సాక్షి, పాట్నా : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీహార్ రాష్ట్ర రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఎన్డీఏ కూటమి నుంచి తప్పుకుంటున్నట్లు రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ చీఫ్ పశుపతి కుమార్ పరాస్ ప్రకటించారు. ఇదే సమయంలో కేంద్రమంత్రి పదవికి కూడా తాను రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు.
ఈ సందర్భంగా పరాస్ మీడియాతో మాట్లాడుతూ..‘కేంద్ర కేబినెట్‌లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి పదవి ఇచ్చినందుకు ప్రధాని మోదీకి ధన్యావాదాలు. ఆయనకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను.
కానీ, బీహార్‌లో ఎన్డీయే భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో మాకు అన్యాయం జరిగింది. మా పార్టీకి ఐదుగురు ఎంపీలున్నారు. అయినా పొత్తులో మాకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. అందుకే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నాను’ అని చెప్పుకొచ్చారు.
ఎన్డీయే మిత్రపక్షమైన లోక్ జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు, దళిత నేతగా పేరొందిన రాం విలాస్ పాశ్వాన్ మరణం తర్వాత ఆయన కుమారుడు చిరాగ్, సోదరుడు పరాస్ మధ్య విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే 2021లో పార్టీ రెండు ముక్కలుగా చీలిపోయింది. చిరాగ్ ఎన్డీయే నుంచి బయటకు రాగా.. కూటమిలో ఉన్న పశుపతి పరాస్‌కు కేంద్రమంత్రి పదవి దక్కింది.
అయితే, ఇటీవల ఎన్డీయే విస్తరణలో భాగంగా చిరాగ్ మళ్లీ కూటమిలో చేరగా.. తాజా సర్దుబాటులో వారికి సీట్లు కేటాయించారు. అయితే, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో హాజీపూర్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్న పరాస్‌కు ఇప్పుడు కూటమిలో సీట్లు దక్కలేదు. ఈ క్రమంలోనే కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసిన ఆయన.. ఎన్డీయే నుంచి బయటకు వచ్చేస్తున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment