Inheritance politics
-
Chirag Vs Pashupati: అబ్బాయి వర్సెస్ బాబాయి
జాతీయ రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన వారసత్వ పోరుకు తెర లేచింది. బిహార్‌లో దిగ్గజ నేత దివంగత రాం విలాస్ పాశ్వాన్ వారసత్వం కోసం ఆయన కుమారుడు చిరాగ్, సోదరుడు పశుపతి కుమార్ పారస్ మధ్య జరుగుతున్న పోరు తుది దశకు చేరుకుంది. పాశ్వాన్ ఏకంగా ఎనిమిది సార్లు ఎంపీగా నెగ్గిన హాజీపూర్ లోక్‌సభ స్థానంలో ఈసారి వారిద్దరూ నేరుగా అమీతుమీ తేల్చుకోనున్నారు... పాశ్వాన్ల కంచుకోట హాజీపూర్ లోక్‌సభ స్థానంతో పాశ్వాన్‌లది విడదీయరాని బంధం. లోక్ జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు రాం విలాస్ పాశ్వాన్ 1977 లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారిగా అక్కడ విజయం సాధించారు. మధ్యలో 1984, 2009 మినహా మరో ఏడుసార్లు హాజీపూర్ నుంచే నెగ్గారు. ఆనారోగ్య కారణాలతో పాశ్వాన్ రాజ్యసభకు వెళ్లడంతో తమ్ముడు పశుపతి 2019లో తొలిసారి హాజీపూర్ నుంచి పోటీ చేసి నెగ్గారు. చిరాగ్ 2014తో పాటు 2019లోనూ జముయ్ లోక్‌సభ స్థానం నుంచి నెగ్గారు. 2020లో పాశ్వాన్ మృతి చిరాగ్, పశుపతి మధ్య వారసత్వ పోరుకు దారితీసింది. పాశ్వాన్ వారసుడిని తానేనని పశుపతి ప్రకటించుకోవడంతో ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరిస్తానని చిరాగ్ హెచ్చరించారు. పశుపతి మిగతా నలుగురు ఎల్జేపీ ఎంపీలతో కలిసి తిరుగుబావుటా ఎగరేయడంతో వారందరినీ పార్టీ నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించారు. చివరికి వివాదం ఎన్నికల సంఘం వద్దకు చేరింది. ఎల్జేపీ పేరును, పార్టీ గుర్తును ఈసీ స్తంభింపజేసి పశుపతి వర్గానికి రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ (ఆర్ఎల్జేపీ), చిరాగ్‌కు ఎల్జేపీ (రాం విలాస్) పేర్లు కేటాయించింది. 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్డీఏతో చిరాగ్ తెగదెంపులు చేసుకున్న నేపథ్యంలో పశుపతి 2021లో ఎన్డీఏలో చేరి కేంద్ర మంత్రి అయ్యారు. చిరాగ్ ఇన్, పశుపతి ఔట్ ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో 40 స్థానాలనూ క్లీన్‌స్వీప్ చేయడం లక్ష్యం పెట్టుకున్న బీజేపీ మరోసారి చిరాగ్‌ను చేరదీసింది. అలా మళ్లీ ఎన్డీఏలో చేరిన చిరాగ్, పొత్తులో భాగంగా తమకు కేటాయించే 5 స్థానాల్లో హాజీపూర్ ఉండాల్సిందేనని పట్టుబట్టి సాధించుకున్నారు. దాంతో పశుపతి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. దీనికి తోడు ఆర్ఎల్జేపీకి బీజేపీ ఒక్క సీటు కూడా కేటాయించకపోవడంతో వారం క్రితం కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. తాను హాజీపూర్ నుంచి పోటీ చేయడం ఖాయమని ప్రకటించారు. తనతో పాటు మిగతా నలుగురు ఎంపీలు కూడా మళ్లీ బరిలో దిగి తీరతారని స్పష్టం చేశారు. బాబాయిని ఓడిస్తే పాశ్వాన్ల కంచుకోటైన హాజీపూర్ హస్తగతమవడమే గాక తండ్రి వారసత్వం పూర్తిగా తనదేనని రుజువవుతుందనే భావనతో చిరాగ్ అక్కడి నుంచి బరిలో దిగుతున్నారు. హాజీపూర్‌లో ఎస్సీ సామాజిక వర్గానికి దాదాపు 4 లక్షల ఓట్లున్నాయి. దీనికి తోడు 1.5 లక్షల దాకా ముస్లిం ఓట్లున్నాయి. యాదవులు, రాజ్‌పుత్‌లు, భూమిహార్లతో పాటు కుషా్వహాలు, పాశ్వాన్లు, రవిదాస్ వంటి అత్యంత వెనకబడ్డ సామాజిక వర్గాలకు కూడా చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకుంది. ఈ వర్గాలకు రాం విలాస్ పాశ్వాన్ తిరుగులేని నేతగా కొనసాగారు. 1977లో ఆయన సాధించిన 4.69 లక్షల మెజారిటీ గిన్నిస్ రికార్డుకెక్కింది! 1989లో ఏకంగా 5 లక్షల పై చిలుకు మెజారిటీ సాధించారాయన. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్రమాదం వారసత్వ రాజకీయాలకే.. ప్రజాస్వామ్యానికి కాదు!: అమిత్ షా
కౌశాంబి: వారసత్వ రాజకీయాలు, కులవాదానికే ప్రమాదం తప్ప దేశ ప్రజాస్వామ్యానికి ఎటువంటి ప్రమాదం లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. కులతత్వం, వారసత్వ, బుజ్జగింపు రాజకీయాలు అనే మూడు అల్సర్లతో కాంగ్రెస్ పార్టీ భారత ప్రజాస్వామ్యాన్ని చుట్టుముట్టిందని ఆయన ఆరోపించారు. ప్రధాని మోదీ ఈ మూడింటినీ తొలగించి వేసినందుకే, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు భయపడుతోందని పేర్కొన్నారు. భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటూ యూకేలో ఇటీవల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఈ మేరకు బదులిచ్చారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబిలో ‘కౌశాంబి మహోత్సవ్’ను ప్రారంభించి, అనంతరం జరిగిన సభలో అమిత్ షా ప్రసంగించారు. తమ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటుపడిందనే ఒకే ఒక్క కారణంతో పార్లమెంట్ సమావేశాలను సవ్యంగా సాగనీయని కాంగ్రెస్‌ను దేశం క్షమించదని అమిత్ షా ఆరోపించారు. ఎటువంటి కార్యకలాపాలు, చర్చ లేకుండానే బడ్జెట్ సమావేశాలు ముగియడం పార్లమెంట్ చరిత్రలో ఇదే మొదటిసారన్నారు. గతంలో కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టంలోని నిబంధనల ప్రకారమే రాహుల్ లోక్‌సభ సభ్యత్వం రద్దయిందని ఆయన చెప్పారు. ఒక్క రాహుల్ గాంధీయే కాదు, ఈ చట్టం కింద ఇప్పటి వరకు 17 మంది ఎమ్మెల్యేలు, ఎంపీల సభ్యత్వాలు రద్దయ్యాయన్నారు. చట్టానికి లోబడి నడుచుకుని, హైకోర్టులో అనర్హత వేటు నుంచి బయటపడాలని రాహుల్‌కు సూచించారు. సమాజంలోని అన్ని వర్గాల సమగ్ర సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రధాని మోదీని 2024 ఎన్నికల్లో మళ్లీ గెలిపించాలని పిలుపునిచ్చారు. -
Gujarat Assembly Election 2022: గిరిజనులంటే కాంగ్రెస్‌కు అలుసు
దాహోడ్/మెహసానా: ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి గిరిజనులపై నిజంగా ప్రేమ ఉంటే రాష్ట్రపతి ఎన్నికల్లో గిరిజన మహిళా అభ్యర్థిగా ఎందుకు మద్దతివ్వలేదని ప్రధాని మోదీ నిలదీశారు. ఆయన బుధవారం గుజరాత్‌లోని దాహోడ్ పట్టణంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. గిరిజనుల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. రాష్ట్రపతి ఎన్నికల్లో గిరిజన మహిళా అభ్యర్థికి మద్దతు ఇవ్వకపోగా, ఆమెను ఓడించేందుకు ప్రతిపక్షం అభ్యర్థిని నిలబెట్టిందని ఆక్షేపించారు. కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ గిరిజనుల ఆశీస్సులతో ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఎన్నికయ్యారని తెలిపారు. దాహోడ్ ప్రాంత అభివృద్ధికి కాంగ్రెస్ చేసిందేమీ లేదని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే ఇక్కడి అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని నరేంద్ర మోదీ వెల్లడించారు. కాంగ్రెస్ మోడల్ అంటే ఇదే.. అవినీతి, కులతత్వం, బంధుప్రీతి, వారసత్వ రాజకీయాలు, మత విద్వేషం, సమాజంలో విభజన, ఓటు బ్యాంకు రాజకీయాలే కాంగ్రెస్ మోడల్ అని ప్రధాని మోదీ మండిపడ్డారు. కాంగ్రెస్ మోడల్ కేవలం గుజరాత్‌నే కాదు, మొత్తం దేశాన్ని నాశనం చేసిందని దుయ్యబట్టారు. ఆయన బుధవారం మెహసానాలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మాట్లాడారు. ప్రజలు ఎప్పటికీ పేదలుగా ఉండిపోవాలన్నదే ఆ పార్టీ ఉద్దేశమన్నారు. దురభిమానం, వివక్షను బీజేపీ ఏనాడూ నమ్ముకోలేదని, అందుకే యువత తమ పట్ల విశ్వాసం చూపుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో అస్తవ్యస్తంగా మారిన దేశాన్ని అభివృద్ధి చేసేందుకు తాము ఎంతగానో శ్రమిస్తున్నామని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. వడోదరలోనూ ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
డబ్బు, వారసత్వం శాసిస్తున్నాయి
రాజకీయాలపై జస్టిస్ చలమేశ్వర్ అహ్మదాబాద్: ధన బలం, వారసత్వ రాజకీయాలు.. రాజకీయ న్యాయాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియలో డబ్బు, రాజకీయాలు కీలక పాత్ర పోషిస్తూ రాజ్యాంగ నిర్మాతలు నిర్దేశించిన రాజకీయ సమానత్వాన్ని దెబ్బతీస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అహ్మదాబాద్‌లో జస్టిస్ పీడీ దేశాయ్ స్మారక ప్రసంగం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. చట్టసభలో సభ్యుడయ్యే అర్హతను చివరకు ధనబలం నిర్ణయిస్తుందని, ఒకరు చట్ట సభలో సభ్యుడైతే.. అతని భార్య, పిల్లలు, మిగతా కుటుంబసభ్యులు ఆ స్థానం కోసం వరుసలో ఉంటున్నారని జస్టిస్ చలమేశ్వర్ తప్పుపట్టారు. ‘రాజకీయ క్షేత్రంలో సమానత్వం, న్యాయం విషయానికొస్తే.. మనమింకా ప్రాథమిక దశలోనే ఉన్నాం. రాజ్యాల్ని, జ్యేష్ట పుత్రుడికి వారసత్వ హక్కు నిబంధనను రద్దు చేశాం. అయితే ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియలో క్రియాశీలకంగా పాల్గొనాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షించే విషయంలో ఎంతవరకూ రాజకీయ న్యాయం సాధించాం?’ అని జస్టిస్ చలమేశ్వర్ ప్రశ్నించారు.