పశుపతిపై చిరాగ్ పాశ్వాన్ పోటీ
హాజీపూర్‌లో ఆసక్తికర వారసత్వ పోరు
జాతీయ రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన వారసత్వ పోరుకు తెర లేచింది. బిహార్లో దిగ్గజ నేత దివంగత రాం విలాస్ పాశ్వాన్ వారసత్వం కోసం ఆయన కుమారుడు చిరాగ్, సోదరుడు పశుపతి కుమార్ పారస్ మధ్య జరుగుతున్న పోరు తుది దశకు చేరుకుంది. పాశ్వాన్ ఏకంగా ఎనిమిది సార్లు ఎంపీగా నెగ్గిన హాజీపూర్ లోక్‌సభ స్థానంలో ఈసారి వారిద్దరూ నేరుగా అమీతుమీ తేల్చుకోనున్నారు...
పాశ్వాన్ల కంచుకోట
హాజీపూర్ లోక్‌సభ స్థానంతో పాశ్వాన్‌లది విడదీయరాని బంధం. లోక్ జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు రాం విలాస్ పాశ్వాన్ 1977 లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారిగా అక్కడ విజయం సాధించారు. మధ్యలో 1984, 2009 మినహా మరో ఏడుసార్లు హాజీపూర్ నుంచే నెగ్గారు. ఆనారోగ్య కారణాలతో పాశ్వాన్ రాజ్యసభకు వెళ్లడంతో తమ్ముడు పశుపతి 2019లో తొలిసారి హాజీపూర్ నుంచి పోటీ చేసి నెగ్గారు. చిరాగ్ 2014తో పాటు 2019లోనూ జముయ్ లోక్‌సభ స్థానం నుంచి నెగ్గారు. 2020లో పాశ్వాన్ మృతి చిరాగ్, పశుపతి మధ్య వారసత్వ పోరుకు దారితీసింది.
పాశ్వాన్ వారసుడిని తానేనని పశుపతి ప్రకటించుకోవడంతో ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరిస్తానని చిరాగ్ హెచ్చరించారు. పశుపతి మిగతా నలుగురు ఎల్జేపీ ఎంపీలతో కలిసి తిరుగుబావుటా ఎగరేయడంతో వారందరినీ పార్టీ నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించారు. చివరికి వివాదం ఎన్నికల సంఘం వద్దకు చేరింది. ఎల్జేపీ పేరును, పార్టీ గుర్తును ఈసీ స్తంభింపజేసి పశుపతి వర్గానికి రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ (ఆర్‌ఎల్జేపీ), చిరాగ్‌కు ఎల్జేపీ (రాం విలాస్) పేర్లు కేటాయించింది. 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్డీఏతో చిరాగ్ తెగదెంపులు చేసుకున్న నేపథ్యంలో పశుపతి 2021లో ఎన్డీఏలో చేరి కేంద్ర మంత్రి అయ్యారు.
చిరాగ్ ఇన్, పశుపతి ఔట్
ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బిహార్లో 40 స్థానాలనూ క్లీన్‌స్వీప్ చేయడం లక్ష్యం పెట్టుకున్న బీజేపీ మరోసారి చిరాగ్‌ను చేరదీసింది. అలా మళ్లీ ఎన్డీఏలో చేరిన చిరాగ్, పొత్తులో భాగంగా తమకు కేటాయించే 5 స్థానాల్లో హాజీపూర్ ఉండాల్సిందేనని పట్టుబట్టి సాధించుకున్నారు. దాంతో పశుపతి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. దీనికి తోడు ఆర్‌ఎల్జేపీకి బీజేపీ ఒక్క సీటు కూడా కేటాయించకపోవడంతో వారం క్రితం కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. తాను హాజీపూర్ నుంచి పోటీ చేయడం ఖాయమని ప్రకటించారు. తనతో పాటు మిగతా నలుగురు ఎంపీలు కూడా మళ్లీ బరిలో దిగి తీరతారని స్పష్టం చేశారు. బాబాయిని ఓడిస్తే పాశ్వాన్ల కంచుకోటైన హాజీపూర్ హస్తగతమవడమే గాక తండ్రి వారసత్వం పూర్తిగా తనదేనని రుజువవుతుందనే భావనతో చిరాగ్ అక్కడి నుంచి బరిలో దిగుతున్నారు.
హాజీపూర్‌లో ఎస్సీ సామాజిక వర్గానికి దాదాపు 4 లక్షల ఓట్లున్నాయి. దీనికి తోడు 1.5 లక్షల దాకా ముస్లిం ఓట్లున్నాయి. యాదవులు, రాజ్‌పుత్‌లు, భూమిహార్లతో పాటు కుషా్వహాలు, పాశ్వాన్లు, రవిదాస్ వంటి అత్యంత వెనకబడ్డ సామాజిక వర్గాలకు కూడా చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకుంది. ఈ వర్గాలకు రాం విలాస్ పాశ్వాన్ తిరుగులేని నేతగా కొనసాగారు. 1977లో ఆయన సాధించిన 4.69 లక్షల మెజారిటీ గిన్నిస్ రికార్డుకెక్కింది! 1989లో ఏకంగా 5 లక్షల పై చిలుకు మెజారిటీ సాధించారాయన.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment