పాట్నా: బిహార్‌లోని సమస్తిపూర్ లోక్‌సభ నియోజకవర్గంలో ఆసక్తికర పోరు నెలకొంది. రాష్ట్రంలోని నితీష్ కుమార్ ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రుల వారసులు ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచి ప్రత్యర్థులుగా తలపడుతున్నారు.
సమస్తిపూర్ ఎస్సీ రిజర్వ్‌డ్ సీటు. ఈ నియోజకవర్గం దివంగత సోషలిస్ట్ నాయకుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ జన్మస్థలం. సోషల్ ఇంజనీరింగ్ మాస్టర్‌గా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన కర్పూరి ఠాకూర్‌కు భారత ప్రభుత్వం ఇటీవలే భారతరత్న అవార్డును ప్రకటించింది. ఠాకూర్ 1977లో సమస్తిపూర్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.
బీహార్ గ్రామీణ పనుల శాఖ మంత్రి అశోక్ చౌదరి కుమార్తె 25 ఏళ్ల శాంభవి చౌదరి లోక్‌జనశక్తి పార్టీ (రామ్ విలాస్) -LJP (RV) నామినేషన్‌పై ఎన్‌డీఏ అభ్యర్థిగా సమస్తిపూర్ స్థానంలో పోటీ చేస్తున్నారు. ఢిల్లీ యూనివర్శిటీలోని లేడీ శ్రీ రామ్ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేషన్, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి సోషియాలజీలో ఎంఏ పట్టా పొందిన శాంభవి.. ఈసారి పోటీ చేస్తున్న పార్లమెంటు అభ్యర్థుల్లో ఈమే అత్యంత పిన్న వయస్కురాలు.
ఇక ఆర్‌జేడీ నేతృత్వంలోని మహాఘట్ బంధన్‌లో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థిగా 33 ఏళ్ల సన్నీ హజారీ పోటీ చేస్తున్నారు. ఈయన కూడా నితీష్ కుమార్ ప్రభుత్వంలో సమాచార, ప్రజా సంబంధాల శాఖ మంత్రిగా ఉన్న మహేశ్వర్ హజారీ కుమారుడు. ఎన్‌ఐటీ పాట్నా నుంచి బీటెక్ పూర్తి చేసిన సన్నీ సమస్తిపూర్‌లో సొంత వ్యాపారాన్ని నడుపుతున్నారు.
అభ్యర్థులిద్దరూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. రోడ్‌షోలతో ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు తన కూతురి గెలుపు కోసం శాంభవి తండ్రి, రాష్ట్ర మంత్రి అశోక్ చౌదరి శ్రమిస్తుండగా సన్నీ తండ్రి, బీహార్ మంత్రి మహేశ్వర్ హజారీ ఇంకా తన కుమారుడికి బహిరంగంగా మద్దతు ప్రకటించలేదు. సమస్తీపూర్ నియోజకవర్గంలో మే 13న పోలింగ్ జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment