లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీహార్‌లో బాబాయ్ వర్సెస్ అబ్బాయ్ రాజకీయం రంజుగా మారింది.
లోక్‌సభ సీట్ల కేటాయింపుతో బీహార్‌లో బాబాయ్ వర్సెస్ అబ్బాయ్ రాజకీయం తెరపైకి వచ్చింది. నిన్న మొన్నటి వరకు లోక్ జనశక్తిని పార్టీ (ఆర్‌ఎల్‌జేపీ) శాసించి మోదీ వర్గంలో కేబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన బాబాయ్ పసుపతి పరాస్ ఇప్పుడు రాజకీయ మనుగడ కోసం పోరాడుతుంటే.. మరోవైపు తన తండ్రి స్థాపించిన లోక్ జన శక్తి పార్టీ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టిన అబ్బాయి చిరాగ్ పాశ్వాన్ వైపే బీజేపీ మొగ్గు చూపింది.
బీజేపీ తీరుపై అసంతృప్తి
గత కొంత కాలంగా పసుపతి పరాస్ కేంద్ర మంత్రివర్గం నుండి వైదొలగుతారని ఊహాగానాలు ఊపందుకున్నాయి. అతని ఎమ్మెల్యేలు ఇండియా కుటమికి మద్దతు పలుకుతున్నారని, వారం క్రితం చిరాగ్ పాస్‌వాన్ సైతం బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నారంటూ రాష్ట్ర రాజకీయాల్లో చర్చలు జోరుగా సాగాయి. ఈ వరుస పరిణామాలపై పశుపతి పరాస్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ పార్టీ ఆర్‌ఎల్జేపీ కూడా ఎన్డీయేలో భాగమేనని తెలిపారు. అంతేకాదు తమ పార్టీ తలుపులు తెరిచే ఉన్నాయని పశుపతి పరాస్ అన్నారు. ఎక్కడికైనా వెళ్లే స్వేచ్ఛ తమకు ఉందని ఎన్డీయేను హెచ్చరించారు.
పాశ్వాన్ వైపే మొగ్గు
అదే సమయంలో ఒకప్పుడు తనను తాను ప్రధాని నరేంద్ర మోదీకి ‘హనుమంతుడు’గా అభివర్ణించుకున్న పాశ్వాన్ ఎన్డీయేతో పొత్తు పెట్టుకున్నారు. పొత్తులో భాగంగా పాశ్వాన్ ఆశించిన ఆరు సీట్లలో ఐదు స్థానాలను దక్కించుకున్నారు. అయితే, ఆ జాబితాలో అతని దివంగత తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్‌కు చెందిన హాజీపూర్ లోక్‌సభ స్థానం ఉంది.
అంచనాలు తారుమారు
రామ్ విలాస్ పాశ్వాన్ సోదరుడు పశుపతి పరాస్ హాజీపూర్ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో అదే స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తారుమారు చేశాయి. 6 శాతం పాశ్వాన్ వర్గం ఓట్లు చిరాగ్ పాస్‌వాన్‌కు కలిసొచ్చాయి. పొత్తులో భాగంగా లోక్‌సభ సీట్ల పంపిణీలో బాబాయ్ పశుపతి పరాస్‌ను కాదనుకుని అబ్బాయి చిరాగ్ పాస్‌వాన్‌తో పొత్తు పెట‍్టుకునేందుకు కారణమయ్యాయి.
కాగా, చిరాగ్ పాశ్వాన్ తండ్రి దివంగత నేత రామ్ విలాస్ పాశ్వాన్ హాజీపూర్ నుండి ఎనిమిది సార్లు గెలుపొందారు. వాటిలో నాలుగు వరుస విజయాలున్నాయి. చిరాగ్ పాస్‌వాన్ పార్టీ సమస్తిపూర్, జముయి, వైశాలి, ఖగారియా లోక్‌సభ స్థానాల్లో పోటీకి దిగనుంది.
ఎవరికెన్ని సీట్లంటే?
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీహార్‌లో పొత్తులు ఖరారయ్యాయి. అలయన్స్‌లో భాగంగా రాష్ట్రంలో ఉన్న 40 లోక్‌సభ స్థానాలకు గాను పెద్దన్నగా వ్యవహరిస్తున్నబీజేపీ (17), సీఎం నితీష్‌కుమార్ పార్టీ జనతాదళ్ యూనైటెడ్ (16), లోక్‌జనశక్తి పార్టీ (5), బీహార్ మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ పార్టీ హిందుస్థాన్ ఆవామ్ మోర్చాకి (1), రాష్ట్రీయ లోక్ మోర్చా పార్టీకి (1) సీట్లు కేటాయించింది. మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment