడుకున్నందుకుగాను నటుడు ధనుష్‌ నయనతారపై రూ.10 కోట్లు నష్టపరిహారం కోరుతూ చెన్నై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీంతో న్యాయస్థానం అ పిటిషన్‌ పై వివరణ కోరుతూ గత నెల 8వ తేదీన నటి నయనతార, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌తోపాటూ నెట్‌ప్లిక్స్‌ ఓటీటీ సంస్థకు నోటీసులు జారీ చేసింది. కాగా ఈ కేసు తాజాగా మరోసారి కోర్టులో న్యాయమూర్తి అబ్దుల్‌ ఖుదూస్‌ సమక్షంలో విచారణకు వచ్చింది. కాగా నెట్‌ ఫిక్స్‌ ఓటీటీ సంస్థ వివరణ ఇవ్వడానికి తమకు మరికొంత సమయం కావాలని కోరడంతో, అందుకు అవకాశం ఇచ్చిన న్యాయమూర్తి తదుపరి విచారణ ఈనెల 22వ తేదీకి వాయిదా వేశారు.

చంద్రముఖితో కూడా అదే వివాదం
నయనతార చంద్రముఖి సినిమాతో కూడా వివాదంలో చిక్కుకుంది. తమ అనుమతి లేకుండా చంద్రముఖి సినిమాలోని సన్నివేశాలను తన డాక్యుమెంటరీలో వాడుకున్నందుకు నిర్మాతలు నయనతారకు నోటీసులు పంపించారు. హీరోయిన్‌, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ తమకు రూ.5 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.  ధనుష్‌పై పదునైన మాటలతో విరుచుకుపడిని నయన్‌.. చంద్రముఖి చిత్ర యూనిట్‌పై ఎలాంటి కామెంట్‌ చేయలేదు.

ధనుష్‌పై భగ్గుమన్న నయన్‌
ధనుష్‌ తమపై చాలాకాలంగా ద్వేషాన్ని పెంచుకున్నాడని నయన్‌ తెలిపింది. తనలోని దాగి ఉన్న పగన ఇలా చూపించడం వల్లే తాము బాధపడాల్సి వస్తోందని ఆమె అన్నారు. 'నేనూ రౌడీనే షూటింగ్ టైంలో మేం మా ఫోన్‌లో తీసుకున్న వీడియోని ట్రైలర్‌లో 3 సెకన్లు ఉపయోగించినందుకు నువ్వు రూ.10 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేయడం చాలా దారుణం. నువ్వు ఇంతలా దిగజారుతావ్ అనుకోలేదు. దీన్నిబట్టి నీ క్యారెక్టర్ ఏంటో అర్థమవుతోంది. నీ అభిమానుల ముందు, బయట ఎంతలా నటిస్తున్నావో తెలుస్తోంది. మాతో మాత్రం అలా ప్రవర్తించకు. సినిమా సెట్‌లో ఉన్న వాళ్లందరి జీవితాల్ని శాసించే హక్కు నిర్మాతకు ఉందా..?' అని ఆగ్రహం వ్యక్తం చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement