
Chirag Paswan Vs Pashupati Paras: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పలు ప్రత్యేకతలు చోటుచేసుకుంటున్నాయి. కుటుంబ సభ్యులే విరోధులుగా బరిలోకి దిగుతున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తన చిన్నాన్న పశుపతి కుమార్ పరాస్‌పై హాజీపూర్ నుంచి పోటీ చేస్తానని లోక్ జనశక్తి పార్టీ నాయకుడు చిరాగ్ పాశ్వాన్ ప్రకటించారు.
‘నాన్న కర్మభూమి అయిన హాజీపూర్ నుంచి లోక్ జనశక్తి పార్టీ (రామ్‌విలాస్), ఎన్‌డీఏ అభ్యర్థిగా నేను పోటీ చేయడం ఖాయం. ఆయనకు (పశుపతి కుమార్ పరాస్) స్వాగతం (అక్కడ నుంచి పోటీ చేయడానికి). నేను అన్ని సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్నాను. ఎలాంటి సవాళ్లకు నేనెప్పుడూ భయపడలేదు. ఈ ఛాలెంజ్‌ను కూడా స్వీకరిస్తున్నాను’ అని చిరాగ్ పాశ్వాన్ మీడియాతో అన్నారు.
హాజీపూర్ నియోజకవర్గం నుండి తన సొంత బాబాయిపై పోటీ చేయడంపై పాశ్వాన్ మాట్లాడుతూ "ఇది నాకు రాజకీయ ఎంపిక కానే కాదు. ఇది నా కుటుంబానికి కూడా ఇబ్బందికరమే. ఇటువంటి నిర్ణయాలు రాజకీయ పార్టీలుగా మాత్రమే కాకుండా కుటుంబ సభ్యుల మనోభావాలు పరిగణనలోకి తీసుకుని తీసుకోవాలి. కుటుంబం నుండి విడిపోవాలనే నిర్ణయం ముందుగా ఆయనే (పశుపతి పరాస్) తీసుకున్నారు" అని పేర్కొన్నారు.
బిహార్‌లో రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీకి ఎన్‌డీఏ సీట్లు నిరాకరించడంతో రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ (RLJP) అధ్యక్షుడు పశుపతి కుమార్ పరాస్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. "నేను (లోక్‌సభ ఎన్నికల్లో) హాజీపూర్ నుండి పోటీ చేస్తాను. మా సిట్టింగ్ ఎంపీలందరూ వారి వారి నియోజకవర్గాల నుండి పోటీ చేస్తారు. ఇది మా పార్టీ నిర్ణయం" అని పరాస్ అన్నారు.
రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం బిహార్‌లో సీట్ల పంపకాన్ని ఎన్‌డీఏ ప్రకటించింది. బీజేపీ 17 స్థానాల్లో, జేడీయూ 16 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు పేర్కొంది. జితన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని హిందుస్థానీ ఆవామ్ మోర్చా (HAM), రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్‌ఎల్‌ఎస్‌పీ) ఒక్కో స్థానంలో పోటీ చేయనుంది. లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) ఐదు స్థానాల్లో పోటీ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment