Bihar politics: పాత కత్తులు.. కొత్త పొత్తులు | Sakshi
Sakshi News home page

Bihar politics: పాత కత్తులు.. కొత్త పొత్తులు

Published Sun, Apr 14 2024 12:34 AM

Lok sabha elections 2024: Bihar plays a key role in national political History - Sakshi

బిహార్‌లో హోరాహోరీ

2019లో ఎన్డీఏ క్లీన్‌స్వీప్‌

ఈసారి చిక్కని ఓటరు నాడి

ఇండియా కూటమి గట్టిపోటీ

మళ్లీ బీజేపీతో జట్టుకట్టిన నితీశ్‌ 

‘పల్టూరాం’పై జనస్పందనే కీలకం!

కులాల కుంపట్లు, పొత్తుల కత్తులు, కిచిడీ కూటములు, జంపింగ్‌ జపాంగ్‌లకు పెట్టింది పేరైన బిహార్‌లో రాజకీయాలు ఎప్పుడూ కాక పుట్టిస్తూనే ఉంటాయి. 40 సీట్లతో లోక్‌సభ నియోజకవర్గాల పరంగా దేశంలో నాలుగో స్థానంలో నిలుస్తున్న ఈ తూర్పు రాష్ట్రానిది జాతీయ రాజకీయాల్లో ఆది నుంచీ కీలక పాత్రే.
తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్‌ మొదలు జగ్జీవన్‌రాం, నుంచి లాలూ ప్రసాద్, నితీశ్‌కుమార్‌ దాకా దేశ, రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన ఉద్ధండ నేతలకు పుట్టిల్లు బిహార్‌. అధికారం కోసం ప్రాంతీయ, జాతీయ పార్టీల మధ్య కుమ్ములాటలు, వర్గ పోరు, పవర్‌ పాలిటిక్స్‌ ఇక్కడ సర్వసాధారణం.


స్టేట్‌ స్కాన్‌
రాజకీయంగా చైతన్యవంతమైన బిహార్‌లో లోక్‌సభ ఎన్నికల ముంగిట కొత్త పొత్తులు పొడిచాయి. గత ఎన్నికల్లో బీజేపీ, జేడీ (యూ), లోక్‌ జనశక్తి పార్టీలతో కూడిన ఎన్డీఏ కూటమి ఏకంగా 39 సీట్లను ఒడిసిపట్టింది. బీజేపీ 17 సీట్లలో పోటీ చేసి అన్నీ గెలుచుకుంది. జేడీ(యూ) 17 సీట్లకు 16 చోట్ల, ఎల్జేపీ ఆరింటికి ఆరూ కైవసం చేసుకున్నాయి.

కాంగ్రెస్, ఆర్జేడీ తదితర పార్టీల మహాకూటమి మహా ఓటమి చవిచూసింది. కాంగ్రెస్‌ 9 చోట్ల పోటీ చేసి ఒక్క సీటు గెల్చుకోగా ఆర్జేడీ 19 స్థానాల్లో తలపడినా సున్నా చుట్టింది. మిగతా పార్టీలదీ అదే పరిస్థితి. కేంద్రంలో మోదీ 2.0 బలమైన సర్కారు ఏర్పాటులో బిహార్‌ ఘనవిజయానిది ప్రధాన పాత్ర. ఈసారి పాత మిత్రులతో పూర్వ వైభవానికి కాంగ్రెస్‌ ప్రయతి్నస్తోంది. బిహార్‌లో 40 స్థానాల్లో ఆరింటిని ఎస్సీలకు కేటాయించారు.

నితీశ్‌ పిల్లిమొగ్గలు...
బిహార్‌ రాజకీయాల్లో వెలుగు వెలిగిన లాలు అవినీతి కేసుల్లో జైలుపాలైన నాటి నుంచీ రాష్ట్రంపై నితీశ్‌ కుమార్‌ పట్టుబిగించారు. ఏదో ఒక పార్టీతో పొత్తుతో 15 ఏళ్లుగా సీఎం పీఠాన్ని అంటిపెట్టుకున్నారు. జాతీయ రాజకీయాల్లోనూ చక్రం తిప్పుతున్నారు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, సమాజ్‌వాదీ, జేడీ(ఎస్‌), కాంగ్రెస్‌ మహా కూటమిగా పోటీ చేశాయి. ఆర్‌ర్జేడీ అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించినా నితీశ్‌ సీఎం పదవి దక్కించుకున్నారు.

రెండేళ్లు తిరిగేసరికి మహాకూటమికి గుడ్‌బై చెప్పి మళ్లీ బీజేపీతో జట్టుకట్టారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమితో సీట్ల సర్దుబాటు చేసుకుని అత్యధిక ఎంపీ సీట్లను దక్కించుకున్నారు. అదే జోరులో 2020 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎన్డీఏ భాగస్వామిగా పోటీ చేసి సీఎం పీఠమెక్కారు. జేడీ(యూ) (43) కంటే బీజేపీ (74)కే ఎక్కువ సీట్లు దక్కినా నితీశ్‌ మళ్లీ సీఎం పదవి దక్కించుకోవడం విశేషం. రెండేళ్లలోనే ఆయన మళ్లీ ప్లేటు ఫిరాయించారు.

లోక్‌సభ ఎన్నికల్లో మోదీని ఢీకొట్టడమే లక్ష్యంగా విపక్ష పార్టీలతో కలిసి పోటీ చేస్తామంటూ ఎన్డీఏ కూటమి నుంచి బయటికొచ్చేశారు. మహాకూటమి దన్నుతో మళ్లీ సీఎం అయ్యారు! ఇండియా కూటమి ఏర్పాటు కీలక పాత్ర పోషించారు. తీరా గత జనవరిలో ఎన్డీఏలోకి గెంతి మహాకూటమికి, ఇండియా కూటమికీ కోలుకోలేని షాకిచ్చారు. బీజేపీ దన్నుతో సీఎం పదవిని కాపాడుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆ పార్టీతో కలిసి పోటీ చేస్తున్నారు.  

బీజేపీకి కలిసొస్తుందా...?
నితీశ్‌తో కలిసి 2019 ఫలితాలను రిపీట్‌ చేయాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. కానీ దీర్ఘకాలంగా అధికారంలో ఉన్న నితీశ్‌ ప్రభుత్వంపై వ్యతిరేకత ఎన్డీఏ సీట్లకు గండి కొట్టవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో కులగణన చేపట్టడాన్ని నితీశ్‌ సొమ్ము చేసుకోవాలనుకుంటున్నారు. అది తమ ఘనతేనని కాంగ్రెస్‌ ప్రచారం చేసుకుంటోంది.

దేశవ్యాప్తంగా ఆ హామీ ఇస్తున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోంది. బీజేపీ అయోధ్య రామ మందిరంతో హిందుత్వ నినాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చింది. మోదీ ఫ్యాక్టర్, అభివృద్ధి నినాదంపై ఆశలు పెట్టుకుంది. ఈసారి బీజేపీ 17, జేడీయూ 16, చిరాగ్‌ పాశ్వాన్‌ సారథ్యంలోని ఎల్జేపీ 5, జితన్‌ రామ్‌ మాంఝీకి చెందిన హిందుస్థాన్‌ ఆవామ్‌ మోర్చా, రా్రïÙ్టయ లోక్‌ సమతా పార్టీ ఒక్కో స్థానంలో పోటీ చేయనున్నాయి.

కులగణన ఎవరికి ప్లస్‌!
బిహార్‌ రాజకీయాలు చిరకాలంగా కులాల చుట్టూనే తిరుగుతున్నాయి. నితీశ్‌ చేపట్టిన కులగణన మరోసారి రిజర్వేషన్ల తేనెతుట్టెను కదిపింది. రాష్ట్రంలో 94 లక్షల కుటుంబాలు (34.13%) నెలకు రూ.6,000 సంపాదన కూడా లేక పేదరికంలో మగ్గుతున్నాయని కులగణనలో వెల్లడైంది. రాష్ట్రంలో రిజర్వేషన్లను 65 శాతానికి పెంచాల్సిందేనని నితీశ్‌ పేర్కొన్నారు.

రాష్ట్ర జనాభాలో 19.65 శాతం ఎస్సీలు, 1.68 శాతం ఎస్టీలున్నారు. వారిలో ఏకంగా 42.7 శాతం మంది నిరుపేదలని కులగణనలో తేలింది. 27.13 శాతం ఓబీసీలున్నారు. వీరిలో 14.26 శాతం యాదవులు. దాదాపు 17 శాతం మంది ముస్లింలున్నారు. మహాకూటమి యాదవులు, ఎస్‌సీ, ఎస్‌టీ మైనారిటీ ఓట్లపై కాంగ్రెస్‌ గురిపెట్టింది. జనాభా ప్రాతిపదికన సామాజిక న్యాయం జరగాల ని డిమాండ్‌ చేస్తోంది. అగ్రవర్ణాలతో పాటు ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీలనూ ఆకర్షించేలా బీజేపీ, జేడీయూ పావులు కదుపుతున్నాయి. ప్రధాని మోదీ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు.

సర్వేల సంగతేంటి...?
బిహార్‌లో ఎన్నికల సర్వేల్లో భిన్నాభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. నితీశ్‌ చేరికతో ఎన్డీఏకు 32 నుంచి 35 సీట్లు రావచ్చని కొన్ని సర్వేలు అంచనా వేశాయి. ఇండియా కూటమికి 5–8 సీట్లే వస్తాయని చెప్పాయి. అయితే నితీశ్‌పై ప్రజా వ్యతిరేకత ఇండియా కూటమికి కలిసొస్తుందని ఇండియా కూటమి 15 నుంచి 20 పై చిలుకు దాకా చేజక్కించుకోవచ్చని మరికొన్ని సర్వేల అంచనా.

ఇండియా కూటమి పైచేయి సాధిస్తుందా?
ఎన్నికల వేళ వెన్నుపోటు పొడిచిన నితీశ్‌కు గుణపాఠం నేర్పాలని కాంగ్రెస్‌ సారథ్యంలోని ఇండియా కూటమి పట్టుదలగా ఉంది. ఆయనది పచ్చి అవకాశవాదమంటూ కాంగ్రెస్, ఆర్జేడీ దుమ్మెత్తిపోస్తున్నాయి. రాష్ట్రంలో కులగణన తమ సంకీర్ణ సర్కారు ఘనతేనని ప్రచారం చేస్తున్నాయి. ఇది దేశానికి ఎక్స్‌రే వంటిదని, కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని రాహుల్‌ గాంధీ పదేపదే చెబుతున్నారు.

మోదీ హయాంలో నిరుద్యోగం, నిత్యావసరాల ధరల పెరుగుదల, కార్పొరేట్‌ దోపిడీ తదితరాలను ప్రచారా్రస్తాలుగా మలచుకుంటున్నాయి.  దేశవ్యాప్తంగా 30 లక్షల ప్రభుత్వోద్యోగాలతో పాటు పలు సంక్షేమ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. 6 న్యాయాలు 25 గ్యారంటీలతో విడుదల చేసిన జాతీయ మ్యానిఫెస్టోను కాంగ్రెస్‌ ఊరూవాడా ప్రచారం చేస్తోంది. పొత్తులో భాగంగా ఆర్జేడీకి 26, కాంగ్రెస్‌ 9కి, లెఫ్ట్‌ పార్టీలకు 5 సీట్లు దక్కాయి. ఆర్జేడీ తమ 26 సీట్లలో మూడింటిని మాజీ మంత్రి ముకేశ్‌ సాహ్ని సారథ్యంలోని వికాస్‌శీల్‌ ఇన్సాన్‌ పార్టీ (వీఐపీ)కి కేటాయించింది.  

అబ్బాయ్‌–బాబాయ్‌ పోరు
బిహార్లో అబ్బాయ్‌–బాబాయ్‌ అమీతుమీ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఎల్జేపీ వ్యవస్థాపకుడు రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ మరణం తర్వాత ఆయన వారసత్వం కోసం కుమారుడు చిరాగ్, సోదరుడు పశుపతి పరాస్‌ హోరాహోరీ తలపడ్డారు. చివరికి పార్టీని పరాస్‌ చేజిక్కించుకున్నారు. చిరాగ్‌కు ఎల్జేపీ (రాం విలాస్‌), పశుపతికి రాష్ట్రీయ లోక్‌ జనశక్తి పార్టీ (ఆర్‌ఎల్జేపీ) పేర్లను ఎన్నికల సంఘం కేటాయించింది. పశుపతి పార్టీకి బీజేపీ ఒక్క సీటూ ఇవ్వకపోవడంతో ఆయన కేంద్ర మంత్రివర్గం నుంచి వైదొలిగారు. సొంతంగా పోటీ చేస్తామని ప్రకటించారు. చిరాగ్‌కు బీజేపీ ఐదు సీట్లు ఇవ్వగా పట్టుబట్టి పాశ్వాన్ల కంచుకోట అయిన హాజీపూర్‌ను సాధించుకున్నారు. అక్కడ బాబాయ్‌ పశుపతిపై చిరాగ్‌ నేరుగా తలపడుతుండటం విశేషం!

సర్వేల సంగతేంటి...?
బిహార్‌లో ఎన్నికల సర్వేల్లో భిన్నాభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. నితీశ్‌ చేరికతో ఎన్డీఏకు 32 నుంచి 35 సీట్లు రావచ్చని కొన్ని సర్వేలు అంచనా వేశాయి. ఇండియా కూటమికి 5–8 సీట్లే వస్తాయని చెప్పాయి. అయితే నితీశ్‌పై ప్రజా వ్యతిరేకత ఇండియా కూటమికి కలిసొస్తుందని ఇండియా కూటమి 15 నుంచి 20 పై చిలుకు దాకా చేజక్కించుకోవచ్చని మరికొన్ని సర్వేల అంచనా.

యూపీఏ హయాంలో భారత్‌ను బలహీన దేశంగా చూసేవారు. చిన్నాచితకా దేశాల నుంచి కూడా ఉగ్రవాదులు మనపై దాడులకు తెగబడేవారు. కాంగ్రెసేమో చేతకానితనంతో వేరే దేశాలకు ఫిర్యాదు చేస్తుండేది. నేటి భారత్‌ అలాకాదు, అవసరమైతే ఉగ్రవాదుల ఇళ్లలో దూరి మరీ అంతం చేస్తుంది.
– బిహార్‌ ఎన్నికల సభలో ప్రధాని మోదీ
 
మహాకూటమి దెబ్బకు బీజేపీ, ఎన్డీఏ కంగుతిన్నాయి. అందుకే మోదీతో సహా అగ్ర నేతలంతా బిహార్‌లోనే తిరుగుతున్నారు. విపక్షాలపై కత్తిగట్టి ఈడీ, సీబీఐ కూడా ఇక్కడే మరింత ఫోకస్‌ చేస్తున్నాయి. పేదరికం, ఉపాధి, బిహార్‌ చిరకాల కోరికైన ప్రత్యేక హోదా గురించి మోదీ మాట్లాడాలి.
– ఎన్నికల ప్రచారంలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement
Advertisement