గతేడాది బిహార్ ఎన్నికల సందర్భంగా ఎన్డీయేలో భాగస్వామ్యమైన చిరాగ్ పాశ్వాన్, మరో భాగస్వామి నితీశ్ కుమార్‌కు కంట్లో నలకలా మారారు. ఎన్డీయే కూటమితో పోటీ చేయకుండా కావాలని చిరాగ్ విడిగా పోటీ చేసి నితీశ్‌కు చికాకులు తెచ్చారు. ఒకపక్క బీజేపీతో స్నేహం చేస్తూనే మరోపక్క నితీశ్ కుమార్ పార్టీకి పోటీగా అభ్యర్థులను నిలిపారు. అయితే చివరకు అతికష్టం మీద ఎన్డీయే అధికారాన్ని నిలబెట్టుకుంది. బిహార్ ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ.. ఎల్జేపీ అభ్యర్థుల కారణంగా, దాదాపు 35 సీట్లను జేడీయూ కోల్పోయింది. దాంతో తొలిసారి మిత్రపక్షం బీజేపీ కన్నా తక్కువ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఎల్జేపీని బలహీన పర్చే ప్రయత్నాలను జేడీయూ ముమ్మరం చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
అప్పటి నుంచి అదను కోసం చూస్తున్న నితీశ్ చాణక్యం వల్లనే తాజాగా ఎల్జేపీలో ముసలం పుట్టిందంటున్నారు. చిరాగ్‌ను ఒంటరి చేసేలా... మిగతా ఎంపీలకు దగ్గరవుతూ నితీశ్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఎల్జేపీకి ఉన్న 6గురు ఎంపీల్లో ఐదుగురు చిరాగ్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ వేరు కుంపటి పెట్టుకొని, తమను ప్రత్యేకంగా గుర్తించాలని స్పీకర్‌కు లేఖ రాయడం కలకలం సృష్టించింది. లోక్ జనశక్తి అధినేత పదవిని సైతం చిరాగ్ వదులుకొని తన బాబాయి పశుపతి కుమార్ పరాస్‌కు పగ్గాలు అప్పజెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక నితీశ్ పావులు కదిపినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఎల్జేపీ ఎంపీలతో నితీశ్ నేరుగా సంప్రదింపులు జరిపారని, ఈ వ్యవహారాన్ని జేడీయూ నేత మహేశ్వర్ హజారీ ద్వారా నడిపించారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి.
రామ్‌విలాస్ మృతితో బీజాలు
పశుపతి పరాస్‌తో మహేశ్వర్ హజారీకి సత్సంబంధాలున్నాయి. అలాగే బాబాయి, కొడుకు మధ్య విబేధాలున్నాయి. రామ్‌విలాస్ పాశ్వాన్ మరణానంతరం పశుపతికి, చిరాగ్‌కు మధ్య సంబంధాలు క్షీణించాయి. ఎన్నికల్లో విడిగా పోటీచేయాలన్న చిరాగ్ నిర్ణయాన్ని అప్పట్లోనే పశుపతి వ్యతిరేకించారు. అప్పట్లో ఇద్దరి మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పశుపతిని నితీశ్ దగ్గరకు తీశారని సదరువర్గాల సమాచారం. దీంతో పాటు తిరుగుబాటు చేసిన ఎంపీల్లో ఒకరైన వీణా సింగ్ జేడీయూ నుంచి సస్పెండయిన ప్రజాప్రతినిధి భార్య. తిరిగి నితీశ్ దగ్గర మంచి మార్కులు కొట్టేయాలని ఈ నేత ఎంతో యత్నిస్తున్నారు. దాంతో వీణాసింగ్ మద్దతు సులభంగానే పరాస్‌కు లభించింది. అలాగే మరో ఎంపీ అనారోగ్యం పాలైనప్పుడు నితీశ్ వ్యక్తిగతంగా ఆయన బాగోగులపై ఆరా తీశారు. ఇలా ప్రతి ఎంపీతో ఏదోరకంగా సత్సంబంధాలు నెరపడం, అటు పశుపతిని దువ్వడం ద్వారా నితీశ్ తాను అనుకున్నది సాధించారని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇప్పటికే ఎల్జేపీకి ఉన్న ఏకైక ఎంఎల్‌ఏ డిప్యూటీ స్పీకర్ ఎన్నికల్లో జేడీయూకు మద్దతు పలికారు. నితీశ్ పంచన చేశారు. ఉన్న ఒక్క ఎంఎల్‌సీ బీజేపీలో చేరారు. అప్పుడైనా చిరాగ్ మేలుకొని ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తాను మోదీకి హనుమంతుడి లాంటివాడినని చిరాగ్ ఎంత చెప్పుకున్నా, ప్రస్తుతం నితీశ్‌తో సంధి తప్ప ఆయన్ను కాపాడే మార్గాలేవీ లేవంటున్నారు. చిరాగ్ ఎన్డీయేలో ఉంటూనే జేడీ (యూ)ను లక్ష్యంగా చేసుకోవడం వెనుక బీజేపీ పెద్దల హస్తం ఉండొచ్చనే వాదనలు అప్పట్లో వినిపించాయి. నితీశ్‌ను బలహీనపర్చి... తమపై ఆధారపడేలా చేసే గేమ్‌ప్లాన్‌లో భాగంగానే చిరాగ్‌ను జేడీయూపైకి ప్రయోగించారని అంటారు. చివరకు అదే జరిగింది. జేడీయూకు కంటే బీజేపీకి ఎక్కవ స్థానాలు గెలిచినా... ఎన్నికలకు ముందు ప్రకటించిన మేరకు నితీశ్‌ను ముఖ్యమంత్రిగా చేసి... బీజేపీ క్రెడిట్ కొట్టేసింది. ఇప్పుడు చిరాగ్... ఒంటరిగా మిగిలే పరిస్థితులు వచ్చినపుడు అది ఎల్జేపీ అంతర్గత వ్యవహారమని బీజేపీ అంటోంది. రాజకీయాలు తెలిసి రావాలంటే చిరాగ్‌కు ఇంకా సమయం పడుతుందేమో.
– సాక్షి, నేషనల్ డెస్క్
ఎల్జేపీలో ముసలం.. నితీశ్ చాణక్యం!
Published Tue, Jun 15 2021 5:35 AM | Last Updated on Tue, Jun 15 2021 4:39 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment