లోక్‌సభ పోరు.. ఫైనల్‌ పంచ్‌ ఎవరిదో! | Lok Sabha Elections 2024: Patna Sahib and seven other constituencies to go to polls in 7th phase | Sakshi
Sakshi News home page

Lok sabha Elections 2024: ఫైనల్‌ పంచ్‌ ఎవరిదో!

Published Tue, May 28 2024 4:44 AM | Last Updated on Tue, May 28 2024 6:47 AM

Lok Sabha Elections 2024: Patna Sahib and seven other constituencies to go to polls in 7th phase

బిహార్లో 8 స్థానాలకు జూన్‌ 1న పోలింగ్‌

బిహార్‌లో లోక్‌సభ ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి. 40 సీట్లకు గాను ఆరు విడతల్లో 32 చోట్ల ఎన్నికలు ముగిశాయి. చివరిదైన ఏడో దశలో 8 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. వీటిలో బీజేపీ 5 సిట్టింగ్‌ స్థానాలు. 2 జేడీ(యూ), 1 రాష్ట్రీయ లోక్‌ మోర్చా చేతిలో ఉన్నాయి. ఎన్డీఏకు ఈసారి రెబల్స్‌తో పాటు ఇండియా కూటమి నుంచి గట్టి సవాల్‌ ఎదురవుతోంది. 
ఈ నేపథ్యంలో కీలక స్థానాలపై ఫోకస్‌... 

నలంద... జేడీయూ కంచుకోట 
అలనాటి విఖ్యాత నలంద విశ్వవిద్యాలయ చరిత్రకు సాక్ష్యంగా నిలిచే నియోజకవర్గం. సారవంతమైన గంగా పరీవాహక ప్రాంతంలో ఉంటుంది. ఇది జేడీయూ కంచుకోట. బీజేపీ ఇక్కడ ఖాతాయే తెరవలేదు. గత ఎన్నికల్లో కౌసలేంద్ర కుమార్‌ జేడీ(యూ) నుంచి హ్యాట్రిక్‌ విజయం నమోదు చేశారు. ఈసారీ ఆయనే బరిలో ఉన్నారు. ఇండియా కూటమి తరఫున సీపీఐ (ఎంఎల్‌) నుంచి సందీప్‌ సౌరవ్‌ పోటీ చేస్తున్నారు. కమ్యూనిస్టులు గతంలో ఇక్కడ మూడుసార్లు గెలిచారు.

ఆరా... రైట్‌ వర్సెస్‌ లెఫ్ట్‌ 
మొదట్లో దీని పేరు షాబాద్‌. 1977లో ఆరాగా మారింది. ఆర్కే సింగ్‌ 2014లో తొలిసారి ఇక్కడ కాషాయ జెండా ఎగరేశారు. 2019లోనూ నెగ్గిన ఆయన ఈసారి హ్యాట్రిక్‌ కోసం ఉవి్వళ్లూరుతున్నారు. ఇండియా కూటమి తరఫున సీపీఎం (ఎంఎల్‌) అభ్యర్థి సుధామా ప్రసాద్‌ బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో సీపీఐ (ఎంఎల్‌)కు ఇక్కడ 4 లక్షల పైగా ఓట్లొచ్చాయి! రైట్, లెఫ్ట్‌ పారీ్టల వార్‌ ఇక్కడ ఉత్కంఠ రేపుతోంది.

పట్నా సాహిబ్‌...  రవిశంకర్‌కు సవాల్‌ 
సిక్కుల మత గురువు గురు గోవింద్‌సింగ్‌ జన్మస్థలం. 2008లో ఏర్పాటైంది. 2009, 2014ల్లో బాలీవుడ్‌ షాట్‌గన్‌  శత్రుఘ్న సిన్హా బీజేపీ తరఫున గెలిచారు. 2019లో ఎన్నికల ముందు శత్రుఘ్న బీజేపీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌ అభ్యరి్థగా బరిలో దిగారు. దాంతో 20 ఏళ్లుగా రాజ్యసభకు ప్రాతినిధ్య వహిస్తున్న సీనియర్‌ నేత రవిశంకర్‌ ప్రసాద్‌ను బీజేపీ బరిలో దించింది. శత్రుఘ్నను ఆయన 2.8 లక్షల పైగా ఓట్ల మెజారిటీతో ఓడించారు. ఈసారి కూడా బీజేపీ నుంచి ఆయనే బరిలో ఉన్నారు. ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్‌ తరఫున లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌ తనయుడు అన్షుల్‌ అవిజిత్‌ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్, ఆర్జేడీలకు మంచి ఓటు బ్యాంకు ఉండటంతో బీజేపీ గట్టి పోటీ ఎదుర్కొంటోంది.  

పాటలీపుత్ర... లాలుకు ప్రతిష్టాత్మకం 
గత రెండు ఎన్నికల్లోనూ ఆర్జేడీ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమార్తె మీసా భారతిని బీజేపీ నేత రామ్‌ కృపాల్‌ యాదవ్‌ ఓడించారు. 2009లో లాలు కూడా ఇక్కడ ఓటమి చవిచూశారు. లాలుకు ఒకప్పటి నమ్మినబంటు రాంకృపాల్‌ బీజేపీ అభ్యరి్థగా ఉన్నారు. బీజేపీ తరఫున రెండుసార్లు వరుసగా గెలిచిన ఆయన 2004లో ఇక్కడ ఆర్జేడీ అభ్యరి్థగా బీజేపీని ఓడించడం విశేషం. ఆర్జేడీ నుంచి మీసా భారతి మళ్లీ పోటీ చేస్తున్నారు. కుమార్తెను ఎలాగైనా లోక్‌సభకు పంపాలని కలలుగంటున్న లాలుకు ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా        మారింది. కాంగ్రెస్‌ దన్ను ఆర్జేడీకి కలిసొచ్చే అంశం. 

కరాకట్‌.. బీజేపీకి పవన్‌ గండం 
ఇక్కడ కుష్వాహా (కోయెరి) సామాజికవర్గానిదే ఆధిపత్యం. గత మూడు ఎన్నికల్లోనూ ఆ వర్గం నేతలే గెలుస్తున్నారు. కుషా్వహాలు, రాజ్‌పుత్‌లు, యాదవులు ఇక్కడ రెండేసి లక్షల చొప్పున ఉంటారు. గతేడాది బీజేపీలో చేరిన భోజ్‌పురి స్టార్‌ పవన్‌ సింగ్‌ ఇప్పుడు పారీ్టకి కొరకరాని కొయ్యగా మారారు. ఇక్కడ టికెట్‌ ఆశించి భంగపడి ఇండిపెండెంట్‌గా బరిలో దిగారు. ఇండియా కూటమి తరఫున సీపీఐ (ఎంఎల్‌) నుంచి రాజారాం సింగ్‌ కుషా్వహా బరిలో ఉన్నారు. ఎన్డీయే నుంచి రా్రïÙ్టయ లోక్‌ మోర్చా వ్యవస్థాపకుడు ఉపేంద్ర కుష్వాహా పోటీ చేస్తున్నారు. పవన్‌ సింగ్‌ నామినేషన్‌కు జనం భారీగా వచ్చారు. త్రిముఖ పోటీలో ఎన్డీఏ ఎదురీదుతోంది.

జహానాబాద్‌... జేడీయూ వర్సెస్‌ ఆర్జేడీ 
‘రెడ్‌ కారిడార్‌’లో అత్యంత సున్నితమైన నక్సల్స్‌ ప్రభావిత నియోజకవర్గం. కమ్యూనిస్టులకు కంచుకోట. 1998 నుంచీ ఆర్జేడీ, జేడీయూ మధ్య చేతులు మారుతోంది. 2014లో రా్రïÙ్టయ లోక్‌ సమతా పార్టీ నెగ్గింది. 2019లో జేడీ(యూ) నేత చందేశ్వర్‌ ప్రసాద్‌ కేవలం 1,751 ఓట్ల తేడాతో ఆర్జేడీ అభ్యర్థి సురేంద్ర ప్రసాద్‌ యాదవ్‌ను ఓడించారు. ఈసారి కూడా వారిద్దరే బరిలో ఉన్నారు. 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement